నలుగురు పిల్లల్ని కనాలి
- హిందూ మహిళలకు బీజేపీ ఎంపీ మహరాజ్ సూచన
మీరట్ /న్యూఢిల్లీ: జాతిపిత మహాత్మాగాంధీని చంపిన నాథురామ్ గాడ్సే గొప్ప దేశ భక్తుడని కొనియాడి పార్లమెంట్‌లో క్షమాపణలు చెప్పిన బీజేపీ ఎంపీ సాక్షీ మహరాజ్ మరో వివాదంతో తెరపైకి వచ్చారు. హిందూ మహిళలు ఒక్కొక్కరు కనీసం నలుగురు పిల్లల్ని కనాలని మంగళవారం మీరట్‌లో జరిగిన ఓ ఆధ్యాత్మిక సభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘మేము గత ప్రభుత్వమిచ్చిన ‘హమ్ దో, హమారా ఏక్’ నినాదాన్ని స్వాగతిస్తున్నాం. ‘హమ్ దో ఔర్ హమారా’ అనే మరో నినాదాన్నీ వారిచ్చారు.
కానీ ఇప్పుడు వీటితో ఎవరూ సంతృప్తి చెందడం లేదు. అమ్మాయిలను అమ్మాయిలే, అబ్బాయిలను అబ్బాయిలే వివాహాలు చేసుకోవడాన్ని గత ప్రభుత్వం ప్రోత్సహించింది. కానీ, ఇదంతా ఎందుకు? ప్రతి మహిళా కనీసం నలుగురు పిల్లల్ని కనాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. వీరిలో ఒకరిని సాధువులకు ఇవ్వండి. మిగిలిన వారిని సైన్యానికి పంపండి’ అని మహరాజ్ అన్నారు.
మండిపడ్డ విపక్షాలు.. మహరాజ్ చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు మండిపడ్డాయి. భారత దేశ జనాభా పెరుగుదల పద్ధతిని మార్చాలనుకుంటున్నారా? అని సంఘ్ పరివార్, నాయకులను హేళన చేశాయి. దీనిపై ప్రభుత్వం స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశాయి. 24 గంటలు గడిచినా ప్రధాని, హోంమంత్రి, ఆర్థికమంత్రి ఈ విషయంపై స్పందించకపోవడంపై విపక్షాలు మండిపడ్డాయి.
‘ఇది కొత్త జనాభా పద్ధతా? దేశం దీనికి సమాధానం కోరుకొంటోంది. కానీ, వారి నుంచి సమాధానం రాదని మాకు తెలుసు’ అని కాంగ్రెస్ ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ వ్యాఖ్యానించారు. కాగా, మహరాజ్ వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని, అది అతని వ్యక్తిగత అభిప్రాయమని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా భువనేశ్వర్‌లో అన్నారు.