జీవితంలో ఎంత పొందినా, ఎంత కీర్తి గడించినా, ఇంకా ఏదో కావాలి అన్న కోరిక మానవుడిని అనుక్షణం వెంటాడుతూ ఉంటుంది. ఫలితంగా ఇంకా ఏదో కావాలని నిరంతరాయంగా అన్వేషణ సాగుతుంటుంది. ఏది గమ్యం, ఎటు వైపు పయనం అన్న అవగాహన లేకుండా మనిషి ప్రయాణం సాగిపోతూ ఉంటుంది. కోరికల వలయంలో కూరుకుపోతూ కొట్టుమిట్టాడతాడు మనిషి. చాలామందికి కోరికల నిజతత్వంపై అవగాహన ఉండదు. అందుకే ప్రాపంచిక విషయాలకు సంబంధించిన కల్పనలు చేసుకుంటూ, కలలు కంటూ, అనేకమైన కోరికలతో జీవితాలను వెళ్లదీస్తారు.
ప్రాపంచికమైన కోరికలను మాత్రమే తీర్చుకోవడం ద్వారా శాశ్వతమైన ఆనందాన్ని పొందాలని భావించేవారు సత్యానికి చాలా దూరంగా ఉన్నట్లు లెక్క. ఇటువంటి మనఃస్థితి ఉన్నవారు కోరికలు తీరని పక్షంలో మానసిక సమతుల్యతని కోల్పోతారు. కోరికలు తీరకపోవడం కారణంగా ఏర్పడే లోటు వల్ల వారు తమ పరిస్థితిని మరింత దుర్భరం చేసుకుంటారు. బాహ్యమైన విషయాలు సంతోషాన్ని తప్పక అందిస్తాయి. కానీ ఆత్మతృప్తిని, ఆనందాన్ని అందించలేవు. బాహ్యమైన విషయాల ద్వారా కానీ, వస్తు సంపదల ద్వారా కానీ ఏర్పడే సంతోషం కొద్దిసమయం పాటే నిలబడుతుంది.
ఈ కారణంగానే ఒక కోరిక తీరిన వెంటనే మరొక కోరిక పుట్టుకొస్తుంది. ఇంకా ఇంకా ఏదో కావాలని మనిషి నిరంతరం తపన పడుతూ, అన్వేషిస్తూనే ఉంటాడు. ఆత్మజ్ఞానమే ఆ అన్వేషణకు సమాధానం. ఎన్నడూ మార్పు చెందనిది, శాశ్వతమైనది మాత్రమే యధార్థమైన సంతృప్తిని ఇవ్వగలదు. ఆత్మతత్వం ఏమిటో అవగాహనకు వచ్చినప్పుడు మాత్రమే మనిషికి సంపూర్ణమైన తృప్తి కలుగుతుంది. ఆత్మతృప్తి అనంతమైన కోరికలన్నిటిని తీరుస్తుంది. నిజమైన ఆనందం మీలోనే ఉంది. ఆ ఆనందమే మీ నిజ తత్వమై ప్రకాశిస్తూ ఉంటుంది. ఆత్మ సాక్షాత్కారంలోనే నిజమైన ధన్యత ఉంది.
చాలామంది ఆత్మవిద్య కోసం ఎందుకు అన్వేషణ చేయరంటే, ఆత్మజ్ఞానం కోసం వాళ్లు దేన్నో వదిలి వేయాలని భ్రమ పడతారు. ధ్యానసాధన చేసి ఆత్మజ్ఞానం పొందిన ఎందరో మహనీయులు, మహితాత్ములు ఆత్మదర్శనంతోనే తమకు మిగిలినవన్నీ సమకూరాయని తెలిపారు, నిరూపించారు కూడా. మీరు ఆశించే ప్రతిదీ పరమాత్మ సృష్టిలోనే ఉంది అన్న సత్యాన్ని తెలుసుకోండి. ఈ విషయాన్ని ప్రగాఢంగా నమ్మండి. దేన్ని కోరుకుంటే కోరికలన్నీ తీరి మనసు శాంతిస్తుందో అదే ఆత్మ. ఆ ఆత్మదర్శనం దిశగా అడుగులు వేయండి. ఈ రోజే సాధన మొదలు పెట్టండి.
ఆత్మజ్ఞానం కోసం మీరు దేన్ని వదిలి పెట్టవలసిన అవసరం లేదు. నిజానికి ఆత్మజ్ఞానంలోనే మీకు కావాల్సిన సాఫల్యమంతటినీ కనుగొంటారు. మీ హృదయం లోనే దివ్యమైన ఆనందాన్ని, ఆత్మతృప్తిని అనుభూతి చెందుతారు. ఆత్మతో అనుసంధానం కలిగినప్పుడు బాహ్యంగా మీరు దేన్నీ అన్వేషించాల్సిన అవసరం ఉండదు. ముఖ్యంగా సాధన చేసే యోగికి తీరని కోరికలు ఏవి ఉండవు.
– మాతా ఆత్మానందమయి
ఆధ్యాత్మిక గురువు
Comments
Please login to add a commentAdd a comment