ఒక రోజున బుద్ధుడు అబిరవతి నదీ తీరంలోని ఒక ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడే ఒక ఆరామం కూడా ఉంది. బుద్ధుడు అక్కడే ఉన్నాడని తెలుసుకుని ఆ పరిసర గ్రామ వాసులు ఎందరో అక్కడికి వచ్చారు. బుద్ధుని ధర్మోపదేశం పూర్తి చేయగానే... ఒక యువకుడు లేచి నమస్కరించి... ‘‘భగవాన్! కోరికలు చెడ్డవా? వాటి వల్ల ప్రయోజనం ఉండదా? వివరించి చెప్పగలరు’’ అని ప్రార్థించాడు.
‘‘ఓ యువకా! జాగ్రత్తగా విను. ఒక మాంసం వ్యాపారి తన దుకాణం దగ్గరకు వచ్చిన కుక్కకు మాంసం గీకేసిన ఎముకను వేస్తాడు. ఆ ఎముకకు మాంసం చెమ్మ, కొద్దిగా రక్తం మాత్రమే అంటి ఉంటాయి. కానీ... ఆ కుక్క ఆ ఎముకను కరచుకొని నానా తంటాలు పడుతుంది. దానివల్ల దాని ఆకలి తీరదు. దౌర్బల్యమూ తొలగదు. కోరికల వల్ల దొరికేది కూడా ఇంతే!
అలాగే... వెలుగు కోసం ఒకడు ఒక గడ్డిదివిటీని పట్టుకుని గాలికి ఎదురుగా పరుగులు తీస్తుంటాడు. దివిటీ మంట చెలరేగి, పెద్దదవుతుంది. దివిటీని పట్టుకున్న వాని ముఖం మీదకే జ్వాలలు వచ్చి పడుతుంటాయి. అప్పుడు వాడు ఆ దివిటీని వదిలి పెట్టకపోతే.. తన దివిటీనే తనని కాల్చేస్తుంది. మనలో రేగిన కామాగ్నులు కూడా మనల్ని అలానే దహిస్తాయి. నిలువెత్తు లోతులో నిప్పుల గుండం ఉంటుంది. అది రగిలి చల్లారింది. పైకి మంట గానీ, పొగ గానే లేవడం లేదు. పైపై బొగ్గులన్నీ చల్లారాయి. కానీ... దానిలో దిగిన వాడు మాత్రం నిప్పుల్లో దిగబడిపోతాడు.
మాడి బొగ్గులా మారిపోతాడు. కామం అనే నిప్పుల గుండంలో దిగబడిన వారు కూడా అలానే నశించిపోతారు. అలాగే... ఒకడు స్వప్నంలో అందమైన పూలతోటలో విహరిస్తూ ఉంటాడు. రంగురంగుల పూలచెట్లు, అందమైన సీతాకోకచిలుకలు, తుమ్మెదల ఝుంకార నాదాలూ... మత్తు కలిగించే చల్లని గాలి, వాడు ఆనందం లో తేలిపోయి, మైమరచిపోతాడు. అంతలో మెలకువ వస్తుంది. ఆనంద దృశ్యాలన్నీ అదృశ్యమై పోతాయి. మధురానుభూతి మాయమైపోతూ ఉంటుంది. కామ సుఖాలు కూడా అలాంటివే...
ఇంకా ఒకరు అందమైన, విలువైన నగల్ని అరువు తెచ్చుకుంటారు.
ధరిస్తారు. దూరంగా ఉన్న పట్టణానికి వెళ్తారు. అక్కడ అంగడిలో వాటిని అమ్మకానికి పెడతారు. బేరం జరుగుతూ ఉండగా, అసలైన నగల యజమాని వస్తాడు. దూషించి తన నగలు తాను పట్టుకుపోతాడు. అవమానంతో బేలతనంతో ఆ అరువు తెచ్చుకున్న వారు హేళన పాలవుతారు. కామాలు అంటే కోరికలు కూడా మనకి చివరికి అవమానాల్ని తెస్తాయి. హేళన పాల్జేస్తాయి. కాబట్టి కోరికలల వెంటపడి పరుగుతీసే మన మనస్సుని మనం నియంత్రించుకోవాలి.’’ అని చెప్పాడు. ఆ యువకునితో పాటు, అక్కడ ఉన్న వారందరికీ కోర్కెల వల్ల కలిగే కీడు అర్థమైంది. ఆ యువకుడు లేచి, బుద్ధునికి వంగి నమస్కరించాడు.
– డా. బొర్రా గోవర్ధన్
(చదవండి: లోపలి అరలు, పొరలు, వాటికి అడ్డంగా తెరలు)
Comments
Please login to add a commentAdd a comment