యువత భవిష్యత్తును కాలరాస్తున్న బాబు | Chandrababu Naidu Negligence Towards Unemployed Youth | Sakshi
Sakshi News home page

యువత భవిష్యత్తును కాలరాస్తున్న బాబు

Published Sun, Aug 12 2018 1:16 AM | Last Updated on Sat, Oct 20 2018 5:53 PM

Chandrababu Naidu Negligence Towards Unemployed Youth - Sakshi

రాష్ట్రంలో నిరుద్యోగం బారిన పడిన లక్షలాది యువతకు అవకాశాలను కల్పించడంలో ఘోరంగా విఫలమైన చంద్రబాబు వారిని మత్తులో ముంచి, వ్యసనాల ఊబిలోకి నెట్టడానికి కావలసిన అన్ని ప్రయత్నాల్లోనూ ముందు ఉంటున్నారు. ప్రతి ఊరులో గ్రంథాలయం, స్కూలు, వైద్యాలయం నిర్మించాల్సిన బాధ్యత నెరవేర్చడానికి బదులుగా మద్యశాలలు నిర్మించేవాడు సరైన పాలకుడేనా? మహిళల మీద అత్యాచారాలు పెరగడానికి, యువకుల్లో నేరాలు పెరగడానికి తాగుడు ప్రధాన కారణం అని తెలిసి కూడా బాబు కనీసం బెల్టుషాపులను ఎందుకు ఎత్తివేయడం లేదు? నైతిక వర్తన విధ్వంసానికి పనిగట్టుకుని పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో తాగుడు, జూదం, యధేచ్ఛగా పాలక వర్గం కనుసన్నల్లో, స్వయంగా తెలుగుదేశం ఎంఎల్‌ఏ, ఎంఎల్‌సీలు నడపడం వల్ల కాదా? వ్యవసాయ రంగంలోకి విద్యావంతులను ఆకర్షించి నూతన విధానాలకు తెరలేపవలసిన చంద్రబాబు, వ్యవసాయం దండగని బోధిస్తున్నాడు.

చంద్రబాబుకు యువతపై నిర్లక్ష్యం మరింత పెరుగుతోంది. ఆయన ఓట్ల వెంపర్లాటలోపడి యువ శక్తిని నిర్వీర్యం చేస్తున్నారు. ఆం«ధ్రప్రదేశ్‌లో యువశక్తి అపారంగా వుంది. విస్తృతంగా మానవ వనరులున్న ఆంధ రాష్ట్రంలో యువశక్తిని ఉపాధి రంగంలోకి తీసుకురాగలిగితే సంపద వెల్లివిరుస్తుంది. యువకులు సంపద సృష్టికర్తలు శారీరక శక్తి, మానసిక శక్తి కలిసి వారు ఆధునిక పారిశ్రామిక, సాంకేతిక జ్ఞానాన్ని అందుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. యువతీ,యువకుల్లో ఈనాడు వినూత్న ప్రతిభ, నైపుణ్యశక్తి ప్రజ్వలిస్తున్నాయి. చంద్రబాబు  నిర్దిష్టమైన శాస్త్ర, సాంకేతిక, వైజ్ఞానిక వ్యవస్ధల నిర్మాణానికి పూనుకోలేక, యువశక్తిని నిర్వీర్యం చేసే అభూత కల్పనలు వల్లిస్తున్నారు. ఉన్న వనరులను కుదువబెట్టడం, వనరులను అమ్ముకోవడం, రాజకీయధనంగా మార్చుకోవడంలో వున్న నైపుణ్యం, ఉత్పత్తి శక్తులకు నిర్మాణాన్ని పొందించే కర్తృత్వం బాబు దగ్గర లేదు. ప్రపంచ వ్యాప్తంగా తయారవుతున్న వస్తువులకు, పరిశమలకు ముడిసరుకు అందిస్తున్న ఆంధ్రప్రదేశ్, జపాన్, చైనా వలె ఎందుకు సొంత పరిశ్రమలను పారంభించడం లేదనేది పెద్ద పశ్న! భారీ కార్లపరిశ్రమలు, కార్ల విడిభాగాలు తయారు చేసే పరిశ్రమలు, విడిభాగాలను నిల్వచేసే గౌడౌన్ల నిర్మాణం వంటివాటికి లక్షల సంఖ్యలో యువశక్తిని వాడుకోవచ్చు. ఇలాంటి పరిశ్రమల స్థాపన ద్వారా కార్మికులను, గుమాస్తాలను, అకౌంటెంట్లను, మేనేజర్లను పెద్ద సంఖ్యలో ఉద్యోగులుగా వినియోగించవచ్చు. ఈ పారిశ్రామిక నిర్మాణాలకు బదులుగా మందుషాపులు, పబ్‌లు, క్లబ్‌లు, వినోదశాలలు నిర్మించి చంద్రబాబు బుద్ధిపూర్వకంగా యువకులను నాశనం చేస్తున్నారు. 

