సంత్ సేవాలాల్ జయంతి వేడుకల్లో తలసాని, సత్యవతి రాథోడ్ తదితరులు
బంజారాహిల్స్ (హైదరాబాద్): తన జాతిని సన్మార్గంలో నడిపించి భారత్‌లోని దాదాపు 11 కోట్ల బంజారాలకు సంత్ సేవాలాల్ మహారాజ్ ఆరాధ్య దైవంగా మారారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. బంజారాహిల్స్‌లోని బంజారా భవన్‌లో బుధవారం నిర్వహించిన సంత్ సేవాలాల్ మహారాజ్ 284వ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు.
ప్రకృతి ఆరాధన, ఆధ్యాత్మిక దృక్పథం, సామాజిక సాంస్కృతిక జీవన విధానాన్ని కాపాడటం కోసం సేవాలాల్ మహారాజ్ ఎంతో కృషి చేశారని చెప్పారు. తెలంగాణ వస్తే అణగారిన వర్గాల అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి తగిన గుర్తింపు దక్కుతుందనడానికి సేవాలాల్ జయంతిని అధికారికంగా ప్రభుత్వం నిర్వహించడమే నిదర్శనమన్నారు. ఉత్సవాల నిర్వహణ కోసం ప్రభుత్వం రూ.కోటి మంజూరు చేసిందని తెలిపారు.
మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ... సీఎం కేసీఆర్ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం బంజారా, లంబాడా వర్గాలకు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందన్నారు. రాష్ట్రంలోని తాండాలను గ్రామ పంచాయితీలుగా మార్చి.. ‘మా తండాలో మా రాజ్యం’అనే గిరిజనుల చిరకాల ప్రజాస్వామిక ఆకాంక్షను నెరవేర్చిందని చెప్పారు. గిరిజన విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన విద్యను అందించేందుకు రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment