ఏపీలో గణనీయంగా తగ్గిన మద్యం అమ్మకాలు | Liquor Sales Drops In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఏపీలో గణనీయంగా తగ్గిన మద్యం అమ్మకాలు

Published Mon, Dec 2 2019 8:56 PM | Last Updated on Mon, Dec 2 2019 9:26 PM

Liquor Sales Drops In Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకొచ్చిన నూతన మద్యం విధానం సత్ఫలితాలిస్తోంది. మద్య నియంత్రణ, నిషేధం దిశగా ఏపీ వేగంగా ముందుకు సాగుతోంది. ఇందుకు నిదర్శనంగా ఏపీలో మద్యం వినియోగం, విక్రయాలు గణనీయంగా తగ్గాయి. 2018 నవంబర్‌లో 29లక్షల 62వేల కేసుల లిక్కర్‌ను విక్రయించగా.. ఈ ఏడాది నవంబర్‌లో 22లక్షల 31వేల కేసుల మద్యం మాత్రమే అమ్ముడయింది. దీంతో 24.67 శాతం మేర మద్యం అమ్మకాలు తగ్గినట్టయింది. బీర్ల అమ్మకాల విషయానికి వస్తే 2018 నవంబర్‌లో 17లక్షల 80వేల కేసులు అమ్ముడుపోగా, ఈ ఏడాది నవంబర్‌లో 8లక్షల 13వేల కేసులను మాత్రమే విక్రయించారు. దీంతో బీర్ల అమ్మకాల్లో తగ్గుదల 54.30 శాతంగా నమోదైంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన మద్యం పాలసీ వల్ల గతంలో ఉన్న 4380 మద్యం షాపులను 3500లకు తగ్గించారు.  అంతేకాకుండా మద్యం అమ్మకం సమయాన్ని ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పరిమితం చేసిన సంగతి తెలిసిందే. మద్యం ధరల పెంపుదల, అమ్మకాల్లో నియంత్రణ విధిస్తూ సీఎం వైఎస్‌ జగన్‌ తీసుకున్న నిర్ణయంతో ఈ మార్పు సాధ్యమైంది.

కొత్త మద్యం పాలసీలో భాగంగా ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయాలతో అమ్మకాలు తగ్గాయని, ప్రైవేటు వ్యక్తుల ప్రమేయం లేకపోవడం, సమయాన్ని సక్రమంగా పాటించడంతో మద్యం క్రమక్రమంగా నియంత్రణలోకి వస్తోందని అధికారులు చెబుతున్నారు. పర్మిట్‌ రూమ్‌లను రద్దు చేయడంతో  మద్యం షాపులు కేవలం అమ్మకానికి పరమితమవుతున్నాయని తెలిపారు. సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు ఎక్సైజ్‌, పోలీసు అధికారులు సమన్వయంతో బెల్ట్‌ షాపులను తొలగించడంతో గ్రామాల్లో మద్యం వినియోగం పూర్తిగా తగ్గిందని అధికారులు వివరించారు. గ్రామ సచివాలయాల వ్యవస్థ ద్వారా నిఘా ఉంచడం ద్వారా అక్రమ మద్యం విక్రయాలకు అవకాశం లేకుండా పోయిందన్నారు. 

ఆదాయం తగ్గలేదు..
అయితే నూతన మద్యం విధానం వల్ల ఆదాయం మాత్రం తగ్గలేదని అధికారులు తెలిపారు. భారీగా రెట్లు పెంచడంతో.. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం అలాగే ఉందన్నారు. మద్యం వినియోగం మాత్రం గణనీయంగా తగ్గిందని పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement