'ఇంటర్‌నెట్ ఆధారిత జీవనం ప్రమాదకరం'
హైదరాబాద్ : ప్రజల్లో ధార్మిక విలువలు పడిపోతున్నాయని, ధనార్జనే ధ్యేయంగా ఎంత క్రూరత్వానికైనా సిద్దపడుతున్నారని ఆధ్యాత్మిక గురువు మాతా అమృతానందమయి అన్నారు. భారతదేశ యాత్రలో భాగంగా అమ్మ ఆదివారం నగరంలోని మహేంద్రహిల్స్‌లోని ఆశ్రమానికి విచ్చేశారు. ఈ సందర్భంగా భక్తులను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. నేటి తరం వారు భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు తిలోదకాలు ఇచ్చేశారని అన్నారు.
ప్రస్తుతం అంతా ఇంటర్‌నెట్‌పై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని, ఇది చాలా ప్రమాదకరమని, ప్రజల్లో ధ్యానం, భక్తి, యోగాసానాలు వేయడం, ప్రవచనాలు వినడం, భజనలు చేయడం చాలా తగ్గిపోయాయని, సేవా గుణాన్ని మరిచిపోతున్నారని మాతా అమృతానందమయి ఆవేదన వ్యక్తం చేశారు. తోటివారిని ప్రేమతో దగ్గరకు తీసుకోవాలని హితవు పలికారు. ఈ సందర్భంగా అమ్మ విద్యామృతం పథకం కిదం దాదాపు వెయ్యిమంది విద్యార్థులకు ఉపకారవేతనాలు, 500 ల మంది వితంతువులకు పింఛన్లు అందజేశారు.