teaches
-
ఏఐ మేజిక్ : గంటకు రూ. 400 సంపాదన
మసాలా దినుసులు, ఎండు మిరప కాయలను గ్రైండింగ్ చేసే చిన్నపాటి వ్యాపారం చేస్తున్న పుణెకు చెందిన 53 సంవత్సరాల బేబి రాజారామ్ బొకాలే నోటి నుంచి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)కి సంబంధించిన విషయాలు, విశేషాలు వినిపిస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) మోడల్స్‌కు తన గొంతును అరువు ఇస్తూ అదనపు ఆదాయాన్ని ఆర్జిస్తుంటుంది బేబి. పర్సనల్ ఫైనాన్స్ నుంచి ఫ్రాడ్ జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పే ఎన్నో విషయాల వరకు మరాఠీలో చెబుతుంది... భారత పర్యటనకు వచ్చిన మైక్రోసాఫ్ట్ సీయీవో సత్య నాదెళ్ల సోషల్ ఇంపాక్ట్ ఆర్గనైజేషన్ ‘కార్య’ టీమ్‌లాంటి చేంజ్మేకర్స్తో కలిసి పని చేయడానికి ఉత్సాహం చూపారు. ‘కార్య’కు సంస్కృతంలో ‘మీకు గౌరవాన్ని ఇచ్చే పని’ అనే అర్థం ఉంది. 2017లో బెంగళూరు కేంద్రంగా మైక్రోసాఫ్ట్ రిసెర్చి ప్రాజెక్ట్‌గా మొదలైన కార్య ‘ఎర్న్, లెర్న్ అండ్ గ్రో’ అనే నినాదంతో ముందుకు వెళుతోంది. కృత్రిమ మేధ నమూనాలకు శిక్షణ ఇవ్వడానికి, పరిశోధనల కోసం అనేక భారతీయ భాషలలో డేటాసెట్లను క్రియేట్ చేస్తోంది. ‘ఎన్నో లక్షల మంది మరాఠీ మాట్లాడుతున్నప్పటికీ డిజిటల్ ప్రపంచంలో ఆ భాషకు సముచిత ప్రాధాన్యత లేదు’ అంటున్న ‘కార్య’ నిర్వాహకులు మరాఠీపైనే కాదు డిజిటల్ ప్రపంచానికి దూరంగా ఉన్న ఎన్నో భాషలపై దృష్టి పెడుతున్నారు. నైపుణ్యాలను (స్కిల్క్) వాడుకోవడంతోపాటు పేదరికాన్ని దూరం చేయడానికి, డిజిటల్ ఆర్టికవ్యవస్థ బలోపేతానికి స్కిల్ డెవలప్మెంట్కు ప్రాధాన్యత ఇస్తున్నారు. బేబీ రాజారామ్ బొకాలేలాంటి సామాన్య మహిళలే ఇందుకు ఉదాహరణ. పగటిపూట తన పనులన్నీ పూర్తయ్యాక ఏఐ మోడల్స్ కోసం తన మాతృభాష మరాఠీలో స్టోరీలు చదువుతుంది బొకాలే. బ్యాంకింగ్, సేవింగ్స్, ఫ్రాడ్ ప్రివెన్షన్లకు సంబంధించిన ఈ స్టోరీలను ఇన్ఫర్మేటివ్, ఎంటర్టైనింగ్ విధానంలో రూపొదించారు. ‘నా వాయిస్ రికార్డు అవుతున్నందుకు గర్వంగా ఉంది. స్టోరీ చదువుతున్నప్పుడు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. కష్టపడి సంపాదించిన డబ్బు ఖర్చు చేయడం తప్ప పొదుపు చేయడం అనే అలవాటు చాలామందిలో ఉండదు. పొదుపు అలవాటును ఒక కథ నొక్కి చెబుతుంది’ అంటున్న బొకాలే తన డిజిటల్ అక్షరాస్యతను కూడా పెంచుకుంటోంది. ఏఐ టెక్నాలజీకి సంబంధించి ఆసక్తికరమైన విషయాలు తన స్మార్ట్ ఫోన్ ద్వారా తెలుసుకుంటుంది. ‘మరాఠీలో ఏఐ టూల్స్ అందుబాటులోకి వస్తున్నందుకు ఆనందంగా ఉంది’ అంటుంది బొకాలే. మొత్తం పదకొండు రోజులలో ఆమె చేసిన అయిదు గంటల పనికి రెండువేల రూపాయలు అందుకుంది. వాయిస్ అరువు ఇచ్చినందుకు వచ్చిన డబ్బులను గ్రైండర్ రిపేరింగ్ కోసం ఉపయోగించింది. ‘సమయం రాత్రి 10.30 గంటలు. ఒక మూలన రంగురంగుల వెలుగులతో మెరిసిపోతున్న కృష్ణుడి మందిరం ఉన్న చిత్రం కనిపిస్తోంది. మంచంపై కూర్చున్న ఆమె తన స్మార్ట్‌ఫోన్‌లో ఒక యాప్ ఓపెన్ చేసి స్పష్టమైన, ప్రతిధ్వనించే గొంతుతో ఒక కథను బిగ్గరగా చదవడం మొదలుపెట్టింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్‌కు మరాఠీలో ట్రైనింగ్ ఇచ్చేందుకు బొకాలే గొంతును ఉపయోగించుకుంటున్నారు’ అంటూ తన బ్లాగ్‌లో రాసింది మైక్రోసాఫ్ట్. ‘ఇలాంటి పని ఒకటి చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు’ నవ్వుతూ అంటుంది బొకాలే. కాలేజీ పిల్లల నోటి నుంచి ‘ఏఐ’ అనే మాట వినడం తప్ప దానికి సంబంధించిన పైలట్ ప్రాజెక్ట్‌లో భాగం అవుతానని ఆమె ఉహించలేదు. పుణెలోని ఖారద్ ఏరియాలో చుట్టపక్కల వారు బొకాలేను ‘బేబీ అక్కా’ అని ప్రేమగా పిలుస్తారు. సెల్ఫ్–హెల్ప్ బ్యాంకింగ్ గ్రూప్ మొదలు పెట్టి మహిళలలో పొదుపు అలవాట్లు పెంపొదిస్తుంది బొకాలే. తాము దాచుకున్న పొదుపు మొత్తాలతో చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభించిన మహిళలు ఎందరో ఉన్నారు. 51 సంవత్సరాల సురేఖ గైక్వాడ్ కూడా ‘కార్య’ కోసం మరాఠీ విషయంలో బేబీలాగే పనిచేస్తుంది. చిన్న΄ాటి కిరాణా దుకాణం నడుతున్న సురేఖ ‘ఈ పని నాలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది’ అంటుంది. బ్యాంకులో డబ్బు ఎలా డిపాజిట్ చేయాలి, ఎలా డ్రా చేయాలి... వంటి వాటి నుంచి కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికత వల్ల కలిగే ఉపయోగాల వరకు ఎన్నో విషయాలు తెలుసుకుంది. పొదుపుపై దృష్టి పెట్టింది సురేఖ. 55 సంవత్సరాల మీనా జాదవ్ కూడా ‘కార్య’ కోసం పనిచేస్తోంది. తనకు వచ్చిన డబ్బును టైలరింగ్ బిజినెస్‌కు అవసరమైన మెటీరియల్ కొనడానికి ఉపయోగించింది. ఇప్పుడు మీనా సేవింగ్ ఎకౌంట్‌ను ఉపయోగిస్తుంది. ఏటీయం ను ఎలా ఉపయోగించాలో తెలుసుకుంది. మరో మహిళ తాను సంపాదించిన డబ్బును కుమార్తె చదువుకు సంబంధించి పొదుపు ఖాతా ప్రారంభించడానికి ఉపయోగించింది. వీరందరూ తమ పనిని ఆస్వాదించడమే కాదు ఫైనాన్షియల్ ప్లానింగ్, ఆన్లైన్ టూల్స్ ఉపయోగం, ఎలా ఉపయోగించాలి, స్మార్ట్‌ఫోన్ ద్వారా కొత్త ఉపాధి అవకాశాలు ఎలా సృష్టించుకోవాలో తెలుసు కున్నారు. ‘అన్ని కమ్యూనిటీలు భాగం కావడమే కార్య విజయానికి కారణం. ‘కార్య’కర్తలలో మహిళలే ఎక్కువ. ఈ పని వల్ల నాకు ఎంత డబ్బు వస్తుంది అనేదాని కంటే ఈ పని చేయడం వల్ల నాకు, నా కుటుంబానికి చెడ్డ పేరు రాదు కదా! అనేది ఎక్కువ మంది మహిళల నుంచి వచ్చే ప్రశ్న’ అంటుంది మెక్రోసాఫ్ట్ రిసెర్చర్ కాళిక బాలి. పైలట్ ప్రాజెక్ట్‌లో భాగమైన కొద్దిమంది మహిళలకు మొదట్లో స్మార్ట్‌ఫోన్ ఎలా ఉపయోగించాలి అనేది బొత్తిగా తెలియదు. అలాంటి వారు కుటుంబ సభ్యులు, బంధువులు ఆశ్చర్యపడేలా స్మార్ట్‌ఫోన్‌ను అద్భుతంగా ఉపయోగిస్తున్నారు. స్థూలంగా చె ప్పాలంటే వారి ప్రగతి ప్రయాణంలో ఇది తొలి అడుగు మాత్రమే. ఈ ఫోటోలో ఉన్న వారు (ఎడమ నుంచి) పార్వతీ కెంబ్లే, సురేఖ గైక్వాడ్, బేబీ రాజారామ్ బొకాలే. గతంలో ఈ ముగ్గురు ఒకచోట కూర్చుంటే ఏం మాట్లాడుకునేవారో తెలియదుగానీ ఇప్పుడు మాత్రం పొదుపు, వ్యా΄ారం లాంటి విషయాల గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. వీరి సెల్ఫ్–హెల్ప్ బ్యాంకింగ్ గ్రూప్ ఎంతోమంది మహిళల్లో పొదుపు అలవాట్లను పెంచు తోంది. భవిష్యత్ లక్ష్యాలను నిర్దేశించుకునేలా చేస్తోంది. -
కోరికలు కలలోని పూదోటలు! వాటి కోసం పరుగులు తీస్తే చివరికి..
ఒక రోజున బుద్ధుడు అబిరవతి నదీ తీరంలోని ఒక ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడే ఒక ఆరామం కూడా ఉంది. బుద్ధుడు అక్కడే ఉన్నాడని తెలుసుకుని ఆ పరిసర గ్రామ వాసులు ఎందరో అక్కడికి వచ్చారు. బుద్ధుని ధర్మోపదేశం పూర్తి చేయగానే... ఒక యువకుడు లేచి నమస్కరించి... ‘‘భగవాన్! కోరికలు చెడ్డవా? వాటి వల్ల ప్రయోజనం ఉండదా? వివరించి చెప్పగలరు’’ అని ప్రార్థించాడు. ‘‘ఓ యువకా! జాగ్రత్తగా విను. ఒక మాంసం వ్యాపారి తన దుకాణం దగ్గరకు వచ్చిన కుక్కకు మాంసం గీకేసిన ఎముకను వేస్తాడు. ఆ ఎముకకు మాంసం చెమ్మ, కొద్దిగా రక్తం మాత్రమే అంటి ఉంటాయి. కానీ... ఆ కుక్క ఆ ఎముకను కరచుకొని నానా తంటాలు పడుతుంది. దానివల్ల దాని ఆకలి తీరదు. దౌర్బల్యమూ తొలగదు. కోరికల వల్ల దొరికేది కూడా ఇంతే! అలాగే... వెలుగు కోసం ఒకడు ఒక గడ్డిదివిటీని పట్టుకుని గాలికి ఎదురుగా పరుగులు తీస్తుంటాడు. దివిటీ మంట చెలరేగి, పెద్దదవుతుంది. దివిటీని పట్టుకున్న వాని ముఖం మీదకే జ్వాలలు వచ్చి పడుతుంటాయి. అప్పుడు వాడు ఆ దివిటీని వదిలి పెట్టకపోతే.. తన దివిటీనే తనని కాల్చేస్తుంది. మనలో రేగిన కామాగ్నులు కూడా మనల్ని అలానే దహిస్తాయి. నిలువెత్తు లోతులో నిప్పుల గుండం ఉంటుంది. అది రగిలి చల్లారింది. పైకి మంట గానీ, పొగ గానే లేవడం లేదు. పైపై బొగ్గులన్నీ చల్లారాయి. కానీ... దానిలో దిగిన వాడు మాత్రం నిప్పుల్లో దిగబడిపోతాడు. మాడి బొగ్గులా మారిపోతాడు. కామం అనే నిప్పుల గుండంలో దిగబడిన వారు కూడా అలానే నశించిపోతారు. అలాగే... ఒకడు స్వప్నంలో అందమైన పూలతోటలో విహరిస్తూ ఉంటాడు. రంగురంగుల పూలచెట్లు, అందమైన సీతాకోకచిలుకలు, తుమ్మెదల ఝుంకార నాదాలూ... మత్తు కలిగించే చల్లని గాలి, వాడు ఆనందం లో తేలిపోయి, మైమరచిపోతాడు. అంతలో మెలకువ వస్తుంది. ఆనంద దృశ్యాలన్నీ అదృశ్యమై పోతాయి. మధురానుభూతి మాయమైపోతూ ఉంటుంది. కామ సుఖాలు కూడా అలాంటివే... ఇంకా ఒకరు అందమైన, విలువైన నగల్ని అరువు తెచ్చుకుంటారు. ధరిస్తారు. దూరంగా ఉన్న పట్టణానికి వెళ్తారు. అక్కడ అంగడిలో వాటిని అమ్మకానికి పెడతారు. బేరం జరుగుతూ ఉండగా, అసలైన నగల యజమాని వస్తాడు. దూషించి తన నగలు తాను పట్టుకుపోతాడు. అవమానంతో బేలతనంతో ఆ అరువు తెచ్చుకున్న వారు హేళన పాలవుతారు. కామాలు అంటే కోరికలు కూడా మనకి చివరికి అవమానాల్ని తెస్తాయి. హేళన పాల్జేస్తాయి. కాబట్టి కోరికలల వెంటపడి పరుగుతీసే మన మనస్సుని మనం నియంత్రించుకోవాలి.’’ అని చెప్పాడు. ఆ యువకునితో పాటు, అక్కడ ఉన్న వారందరికీ కోర్కెల వల్ల కలిగే కీడు అర్థమైంది. ఆ యువకుడు లేచి, బుద్ధునికి వంగి నమస్కరించాడు. – డా. బొర్రా గోవర్ధన్ (చదవండి: లోపలి అరలు, పొరలు, వాటికి అడ్డంగా తెరలు) -
మదర్ పవర్ ఈజ్ డివైన్ పవర్!
పిల్లల చదువు, పెంపకంలో తల్లిపాత్ర కీలకమైనది. తల్లి దినచర్యలో పిల్లలతో హోంవర్క్ చేయించడం ఒక భాగం. అయితే అందరు తల్లులకు ఇది వీలవుతుందా? కాకపోయినా... తప్పదు కదా! అంటుంది ఈ తల్లి, రోడ్డు పక్కన బండిపై పండ్లు అమ్ముకునే ఒక మహిళ, బండి పక్కన నేలపై కూర్చొని పిల్లలతో ఓపిగ్గా హోం వర్క్ చేయిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ‘ఈ వీడియోకు కాప్షన్ ఇవ్వడానికి పదాలు రావడం లేదు’ అని రాస్తూ ఝార్ఖండ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి సంజయ్ కుమార్ ఈ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ‘ఈ రోజు పడే కష్టమే రేపటి విజయం’ అని నెటిజనాలు ఆ తల్లిపై ప్రశంసల జల్లు కురిపించారు. ‘మదర్ పవర్ ఈజ్ డివైన్ పవర్’ అని ఒకరు రాశారు. -
యూనిఫామ్ వేసుకొని పాఠాలు చెప్పే పంతులమ్మ.. ఫుల్ అటెండెన్స్
రాయ్‌పూర్‌లో ఒక టీచర్ పిల్లల్ని వినూత్నంగా ఆకట్టుకుంటోంది. వారానికి ఒకసారి వారిలాగే యూనిఫామ్ ధరించి స్కూల్‌కు వస్తోంది. ‘నేనూ మీలో ఒకదాన్నే’ అనే భావన కలిగించడమే కాదు... టీచర్ అంటే కొట్టే తిట్టే మనిషి కాదనే భరోసా ఇస్తోంది. దీంతో పిల్లలు ఫుల్లుగా స్కూల్‌కు అటెండ్ అవుతున్నారు. పిల్లల్లో ఆత్మవిశ్వాసం నింపడానికి ఆమె చేస్తున్న ఈ చిన్న ప్రయత్నం అందరి ప్రశంసలు పొదుతోంది. రాయ్‌పూర్ (చత్తిస్గఢ్)లోని గోకుల్‌రామ్ వర్మ ప్రైమరీ స్కూల్ అనే ప్రభుత్వబడిలో వారమంతా పిల్లలు ఉత్సాహంగా ఉంటారు. శనివారం ఇంకా ఉత్సాహంగా ఉంటారు. దానికి కారణం ఆ రోజు ఆ స్కూల్ టీచర్ జాహ్నవి యదు వారిలాగే తయారయ్యి వారిలాగే యూనిఫామ్ వేసుకుని వస్తుంది. ఆ రోజు కుర్చీలో కూచోదు. వారి మధ్య కూచుని పాఠాలు, కబుర్లు చెబుతుంది. వారితో సంభాషిస్తుంది. అందుకే పిల్లలందరికీ జాహ్నవి యదు టీచర్ అంటే ఇష్టం. కొత్త ఆలోచన గోకుల్ రామ్ వర్మ ప్రైమరీ స్కూల్లో 1 నుంచి 5 వరకూ చదివే 350 మంది పిల్లలు ఉన్నారు. వారంతా ఆ చుట్టుపక్కల బస్తీవాసుల పిల్లలు. వారి తల్లిదండ్రులకు పెద్దగా చదువు లేదు. పిల్లలకు క్రమశిక్షణ అంటే తెలియదు. స్కూల్‌కు రోజూ రావడం ఇష్టం ఉండదు. యూనిఫామ్ వేసుకోరు. గత సంవత్సరం ఇదే బడిలో టీచర్‌గా చేరిన 30 ఏళ్ల జాహ్నవి యదు ఇదంతా గమనించింది. వారితో తిప్పలు పడింది. దారిలో పెట్టలేక సతమతమయ్యింది. ఈ సంవత్సరం అంటే 2023 జూన్‌లో స్కూల్ రీ ఓపెన్ అయినప్పుడు జాహ్నవి యదు కొత్త ఆలోచన చేసింది. హఠాత్తుగా ఒకరోజు వారిలాగా యూనిఫామ్ వేసుకుని వచ్చింది. పిల్లలు ఆశ్చర్యపోయారు. గుమిగూడారు. నవ్వారు. ఆనందించారు. ‘ఎందుకు టీచర్ ఇలా వేసుకొచ్చావ్’ అనంటే ‘స్కూల్‌కి మీరు ఇలాగే రావాలి. అందుకని వేసుకొచ్చా. మనందరం ఒక టీమ్. మనందరం సూపర్‌గా చదువుకోవాలి’ అని వారిని ‘మనం’ చేశాక వాళ్లు సంతోషించారు. టీచర్లా యూనిఫామ్ వేసుకురావాలని వారికీ అనిపించింది. టీచర్ కోసం రోజూ స్కూల్‌కి రావాలని కూడా. అన్నీ ప్రశంసలే జాహ్నవి యదు వారానికి ఒకరోజు అంటే ప్రతి శనివారం స్కూల్ యూనిఫామ్‌లో రావడం రాయ్‌పూర్ అంతా పెద్ద వార్త అయ్యింది. జాహ్నవి యదు చర్య వల్ల పిల్లలు బెరుకు లేకుండా తమ మనసుల్లో ఉన్నది చెప్పుకుంటున్నారని స్కూల్ అనేది టీచర్లు చావబాదే స్థలం కాదని తెలుసుకుని క్లాసులకు హాజరవుతున్నారని ఊరు మొత్తం తెలిసింది. అందరూ జాహ్నవి యదును అభినందిస్తున్నారు. ‘టీచర్లూ పిల్లలూ బడిలో సమానమే అనే భావన వ్యాప్తి చేయడమే నా ఉద్దేశం’ అని జాహ్నవి యదు చెప్పింది. అయితే ఇలాంటి బట్టల్లో రావడానికి ఆమె కొంచెం ఆలోచించింది– అత్తామామలు ఏమంటారోనని. కాని వారు అంగీకరించి దూసుకుపో కోడలు పిల్లా అని ఉత్సాహపరిచారు. దాంతో జాహ్నవి యదు పిల్లలతో ఆడిపాడుతున్నట్టుగా కనిపిస్తూ వారికి పాఠాలు చెబుతూ దారిలో పెడుతోంది. ఫేవరెట్ టీచర్ కొందరు టీచర్లు తమ కెరీర్ మొత్తం ఏ క్లాస్‌కీ ఫేవరెట్ టీచర్ కాకుండానే రిటైర్ అయిపోతారు. కొందరు టీచర్లు ప్రతి సంవత్సరం ఎంతోమంది పిల్లలకు ఫేవరెట్ టీచర్ అవుతారు. పిల్లలతో బంధం వేసుకోవడం టీచర్‌కు చాలా ముఖ్యం. అందులో ఎంతో ఆత్మతృప్తి ఉంటుంది. ఇప్పుడు స్కూల్ మొత్తానికి ఫేవరెట్ టీచర్ అయిన జాహ్నవి యదుని చూసి తాము కూడా పిల్లల కోసం ఏదైనా చేద్దామా అనుకుంటున్నారు మిగిలిన టీచర్లు. అది చాలదూ? టీచర్లూ, పిల్లలూ బడిలో సమానమే అనే భావన వ్యాప్తి చేయడమే నా ఉద్దేశం. – జాహ్నవి యదు -
ఆ సమయంలో ఏం చేయగలను చెప్పు?
ఈ రోజుల్లో సర్వసాధారణంగా వినిపిస్తున్న పదం లైంగిక వేధింపులు (సెక్సువల్ హెరాస్మెంట్). ఈ వేధింపులు ఒక ప్రదేశానికో, ఒక వయసులో ఉన్న మహిళలకే పరిమితమై ఉన్నాయనుకుంటే పొరపడ్డట్లే. ఎందుకంటే ఇప్పుడు లైంగిక వేధింపులనేవి ప్రతి చోట జరుగుతునే ఉన్నాయి. ఇది భౌతిక రూపంలోనూ మానసిక రూపంలోనూ వెంటాడుతున్నాయి. బుడిబుడి నడకలు వేస్తున్న చిన్నారి, స్కూల్ కి వెళ్లే పాప, కాలేజీకి వెళ్లే యువతి, కార్యాలయాల్లో పనిచేసే మహిళా ఉద్యోగుల నుంచి చెప్పడానికే అసహ్యమనిపించేలా ముసలి అవ్వలపై కూడా లైంగిక వేధింపులు జరుగుతున్నాయి. అయితే, ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ముందుగా తమ పిల్లలకు అవగాహన కల్పించడం చాలా ముఖ్యమని పలువురు చెప్తున్నారు. భారత్ వంటి దేశాల్లో లైంగికపరమైన అంశాలను చర్చించుకోవడం తప్పుగా భావిస్తారని, ఇక తండ్రి కొడుకులు, తల్లి కొడుకుల మధ్య ఇలాంటి సంభాషణ ఎంతో పాపంగా భావిస్తారని కానీ జరగాల్సిన పద్ధతిలో వారి మధ్య జరిగితే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని చెప్తున్నారు. ఇందుకోసం బ్రేక్ త్రో ఇండియా అనే సంస్థ ఒక నిమిషం లోపు వీడియోలోనే తమ పిల్లలు లైంగిక వేధింపుల చర్యలు పాల్పడకుండా ఓ తల్లి ఎలా పాఠం బోధించవచ్చో వివరించారు. ఆ వీడియోలో ఏముందంటే 'ఓ విద్యార్థిని స్కూల్ బ్యాగుతో పొద్దున్నే సిద్ధమై స్కూల్ కి బయలు దేరుతుంది. ఇంటి బయట కాలుపెట్టగానే వారి ఇంటిపైన మరో ఇంట్లో ఉంటున్న ఓ కుర్రాడు బంతిపూలు ఆ అమ్మాయి తలపై జల్లుతాడు. కోపంతో ఆ అమ్మాయి.. వాటిని దులిపేసుకుని వెళ్లిపోతుంది. ఆ తర్వాత మరో ఆంటీపై అలాగే చేయబోతాడు. అప్పుడే వాళ్ల అమ్మ బట్టలు ఆరవేసేందుకు బయటకు వచ్చి ఆ విషయం గమనిస్తుంది. దాంతో ఆ బాలుడు వెంటనే ఆంటీపై పూలు చల్లకుండా ఆగిపోతాడు. ఆ సమయంలో తల్లికి ఆ కుమారుడికి మధ్య అర్ధమంతమైన సంభాషణ జరుగుతుంది. ఆ సంభాషణ ఏమిటంటే.. తల్లి: నిన్న నేను ఆఫీసుకు వెళుతుంటే ఏం జరిగిందో చెప్పనా.. కొడుకు: చెప్పు తల్లి: కొందరు కుర్రాళ్లు పాప్ కార్న్‌ను నాపైకి విసిరారు కొడుకు: అప్పుడేం జరిగింది తల్లి: నేను వెనుకకు తిరిగి చూశాను. వారు బైక్స్ పై కూర్చుని ఉన్నారు. దగ్గరగా వచ్చి మేడమ్.. మీ తలలో మా పాప్ కార్న్ చిక్కుకుపోయింది.. తీసుకోమంటారా అన్నారు. అ సమయంలో వాళ్లను ఏం చేయగలను చెప్పు? కొడుకు: (ఏం మాట్లాడకుండా.. తప్పు చేస్తున్నవాడిలా మౌనంలోకి జారుకున్నాడు). తల్లి: అందుకే ఎవరి విషయంలోనూ అతి తెలివితో ప్రవర్తించకూడదు.. అని చెప్పి వెళ్లిపోతుంది.