విధి బలీయం...
జనమేజయుడు పరీక్షిత్తు కుమారుడు, అభిమన్యుడి మనుమడు. ఓ సర్పం మూలంగా తన తండ్రి మరణించడంతో యావత్తూ సర్పజాతినే నిర్మూలించేందుకు సర్పయాగం చేయించి, చరిత్రకెక్కినవాడు. అటువంటి జనమేజయుడు ఒకసారి వ్యాసమహర్షిని సందర్శించాడు. భక్తితో ఆయనకు నమస్కరించి, ‘‘మహామునీ, కురుక్షేత్ర సంగ్రామం జరుగుతుందని మీకు ముందే తెలుసుకదా, ఎంతో తపశ్శక్తి సంపన్నులైన మీరు అది తెలిసి ఉండి కూడా, ఆ సంగ్రామాన్ని ఎందుకు ఆపలేకపోయారు? మీరు ఆపి ఉంటే ఎంతో జననష్టం, ధనష్టం తప్పి ఉండేది కదా’’ అని అడిగాడు. అందుకు వ్యాసులవారు నవ్వుతూ ‘‘జనమేజయా! విధి ఎంతో బలీయమైనది. దానిని ఎవరూ తప్పించలేరు. ఆ మాటకొస్తే శ్రీకృష్ణుడు స్వయంగా భగవానుడు కదా! ఆయనే యుద్ధాన్ని నివారించలేకపోయాడు కదా’’ అన్నాడు.
కాని, జనమేజయుడు మాత్రం ‘‘మీరు చెబితే ధర్మరాజు తప్పక విని ఉండేవాడు, దుర్యోధనుడు కూడా సంధికి ఒప్పుకునేవాడు, సమర్థులై ఉండీ మీరు చూస్తూ ఊరుకున్నారు. జరగబోయేదాని గురించి నాకు గనక ముందుగా తెలిసి ఉంటే, నేను దానిని తప్పక నివారించి ఉండేవాడిని’’ అంటూ వ్యాసుడిని తూలనాడాడు. విసిగిపోయిన వ్యాసుడు ‘‘సరే, నీకో సంగతి చెబుతాను. జాగ్రత్తగా విను. నీవు పొరపాటున కూడా ఉత్తరం వైపున ఉన్న అరణ్యానికి వెళ్లకు. వెళ్లినా, అక్కడ నీకు కనిపించిన అడవిపందిని వేటాడకు. ఒకవేళ వేటాడినా, అప్సరసగా మారిన ఆ పందిని వివాహమాడకు. వివాహమాడినా, మేలుజాతి గుర్రాలను కొనకు. ఒకవేళ కొన్నా, ఆమెతో కలసి యజ్ఞం చేయకు. చేసినా, వయసులో ఉన్న రుత్విజులను నియమించకు... అలా చేస్తే నీకు ఎన్నో కష్టనష్టాలు కలుగుతాయి’’ అని హెచ్చరించాడు. సరేనంటూ వ్యాసుడికి నమస్కరించి, అక్కడినుంచి వెళ్లిపోయాడు జనమేజయుడు ఇది జరిగి చాలా ఏళ్లు గడవడంతో రాజ్యపాలనలో పడి, తనకు, వ్యాసమునికీ మధ్య జరిగిన సంభాషణను పూర్తిగా మరచిపోతాడు. తర్వాత కొంతకాలానికి జనమేజయుడికి తన రాజ్యప్రజలు ఓ అడవిపంది వల్ల పంటనష్టం, ప్రాణనష్టం జరిగి తంటాలు పడుతున్న విషయం తెలుస్తుంది.
ఆ పంది తన రాజ్యానికి ఉత్తర దిక్కునే ఉన్న అడవినుంచి వస్తోందని తెలిసి వెంటనే అక్కడికి వెళ్తాడు. అక్కడ తనకు కనిపించిన అడవిపంది మీద బాణాల వర్షం కురిపించి, దానిని సంహరిస్తాడు. అప్పుడు ఆ అడవిపంది కాస్తా ఓ అందమైన అమ్మాయిగా మారుతుంది. తాను ఓ అప్సరసనని, శాపవశాన ఇలా అడవిపందిగా మారానని, తనను వివాహం చేసుకోమని బలవంతం చేస్తుంది. రాజు ఆమెను పెళ్లాడి, రాజ్యానికి తీసుకెళతాడు. అప్పుడు గుర్తొస్తుంది జనమేజయునికి తాను వ్యాసునికిచ్చిన మాట. కానీ, చేసేదేమీలేక మిన్నకుండిపోతాడు. ఆ తర్వాత మరికొద్దికాలానికి మేలుజాతి అశ్వమొకటి బేరానికి వస్తే బోలెడంత ధనమిచ్చి దానిని కొంటాడు.
సకల శుభలక్షణాలున్న ఆ అశ్వం ఉంది కాబట్టి అశ్వమేధయాగం చేయమని చాలామంది సలహా ఇస్తారు. దాంతో జనమేజయుడు అశ్వమేధయాగం ఆరంభిస్తాడు. కనీసం ఇక్కడైనా జాగ్రత్తగా ఉందామని బాగా అనుభవజ్ఞులైన వృద్ధ రుత్విజులను యాగానికి ఆహ్వానిస్తాడు. తీరా ముహూర్తం సమీపించాక వారిలో కొందరు జబ్బుపడి రాలేకపోవడంతో విధిలేక కొందరు యువ రుత్విజులను నియమిస్తాడు. యజ్ఞం జరిగే సమయానికి జనమేజయుడి భార్య అక్కడకు వచ్చి, తన మేలిముసుగు తీసి, ఆ రుత్విజులను చూసి అందంగా నవ్వుతుంది. దాంతో మనసు చలించిన రుత్విజులు యాగం మీద దృష్టి పెట్టలేక మంత్రాలు తప్పుగా చదువుతూ, యాగప్రక్రియను కూడా తప్పుగా జరిపిస్తారు. యాగం లోపభూయిష్టంగా జరగడంతో, యాగకర్త అయిన జనమేజయునికి కుష్టువ్యాధి వస్తుంది. రాజ్యాన్ని కోల్పోతాడు. అప్పుడు పశ్చాత్తాపంతో కంట తడిపెడుతూ, విధి ఎంత బలీయమైనదో కదా అని వేదవ్యాసుని తలచుకుని బాధపడతాడు జనమేజయుడు.