BV Ragavulu
-
సీట్ల సర్దుబాటుపై ఫిబ్రవరిలో నిర్ణయం
సాక్షి, విశాఖపట్నం/నగరంపాలెం (గుంటూరు): జనసేన, వామపక్షాల పొత్తు నేపథ్యంలో సీట్ల సర్దుబాటుపై ఫిబ్రవరిలో నిర్ణయం తీసుకుంటామని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ తెలిపారు. వచ్చే నెలలో మరోసారి సమావేశమవుతామన్నారు. విశాఖ రుషికొండలోని ఓ రిసార్ట్స్‌లో జనసేన, సీపీఐ, సీపీఎం ముఖ్య నాయకులు రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి, సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులుతో పవన్‌కల్యాణ్ మూడు గంటలపాటు చర్చించారు. అనంతరం వారితో కలిసి పవన్ విలేకరులతో మాట్లాడారు. వామపక్షాలు, జనసేన పార్టీల భావజాలం ఒకేలా ఉండడంతో వాటితో కలిసి పనిచేయాలన్న నిర్ణయానికొచ్చామని పవన్ చెప్పారు. పర్యావరణ కాలుష్యం, మైనింగ్ పాలసీ, 2013 భూసేకరణ చట్టం అమలు, జాయింట్ ఫ్యాక్టస్ ఫైండింగ్ కమిటీ నివేదికను ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న దానిపై చర్చించామని తెలిపారు. 2019 ఎన్నికల్లో ఎలా కలిసి వెళ్లాలన్న దానిపై చర్చించామన్నారు. ఈవీఎంలలో లోపాలపై తమకు అభ్యంతరాలున్నాయని, త్వరలో వాటిపై సమగ్రంగా చర్చిస్తామని చెప్పారు. నిపుణుల కమిటీ వేయాలి ఈవీఎంలపై తలెత్తిన అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత కేంద్ర ఎన్నికల కమిషన్‌పై ఉందని సురవరం సుధాకరరెడ్డి చెప్పారు. తెలంగాణ ఎన్నికల్లో పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు వ్యత్యాసం ఉండడం వల్ల కొన్ని నియోజకవర్గాల్లో ఫలితాలు తారుమారయ్యాయన్నారు. ఇలాంటి అనుమానాల నివృత్తికి నిపుణుల కమిటీ వేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. బీవీ రాఘవులు మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయ భవిష్యత్తు, ఆ ప్రక్రియలో మూడు పార్టీల పాత్ర గురించి చర్చించామని తెలిపారు. ప్రత్యేక హోదా, వాగ్దానాల అమలులో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను మోసం చేసిందన్నారు. సమావేశంలో జనసేన నాయకులు నాదెండ్ల మనోహర్, మాదాసు గంగాధరం, సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు కె.రామకృష్ణ, పి.మధు పాల్గొన్నారు. 27న జనసేన శంఖారావం సభ 27న గుంటూరు లాడ్జి సెంటరులోని ఎల్ఈఎం స్కూల్ గ్రౌండ్లో జనసేన శంఖారావం పేరుతో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు జనసేన నాయకుడు, మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు తెలిపారు. శుక్రవారం ఆయన సభ ఏర్పాట్లను పరిశీలించారు. పవన్‌కల్యాణ్ ఈ సభలో పాల్గొంటారన్నారు. -
చెప్పం.. చేసి చూపిస్తాం!
సాక్షి, కామారెడ్డి : ప్రజల కోసం ఉద్యోగానికి రాజీనామా చేసి త్యాగం చేసిన వ్యక్తికి.. డబ్బు, అవినీతిపరుల మధ్య కామారెడ్డి నియోజకవర్గంలో పోటీ జరుగుతోందని, త్యాగం చేసిన వారినే గెలిపించాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు బీవీ రాఘవులు పిలుపునిచ్చారు. తాము అది చేస్తాం.. ఇది చేస్తామని చెప్పమని, చేసి చూపిస్తామని స్పష్టం చేశారు. శుక్రవారం కామారెడ్డి బీఎల్ఎఫ్ అభ్యర్థి డాక్టర్ పుట్ట మల్లికార్జున్ నామినేషన్ కార్యక్రమానికి హాజరైన ఆయన వీక్లీ మార్కెట్ ఆవరణలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. గంజ్‌లో గాంధీ విగ్రహం సాక్షిగా పరువు తీసుకుని బజారు పాలైన వ్యక్తులకు ఓటు వేయవద్దని, నిజాయతీపరుడైన బీఎల్ఎఫ్ అభ్యర్థికి ఓటు వేయాలని కోరారు. ఓట్లు మనవి రూ.కోట్లు వాళ్లవి అని ఎద్దేవా చేశారు. సామాజిక న్యాయం, నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం, ప్రజా సేవ కోసం ఒక్క సారి తమకు అవకాశం ఇవ్వాలన్నారు. కామారెడ్డిలో 54 వేల మంది బీడీ కార్మికులుంటే వారి సంక్షేమ కోసం కాంగ్రెస్, టీఆర్ఎస్లు ఆలోచించాయా? అని ప్రశ్నించారు. ఇక్కడ బీడీ కార్మికులకు ఇళ్ల కట్టించే అవకాశం ఉన్నా పట్టించుకోలేదని, భూ కబ్జాదారులను, రియల్ ఎస్టేట్ వ్యాపారులను, కాంట్రాక్టర్లనే పట్టించుకున్నారని ఆరోపించారు. కామారెడ్డిలో టీఆర్ఎస్, కాంగ్రెస్‌లకు ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. ప్రత్యామ్నాయం గా బీఎల్‌ఎఫ్‌కు ఓటువేసి గెలిపించాలని కోరారు. రాష్ట్ర స్వరూపాన్ని మారుస్తాం బీఎల్ఎఫ్ అధికారంలోకి వస్తే రాష్ట్ర స్వరూపాన్ని మారుస్తామని రాఘవులు తెలిపారు. 30 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో, తొమ్మిదేళ్ల టీడీపీ, నాలుగున్నరేళ్ల టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం వెనకబడిందన్నారు. అంతేకాక నాయకులు రంగులు మారుస్తున్నారే తప్ప రాష్ట్రం, ప్రజల తలరాతను మార్చడం లేదని.. అందుకోసం బీఎల్ఎఫ్ పోటీలోకి వచ్చిందన్నారు. అవకాశం ఇస్తే రాష్ట్రాన్నే మార్చి చూపుతామన్నారు. అనంతరం వీక్లీ మార్కెట్ నుంచి బీఎల్ఎఫ్ అభ్యర్థి పుట్ట మల్లికార్జున్ నామినేషన్‌కు భారీ ర్యాలీగా బయలుదేరి ఆర్డీవో కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషనల్ పత్రాలు అందజేశారు. పోలీసులతో వాగ్వాదం నామినేషన్ వేయడానికి కార్యాలయానికి వెళ్తుండగా, పోలీసులు రాఘవులును, ఎంసీపీఐయూ జాతీయ కార్యదర్శి గౌస్, అభ్యర్థి మల్లికార్జున్ తదితరులను అడ్డుకున్నారు. మెడలో వేసుకున్న పార్టీల కండువాలు తీసేసి, లోపలికి వెళ్లాలని పోలీసులు సూచించారు. దీంతో రాఘవులు 15 నిమిషాల పాటు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తాము ఎర్రరంగు చొక్కాలను వేసుకుని వస్తే, వాటిని కూడా విప్పించేస్తారా? అని పోలీసులపై అగ్రహం వ్యక్తం చేశారు. తాను 6 నియోజవర్గాలలో నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నానని, ఎక్కడా అడ్డుకోలేదని, ఇక్కడ మాత్రం ఏమిటని ప్రశ్నించారు. నిన్న, మొన్న ఇతర పార్టీల వారు కండువాలతో వెళితే పట్టించుకోలేదని, తమను మాత్రం అడ్డుకుంటారా? అని ప్రశ్నించారు. ఏ చట్టం ప్రకారం లోనికి పంపించరో రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారితో చెప్పించాలని కోరారు. కొద్దిసేపటి తర్వాత కామారెడ్డి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అక్కడ ఉన్న సీఐ ఫోన్ చేసి, రాఘవులుతో మాట్లాడించారు. దీంతో బీఎల్ఎఫ్ నేతలు మెడలోని కండువాలను తీసి, నామినేషన్ వేయడానికి లోపలికి వెళ్లారు. -
బీవీ రాఘవులుతో మనసులో మాట
-
స్వీట్లు.. శుభాకాంక్షలేనా?: రాఘవులు
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్‌లు కార్మికదినోత్సవాన్ని స్వీట్ డబ్బాలు, శుభాకాంక్షలకే పరిమితం చేశారని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు విమర్శించారు. కార్మిక చట్టాలను అమలు చేయకుండా, వారి హక్కులను హరించి వేస్తున్న ముఖ్యమంత్రులకు మేడే శుభాకాంక్షలు తెలిపే నైతిక అర్హత లేదన్నారు.నగరంలోని ఎంబీ భవన్లో జరిగిన మేడే వేడుకల్లో ఆయన మాట్లాడారు. కార్మిక పక్షపాతినంటూ పత్రికల్లో ప్రకటనలు గుప్పించిన కేసీఆర్, కనీస వేతనాల సలహా మండలి చేసిన సిఫారసులను 23 నెలలుగా ఎందుకు అమలు చేయలేకపోతున్నారని ప్రశ్నించారు. ఏపీలో కూడా విశాఖ బ్రాండిక్స్, అనంతపురం కారంపొడి కంపెనీల్లో వందలాది మంది కార్మికులను పనుల్లోనుంచి తొలగించారని చెప్పారు. పాలకుల కల్లబొల్లి కబుర్లను నమ్మకుండా ఐక్యపోరాటాల ద్వారా హక్కులను సాధించుకోవాలన్నారు.