
సాక్షి, విజయవాడ: ఏపీలో కూటమి ప్రభుత్వ బడ్జెట్.. కోతల బడ్జెట్ అంటూ ఎద్దేవా చేశారు సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు. అభివృద్ధి, సంక్షేమం ఊసే లేని బడ్జెట్ ఇది. మహిళలు, నిరుద్యోగులకు మొండి చేయి చూపారని ఆరోపించారు. బడ్జెట్‌లో సమగ్రత లేదు అంటూ వ్యాఖ్యానించారు.
సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. ఇది కోతల బడ్జెట్ మాత్రమే. ఆదాయాన్ని పెంచుకునే అంకెలు అన్నీ మోసపూరితమైనవి. సొంత పన్నులు 15వేల కోట్లు పెరుగుతాయని చెప్పారు. ఎలా పెరుగుతాయి చెప్పాలి. రెవెన్యూ ఎస్టిమేషన్, ఖర్చుల ఎస్టిమేషన్ కోత పడబోతుంది. ఎర్ర చందనం అమ్మకం ద్వారా తీసుకొస్తారా? లేక మద్యం తాగించి వసూళ్లు చేస్తారా?. బడ్జెట్‌లో సమగ్రతే లేదు. అభివృద్ధి, సంక్షేమం ఊసే లేని బడ్జెట్ ఇది. కేంద్రం వాటాపై ఒక మాట కూడా మాట్లాడలేదు.
ప్రభుత్వం ప్రారంభంలోనే సూపర్ సిక్స్‌ల్లో మూడు సిక్స్‌లు ఎగిరిపోయాయి. మిగిలినవి కూడా సంఖ్యల తగ్గిస్తారు. మహిళలు, నిరుద్యోగులకు మొండి చేయి చూపారు. వర్గీకరణ చేసిన తర్వాత డీఎస్సీ ఇస్తామని ఉద్యోగాలు ఎగ్గొట్టె ప్రయత్నం చేస్తోంది. వ్యవసాయశాఖ అంకెలు చూస్తే కడుపు తరుక్కుపోతోంది. ఇరిగేషన్‌పై ఖర్చు తగ్గించారు. 54 మండలాలు ఇప్పటికే కరువు మండలుగా ప్రకటించారు. తక్కువ ఖర్చుతో పూర్తి చేసే ప్రాజెక్టులు పూర్తి చేయాలి. మూలధనం వ్యయం 40వేల కోట్లు.. రెవెన్యూ వ్యయం లక్ష కోట్లుగా ఉంది అంటూ చెప్పుకొచ్చారు.

Comments
Please login to add a commentAdd a comment