హైదరాబాద్ పాతబస్తీలో ఎన్ఐఏ జల్లెడ
నగరంలోని పాతబస్తీ ప్రాంతాన్ని ఎన్ఐఏ అధికారులు, తెలంగాణ పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఇప్పటికే దాదాపు 13 మంది ఐసిస్ సానుభూతి పరులను అదుపులోకి తీసుకున్న అధికారులు, మీర్ చౌక్, మొగల్ పురా, భవానీనగర్, చాంద్రాయణగుట్ట పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా గాలిస్తున్నారు. వీటితో పాటు పలు ఇతర ప్రాంతాల్లో కూడా ఎన్ఐఏ తనిఖీలు కొనసాగుతున్నాయి.
హైదరాబాద్ నగరంలో పేలుళ్లు జరిపేందుకు ఐసిస్ కుట్ర పన్నిందన్న పక్కా సమాచారం అందడంతో ఎన్ఐఏ అధికారులు బుధవారం ఉదయమే హైదరాబాద్ చేరుకున్న అధికారులు బృందాలుగా విడిపోయి పలు ప్రాంతాలలో సోదాలు నిర్వహించారు. ఇంతకుముందే అరెస్టుచేసిన నిక్కీ జోసెఫ్ తదితరులు విచారణలో వెల్లడించిన అంశాల ఆధారంగా పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ముందునుంచి అనుమానించినట్లే వాళ్ల వద్ద భారీ మొత్తంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలు పట్టుబడ్డాయి. వీళ్లంతా ఐసిస్ కార్యకర్తలేనా.. లేక స్లీపర్ సెల్స్ సభ్యులా అన్న విషయం ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది.
మామూలు రోజుల్లో ఏవో పనులు చేసుకుంటూ సాధారణ పౌరుల్లాగే జీవించే స్లీపర్ సెల్స్ సభ్యులు.. తమకు ఆదేశాలు అందిన మరుక్షణం ఉగ్రవాద కార్యకలాపాలు చేపట్టేందుకు సిద్ధమైపోతారు. తమకు హ్యాండ్లర్ల నుంచి అందే ఆదేశాలు, ఆయుధాలతో పని కానిస్తారు. ఇలాంటివాళ్లను ముందుగా గుర్తించడం కష్టం. కానీ సరైన టిప్ అందితే మాత్రం చివరి నిమిషంలో పేలుళ్లు చేపట్టడానికి ముందు కూడా పట్టుకునే అవకాశం ఉంది.