ద్వాదశ దర్శనం | Dvadasa Preview | Sakshi
Sakshi News home page

ద్వాదశ దర్శనం

Published Mon, Nov 23 2015 12:34 AM | Last Updated on Sun, Sep 3 2017 12:51 PM

ద్వాదశ దర్శనం

ద్వాదశ దర్శనం

కార్తికం
 
కార్తికమాసం శివుడికి ప్రీతిపాత్రమైన మాసం. శివభక్తులు ఈ నెల్లాళ్లూ అత్యంత భక్తిశ్రద్ధలతో సదాశివుడిని కొలుస్తారు. శూలపాణి అయిన శివుడు కార్తిక పౌర్ణమి రోజున దేవతలను ముప్పుతిప్పలు పెట్టిన త్రిపురాసురుడిని సంహరించి, ముల్లోకాలను కాపాడాడని ప్రతీతి. సోమవారం శివుడికి ప్రీతిపాత్రం కావడంతో కార్తీక సోమవారాల్లో ఉపవాస వ్రతాలు ఆచరిస్తారు. వేకువనే శివాలయాలకు వెళ్లి పూజార్చనలలో పాల్గొంటారు. మన దేశంలో శివాలయాలు లేని ఊళ్లు దాదాపు ఉండవు. అయితే, ద్వాదశ జ్యోతిర్లింగాలు మాత్రం శివభక్తులకు తప్పనిసరి సందర్శనీయ క్షేత్రాలు. సాధారణ దినాలలో కంటే, కార్తికమాసంలో ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలు శివభక్తులతో కళకళలాడుతూ కనిపిస్తాయి. పవిత్ర కార్తిక మాసం సందర్భంగా వరుస క్రమంలో ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల గురించి ఒక విహంగ వీక్షణం...
 
1. సోమనాథుడు
గుజరాత్‌లోని సౌరాష్ట్ర ప్రాంతంలో ఉంది. ద్వాదశ జ్యోతిర్లింగాల యాత్రకు బయలుదేరే వారు ఇక్కడి నుంచే తమ యాత్రను ప్రారంభిస్తారు. ఈ క్షేత్రంపై పదహారుసార్లు దాడులు జరిగాయి. అన్నిసార్లూ పునర్నిర్మాణమూ జరిగింది. ఇది శైవులకు మాత్రమే కాదు, వైష్ణవులకూ సందర్శనీయ క్షేత్రమే. శ్రీకృష్ణ పరమాత్ముడు ఇక్కడే తన అవతారాన్ని చాలించినట్లు ప్రతీతి. శాపవశాత్తు తేజస్సు కోల్పోయిన చంద్రుడు ఇక్కడి సరస్వతీ నదిలో స్నానమాచరించి, తిరిగి తేజస్సును పొందినట్లు పురాణాలు చెబుతున్నాయి.
 
 2. మల్లికార్జునుడు
 ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో ఉంది. తమలో ఎవరు అధికులనే దానిపై బ్రహ్మకు, విష్ణువుకు ఎడతెగని వాదులాట జరిగినప్పుడు శివుడు ఇక్కడ ముల్లోకాలనూ ఆక్రమిస్తూ అద్యంత రహిత జ్యోతిర్లింగంగా ఆవిర్భవించినట్లు పురాణాలు చెబుతున్నాయి. సాంబశివుడు ఇక్కడ మల్లికార్జున స్వామిగా వెలశాడు. శ్రీశైలం శైవక్షేత్రం మాత్రమే కాదు, ఇది శక్తిపీఠం కూడా. సతీదేవి పెపైదవి ఇక్కడ పడినందున ఇది అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటిగా ప్రసిద్ధి పొందింది.
 
 3. మహాకాళేశ్వరుడు
 మధ్యప్రదేశ్‌లో ఉంది. మహాశివుడు ఇక్కడ స్వయంభువుగా వెలిశాడు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఇదొక్కటే స్వయంభూలింగం. ఇక్కడ మహాకాళేశ్వరుడిగా పరమశివుడు పూజలందుకుంటున్నాడు. మహాకాళేశ్వరుడినే దక్షిణామూర్తిగానూ ఆరాధిస్తారు. అష్టాదశ శక్తిపీఠాలలో ఉజ్జయిని కూడా ఒకటి. ఇక్కడ మహాకాళిగా ఆదిశక్తి ఆరాధనలు అందుకుంటోంది. శివశక్తులు ఒకేచోట ఉండటం ఇక్కడి విశేషం. ఇక్కడి కాలభైరవుడి ఆలయం కూడా సుప్రసిద్ధ సందర్శనీయ క్షేత్రం.
 
 4. ఓంకారేశ్వరుడు
 ఇది కూడా మధ్యప్రదేశ్‌లోనే ఉంది. మాంధాత తపస్సుకు మెచ్చి ఈశ్వరుడు ఇక్కడ వెలిశాడంటారు. నర్మదా నదీ తీరంలో శివుడు ఓంకారేశ్వరుడిగా పూజలందుకుంటున్నాడు. నారద మహాముని ఒకసారి వింధ్య పర్వతానికి వచ్చి, మేరుపర్వతం గొప్పదనం గురించి చెప్పాడు. మేరువును మించిపోవాలనే తపనతో వింధ్య పార్థివ లింగాన్ని స్థాపించి తపస్సు చేయగా, మెచ్చిన శివుడు ఇక్కడ ఓంకారేశ్వరుడిగా వెలసినట్లు ప్రతీతి. అమరులకు ఈశ్వరుడైనందున అమరేశ్వరుడిగా కూడా ఓంకారేశ్వరుడిని కొలుస్తారు.
 
 5. బైద్యనాథేశ్వరుడు

 నేటి జార్ఖండ్ రాష్ట్రంలోని డియోఘర్‌లో బైద్యనాథ జ్యోతిర్లింగం ఉంది. ఈశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకోవడం కోసం రావణాసురుడు తన పదితలలనూ తెగనరుక్కోవడంతో ఈశ్వరుడు ఆయన భక్తికి మెచ్చి, ఆ తలలన్నింటినీ అతికించడం వల్ల ఈయనకు వైద్యనాథేశ్వరుడని పేరు వచ్చింది. అయితే వైద్యనాథ జ్యోతిర్లింగం గురించి భిన్న కథనాలు వినవస్తాయి. మహారాష్ట్రలోని పర్లి (పరల్యాం వైద్యనాథం చ)లో హిమాచల ప్రదేశ్‌లోని ైబె థ్యనాథ్‌లోనూ ఉన్న లింగాలకు కూడా వైద్యనాథుడనే పేరు..
 
 6. కేదారనాథుడు

 ఉత్తరాఖండ్‌లో హిమాలయాల వద్ద మందాకినీ తీరాన ఉంది. ఏటా అక్షయ తృతీయ మొదలుకొని కార్తిక పూర్ణిమ వరకు మాత్రమే కేదార్‌నాథ్‌లోని ఆలయం భక్తుల కోసం తెరుచుకుని ఉంటుంది. ఆ తర్వాత శీతాకాలంలో ఆరునెలల పాటు ఇక్కడి విగ్రహాలను ఉఖిమఠానికి తరలించి, అక్కడ పూజపునస్కారాలను కొనసాగిస్తారు. పాండవులు ఈ ఆలయాన్ని నిర్మించారని ప్రతీతి. ఆ తర్వాత ఆది శంకరాచార్యులు దీనిని పునరుద్ధరించారు.
 
 7. భీమశంకరుడు

 మహారాష్ట్రలోని పుణే సమీపంలో భీమశంకరేశ్వర ఆలయం ఉంది. భీమశంకర్ నుంచే భీమా నది మొదలవుతుంది. రాయచూర్ వద్ద ఇది కృష్ణా నదిలో కలుస్తుంది. సహ్యాద్రిపర్వతాలలో గల ఈ లింగం భీమశంకరుడిగా ప్రసిద్ధిపొందింది. ఈ ప్రదేశానికి పురాణాలలో ఢాకిని అనే పేరుంది. భీముడు ఈ లింగాన్ని పూజించడం వల్ల భీమశంకరుడని పేరు వచ్చింది.
 
 8. రామేశ్వరుడు
 తమిళనాడులోని రామేశ్వరంలో ఉంది. ద్వాదశ జ్యోతిర్లింగాలన్నింటిలోనూ రామేశ్వరంలో కొలువై ఉన్న లింగమే అత్యంత పెద్దదిగా ప్రసిద్ధి పొందింది. రాముడు ప్రతిష్టించి సేవించినందు వల్ల ఈ లింగానికి రామేశ్వర లింగమని పేరు.
 
 9. నాగేశ్వరుడు
 గుజరాత్‌లోని ద్వారకలో కొలువై ఉన్న ఈ నాగేశ్వర జ్యోతిర్లింగమే ద్వాదశ జ్యోతిర్లింగాలలో అత్యంత ప్రాచీనమైనదిగా విశ్వసిస్తారు. నాటి దారుకావన మే నేటి ద్వారక. శివపురాణంలో కూడా నాగేశ్వర జ్యోతిర్లింగం గురించిన ప్రస్తావన కనిపిస్తుంది. తనను ఆరాధించిన వారి సర్వకష్టాలనూ నివారిస్తానని ప్రతిజ్ఞాపూర్వకంగా చెప్పిన శివుడు నాగేశ్వర జ్యోతిర్లింగంగా మారిపోయాడంటారు.
 
 10. విశ్వేశ్వరుడు
 ద్వాదశ జ్యోతిర్లింగాలన్నింటిలోనూ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో గల కాశీవిశ్వనాథుడికి ఉన్న ప్రాశస్త్యం మరేలింగానికీ లేదంటే అతిశయోక్తి కాదు. శివుడికి కాశీనగరమంటే ఈశ్వరుడికి ఎంత ప్రీతి అంటే, తనకు భిక్ష దొరకలేదని అలిగిన వ్యాసుడు ఆ నగరాన్ని శపించడానికి సిద్ధపడేసరికి అమితంగా ఆగ్రహించి, వ్యాసుడినే నగరం నుంచి వెళ్లగొట్టాడట. అత్యంత పురాతన నగరమైన కాశీకి మహాశ్మశానమని పేరు. ఇక్కడి అమ్మవారు విశాలాక్షి. అమ్మవారు అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి. కాశీవిశ్వనాథుడిని సందర్శించిన వారికి ముక్తి లభిస్తుందని, కాశీలో మరణించిన వారికి అంత్యసమయంలో శివుడే స్వయంగా తారకమంత్రాన్ని ఉపదేశిస్తాడని ప్రతీతి.
 
 11. త్య్రంబకేశ్వరుడు
 మహారాష్ట్రలోని నాసిక్ వద్దగల త్రయంబకేశ్వరంలో ఈ జ్యోతిర్లింగం ఉంది. తమకు జ్ఞానబోధ చేసిన ఈశ్వరుడిలో బ్రహ్మ, విష్ణువులు ఐక్యం అయిపోవడం వల్ల ముగ్గురూ కలిసి త్య్రయంబకేశ్వర లింగంగా ఆవిర్భవించారు. పరమ పావనమైన గోదావరి నది ఇక్కడే పుట్టింది. ఈ గోదావరికి గౌతమి అని పేరు. త్య్రంబకేశ్వరుని సేవించిన వారికి సకల విద్యలు అబ్బుతాయట. మోక్షం లభిస్తుందట.
 
 12. ఘృష్ణేశ్వరుడు

 మహారాష్ట్రలోని దౌలతాబాద్‌లో ఉన్న ఈ ఆలయం శివపురాణంలోని కోటిరుద్ర సంహితలో చెప్పిన చిట్టచివరి ద్వాదశ జ్యోతిర్లింగంగా చెప్పుకుంటారు. ఘృష్ణేశ్వర్‌కి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో గల వెరుల్‌లో ఉంది ఈ ఆలయం. ఘృశ్నే అనే భక్తురాలి కోరిక మేరకు శివుడు ఈ ప్రదేశంలో జ్యోతిర్లింగంగా అవతరించినందువల్ల ఈయనకు ఘృష్ణేశ్వరుడని పేరు వచ్చింది. ఘృష్ణేశ్వరుని సేవించిన వారికి సంతాన నష్టం, అకాల మృత్యువు ఉండవని విశ్వాసం.

 శైవక్షేత్రాలు... ఎన్నెన్నో..!
 ఒక్కోలింగానికి ఒక్కో విశిష్ఠత. ఇంకా... పంచభూతలింగాలున్నాయి. ఇవిగాక పంచారామాలున్నాయి. ఇంతేనా... కొన్ని వందల ఏళ్ల చరిత్ర కలిగిన ప్రాచీన శివాలయాలు ఈ పృథ్విపై ఉన్నాయి. శైవక్షేత్రాలను సందర్శించినా, విన్నా, పఠించినా పుణ్యప్రదమే.
 - పన్యాల జగన్నాథదాసు,
 డి.వి.ఆర్. భాస్కర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement