ఏఐ మేజిక్‌ : గంటకు రూ. 400 సంపాదన  | Baby Bokale Teaches Marathi To AI And Makes Rs 400 Per Hour | Sakshi
Sakshi News home page

 ఏఐ మేజిక్‌ : గంటకు రూ. 400 సంపాదన 

Feb 10 2024 10:04 AM | Updated on Feb 10 2024 10:44 AM

Baby Bokale Teaches Marathi to AI And Makes Rs 400 Per Hour - Sakshi

మసాలా దినుసులు, ఎండు మిరప కాయలను గ్రైండింగ్‌ చేసే చిన్నపాటి వ్యాపారం చేస్తున్న పుణెకు చెందిన 53 సంవత్సరాల బేబి రాజారామ్‌ బొకాలే నోటి నుంచి ఇప్పుడు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ)కి  సంబంధించిన విషయాలు, విశేషాలు వినిపిస్తున్నాయి. మైక్రోసాఫ్ట్‌  ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ)  మోడల్స్‌కు తన గొంతును అరువు ఇస్తూ అదనపు ఆదాయాన్ని ఆర్జిస్తుంటుంది బేబి. పర్సనల్‌ ఫైనాన్స్‌ నుంచి ఫ్రాడ్‌ జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పే ఎన్నో విషయాల వరకు మరాఠీలో చెబుతుంది...

భారత పర్యటనకు వచ్చిన మైక్రోసాఫ్ట్‌ సీయీవో సత్య నాదెళ్ల సోషల్‌ ఇంపాక్ట్‌ ఆర్గనైజేషన్‌ ‘కార్య’ టీమ్‌లాంటి చేంజ్‌మేకర్స్‌తో కలిసి పని చేయడానికి ఉత్సాహం చూపారు. ‘కార్య’కు సంస్కృతంలో ‘మీకు గౌరవాన్ని ఇచ్చే పని’ అనే అర్థం ఉంది. 2017లో బెంగళూరు  కేంద్రంగా మైక్రోసాఫ్ట్‌ రిసెర్చి ప్రాజెక్ట్‌గా మొదలైన కార్య ‘ఎర్న్, లెర్న్‌ అండ్‌ గ్రో’ అనే నినాదంతో ముందుకు వెళుతోంది. కృత్రిమ మేధ నమూనాలకు శిక్షణ ఇవ్వడానికి, పరిశోధనల కోసం అనేక భారతీయ భాషలలో డేటాసెట్లను క్రియేట్‌ చేస్తోంది.

‘ఎన్నో లక్షల మంది మరాఠీ మాట్లాడుతున్నప్పటికీ డిజిటల్‌ ప్రపంచంలో ఆ భాషకు సముచిత ప్రాధాన్యత లేదు’ అంటున్న ‘కార్య’ నిర్వాహకులు మరాఠీపైనే కాదు డిజిటల్‌ ప్రపంచానికి దూరంగా ఉన్న ఎన్నో భాషలపై దృష్టి పెడుతున్నారు. నైపుణ్యాలను (స్కిల్క్‌) వాడుకోవడంతోపాటు పేదరికాన్ని దూరం చేయడానికి, డిజిటల్‌ ఆర్టికవ్యవస్థ బలోపేతానికి స్కిల్‌ డెవలప్‌మెంట్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారు. బేబీ రాజారామ్‌ బొకాలేలాంటి సామాన్య మహిళలే ఇందుకు ఉదాహరణ. 

పగటిపూట తన పనులన్నీ పూర్తయ్యాక ఏఐ మోడల్స్‌ కోసం తన మాతృభాష మరాఠీలో స్టోరీలు చదువుతుంది బొకాలే. బ్యాంకింగ్, సేవింగ్స్, ఫ్రాడ్‌ ప్రివెన్షన్లకు సంబంధించిన ఈ స్టోరీలను ఇన్‌ఫర్‌మేటివ్, ఎంటర్‌టైనింగ్‌ విధానంలో రూపొదించారు.

‘నా వాయిస్‌ రికార్డు అవుతున్నందుకు గర్వంగా ఉంది. స్టోరీ చదువుతున్నప్పుడు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. కష్టపడి సంపాదించిన డబ్బు ఖర్చు చేయడం తప్ప పొదుపు చేయడం అనే అలవాటు చాలామందిలో ఉండదు. పొదుపు అలవాటును ఒక కథ నొక్కి చెబుతుంది’ అంటున్న బొకాలే తన డిజిటల్‌ అక్షరాస్యతను కూడా పెంచుకుంటోంది. ఏఐ టెక్నాలజీకి సంబంధించి ఆసక్తికరమైన విషయాలు తన స్మార్ట్‌ ఫోన్‌ ద్వారా తెలుసుకుంటుంది.

‘మరాఠీలో ఏఐ టూల్స్‌ అందుబాటులోకి వస్తున్నందుకు ఆనందంగా ఉంది’ అంటుంది బొకాలే. మొత్తం పదకొండు రోజులలో ఆమె చేసిన అయిదు గంటల పనికి రెండువేల రూపాయలు అందుకుంది. వాయిస్‌ అరువు ఇచ్చినందుకు వచ్చిన డబ్బులను గ్రైండర్‌ రిపేరింగ్‌  కోసం ఉపయోగించింది.

‘సమయం రాత్రి 10.30 గంటలు. ఒక మూలన రంగురంగుల వెలుగులతో మెరిసిపోతున్న కృష్ణుడి మందిరం ఉన్న చిత్రం కనిపిస్తోంది. మంచంపై కూర్చున్న ఆమె తన స్మార్ట్‌ఫోన్‌లో ఒక యాప్‌ ఓపెన్‌ చేసి స్పష్టమైన, ప్రతిధ్వనించే గొంతుతో ఒక కథను బిగ్గరగా చదవడం మొదలుపెట్టింది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ మోడల్స్‌కు మరాఠీలో ట్రైనింగ్‌ ఇచ్చేందుకు బొకాలే గొంతును ఉపయోగించుకుంటున్నారు’ అంటూ తన బ్లాగ్‌లో రాసింది మైక్రోసాఫ్ట్‌.

‘ఇలాంటి పని ఒకటి చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు’ నవ్వుతూ అంటుంది బొకాలే. కాలేజీ పిల్లల నోటి నుంచి ‘ఏఐ’ అనే మాట వినడం తప్ప దానికి సంబంధించిన పైలట్‌  ప్రాజెక్ట్‌లో భాగం అవుతానని ఆమె ఉహించలేదు. పుణెలోని ఖారద్‌ ఏరియాలో చుట్టపక్కల వారు బొకాలేను ‘బేబీ అక్కా’ అని ప్రేమగా పిలుస్తారు. సెల్ఫ్‌–హెల్ప్‌ బ్యాంకింగ్‌ గ్రూప్‌ మొదలు పెట్టి మహిళలలో పొదుపు అలవాట్లు పెంపొదిస్తుంది బొకాలే. తాము దాచుకున్న పొదుపు మొత్తాలతో చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభించిన మహిళలు ఎందరో ఉన్నారు.

51 సంవత్సరాల సురేఖ గైక్వాడ్‌ కూడా ‘కార్య’ కోసం మరాఠీ విషయంలో బేబీలాగే పనిచేస్తుంది. చిన్న΄ాటి కిరాణా దుకాణం నడుతున్న సురేఖ ‘ఈ పని నాలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది’ అంటుంది. బ్యాంకులో డబ్బు ఎలా డిపాజిట్‌ చేయాలి, ఎలా డ్రా చేయాలి... వంటి వాటి నుంచి కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికత వల్ల కలిగే ఉపయోగాల వరకు ఎన్నో విషయాలు తెలుసుకుంది.  పొదుపుపై దృష్టి పెట్టింది సురేఖ.

55 సంవత్సరాల మీనా జాదవ్‌ కూడా ‘కార్య’ కోసం పనిచేస్తోంది. తనకు వచ్చిన డబ్బును టైలరింగ్‌ బిజినెస్‌కు అవసరమైన మెటీరియల్‌ కొనడానికి ఉపయోగించింది. ఇప్పుడు మీనా సేవింగ్‌ ఎకౌంట్‌ను ఉపయోగిస్తుంది. ఏటీయం ను ఎలా ఉపయోగించాలో తెలుసుకుంది.

మరో మహిళ తాను సంపాదించిన డబ్బును కుమార్తె చదువుకు సంబంధించి  పొదుపు ఖాతా ప్రారంభించడానికి ఉపయోగించింది. వీరందరూ తమ పనిని ఆస్వాదించడమే కాదు ఫైనాన్షియల్‌ ప్లానింగ్, ఆన్‌లైన్‌ టూల్స్‌ ఉపయోగం, ఎలా ఉపయోగించాలి, స్మార్ట్‌ఫోన్‌ ద్వారా కొత్త ఉపాధి అవకాశాలు ఎలా సృష్టించుకోవాలో తెలుసు కున్నారు.

‘అన్ని కమ్యూనిటీలు భాగం కావడమే కార్య విజయానికి కారణం. ‘కార్య’కర్తలలో మహిళలే ఎక్కువ. ఈ పని వల్ల నాకు ఎంత డబ్బు వస్తుంది అనేదాని కంటే ఈ పని చేయడం వల్ల నాకు, నా కుటుంబానికి చెడ్డ పేరు రాదు కదా! అనేది ఎక్కువ మంది మహిళల నుంచి వచ్చే ప్రశ్న’ అంటుంది మెక్రోసాఫ్ట్‌ రిసెర్చర్‌ కాళిక బాలి.

పైలట్‌ ప్రాజెక్ట్‌లో భాగమైన కొద్దిమంది మహిళలకు మొదట్లో స్మార్ట్‌ఫోన్‌ ఎలా ఉపయోగించాలి అనేది బొత్తిగా తెలియదు. అలాంటి వారు కుటుంబ సభ్యులు, బంధువులు ఆశ్చర్యపడేలా స్మార్ట్‌ఫోన్‌ను అద్భుతంగా ఉపయోగిస్తున్నారు. స్థూలంగా చె ప్పాలంటే వారి ప్రగతి ప్రయాణంలో ఇది తొలి అడుగు మాత్రమే.


ఈ ఫోటోలో ఉన్న వారు (ఎడమ నుంచి) పార్వతీ కెంబ్లే, సురేఖ గైక్వాడ్, బేబీ రాజారామ్‌ బొకాలే. గతంలో ఈ ముగ్గురు ఒకచోట కూర్చుంటే ఏం మాట్లాడుకునేవారో తెలియదుగానీ ఇప్పుడు మాత్రం పొదుపు, వ్యా΄ారం లాంటి విషయాల గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. వీరి సెల్ఫ్‌–హెల్ప్‌ బ్యాంకింగ్‌ గ్రూప్‌ ఎంతోమంది మహిళల్లో పొదుపు అలవాట్లను పెంచు తోంది. భవిష్యత్‌ లక్ష్యాలను నిర్దేశించుకునేలా చేస్తోంది. 
  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement