ఆ సమయంలో ఏం చేయగలను చెప్పు?
ఈ రోజుల్లో సర్వసాధారణంగా వినిపిస్తున్న పదం లైంగిక వేధింపులు (సెక్సువల్ హెరాస్మెంట్). ఈ వేధింపులు ఒక ప్రదేశానికో, ఒక వయసులో ఉన్న మహిళలకే పరిమితమై ఉన్నాయనుకుంటే పొరపడ్డట్లే. ఎందుకంటే ఇప్పుడు లైంగిక వేధింపులనేవి ప్రతి చోట జరుగుతునే ఉన్నాయి. ఇది భౌతిక రూపంలోనూ మానసిక రూపంలోనూ వెంటాడుతున్నాయి. బుడిబుడి నడకలు వేస్తున్న చిన్నారి, స్కూల్ కి వెళ్లే పాప, కాలేజీకి వెళ్లే యువతి, కార్యాలయాల్లో పనిచేసే మహిళా ఉద్యోగుల నుంచి చెప్పడానికే అసహ్యమనిపించేలా ముసలి అవ్వలపై కూడా లైంగిక వేధింపులు జరుగుతున్నాయి.
అయితే, ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ముందుగా తమ పిల్లలకు అవగాహన కల్పించడం చాలా ముఖ్యమని పలువురు చెప్తున్నారు. భారత్ వంటి దేశాల్లో లైంగికపరమైన అంశాలను చర్చించుకోవడం తప్పుగా భావిస్తారని, ఇక తండ్రి కొడుకులు, తల్లి కొడుకుల మధ్య ఇలాంటి సంభాషణ ఎంతో పాపంగా భావిస్తారని కానీ జరగాల్సిన పద్ధతిలో వారి మధ్య జరిగితే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని చెప్తున్నారు. ఇందుకోసం బ్రేక్ త్రో ఇండియా అనే సంస్థ ఒక నిమిషం లోపు వీడియోలోనే తమ పిల్లలు లైంగిక వేధింపుల చర్యలు పాల్పడకుండా ఓ తల్లి ఎలా పాఠం బోధించవచ్చో వివరించారు.
ఆ వీడియోలో ఏముందంటే 'ఓ విద్యార్థిని స్కూల్ బ్యాగుతో పొద్దున్నే సిద్ధమై స్కూల్ కి బయలు దేరుతుంది. ఇంటి బయట కాలుపెట్టగానే వారి ఇంటిపైన మరో ఇంట్లో ఉంటున్న ఓ కుర్రాడు బంతిపూలు ఆ అమ్మాయి తలపై జల్లుతాడు. కోపంతో ఆ అమ్మాయి.. వాటిని దులిపేసుకుని వెళ్లిపోతుంది. ఆ తర్వాత మరో ఆంటీపై అలాగే చేయబోతాడు. అప్పుడే వాళ్ల అమ్మ బట్టలు ఆరవేసేందుకు బయటకు వచ్చి ఆ విషయం గమనిస్తుంది. దాంతో ఆ బాలుడు వెంటనే ఆంటీపై పూలు చల్లకుండా ఆగిపోతాడు. ఆ సమయంలో తల్లికి ఆ కుమారుడికి మధ్య అర్ధమంతమైన సంభాషణ జరుగుతుంది.
ఆ సంభాషణ ఏమిటంటే..
తల్లి: నిన్న నేను ఆఫీసుకు వెళుతుంటే ఏం జరిగిందో చెప్పనా..
కొడుకు: చెప్పు
తల్లి: కొందరు కుర్రాళ్లు పాప్ కార్న్ను నాపైకి విసిరారు
కొడుకు: అప్పుడేం జరిగింది
తల్లి: నేను వెనుకకు తిరిగి చూశాను. వారు బైక్స్ పై కూర్చుని ఉన్నారు. దగ్గరగా వచ్చి మేడమ్.. మీ తలలో మా పాప్ కార్న్ చిక్కుకుపోయింది.. తీసుకోమంటారా అన్నారు. అ సమయంలో వాళ్లను ఏం చేయగలను చెప్పు?
కొడుకు: (ఏం మాట్లాడకుండా.. తప్పు చేస్తున్నవాడిలా మౌనంలోకి జారుకున్నాడు).
తల్లి: అందుకే ఎవరి విషయంలోనూ అతి తెలివితో ప్రవర్తించకూడదు.. అని చెప్పి వెళ్లిపోతుంది.