ఈనాడు రాష్ట్ర బడ్జెట్‌ 2 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంది. రాష్ట్రంలో 12 లక్షల మంది నిరుద్యోగులున్నారు. ఎందరో డిగ్రీలు, బీటెక్‌లు, ఎంటెక్‌లు, ఎంబీఏలు చేసి ఖాళీగా ఉంటున్నారు. కానీ కొడుకు అభివృద్ధి్ద మీద ఉన్న శ్రద్ధ బాబుకు ఈ యువత మీద లేదు. తండ్రికి తగ్గట్టే కుమారుడు లోకేశ్‌ సైతం అవినీతిలో, అబద్ధాల్లో తండ్రిని మించిన వాడిగా పేరుపొందుతున్నాడు. చివరకు మధ్యాహ్న భోజనంలో పిల్లలకు పెట్టే గుడ్ల విషయంలోనూ అవినీతే. అంగన్‌ వాడీ కేంద్రాల్లో నీళ్ల పాలు సరఫరా. అనేక స్కూళ్లలో విద్యార్థులకు తగినన్ని క్లాసురూములు లేవు. విద్యార్థినులెందరో బాల్య వివాహాలకు గురై విద్యాగంధం కోల్పోయి డ్రాపౌట్స్‌ అవుతున్నారు. దీనివల్ల ఉత్పత్తి కుంటుపడుతుందని, రాష్ట్రం అభాగ్యం కావడానికి స్రీవిద్య తక్కువ కావడమే కారణమని చంద్రబాబుకు తెలియదా? ప్రాథమిక వైద్యశాలల్లో ఒక పడక మీద ముగ్గురు బాలింతలు పడుకొంటున్న దృశ్యాలు బాబు కొడుకు చూడటం లేదా? మీరు పాలించే రాష్ట్రంలో యువకులు పనిలేక బెంగళూరు, మద్రాసు, ఢిల్లీ వంటి నగరాల్లో చాలీచాలని ఉపాధి కోసం పరిగెత్తుతోంటే అంకెల గారడీ చేస్తున్నారా? 

ఇక పోతే రాష్ట్రంలో గ్రంథాలయ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు. విద్యార్థులు పోటీ పరీక్షలకు వెళ్లాలంటే గ్రంథాలయాలు, డిజిటల్‌ లైబ్రరీలు అవసరం. కానీ ఉన్న కాసిని గ్రంథాలయాల్లోనూ మంచినీళ్ల వసతి లేదు. కొత్త పుస్తకాల కొనుగోలు లేదు. దళిత బడుగు వర్గాల పిల్లలు పూర్తిగా గ్రంథాలయాలపైనే ఆధారపడి ఉంటారు. ఎందుకు ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందో ఆలోచించాలి. గ్రంథాలయోద్యమం ద్వారానే స్వాతంత్య్రం వచ్చిందని, భాషా రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడింది కూడా గ్రంథాలయోద్యమం వల్లనేనని చంద్రబాబు గ్రహించడం లేదు. ప్రతి ఊరులో గ్రంథాలయం, స్కూలు, వైద్యాలయం నిర్మించాల్సిన బాధ్యత నెరవేర్చడానికి బదులుగా మద్యశాలలు నిర్మించేవాడూ పాలకుడేనా? యువతను వ్యక్తిత్వ నిర్మాణంలో తీర్చిదిద్దాల్సిన పాలకుడు యువతను వ్యసనాల ఊబిలోకి నెడుతున్నారు. మహిళల మీద అత్యాచారాలు పెరగడానికి, యువకుల్లో నేరాలు పెరగడానికి తాగుడు ప్రధాన కారణం అని తెలిసి కూడా బాబు కనీసం బెల్టుషాపులను ఎందుకు ఎత్తివేయడం లేదు? 

మరోవైపున కంప్యూటర్, కమ్యూనికేషన్లు, ఇతర సర్వీసు రంగాలకు ఎనలేని ప్రాధాన్యమిస్తున్న చంద్రబాబు, ఈ సర్వీసు రంగాలకు కీలకమైన ఉత్పత్తి రంగాలు, వ్యవసాయం, పరిశ్రమలు, గనులు వంటివాటిని పూర్తిగా మర్చిపోయాడు. వ్యవసాయ రంగంలోకి విద్యావంతులను ఆకర్షించి నూతన విధానాలకు తెరలేపవలసిన చంద్రబాబు, వ్యవసాయం దండగని బోధిస్తున్నాడు. లోకేశ్‌ అయితే వ్యవసాయ వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నాడు. పెట్టుబడిదారులు వస్తూత్పత్తి కేంద్రాలతోబాటు తమ మార్కెట్ల కోసం బాబు వంటి ముఖ్యమంత్రులను కొనేస్తున్నారు. ఎన్నికలకు ధనాన్ని అందిస్తున్నారు. అందుకే లిక్కర్‌ ఉత్పత్తిదారులు, లిక్కర్‌ పంపిణీదారులు బాబు వెనుక ఉండి నడిపిస్తున్నారు. ఎన్నికల్లో కల్తీమద్యం అమ్మకాలతో కొత్తరకం యువకులను తాగుబోతులుగా మార్చి ఎన్నికల్లో వాడుకోవాలని వ్యూహాలు పన్నుతున్నారు. 

మోదీ, చంద్రబాబు ఇరువురూ కార్పొరేట్‌ బానిసలుగానే ఉన్నారు. వారి మధ్య అంతర్గత ఐక్యతకు అదే ప్రాతిపదిక. ఈ రెండు శక్తులు పెంచుతున్న ప్రైవేట్‌ సెక్టారులో దళిత బహుజనులకు ప్రతిభ పేరుతో ఉద్యోగాలు రాకుండా చేయడమే వీరి ప్రయత్నం. తద్వారా దళిత బహుజనుల యువత ఉపాధిలేక నిర్వీర్యత, నిర్వేదాలకు గురి కావాలని, మనం పుట్టిన రాష్ట్రంలో మనం బ్రతికే పరిస్థితి లేదనే నిర్వేదనకు అలవాటు పడతారనేదే వీరి ఆలోచన అని స్పష్టం అవుతుంది. నిజానికి 7,8 తరగతుల విద్యార్థినులకు సైకిళ్లు ఇవ్వడం వల్ల విద్యార్థినులు డ్రాపౌట్‌ శాతం తగ్గించవచ్చు. ఆరోగ్య సేవలకు నర్సరీ ట్రైనింగ్‌ సెంటర్సు ఎక్కువ పెట్టడం ద్వారా యువతను మరింతగా ఉపయుక్తం చేయవచ్చు. ఎందుకు చంద్రబాబు యువతను ఉపాధిరంగం వైపు నడిపించడం లేదు?

ముఖ్యంగా అన్ని విశ్వవిద్యాలయాల్లో కలిపి 18 వేల బ్యాక్‌లాగ్‌ పోస్టులున్నాయి. ఎందుకు పూరించడం లేదు! ఎందుకు ఉన్నత విద్యలో దళితులపై వివక్ష చూపిస్తున్నారు? పి.హెచ్‌.డి చేసే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం స్కాలర్షిప్పులు ఇవ్వడం లేదు. తద్వారా పరిశోధనా రంగం కుంటినడక నడుస్తో్తంది. అంతేకాదు. బి.ఎ.,ఎం.ఎ., ఫిలాసఫీ, ఆర్థ్ధిక శాస్త్రం, చరిత్రలను నిర్వీర్యం చేస్తున్నారు. అధ్యాపకుల పోస్టులు పూరించడం లేదు. ఎందుకు చంద్రబాబుకు ఉన్నత విద్యంటే వ్యతిరేకత? ఈ విషయాలను అర్థ్ధం చేసుకొని యువత పోరాటాలకు సన్నద్ధం కావాలి. ప్రత్యామ్నాయ రాజకీయాల వైపు అడుగు వేయాలి. రాజకీయ అవగాహన, రాజకీయ చైతన్యం, సిద్ధాంత బలం, ప్రత్యామ్నాయ ఆలోచన ఈనాటి యువతకు అవసరం. యువత తిరగబడిన అన్ని సందర్భాల్లో సమాజ పునర్నిర్మాణం జరుగుతూనే వచ్చింది. మానవ వనరులు శ్రమ, శక్తి, బహుముఖంగా వున్న ఆంధ్రప్రదేశ్‌ పునర్నిర్మాణానికి యువత నడుంకట్టాలి.  

కత్తి పధ్మారావు(
వ్యాసకర్త సామాజిక తత్వవేత్త, వ్యవస్థాపక అధ్యక్షుడు, నవ్యాంధ్రపారీ)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement