ఖాళీ అయిన పోస్టుల్లో రిటైర్డ్ ఉద్యోగుల నియామకం
కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్‌లో భర్తీకి మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం
ప్రభుత్వ పెద్దలకు కావాల్సిన రిటైర్డ్ ఉద్యోగులకు కొలువులే లక్ష్యం
కొత్త పోస్టుల మంజూరు లేకపోగా ఉన్న పోస్టుల్లోనూ నిరుద్యోగులకు నిరాశే
ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్
సాక్షి, అమరావతి: సూపర్ సిక్స్‌లో మొట్టమొదటి హామీకే చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం తూట్లు పొడుస్తూ నిరుద్యోగ యువతకు షాక్ ఇచ్చింది. వారి పొట్టకొట్టే చర్యలు చేపట్టి.. రిటైర్డ్ ఉద్యోగులను కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానంలో నియమించడానికి గేట్లు తెరిచింది. సూపర్ సిక్స్‌లో మొట్టమొదటి హామీగా యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పన, లేదంటే ఉద్యోగాల కల్పించే వరకు నెలకు మూడు వేల రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉమ్మడిగా విడుదల చేసిన మేనిఫేస్టోలోస్పష్టం చేశారు.
అధికారంలోకి వచ్చాక ఆ హామీని అమలు చేసేందుకు ఎటువంటి చర్యలు తీసుకోపోగా తమకు కావాల్సిన రిటైర్డ్ ఉద్యోగులకు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానంలో ప్రభుత్వ కొలువులు కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ మేరకు ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. దీంతో తమకు ఇక సర్కారు కొలువులు ఎండమావే అని నిరుద్యోగ యువత ఆందోళన వ్యక్తం చేస్తోంది.
నిరుద్యోగుల ఆశలపై నీళ్లు జల్లడమే..
ఖాళీ అయిన పోస్టులను కొత్త వారితో భర్తీ చేయకుండా తిరిగి రిటైర్ ఉద్యోగులతోనే భర్తీ చేయడం అంటే నిరుద్యోగ యువత ఆశలపై నీళ్లు చల్లడమేనని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఖాళీగా ఉన్న పోస్టులను నోటిఫికేషన్‌ల ద్వారా భర్తీ చేస్తేనే నిరుద్యోగ యువతకు అవకాశాలు ఉంటాయని, రిటైర్ వారితో వాటిని భర్తీ చేయడం అంటే నిరుద్యోగ యువతను నిండా ముంచడమేనని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు.
ఒకపక్క రిటైర్డ్ వారికే మళ్లీ అవకాశం ఇస్తూ.. కొత్త పోస్టులు మంజూరు చేయకపోవడంతో సర్కారు కొలువులు నిరుద్యోగ యువతకు అందని ద్రాక్షగానే మిగిలిపోనున్నాయి. ఒక పక్క వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రకటించిన డీఎస్సీని రద్దు చేసి.. ఆ నియామక ప్రక్రియను తాత్సారం చేస్తున్న విషయం విదితమే. ఈ ఏడాది డీఎస్సీ ఉండే అవకాశం కనిపించకపోవడంతో నిరుద్యోగులు ఉస్సూరుమంటున్నారు. వైద్య, ఆరోగ్య శాఖలోనూ గత ప్రభుత్వం ఇచి్చన ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లను ఈ ప్రభుత్వం రద్దు చేసింది.
రెండు స్క్రీనింగ్ కమిటీలు
డిప్యూటీ కార్యదర్శి, డిప్యూటీ డైరెక్టర్ స్థాయి కేడర్‌లో పదవీ విరమణ చేసిన ఉద్యోగులను తిరిగి కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ విధానంలో ఉద్యోగాల్లోకి తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి, సంబంధిత శాఖల ప్రత్యేక సీఎస్, ముఖ్యకార్యదర్శి, కార్యదర్శులతో స్కీనింగ్ కమిటీని ఏర్పాటు చేశారు.
డిప్యూటీ కార్యదర్శి, డిప్యూటీ డైరెక్టర్ కంటే దిగువ కేడర్‌లో పదవీ విరమణ చేసిన ఉద్యోగులను కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ విధానంలో తిరిగి తీసుకునేందుకు సాధారణ పరిపాలన శాఖ (రాజకీయ) ముఖ్యకార్యదర్శి నేతృత్వంలో ఆర్థిక శాఖ కార్యదర్శి (హెచ్‌ఆర్), సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో మరో స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. రిటైర్డ్ ఉద్యోగులతో ఖాళీల భర్తీ ప్రతిపాదనల పూర్తి వివరాలు సంబంధిత శాఖల ప్రత్యేక సీఎస్‌లు, ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులు.. స్క్రీనింగ్ కమిటీలకు పంపాల్సిందిగా ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. స్క్రీనింగ్ కమిటీల ఆమోదం తరువాత సీఎం ఆమోదం తీసుకోవాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానంలో పదవీ విరమణ చేసిన ఉద్యోగులను రెగ్యులర్ పోస్టుల్లోనే తీసుకోవాలని, మంజూరు కాని పోస్టుల్లోకి తీసుకోకూడదని తెలిపారు. ఇలా ప్రభుత్వ ఉద్యోగాల్లో తీసుకున్న రిటైర్డ్ ఉద్యోగులకు వేతనాలు, అలవెన్స్‌లను 2018లో ఆరి్థక శాఖ జారీ చేసిన 48 జీవో మేరకు ఉండాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఈ ఉత్తర్వులు రిటైరైన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులకు మాత్రమే వర్తిస్తాయని, అఖిల భారత సర్విసు, కేంద్ర సర్విసు ఉద్యోగులకు వర్తించవని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment