విజయవాడ, సాక్షి: అనకాపల్లి అచ్యుతాపురం సెజ్ ఫార్మా కంపెనీ ప్రమాదంపై చంద్రబాబు ప్రభుత్వం ప్రదర్శించిన ఉదాసీన వైఖరి తేటతెల్లమైంది. అంత భారీ ప్రమాదం జరిగితే.. ఏం పట్టనట్లు అధికారిక కార్యక్రమాల్లో మునిగిపోయారాయన. మంత్రుల సంగతి పక్కన పెడితే.. కనీసం అక్కడి ప్రజాప్రతినిధుల్ని కూడా ఆయన ఘటనా స్థలానికి వెళ్లమని ఆదేశించకపోవడం గమనార్హం.
అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో మధ్యాహ్నం 1.30 -2 గంటల మధ్య ప్రాంతంలో పేలుడు సంభవించింది. ఆ టైంలో హోంశాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తున్నారు. అయితే ఆ టైంలో ప్రమాదంపై సమాచారం అందినా.. ఆయన సహాయక చర్యలపై ఏమాత్రం సమీక్షించలేదు. పైగా ఆ మీటింగ్‌లో హోంమంత్రి అనిత, డీజీపీ ద్వారకా తిరుమలరావు ఉన్నారు. వాళ్లకూ కనీస ఆదేశాలు ఇవ్వలేదు.
చంద్రబాబు సమీక్ష అనంతరం.. 4 గంటలకు హోం మంత్రి అనిత ప్రెస్ మీట్ పెట్టారు. ప్రమాదంపై కనీసం స్పందించకుండా.. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై విమర్శలతో సరిపెట్టారు. ఆ తర్వాత 5 గంటలకు సచివాలయంలో కార్మిక శాఖమంత్రి వాసంశెట్టి శుభాష్ పాత్రికేయ సమావేశం నిర్వహించారు. అయితే ఆయన కూడా ప్రమాదంపై సగం సగం మాట్లాడారు. ప్రమాదంలో కార్మికులు ముక్కలు, చెక్కలైపోయారని అప్పటికే మీడియా ఛానెల్స్‌లో కథనాలు వచ్చాయి.
ఇక పాలనా యంత్రాంగం అంతా ప్రెస్ నోట్లు, మీడియా దిగ్భ్రాంతులకే పరిమితం అయ్యింది. చివరకు.. రాత్రి 7 గంటలు దాటాక ప్రమాదంపై అనకాపల్లి కలెక్టర్‌తో చంద్రబాబు మాట్లాడారు. అర్ధరాత్రికి హోం మంత్రి అనిత ప్రమాద ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ మధ్యాహ్నాం చంద్రబాబు అక్కడికి వెళ్లనున్నారు. అదే.. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఈ తరహా ఘటనలు జరిగితే.. సత్వర చర్యలు ఉండేవి. స్థానిక ప్రజా ప్రతినిధులు సత్వరమే అక్కడికి పంపించి.. సహాయక చర్యలను పర్యవేక్షించాలని ఆదేశించేవారు. తద్వారా ప్రమాద తీవ్రతను తగ్గించే యత్నమూ చేసేవారు. అదేవిధంగా ప్రభుత్వం తరఫున పరిహారం కూడా సత్వరంగా ప్రకటించి.. అదే త్వరగా బాధిత కుటుంబాలకు అందించేవారు.
ఇదీ చదవండి: 'అచ్యుతాపురం సెజ్' బాధితులకు అండగా నిలవాలి: వైఎస్ జగన్
ఇప్పుడు చంద్రబాబు పాలనలో ఎమ్మెల్యే, ఎంపీ.. అఖరికి అధికారులు కూడా సకాలంలో అక్కడికి వెళ్లలేని దుస్థితి నెలకొందన్న అభిప్రాయమూ వ్యక్తం అవుతోంది. మరోపక్క.. మదనపల్లె ఫైల్స్ ఘటనలో హెలికాఫ్టర్‌లో డీజీపీకి గంటలో పంపిన చంద్రబాబుకి.. అచ్యుతాపురం ఘటనలో సత్వరమే స్పందించాలన్న స్పృహ లేకపోవడంపై రాజకీయంగానూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment