Ismaili muslims
-
ఆగాఖాన్ అస్తమయం
పారిస్: ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ‘ఇస్మాయిలీ’ వర్గం ముస్లింల ఆధ్యాత్మిక గురువు, వేల కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి ఆగాఖాన్ కన్నుమూశారు. షియా ఇస్మాయిలీ ముస్లింల 48వ ఇమామ్ హోదాను యుక్తవయసులో వారసత్వంగా పొంది దశాబ్దాలపాటు వేల కోట్ల రూపాయల దాతృత్వ కార్యక్రమాలు చేసి గొప్ప వితరణశీలిగా పేరు తెచ్చుకున్నారు. ఆగాఖాన్ పోర్చుగల్‌లో మంగళవారం తుది శ్వాస విడిచారని ఆయన కుటుంబం బుధవారం ప్రకటించింది. ఆగా ఖాన్ అంత్యక్రియలు పోర్చుగల్ రాజధాని నగరం లిస్బన్లో జరుగుతాయని ఆగాఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్, ఇస్మాయిలీ రిలీజియన్ కమ్యూనిటీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఆగాఖాన్‌కు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. మొహమ్మద్ ప్రవక్త వారసులుగా షియా ముస్లింలలో ఉప వర్గమైన ఇస్మాయిలీ వర్గానికి ఆగాఖాన్ కుటుంబం ఆధ్యాత్మిక గురువులుగా శతాబ్దాలుగా కొనసాగుతోంది. 1936 డిసెంబర్ 13న స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో జన్మించిన ఈయన అసలు పేరు ప్రిన్స్ కరీమ్ అల్ హుస్సేనీ. ఆగాఖాన్ తండ్రి ప్రిన్స్ అలీఖాన్ విలాస పురుషుడు. దీంతో అలీఖాన్‌ను కాదని తాత సర్ సుల్తాన్ మొహ మ్మద్ షా (ఆగాఖాన్– 3).. కరీమ్ అల్ హు స్సేనీను డిగ్రీ స్టూడెంట్‌గా ఉన్నప్పుడే ఆగా ఖాన్–4గా 1957 అక్టోబర్ 19వ తేదీన ప్రకటించారు. టాంజాని యాలోని దారెస్స లామ్‌లో ఈ కార్య క్రమం జరిగింది. గతంలో ఇదే దారెస్సలామ్ వేదికగా ఆగాఖాన్–3ను ఇస్మాయిలీ వర్గీయులు ఆయనంత బరువు వజ్రాలను కానుకగా సమర్పించిన వార్త అప్పట్లో సంచలనమైంది. ఆనాటి నుంచి ఆధ్యాత్మిక గురువుగా కొనసాగుతూనే వేల కోట్ల రూపాయల విలువైన వ్యాపార సంస్థలను విజయవంతంగా నడిపిస్తున్నారు. వీళ్ల ఆగాఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్ ఆధ్వర్యంలో పలు ప్రపంచ దేశాల్లో వందలాది ఆస్పత్రులు సేవలందిస్తున్నాయి. ఏటా ఒక బిలియన్ డాలర్ల మేర లాభాపేక్షలేని అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నారు. ఆగా ఖాన్ మృతికి ప్రధాని మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, బ్రిటన్ రాజు ఛార్లెస్, ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ సహా పలు ప్రపంచదేశాల అధినేతలు తీవ్ర సంతాపం వ్యక్తంచేశారు. మరోవైపు ఇస్మాయిలీ ముస్లింల నూతన ఆధ్యాత్మిక గురువుగా ఆగాఖాన్4 కుమారుడు రహీమ్ అల్ హుస్సేనీ పేరును ప్రకటించారు. 50వ గురువుగా ఈయనను ఇకపై ఆగాఖాన్–5గా పిలవనున్నారు. -
బతుకు బండిపై ఉగ్ర తూటా
* పాక్‌లో బస్సుపై ముష్కరుల దాడి.. 45 మంది మృతి * లోపలికి ప్రవేశించి ప్రయాణికులపై విచక్షణారహితంగా కాల్పులు * ఘటనకు తామే బాధ్యులమని ప్రకటించుకున్న ఐఎస్ఐఎస్ కరాచీ: వారంతా పేదలు.. రెక్కాడితే గానీ డొక్కాడని బీదాబిక్కీలు.. కూలీ పనులతో బతుకు బండిని లాగిస్తున్నవారు కొందరైతే.. చిన్నాచితకా వ్యాపారాలతో పొట్టుపోసుకునే వారు ఇంకొందరు.. అంతా బస్సులో పట్నానికి వెళ్తున్నారు.. ఇంతలో ఎక్కడ్నుంచి వచ్చారో రక్తంమరిగిన మానవ మృగాలు.. ఆ అమాయకులపై ఏకే 47 తుపాకులు ఎక్కుపెట్టారు.. అతి దగ్గర్నుంచి బుల్లెట్ల వర్షం కురిపించారు.. 16 మంది మహిళలు సహా మొత్తం 45 మంది ప్రాణాలను బలిగొన్నారు! పేదలను మోసుకెళ్తున్న ఆ బతుకు బండి క్షణాల్లో రక్తమోడుతూ ఆగిపోయింది!! బుధవారం పాకిస్తాన్‌లోని కరాచీలో షియా తెగకు చెందిన ఇస్మాయిలీ ముస్లింలు లక్ష్యంగా ఉగ్రవాదులు సాగించిన మారణకాండ ఇదీ. ఈ ఘటనకు తామే బాధ్యులమని అదే బస్సులో తమ సంస్థ పేరుతో కరపత్రాలను వేసి ఐఎస్ఐఎస్ ముష్కరులు ప్రకటించుకున్నారు. ‘అల్లాకు కృతజ్ఞతలు.. 43 మంది మతభ్రష్టులను చంపేశాం’ అని ఐఎస్ ఉగ్రవాదులు ట్విటర్లో పేర్కొన్నారు. పోలీసు దుస్తుల్లో వచ్చి..: అల్-అజార్ గార్డెన్ అనే స్వచ్ఛంద సంస్థకు చెందిన బస్సుపై ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఈ సంస్థ ఇస్మాయిలీ వర్గానికి చెందిన పేదలకు సాయం చేస్తుంటుంది. ఇళ్లు లేనివారికి తక్కువ ధరకు ఇళ్లు కట్టిస్తుంది. బుధవారం ఈ సంస్థకు చెందిన బస్సు 60 మందికి పైగా ప్రయాణికులతో నగర శివారు నుంచి కరాచీలోని వివిధ ప్రాంతాలకు బయల్దేరింది. తొలుత బైక్‌లపై వచ్చిన ఆరు నుంచి ఎనిమిది మంది ముష్కరులు బస్సును ఆపాలంటూ డో మెడికల్ కాలేజీ సమీపంలో కాల్పులు జరిపారు. కొద్దిదూరం వెళ్లాక గులిస్తాన్-ఇ-జోహార్ ప్రాంతంలో బస్సు ఆగగానే అందులోకి ప్రవేశించి విచక్షణారహితంగా తూటాల వర్షం కురిపించారు. అతి దగ్గర్నుంచి కణతలపై గురిపెట్టి మరీ ప్రయాణికులను చంపేశారు. అనంతరం అవే బైక్‌లపై పారిపోయారు. ఇందులో 45 మంది అక్కడికక్కడే నేలకొరగగా.. 20 మంది గాయాలపాలయ్యారు. అనుమానం రాకుం డా ఉగ్రవాదులు పోలీసు దుస్తుల్లో వచ్చి ఈ దారుణానికి తెగబడడం గమనార్హం. ఉగ్రవాదుల కాల్పుల్లో డ్రైవర్ కూడా చనిపోవడంతో.. కండక్టర్ ఆ బస్సును నేరుగా సమీపంలోని ఆసుపత్రికి తీసుకువెళ్లాడు. తాను గాయపడ్డా బస్సును ఆసుపత్రికి చేర్చిన కండక్టర్‌ను అధికారులు అభినందించారు. ఘటన లో చాలామంది తీవ్రంగా గాయపడ్డారని, మృతుల సంఖ్య పెరగొచ్చని పోలీసు ఉన్నతాధికారి గులామ్ జమాలీ చెప్పారు. బస్సులోంచి ఐఎస్ఐఎస్ కరపత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఈ ఘటనకు తామే బాధ్యులమని బెలూచిస్తాన్‌కు చెందిన జున్‌దుల్లా ఉగ్రవాద సంస్థ కూడా ప్రకటించుకుంది. దాడికి ఎవరు పాల్పడ్డారన్న విషయాన్ని ప్రభుత్వం వెల్లడించలేదు. ఖండించిన అధ్యక్షుడు, ప్రధాని బస్సుపై దాడిని పాక్ అధ్యక్షుడు మన్మూన్ హుస్సేన్, ప్రధాని నవాజ్ షరీఫ్ తీవ్రంగా ఖండించారు. భారత ప్రధాని నరేంద్రమోదీ ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.