ఆత్మ శాశ్వతం
అతిగహనమైన తాత్విక విషయాలను కూడా ఎంతో సుందరంగా కవితాత్మకంగా కథా రూపంలో చెప్పిన ఉపనిషత్తు కఠోపనిషత్. ఆ కథ ఇలా వుంటుంది. వాజస్రవసుడి కొడుకు నచికేతుడు. తండ్రి యజ్ఞంలో వట్టిపోయిన ముసలి ఆవుల్ని దానంగా ఇవ్వటం చూసి నచికేతుడు తండ్రిని నన్నెవరికి ఇస్తావని అడుగుతాడు. దీంతో కోపగించుకున్న తండ్రి ‘నిన్ను మృత్యువుకిస్తాను’ అంటాడు. నచికేతుడు మృత్యుదేవత అయిన యముడు ఇంటికి వెళతాడు. అప్పుడక్కడ యముడు లేడు. మూడు రోజులు ఏమీ తినకుండా నచికేతుడు వేచి వున్నాడు. ఆ తరువాత యముడు వచ్చి మూన్నాళ్ళు నిరాహారంగా వేచి వున్నందుకు పరిహారంగా మూడు వరాలు కోరుకొమ్మంటాడు. మొదటి వరంగా తనను తిరిగి తండ్రి వద్దకు పంపించమంటాడు. యముడు సరే అంటాడు. రెండో వరంగా స్వర్గప్రాప్తిని కలుగజేసే యజ్ఞాన్ని ఉపదేశించమంటాడు నచికేతుడు.
యముడు ఉపదేశిస్తాడు. నచికేతుడు ఆ యజ్ఞకర్మను శ్రద్ధగా ఆకళింపు జేసుకొని అలాగే తిరిగి దాన్ని యముడికి ఒప్పజెప్పుతాడు. యముడు సంతోషించి ఆ యజ్ఞం నచికేతుడి పేరు మీద ప్రసిద్ధమవుతుందని అదనంగా వరం ఇస్తాడు. ‘మనిషి చనిపోయాక ఏమవుతాడు? ఆత్మ అనేది వున్నదా?లేదా?’ అంటూ మూడో వరంగా నచికేతుడు అడుగుతాడు. ‘దీన్ని అర్థం చేసుకోవటం చాలా కష్టం. వేరే వరం కోరుకో. దీనికి బదులు ధనాన్ని, అధికారాన్ని, అన్ని రకాల సుఖాల్ని ఇస్తాను’ అంటాడు యముడు. ‘ఇవన్నీ క్షణికాలే. అవి నాకొద్దు. నేను అడిగిన మరణం తర్వాత వుండే జీవితం గురించి చెప్పు’ అంటాడు నచికేతుడు. యముడు సంతోషించి నచికేతుడు అడిగిన ఆ మూడో వరాన్ని కూడా తీర్చుతాడు. మృత్యువు తరువాత వుండే పరమ జీవితం, ఆత్మ, పరబ్రహ్మము గురించి యముడు నచికేతుడికి ఉపదేశించటంతో ఉపనిషత్తు ముగుస్తుంది. ఉపనిషత్కథ చిన్నదే అయినా అందులో శాశ్వత సత్యాలైన వేదాంత భావనలను ఎన్నింటినో పరమ రమణీయంగా చెప్పటం జరిగింది.
లోకంలో రెండు మార్గాలున్నాయి. ఒకటి శ్రేయో మార్గం. రెండు ప్రేమో మార్గం. వాటి గమ్యాలు వేరు. శ్రేయోమార్గం శ్రేయస్కరమైనది. ప్రేమోమార్గం అంతిమంగా దుఃఖకరమైనది. బుద్ధిమంతుడు శ్రేయోమార్గాన్ని ఎన్నుకొని ముక్తిని పొందుతాడు. బుద్ధిహీనుడు ప్రేమోమార్గాన్ని ఎన్నుకొని పతనమవుతాడు. లోకంలో చాలా మంది ఆత్మ గురించి వినివుం డరు. విన్నవాళ్లకు అది ఏమిటో అర్థం కాదు. అలాం టప్పుడు దానిని గురించి ఉపదేశించే వాడు నిజంగా అద్భుతమైన వాడు అవుతాడు. ఉపదేశం పొందిన శిష్యుడూ అలాంటి అద్భుతమైన వాడే అవుతాడు.
ఆత్మజ్ఞానం చర్చల వల్ల, తర్కం వల్ల పొందేది కాదు. ఆత్మ జ్ఞానం కలవాడు మాత్రమే దాన్ని బోధించటానికి అర్హుడు. సత్యనిష్ట కలవాడు మాత్రమే దాన్ని నేర్చుకోవటానికి అర్హుడు. ఆత్మకు చావూ లేదు, పుట్టుకా లేదు. శరీరం నశించినా, ఆత్మ నాశనం కాదు. ఆత్మ నిత్యం, శాశ్వతం, సనాతనం. చెడునడత మానుకోని వారూ, తనను తాను అదుపులో వుంచుకోలేని వారూ, ఏకాగ్రత లేని వారూ, మనస్సులో శాంతి లేని వారూ, ఎంత పాండిత్యం వున్నా ఆత్మజ్ఞానం పొందటానికి అనర్హులు. శరీరం రథం. ఆత్మ యజమాని. బుద్ధి సార థి. మనస్సు కళ్లెం. ఇంద్రియాలు గుర్రాలు. ఇంద్రియ విషయాలు అవి వెళ్లే మార్గాలు. (అజ్ఞానం అనే నిద్ర నుండి) లేవండి, మేల్కొనండి, శ్రేష్ఠులైన వారి దగ్గర జేరి ఆత్మజ్ఞానం పొందండి. కఠోపనిషత్తులోని శ్లోకాలు కొన్ని కొద్ది కొద్ది మార్పులతో భగవద్గీతలో ఉండటం గమనించవచ్చు.
- దీవి సుబ్బారావు