స్త్రీశక్తి వినిమయంతోనే అభివృద్ధి! | Sakshi Guest Column On Women Power | Sakshi
Sakshi News home page

స్త్రీశక్తి వినిమయంతోనే అభివృద్ధి!

Published Tue, Oct 31 2023 12:34 AM | Last Updated on Tue, Oct 31 2023 12:34 AM

Sakshi Guest Column On Women Power

ప్రపంచ వ్యాప్తంగా స్త్రీ కర్షకుల అసమానతల మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది, పోరాటం కూడా జరుగుతోంది. నిజానికి అనాది కాలం నుంచి ప్రధానమైన అసంఘటిత శ్రామికులుగా స్త్రీలు ఉన్నారు. వారు కేవలం శ్రామికులే కాదు, ఉత్పత్తి శక్తులు కూడా! కానీ వారిని రానురాను పురుషాధి పత్యంతో అన్ని రంగాల్లోనూ తొక్కివేశారు. శ్రామిక స్త్రీ ప్రపంచానికి ఊపిరి. స్త్రీ శక్తిని సంపూర్ణంగా వినియోగించుకోకుండా మనం అభివృద్ధి పథంలో పయనించలేం. కుల, మత, లింగ బేధాలు లేకుండా ఆత్మగౌరవంతో ముందుకు వెళ్ళవలసిన సందర్భం ఇది.

నిజానికి మానవాళి చరిత్రలో జరిగిన మార్పులన్నీ స్త్రీలు ఉత్పత్తికి దగ్గరయ్యే క్రమంతోనే ముడిపడి వున్నాయి. పురుషులతోనూ, తన పిల్లలతోనూ, తల్లిదండ్రులతోనూ స్త్రీకుండే సంబంధ బాంధ వ్యాలే మానవాళి చరిత్ర. స్త్రీలకూ, పురుషులకూ మధ్య వ్యక్తమయ్యే ఐక్యత, ఘర్షణల్లో సామాజిక సంబంధాలు నిర్ణయమయ్యాయి. ఒక సారి మనం చరిత్ర పూర్వ యుగానికి వెళితే, ఉత్పత్తిలో తనకు సహకరించే పురుషుణ్ణి స్త్రీయే ఎన్నుకునేది.

ఈ విధమైన పద్ధతి భారత సమాజంలో ఆర్యులు రాకపూర్వం వుండేది. ఆర్యులు వచ్చాక ఉత్పత్తి రంగం నుండి వారిని తప్పించి బానిసత్వంలోకి నెట్టారు. ఆదిమ సమాజం నుండి స్త్రీ గణనాయికగా, సామాజిక శ్రామిక శక్తిగా,పంపిణీదారుగా వేలాది సంవత్సరాల పాటు సమసమాజ భావనతో సమాజాన్ని నడిపించింది. హెన్రీ మోర్గాన్‌ తన ‘ప్రాచీన సమాజం’లో ఈ సమాజ పరిణామ క్రమాన్ని విశ్లేషించారు.  

2018–19 పరిస్థితులతో 2022–23 పరిస్థితులను పీఎల్‌ఎఫ్‌ఎస్‌ (పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే) నివేదికతో సరిపోల్చితే పనిపరంగా స్త్రీల ముఖచిత్రం ఎలా మారిందో అర్థమవుతుంది. స్వీయ ఉపాధిపై ఆధారపడే మహిళలు 53 శాతం నుంచి 65 శాతానికి పెరిగితే, రెగ్యులర్‌ మహిళా ఉద్యోగులు 22 శాతం నుంచి 16 శాతానికి తగ్గారు. క్యాజువల్‌ ఉద్యోగులు 25 శాతం నుంచి 19 శాతానికి తగ్గిపోయారు.

యజమానులుగా వుండే మహిళలు 23 శాతం నుంచి 28 శాతానికి పెరిగితే, జీతాలు లేని పనివారి వాటా 31 శాతం నుంచి 38 శాతానికి చేరుకుంది. అదే పురుషులలో ఈ శాతాలు కాస్త భిన్నంగా ఉన్నాయి. స్వీయ ఉపాధి పొందే పురుషులు ఈ ఐదేళ్లలో 52 శాతం నుంచి 54 శాతానికి పెరగగా, యజమానులు 44 శాతం నుంచి 44.3 శాతానికి, జీతాల్లేని సహాయకులు 7.6 శాతం నుంచి 9.3 శాతానికి పెరిగారు.

వ్యవసాయంపై ఆధారపడే కార్మికుల వాటా 41 శాతం నుంచి 43 శాతానికి, నిర్మాణరంగ పనులను నమ్ముకునే వారి వాటా 12 శాతం నుంచి 13 శాతానికి పెరిగింది. స్త్రీ, పురుషుల మధ్య ఉపాధి, ఆదాయాలలో వ్యత్యాసాలకు సంబంధించిన 200 సంవత్సరాల రికార్డు లను విశ్లేషించి... నోబెల్‌ బహుమతి గ్రహీతలు ఎంతో ఆసక్తికర విషయాలను బయట పెట్టారు. 

ప్రపంచ వ్యాప్తంగా ఇంకా సుమారు 120 కోట్ల మంది పేదవారున్నారు. వీరిలో భారతదేశం, పాకిస్తాన్‌తో కూడిన దక్షిణాసియా ప్రాంతంలో అత్యధికంగా వున్నారని నివేదికలు చెబుతున్నాయి. ఆఫ్రికాలో 38 శాతం మంది పేదలు వున్నారు. అలాగే బహువిధ పేదరిక సూచీని నీతి ఆయోగ్‌ ఇటీవల వెలువరించింది. విద్య, వైద్యం, జీవన ప్రమాణాలు వంటి 12 అంశాల ఆధారంగా రూపొందే ఈ సూచీ ప్రకారం, 2015–16లో 25 శాతం వున్న బహువిధ పేదరికం 2019–21 నాటికి 15 శాతానికి తగ్గింది.

