భార్య పెళ్లిచీర తాకట్టుపెట్టి... | Liquor Consumption Hike In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

తాగించి, తూలించి ప్రాణాలు తీస్తున్నారు

Published Tue, Nov 27 2018 9:13 AM | Last Updated on Tue, Nov 27 2018 9:34 AM

Liquor Consumption Hike In Andhra Pradesh - Sakshi

బౌద్ధ సంస్కృతి విరాజిల్లిన చోటు, సాంస్కృతిక వికాసానికి పెట్టనికోట అయిన తెలుగు నేలలో గ్రామ సంస్కృతి రానురాను మందు సంస్కృతిగా మారిపోతూ వుంది. పుట్టుక, పెళ్ళి, మరణం, పండుగ ఒక్కటేమిటి ప్రతి సందర్భంలోను గ్రామం, పట్టణం మందు వాసన వేస్తున్నాయి. మన పాలకులు ప్రజల్లో, యువకుల్లోని బలహీనతలను రెచ్చగొట్టి డబ్బు గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు. సామాజిక నీతి, రాజకీయ ప్రవర్తన, తాగుడు వలన విధ్వంసం అవుతున్నాయి.  ‘వీధి వీధికి కుళాయిల్లా మందు షాపులు, బెల్టు షాపులు పెట్టారు. మంచినీళ్ళకు జుట్టు జుట్టు పట్టుకొని కొంటున్నాం, కానీ మందు మాత్రం బాబు ఇంటికే సరఫరా చేస్తున్నాడు. నా బిడ్డ కళ్ళముందే చనిపోయాడు బాబూ’ అని ఎందరో తల్లులు ఏడుస్తున్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈ కేకలు వినపడటం లేదా? విశ్వవిద్యాలయాలు, కాలేజీ హాస్టళ్ళ నిండా మందు సీసాలు, అర్ధరాత్రి కేకలు, ఆడపిల్లల హాస్టళ్ళకు వెళ్ళి ఫొటోలు తీయ డాలు, అక్షరాలు బుర్రకెక్కక అక్షరం ముక్క రాక విద్యా సంస్కృతి ధ్వంసం అవడంలేదా? ఒక బేల్దార్‌ మేస్త్రీ ఉదయాన్నే తాగి రాయి మీద రాయి పెడుతూ క్రిందపడి చనిపోయాడు. ఆ యూనియన్‌ లీడర్‌ ‘ఇది వరకు మేస్త్రీలు ఇడ్లీ, అట్టు తిని ఎంత ఎత్తయిన ఎక్కి పనిచేసేవారు. ఇప్పుడు 100కి 90 మంది మేస్త్రీలు తాగి పరంజాలు ఎక్కుతున్నారు. అక్కడ నుండి తూలిపడిపోతున్నారు’ అన్నారు. పొన్నూరులో ఎమ్మెల్యే ఆధ్వర్యంలోనే మందుషాపు నడుస్తోంది. ఇలా అన్ని ప్రాంతాల్లో రాజకీయ నాయకుల అండతోనే షాపులు నడుస్తున్నాయి.

రాష్ట్రాన్ని విజ్ఞాన హబ్బుగా చేస్తానంటున్నావు. విద్యార్ధిలోకమే రోజుకు ఎంతమందు సేవిస్తోందో తెలుసా? ముఖ్యంగా మత కేంద్రాలు తిరుపతి, అన్నవరం, శ్రీశైలం, కనక దుర్గా మందిర పరిసరాల్లో మందు తాగి, ప్రయాణాల్లో బైకులు, కార్లు నడపడంవల్ల ఎంత నెత్తురు ఈ తెలుగు నేల పీల్చుకుందో తెలుసుకుంటున్నారా? చర్చిల ఎదురు ఎక్కువ మందు తాగుతున్నారు. మసీదుల ముందూ మందు షాపులు ఉన్నాయి. మతక్షేత్రాల చుట్టూ మద్యం షాపులే.  చివరకు రక్షక భటులే తాగి ఇళ్ళకు వెళ్ళడం కాక, డ్యూటీలకు వస్తున్న వైనం మీకు తెలుస్తోందా? 

అనంతపురం, కర్నూలు, కడపల్లో మద్యం విపరీతంగా అమ్ముడవుతోంది. ఒక్క అనంతపురంలో రూ. 244 కోట్ల ఆదాయం వచ్చిదంటే ఇక చూడండి. ఒక పక్క కరువు మరొక పక్క నిరుద్యోగం. రాయలసీమ జిల్లాల్లో మందుసీసా ఒక్కటే రాజ్యం ఏలుతోంది.

శ్రీకాకుళం జిల్లా తెలుగు నేలకు వన్నె తెచ్చిన జిల్లా. అటువంటి జిల్లా ఇప్పుడు మందు వాసనేస్తోంది. తుఫానులో ప్రచార ఆర్భాటం తప్ప చేసింది ఏమీ లేదు. తుఫాన్‌ రిలీఫ్‌కు ఇచ్చిన డబ్బులన్నీ ప్రజలు తాగుతున్నారని తెలుసు. సంక్షేమ పథకాలు తాగుడుకే బలి అవుతున్నాయి. చివరకు రూపాయి బియ్యం కూడా అమ్ముకుని తాగుతున్నారు. అన్న క్యాంటీన్‌కి కూడా తాగే వస్తున్నారు. డ్వాక్రా లోన్లు కూడా మగవాళ్ళు ఆడవాళ్ళ చేతుల నుంచి పీక్కుంటున్నారు. ఇళ్ళు కుదువ పెడుతున్నారు. గిన్నెలు, చెంబులు, ఫ్యాన్లు, టి.వి.లు ఇంట్లో సామానంతా కుదువ పెట్టి తాగుతున్నారు. ఆడవాళ్ళ చెవికమ్మలు, పుస్తెలు, కాళ్ళకుండే పట్టాలతో సహా లాక్కెళ్ళి తాగుతున్నారు. ఇటీవల ఒకడు భార్యకు పెట్టిన పెండ్లి పట్టుచీర కూడా కుదువపెట్టి తాగాడు. ఇక అమరావతి ప్రాంతంలో అయితే మందు కొట్లకు తెల్లవారి నుంచే క్యూలు. రైతులు భూమి మీద వచ్చిన డబ్బుతో తాగి, పేకాడి ఇప్పటికే కొంత మంది రోడ్డున పడ్డారు. రైతుల గుండెల్లో తాగుడు అనే గునపం బాబు గుచ్చాడని రైతుల భార్యలు వాపోతున్నారు. తన మనవడి కోసం ఇప్పటికే వేల కోట్లు సంపాదించిన చంద్రబాబు తన రాష్ట్ర ప్రజల కుటుంబాలు విచ్ఛిన్న మవ్వడం తెలియదా?

మామూలు రవాణాల్లోనే కాకుండా జల రవాణాల్లో కూడా మరణాలు పెరిగాయి. ఈ ఏడాది మే 15న తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం మంటూరు గ్రామానికి పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం వాడపల్లికి మధ్య లాంచీ తలకిందులై 19 మంది  చనిపోయారు. ఈ సంవత్సరం జూలై 14న తూర్పుగోదావరి జిల్లా పోలవరం మండల పరిధిలోని గోదావరి నదిలో పశువుల్లంక మొండి రేవు వద్ద పడవ బోల్తాపడి ఏడుగురు గల్లంతయ్యారు. ఈ మరణాల వెనుక తాగుడు ప్రధాన పాత్రలో వుంది. ఈనాడు ఫూలే, అంబేడ్కర్‌ ఆలోచనా విధానంలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ కూటమి ఏర్పడి బాబును ఓడించాల్సిన  బాధ్యత ముందుకు వచ్చింది. ఈ దుర్భర పరిస్ధితి నుండి రాష్ట్రాన్ని బయట పడవేయాల్సి వుంది.

- డాక్టర్‌ కత్తి పద్మారావు
సామాజిక తత్వవేత్త, నవ్యాంధ్ర పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు
98497 41695

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement