బతుకు బండిపై ఉగ్ర తూటా | Karachi terror attack: Gunmen kill 47 Shia Ismailis in Pakistan bus massacre | Sakshi
Sakshi News home page

బతుకు బండిపై ఉగ్ర తూటా

Published Thu, May 14 2015 4:30 AM | Last Updated on Sun, Apr 7 2019 3:24 PM

బతుకు బండిపై ఉగ్ర తూటా - Sakshi

బతుకు బండిపై ఉగ్ర తూటా

* పాక్‌లో బస్సుపై ముష్కరుల దాడి.. 45 మంది మృతి
* లోపలికి ప్రవేశించి ప్రయాణికులపై విచక్షణారహితంగా కాల్పులు
* ఘటనకు తామే బాధ్యులమని ప్రకటించుకున్న ఐఎస్‌ఐఎస్

 
 కరాచీ: వారంతా పేదలు.. రెక్కాడితే గానీ డొక్కాడని బీదాబిక్కీలు.. కూలీ పనులతో బతుకు బండిని లాగిస్తున్నవారు కొందరైతే.. చిన్నాచితకా వ్యాపారాలతో పొట్టుపోసుకునే వారు ఇంకొందరు.. అంతా బస్సులో పట్నానికి వెళ్తున్నారు.. ఇంతలో ఎక్కడ్నుంచి వచ్చారో రక్తంమరిగిన మానవ మృగాలు.. ఆ అమాయకులపై ఏకే 47 తుపాకులు ఎక్కుపెట్టారు.. అతి దగ్గర్నుంచి బుల్లెట్ల వర్షం కురిపించారు.. 16 మంది మహిళలు సహా మొత్తం 45 మంది ప్రాణాలను బలిగొన్నారు! పేదలను మోసుకెళ్తున్న ఆ బతుకు బండి క్షణాల్లో రక్తమోడుతూ ఆగిపోయింది!! బుధవారం పాకిస్తాన్‌లోని కరాచీలో షియా తెగకు చెందిన ఇస్మాయిలీ ముస్లింలు లక్ష్యంగా ఉగ్రవాదులు సాగించిన మారణకాండ ఇదీ. ఈ ఘటనకు తామే బాధ్యులమని అదే బస్సులో తమ సంస్థ పేరుతో కరపత్రాలను వేసి ఐఎస్‌ఐఎస్ ముష్కరులు ప్రకటించుకున్నారు. ‘అల్లాకు కృతజ్ఞతలు.. 43 మంది మతభ్రష్టులను చంపేశాం’ అని ఐఎస్ ఉగ్రవాదులు ట్విటర్‌లో పేర్కొన్నారు.
 
 పోలీసు దుస్తుల్లో వచ్చి..: అల్-అజార్ గార్డెన్ అనే స్వచ్ఛంద సంస్థకు చెందిన బస్సుపై ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఈ సంస్థ ఇస్మాయిలీ వర్గానికి చెందిన పేదలకు సాయం చేస్తుంటుంది. ఇళ్లు లేనివారికి తక్కువ ధరకు ఇళ్లు కట్టిస్తుంది. బుధవారం ఈ సంస్థకు చెందిన బస్సు 60 మందికి పైగా ప్రయాణికులతో నగర శివారు నుంచి కరాచీలోని వివిధ ప్రాంతాలకు బయల్దేరింది. తొలుత బైక్‌లపై వచ్చిన ఆరు నుంచి ఎనిమిది మంది ముష్కరులు బస్సును ఆపాలంటూ డో మెడికల్ కాలేజీ సమీపంలో కాల్పులు జరిపారు.
 
కొద్దిదూరం వెళ్లాక గులిస్తాన్-ఇ-జోహార్ ప్రాంతంలో బస్సు ఆగగానే అందులోకి ప్రవేశించి విచక్షణారహితంగా తూటాల వర్షం కురిపించారు. అతి దగ్గర్నుంచి కణతలపై గురిపెట్టి మరీ ప్రయాణికులను చంపేశారు. అనంతరం అవే బైక్‌లపై పారిపోయారు. ఇందులో 45 మంది అక్కడికక్కడే నేలకొరగగా.. 20 మంది గాయాలపాలయ్యారు. అనుమానం రాకుం డా ఉగ్రవాదులు పోలీసు దుస్తుల్లో వచ్చి ఈ దారుణానికి తెగబడడం గమనార్హం. ఉగ్రవాదుల కాల్పుల్లో డ్రైవర్ కూడా చనిపోవడంతో.. కండక్టర్ ఆ బస్సును నేరుగా సమీపంలోని ఆసుపత్రికి తీసుకువెళ్లాడు. తాను గాయపడ్డా బస్సును ఆసుపత్రికి చేర్చిన కండక్టర్‌ను అధికారులు అభినందించారు. ఘటన లో చాలామంది తీవ్రంగా గాయపడ్డారని, మృతుల సంఖ్య పెరగొచ్చని పోలీసు ఉన్నతాధికారి గులామ్ జమాలీ చెప్పారు. బస్సులోంచి ఐఎస్‌ఐఎస్ కరపత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఈ ఘటనకు తామే బాధ్యులమని బెలూచిస్తాన్‌కు చెందిన జున్‌దుల్లా ఉగ్రవాద సంస్థ కూడా ప్రకటించుకుంది. దాడికి ఎవరు పాల్పడ్డారన్న విషయాన్ని ప్రభుత్వం వెల్లడించలేదు.
 
 ఖండించిన అధ్యక్షుడు, ప్రధాని
 బస్సుపై దాడిని పాక్ అధ్యక్షుడు మన్మూన్ హుస్సేన్, ప్రధాని నవాజ్ షరీఫ్ తీవ్రంగా ఖండించారు. భారత ప్రధాని నరేంద్రమోదీ ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement