బురిడీ బాబా హైడ్రామా | Sudhakar maharaj high drama for Escape from arrest | Sakshi
Sakshi News home page

బురిడీ బాబా హైడ్రామా

Published Thu, Mar 1 2018 9:49 AM | Last Updated on Thu, Mar 1 2018 9:49 AM

Sudhakar maharaj high drama for Escape from arrest  - Sakshi

సుధాకర్‌ మహరాజ్‌

నెల్లూరు (వేదాయపాళెం): ఆధ్యాత్మిక ముసుగులో భక్తులను నయవంచనకు గురిచేసిన సుధాకర్‌ మహరాజ్‌ అలియాస్‌ టీచర్‌ సుధాకర్‌ అరెస్ట్‌ నుంచి తప్పించుకునేందుకు హైడ్రామా ఆడుతున్నారు. గత 13 రోజులుగా నగరంలోని సింహపురి ఆస్పత్రిలో వైద్యం పేరిట అజ్ఞాతంలోకి వెళ్లారు. వైద్య చికిత్సలకు సంబంధించి ఎప్పటికప్పుడు పరిస్థితిని బహిర్గతం చేయాల్సిన వైద్యులు ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. నెల్లూరురూరల్‌ పోలీసులు కూడా కేసు దర్యాప్తును నీరుగారుస్తున్నారని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. నగరంలోని ప్రశాంతినగర్‌లో ఉన్న సుధాకర్‌ మహరాజ్‌ ఆశ్రమంలో మంత్ర పీటం పేరిట 262 భక్తుల నుంచి రూ.3.72 కోట్ల వసూళ్లకు పాల్పడిన వ్యక్తులు అజ్ఞాతంలోకి వెళ్లిన వైనం గత నెల 15న వెలుగుచూసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి మోసపోయిన బాధితులు న్యాయం కోసం నెల్లూరు రూరల్‌ పోలీస్‌స్టేషన్, జిల్లా ఎస్పీలను కలిసి కోరుతున్నారు. అయితే నెల్లూరూరల్‌ పోలీసులు సుధాకర్‌మహరాజ్‌తోపాటు ఇందులో భాగస్వామ్యమైన వాసవి, భాస్కర్, నారాయణరెడ్డి, యశ్వంత్‌ సింగ్‌పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సుధాకర్‌ మహరాజ్‌ ఆశ్రమం కార్యాలయంలో పనిచేసే సాయి, శ్రీనుపై కూడా విచారణ చేపడుతున్నారు. రాజకీయ నాయకులు, ప్రముఖులతో సుధాకర్‌కు పరిచయాలు, సాన్నిహిత్యం ఉన్న నేపథ్యంలో వీరి ఒత్తిడి పోలీసులపై ఉన్నట్లు తెలుస్తోంది.

వాసవి, మిగతా వ్యక్తులు 13 రోజుల పాటు అజ్ఞాతంలో ఉన్నప్పటికీ పోలీసులు వీరి జాడను గుర్తించలేకపోతున్నారు. కళ్ల ముందు కనిపించే సుధాకర్‌ను సైతం ప్రశ్నించేందుకు చొరవ చూపడం లేదు. ఆస్పత్రిలో చేరిన కొద్ది రోజులు ఇంటెన్సీవ్‌ కేర్‌లో ఉన్న సుధాకర్‌ను ఇటీవల ప్రత్యేక గదిలోకి మార్చారు. సుధాకర్‌ అల్లుడు సంపత్‌ ఆస్పత్రి వద్ద ఉంటూ ఎవరినీ గదిలోకి పంపటం లేదు. నెల్లూరురూరల్‌ సీఐ శ్రీనివాసులు రెడ్డి ఒకటి రెండు సార్లు సుధాకర్‌ను విచారించేందుకు గదిలోకి వెళ్లినప్పటికీ సుధాకర్‌ సైగలు చేస్తూ సమాధానం చెప్పకపోవడంతో సీఐ వెనుదిరగాల్సి వచ్చింది. చిన్నపాటి దొంగతనాలు చేసే వ్యక్తులతో ఎంతో కఠనంగా వ్యవహరించే పోలీసులు బడా మోసానికి పాల్పడిన సుధాకర్‌ను తమదైన శైలిలో పోలీసులు ఎందుకు విచారణ సాగించడం లేదనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదిలా ఉంటే సింహపురి ఆస్పత్రి యాజమాన్యం, వైద్యులను సుధాకర్‌ ఆరోగ్య పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని పోలీసులు కోరుతున్నప్పటికీ పోలీసులకు ఎలాంటి నివేదికలు అందలేదు. ఆస్పత్రిలో ఆశ్రయం పొందుతూ వైద్యం పేరిట సుధాకర్‌ బాధితుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కోర్టు ద్వారా బెయిల్‌ కోసం ప్రముఖ లాయర్లు ద్వారా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. బెయిల్‌ వచ్చే వరకు ఆస్పత్రిలోనే ఉంటూ కాలయాపన చేయాలనే భావనలో ఉన్నట్లు తెలుస్తుంది. బాధితులకు న్యాయం చేసే దిశగా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేయాల్సిన అవసరం ఉంది.

మీడియా ప్రతినిధులు భాగస్వాములే
నగరంలోని కొన్ని చానళ్ల ప్రతి నిధులు, పత్రికల విలేకరులు కూడా సుధాకర్‌ మహరాజ్‌కు కొమ్ము కాశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఓ చానల్‌లో పనిచేస్తున్న భాస్కర్‌ అనే వ్యక్తి భక్తుల నుంచి భారీగా వసూళ్లకు పాల్పడ్డాడు. నెల్లూరురూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయివుంది. నిందితుడు ఫరారీలో ఉన్నాడు. ఇదే తరహాలో పలు పత్రికల విలేకరుల కూడా సుధాకర్‌తో కుమ్మక్కు అయినట్లు తెలుస్తుంది. సుధాకర్‌తో సంబంధాలు ఉన్న మీడియా వారి వివరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.

పురుగు మందు ఆశ్రమంలోకి ఎలా వచ్చింది!.
సుధాకర్‌ ఆశ్రమంలో మోసాలు వెలుగు చూడడంతో ఒక్కసారిగా సుధాకర్‌ పురుగుమందు తాగాడని పెద్ద ఎత్తున హైడ్రామా ఆడుతూ హుటాహుటిన సింహపురి ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. ప్రశాంతతకు నెలవైన ఆశ్రమంలో పురుగు మందు డబ్బా ముందుగా ఎందుకు తేవాల్సి వచ్చిందో తెలియాల్సి ఉంది. ముందుగానే ఓ పథకం ప్రకారం పురుగు మందు డబ్బాను తెచ్చి ఉంచినట్లు తెలుస్తుంది. పరిస్థితి తల కిందులైనప్పుడు హైడ్రామాకు పురుగు మందు డబ్బా ఉపయోగపడుతుందని ముందస్తు వ్యూహంలో భాగంగానే వ్యవహరించారని తెలుస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement