Raipur School Teacher Wear Uniform To Inspire Unity And Change; See Pics - Sakshi
Sakshi News home page

Raipur School Teacher: యూనిఫామ్‌, రిబ్బన్స్‌.. అచ్చం పిల్లల్లాగే రెడీ అవుతుంది, పాఠాలు చెప్తుంది

Published Thu, Aug 10 2023 10:19 AM | Last Updated on Thu, Aug 10 2023 11:51 AM

Raipur School Teacher Wears Uniform To Inspires Unity And Change - Sakshi

రాయ్‌పూర్‌లో ఒక టీచర్‌ పిల్లల్ని వినూత్నంగా ఆకట్టుకుంటోంది. వారానికి ఒకసారి వారిలాగే యూనిఫామ్‌ ధరించి స్కూల్‌కు వస్తోంది. ‘నేనూ మీలో ఒకదాన్నే’ అనే భావన కలిగించడమే కాదు... టీచర్‌ అంటే కొట్టే తిట్టే మనిషి కాదనే భరోసా ఇస్తోంది. దీంతో పిల్లలు ఫుల్లుగా స్కూల్‌కు అటెండ్‌ అవుతున్నారు. పిల్లల్లో  ఆత్మవిశ్వాసం నింపడానికి ఆమె చేస్తున్న ఈ చిన్న ప్రయత్నం అందరి ప్రశంసలు  పొదుతోంది.


రాయ్‌పూర్‌ (చత్తిస్‌గఢ్‌)లోని గోకుల్‌రామ్‌ వర్మ ప్రైమరీ స్కూల్‌ అనే ప్రభుత్వబడిలో వారమంతా పిల్లలు ఉత్సాహంగా ఉంటారు. శనివారం ఇంకా ఉత్సాహంగా ఉంటారు. దానికి కారణం ఆ రోజు ఆ స్కూల్‌ టీచర్‌ జాహ్నవి యదు వారిలాగే తయారయ్యి వారిలాగే యూనిఫామ్‌ వేసుకుని వస్తుంది. ఆ రోజు కుర్చీలో కూచోదు. వారి మధ్య కూచుని పాఠాలు, కబుర్లు చెబుతుంది. వారితో సంభాషిస్తుంది. అందుకే పిల్లలందరికీ జాహ్నవి యదు టీచర్‌ అంటే ఇష్టం. 

కొత్త ఆలోచన
గోకుల్‌ రామ్‌ వర్మ ప్రైమరీ స్కూల్‌లో 1 నుంచి 5 వరకూ చదివే 350 మంది పిల్లలు ఉన్నారు. వారంతా ఆ చుట్టుపక్కల బస్తీవాసుల పిల్లలు. వారి తల్లిదండ్రులకు పెద్దగా చదువు లేదు. పిల్లలకు క్రమశిక్షణ అంటే తెలియదు. స్కూల్‌కు రోజూ రావడం ఇష్టం ఉండదు. యూనిఫామ్‌ వేసుకోరు. గత సంవత్సరం ఇదే బడిలో టీచర్‌గా  చేరిన 30 ఏళ్ల జాహ్నవి యదు ఇదంతా గమనించింది. వారితో తిప్పలు పడింది. దారిలో పెట్టలేక సతమతమయ్యింది. ఈ సంవత్సరం అంటే 2023 జూన్‌లో స్కూల్‌ రీ ఓపెన్‌ అయినప్పుడు జాహ్నవి యదు కొత్త ఆలోచన చేసింది.

హఠాత్తుగా ఒకరోజు వారిలాగా యూనిఫామ్‌ వేసుకుని వచ్చింది. పిల్లలు ఆశ్చర్యపోయారు. గుమిగూడారు. నవ్వారు. ఆనందించారు. ‘ఎందుకు టీచర్‌ ఇలా వేసుకొచ్చావ్‌’ అనంటే ‘స్కూల్‌కి మీరు ఇలాగే రావాలి. అందుకని వేసుకొచ్చా. మనందరం ఒక టీమ్‌. మనందరం సూపర్‌గా చదువుకోవాలి’ అని వారిని ‘మనం’ చేశాక వాళ్లు సంతోషించారు. టీచర్‌లా యూనిఫామ్‌ వేసుకురావాలని వారికీ అనిపించింది. టీచర్‌ కోసం రోజూ స్కూల్‌కి రావాలని కూడా.

అన్నీ ప్రశంసలే
జాహ్నవి యదు వారానికి ఒకరోజు అంటే ప్రతి శనివారం స్కూల్‌ యూనిఫామ్‌లో రావడం రాయ్‌పూర్‌ అంతా పెద్ద వార్త అయ్యింది. జాహ్నవి యదు చర్య వల్ల పిల్లలు బెరుకు లేకుండా తమ మనసుల్లో ఉన్నది చెప్పుకుంటున్నారని స్కూల్‌ అనేది టీచర్లు చావబాదే స్థలం కాదని తెలుసుకుని క్లాసులకు హాజరవుతున్నారని ఊరు మొత్తం తెలిసింది. అందరూ జాహ్నవి యదును అభినందిస్తున్నారు. ‘టీచర్లూ పిల్లలూ బడిలో సమానమే అనే భావన వ్యాప్తి చేయడమే నా ఉద్దేశం’ అని జాహ్నవి యదు చెప్పింది. అయితే ఇలాంటి బట్టల్లో రావడానికి ఆమె కొంచెం ఆలోచించింది– అత్తామామలు ఏమంటారోనని. కాని వారు అంగీకరించి దూసుకుపో కోడలు పిల్లా అని ఉత్సాహపరిచారు. దాంతో జాహ్నవి యదు పిల్లలతో ఆడిపాడుతున్నట్టుగా కనిపిస్తూ వారికి పాఠాలు చెబుతూ దారిలో పెడుతోంది.

ఫేవరెట్‌ టీచర్‌
కొందరు టీచర్లు తమ కెరీర్‌ మొత్తం ఏ క్లాస్‌కీ ఫేవరెట్‌ టీచర్‌ కాకుండానే రిటైర్‌ అయిపోతారు. కొందరు టీచర్లు ప్రతి సంవత్సరం ఎంతోమంది పిల్లలకు ఫేవరెట్‌ టీచర్‌ అవుతారు. పిల్లలతో బంధం వేసుకోవడం టీచర్‌కు చాలా ముఖ్యం. అందులో ఎంతో ఆత్మతృప్తి ఉంటుంది. ఇప్పుడు స్కూల్‌ మొత్తానికి ఫేవరెట్‌ టీచర్‌ అయిన జాహ్నవి యదుని చూసి తాము కూడా పిల్లల కోసం ఏదైనా చేద్దామా అనుకుంటున్నారు మిగిలిన టీచర్లు. అది చాలదూ?


టీచర్లూ, పిల్లలూ బడిలో సమానమే అనే భావన వ్యాప్తి చేయడమే నా ఉద్దేశం.
– జాహ్నవి యదు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement