
దాతి మహారాజ్ బాబా
సాక్షి, న్యూఢిల్లీ : తానే స్వయంగా దేవుడి అవతారం అని చెప్పుకునే దాతి మహారాజ్ బాబాపై ఇటీవల ఢిల్లీ పోలీసులు ఓ మహిళ చేసిన ఫిర్యాదుతో అత్యాచార నేరం కింద కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై దాతీ బాబా స్పందించారు. ఆమె నా కూతురులాంటిది. నాపై ఫిర్యాదు చేసినందుకు ఆమెపై నేను ఎలాంటి చర్యలు తీసుకోనని తెలిపారు. ఒక వేళ నాకు శిక్ష పడినా నేను ఆమెను ఏమీ అనలేనన్నారు. నేను నిజంగా తప్పు చేశానని రుజువైతే శిక్షించడానికి న్యాయస్థానాలు ఉన్నాయన్నారు. విచారణకు నేను పూర్తిగా సహకరిస్తానని తెలిపారు.
మహారాజ్ ఆశ్రమం శనిధామ్‌లో రెండు సంవత్సరాల క్రితం తాను అత్యాచారానికి గురైనట్టు ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో దాతీబాబాపై ఐపీసీ 376, 377, 354, 34 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు. విచారణ మొత్తం పూర్తయ్యే వరకూ ఆయన దేశం విడిచి పోరాదని పోలీసులు ఆదేశించారు. ఈయన ఉత్తర భారతదేశంలోనే పాపులర్ బాబా.