ఉత్తరప్రదేశ్, బిహార్, రాజ స్థాన్, మధ్యప్రదేశ్, ఒడిశాలలో పేదరిక నిర్మూలనలో మంచి పురోగతి కనిపించింది. బిహార్‌లో 34 శాతం, జార్ఖండ్‌లో 28.8 శాతం, ఉత్త రప్రదేశ్‌లో 23 శాతం, మధ్యప్రదేశ్‌లో 21 శాతం, అస్సామ్లో 19 శాతం, ఛత్తీస్‌గఢ్‌లో 16 శాతం మేర బహువిధ పేదరికం తగ్గింది. అయినప్పటికీ, ఈ రాష్ట్రాల్లో పేదరికం జాతీయ సగటు కన్నా ఎక్కువే. ప్రపంచంలో పనిచేసే జనాభాలో మూడింట రెండొంతుల మంది అసంఘటిత రంగంలోనే వున్నారన్నది అంతర్జాతీయ కార్మిక సంఘం అంచనా. వీరు లాటిన్‌ అమెరికా, సహారా ఎడారి దిగువ దేశాలు, దక్షిణాసియా దేశాల్లోనే ఎక్కువగా ఉన్నారు.

అసంఘటిత కార్మికుల్లో 58 శాతం మహిళలే. పురుషులతో పోలిస్తే వారి వేతనాలు తక్కువ. డిజిటల్‌ వేదికల ద్వారా ఉపాధి పొందేవారిని ప్లాట్‌ఫామ్ కార్మికులని అంటారు. అసంఘటిత రంగంలో వీరిని కొత్త వర్గంగా పరిగణిస్తున్నారు. ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ వ్యవస్థలు వచ్చిన తర్వాత ఐటీ రంగంలో యువతులు ముమ్మరంగా ప్రవేశించారు. అమెరికా, ఆస్ట్రే లియా, కెనడా, ఇంగ్లాండ్‌ దేశాల్లో ఈ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ సంస్థలు ఎక్కువగా ఉన్నాయి. వీటికి అనుగుణంగా ఢిల్లీ, బాంబే, హైదరాబాద్, మంగుళూరు, కొచ్చిన్‌లలో భారతీయ యువతులు రాత్రివేళల్లో పని చేస్తున్నారు. దీంతో అనేకమంది ఇబ్బందులకు గురవుతున్నారు. 

స్మార్ట్‌ఫోన్‌ విప్లవం ద్వారా ఇప్పుడు పరిమిత కాల పనులు వచ్చాయి. భారత్‌లో ఈ తరహా గిగ్‌ వర్కర్ల సంఖ్య 80 లక్షలు. యువ జనులు, వలస వచ్చిన వారు ఈ ఉద్యోగాలను ఆశ్రయిస్తున్నారు. వీరి పని పరిస్థితులు మెరుగుపడాలనీ, వీరికి ఆరోగ్య బీమా, పింఛన్‌ సౌకర్యాలు అందించాలనీ ఆర్థికవేత్తలు సిఫార్సు చేస్తున్నారు. గిగ్‌ వర్కర్లలో కేవలం 12.2 శాతానికే ఆయుష్మాన్‌ భారత్‌ ఆరోగ్య బీమా సౌకర్యం ఉంది. నాలుగు శాతం అటల్‌ పెన్షన్‌ పథకంలో చేరారు.

సామాజిక భద్రత అంటే ఫించన్, ఆరోగ్య బీమా సదుపాయాలు రెండూ ఉండడం. దీన్ని ఎవరు కల్పించాలనేది ప్రశ్న. కేంద్ర ప్రభుత్వమా లేక డిజిటల్‌ ప్లాట్‌ఫామ్ కంపెనీలా? కంపెనీల నుంచి కొంత రుసుము వసూలు చేసి ప్రభుత్వ సంక్షేమ నిధిలో జమ చేయాలి. గిగ్‌ వర్కర్ల నైపుణ్య శిక్షణకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడానికి ప్లాట్‌ఫామ్ కంపెనీలు జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థతో కలసి సాగాలి.

ప్రపంచవ్యాప్తంగా సామ్రాజ్యాధిపత్యం, పెట్టుబడిదారీ వ్యవస్థ, భూస్వామ్య వ్యవస్థలు స్త్రీని ఇంకా బలహీనమైనదిగా చూస్తున్నాయి. ఈ ధోరణి అంతం కావాలంటే డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్, మహాత్మా ఫూలే ఆలోచనలతో ముందుకు సాగాలి. రాజ్యాంగ స్ఫూర్తిని అందు కోవాలి. కుల, మత, లింగ భేదాలు లేకుండా ఆత్మ గౌరవంతో ముందుకు వెళ్ళవలసిన సందర్భం ఇది. సంకెళ్ళు తెంచుకోవాల్సింది స్త్రీలే, ఎవరో కాదు. స్త్రీలు ఆత్మగౌరవ పోరాట పతాకాన్ని ఎగర వేయాలి. శ్రామిక స్త్రీ ప్రపంచానికి ఊపిరి!
డా‘‘ కత్తి పద్మారావు 
వ్యాసకర్త దళితోద్యమనేత ‘ 98497 41695

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement