జగత్తులో అనేక రకాల ఆధ్యాత్మిక సాధనాలున్నాయి. ఇందులో ఏది ఎవరికి తగినదనే దాన్ని సాధకుని యోగ్యత, అవగాహన స్థాయిని బట్టి నిర్ణయించి, అది వారికి ఉపదేశించేది గురువే. గురువు అంటే అజ్ఞానాన్ని దూరం చేసేవాడని అర్థం. ‘గు’ అంటే చీకటి. ‘రు’ అంటే ప్రకాశం. గురువు అంటే చీకటిని తొలగించి వెలుగుతో ప్రకాశింపచేసేవాడు అని అర్థం. జ్ఞాన మార్గ దర్శకుడైన గురువు స్థానం పరమ పవిత్రమైనది. జ్ఞానాన్ని ఆర్జించడం కన్నా సద్గురువు చరణారవిందాలను సేవించడం, అనుగ్రహాన్ని పొందడం ఉత్తమమైనది.
దేవుడు ఉన్నాడని నమ్మేవారు ఆస్తికులు, లేడని చెప్పేవారు నాస్తికులు అయితే జగత్తు, దేవుడు, జీవుడు అనే పరంపర నుంచి మూడు వాదాలు ఉద్భవించాయి. అవే మూడు ప్రధాన మతసిద్ధాంతాలుగా ఆవిర్భవించి, విస్తృతంగా వ్యాప్తిచెందాయి. ఆ సిద్ధాంతాలే అద్వైతం, విశిష్టాద్వైతం, ద్వైతం అయితే... హైందవ ధర్మానికి మూలస్తంభాలుగా పేర్కొనదగ్గ ముగ్గురు ఆచార్యులు ఈ మూడు మత పరంపరలకు ఆద్యులు. వారే జగద్గురు ఆదిశంకరాచార్యులు, రామానుజాచార్యులు, వల్లభాచార్యులు లేదా మధ్వాచార్యులు. ఈ మూడు మతాలు మతత్రయంగా, ఈ ముగ్గురూ ఆచార్యత్రయంగా ప్రసిద్ధి.
అద్వైతమతం... ఆదిశంకరాచార్యులు: అద్వైతం అంటే రెండు కానిది. అంటే జీవుడికి, దేవుడికి భేదం లేదని చెప్పే మతమన్నమాట. ఈ సిద్ధాంతానికి రూపకర్త జగద్గురు శ్రీ ఆదిశంకరులు. కేరళలోని కాలడి అనే గ్రామంలో జన్మించిన ఆదిశంకరులు ప్రపంచమంతా జగద్గురువుగా గౌరవించే అత్యున్నతమైన ఆధ్యాత్మికవేత్త, మహాజ్ఞాని, మహాపండితులు. సౌందర్యలహరి, శివానందలహరి, వివేకచూడామణి, ప్రస్థాన త్రయభాష్యంతోబాటు ఈనాడు మనం స్తుతించుకునే అనేక స్తోత్రగంథాలు, ప్రకరణ గ్రంథాలు, కనకధారాస్తోత్రం, భజగోవింద శ్లోకాలు ఆయన రచించినవే. రవాణా సదుపాయాలు లేని రోజుల్లోనే ప్రపంచమంతా కాలినడకన పర్యటించి అన్ని మతాలను, విశ్వాసాలను ఒక తాటిపైకి తెచ్చిన ఈ జగద్గురువు భారతదేశంలో నాలుగు పీఠాలను స్థాపించారు.
బదరీనాథ్, పూరి, శృంగేరి, ద్వారకలలో వీరు స్థాపించిన ఈ పీఠాలకు బాధ్యతలు చేపట్టిన వారు కూడా వీరి నామంతోనే జగద్గురువులుగా ప్రఖ్యాతి చెందుతుండటం విశేషం. వీరి లెక్క ప్రకారం దేహమే దేవాలయం. దేహంలో ఉండే జీవుడే దేవుడు. భౌతికమైన దేహం నశించినా, ఆ దేహంలో ఉండే జీవుడు మాత్రం స్థిరంగా ఉంటాడని అద్వైతుల నమ్మకం. నిశ్చలమైన బుద్ధితో ‘అహం బ్రహ్మాస్మి’ అంటే నే నే బ్రహ్మను అని తెలుసుకునేవాడు జీవన్ముక్తుడు అవుతాడని అద్వైతులంటారు.
విశిష్టాద్వైతం... రామానుజాచార్యులు: బ్రహ్మానికి, ప్రకృతికి భేదం లేదని బోధించే విశిష్టాద్వైత మత స్థాపకులు రామానుజాచార్యులు. ఈ మతాన్ని అనుసరించేవారు విశిష్టాద్వైతులుగా ప్రసిద్ధి. జగత్తు సత్యం, జీవుడు సత్యం, దేవుడు సత్యం అన్నది వీరి విశ్వాసం. దేహంలోని భాగాల వలె జీవుడు కూడా దేవునితో చేరి ఉంటారని, దేహం నశించిన తరువాత జీవుడు మరో దేహంలో ప్రవేశిస్తాడు లేదా ప్రకృతిలో లీనమైపోతారని వీరి నమ్మకం. విశిష్టాద్వైతమతాచార్యులైన భగవద్రామానుజులు నేటి చెన్నైకు చేరువలోని శ్రీపెరంబుదూరులో జన్మించారు. కాంచీపురం లోని తిరుక్కచినంబికి శిష్యులైన రామానుజులు శ్రీరంగంలో గొప్ప పండితుడు, వైష్ణవ మత ప్రవక్త అయిన యామునాచార్యులవారి వారసుడిగా నిలిచారు.
బ్రహ్మసూత్రభాష్యానికి విశిష్టాద్వైత దృష్టితో శ్రీ భాష్యం వ్యాఖ్యను రచించారు. మొట్టమొదటి మత సంస్కర్తగా నిలిచిన రామానుజులవారు వేదాంత సంగ్రహం, గద్యత్రయం వంటి విశిష్టమైన గ్రంథాలను రచించారు. ఉత్తరభారతమంతా విస్తృతంగా పర్యటించిన ఆయన దేశం నలుమూలలా నాలుగు శ్రీైవైష్ణవ మఠాలను నెలకొల్పారు. జాతి, మత భేదాలను పాటించకుండా భక్తి భావంతో భగవంతుని సందర్శించాలనుకున్న ప్రతి ఒక్కరికి ఆలయ ప్రవేశం కల్పించేలా చేశారు. తిరుమలతో సహా అనేక దేవాలయాలలో నిర్దిష్టమైన పూజావిధానాలను, సంప్రదాయాలను ఏర్పరిచారు.
ద్వైతమతం... మధ్వాచార్యులు: జీవుడు, దేవుడు వేర్వేరు. జీవాత్మ, పరమాత్మ రెండుగా ఉంటాయని చెప్పే ద్వైతమతాన్ని మధ్వాచార్యులు నెలకొల్పారు. వీరికే వల్లభాచార్యులని పేరు. ఈయన జన్మనామం వాసుదేవులు. ఈయనను వాయుదేవుడి అంశగా భావిస్తారు. జీవాత్మ, పరమాత్మలకు భేదం ఉందని ద్వైతమతవాదులు విశ్వసిస్తారు. వీరికి కూడా వేదాలే ప్రమాణాలు అయినప్పటికీ, అన్నింటిలోకి భాగవత గ్రంథాన్ని అత్యంత ప్రామాణికంగా భావిస్తారు.
కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఉడిపి సమీపంలోని కంచనపూర్ అనే గ్రామంలో జన్మించిన మధ్వాచార్యులవారు రామానుజాచార్యులవారు ప్రచారం చేసిన శ్రీవైష్ణవానికి బదులు సద్‌వైష్ణవం అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. మహాభారతంపై తమదైన వ్యాఖ్యానం, శ్రీకృష్ణస్తుతి, ద్వాదశా స్తోత్రం, నఖస్తుతి, యమకభారతం, కృష్ణామృత మహార్ణవం, తంత్రసార, ఉపాధి ఖండన మొదలైన గ్రంథాలను అందించారు.
జీవులందరూ విష్ణువు అధీనంలో ఉంటారని, ఆయన అనుగ్రహం పొందగలిగినవారికి ముక్తి లభిస్తుందని బోధించే మధ్వాచార్యులు ఉడిపిలో శ్రీకృష్ణుని దేవాలయాన్ని నిర్మించారు. శ్రీవైష్ణవులకు శ్రీరంగంలోని రంగనాథ దేవాలయం ఎంత పవిత్రమైనదో, ద్వైతులకు ఉడిపిలోని శ్రీకృష్ణ దేవాలయం అంతటి పవిత్రమైనది. వీరి సిద్ధాంతాలలోని సరళత్వం సామాన్యప్రజలను అనేకమందిని ఆకట్టుకుని, వీరి మతంవైపు మొగ్గుచూపేలా చేసింది.
- డి.వి.ఆర్.
జగత్ గురువులు... జగతికి వెలుగులు
Published Sat, Oct 26 2013 12:58 AM | Last Updated on Fri, Sep 1 2017 11:58 PM
Advertisement
Advertisement