దక్షిణ భారతదేశం ప్రపంచ చరిత్రలోనే భౌగోళికంగా, సాంస్కృతికంగా, తాత్వికంగా, సాంకేతికంగా భాషా సంపత్తిగా అత్యున్నతమైన కీర్తి కలిగిన ప్రాంతం. ఇక్కడ ప్రకృతి వనరులు, మానవ వనరులు, సామాజిక జీవన సామరస్యం, బౌద్ధ సంస్కృతీ జీవన మార్గం నిత్య ప్రభాసితాలు. ఇటువంటి దక్షిణ భారతదేశాన్ని కేంద్రం మొదటి నుండి అణగదొక్కుతూ, దోపిడీ చేస్తూ, నిర్లక్ష్యం చేస్తూ, అవమానిస్తూ వస్తుంది.
ఈనాడు పార్లమెంటులో జరుగుతున్న చర్చల్లో ప్రత్యేక హోదా గురించి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వివిధ పార్టీల ఎంపీలు ప్రశ్నించినపుడు, కేంద్రం అంతకు ముందటి పార్లమెంట్ ఒప్పందాన్నే నిర్లక్ష్యం చేస్తూ, నిరాకరిస్తూ సమాధానం చెప్పడం ఆంధ్రులను తీవ్రంగా అవమానించడమే! పార్లమెంటు తీర్మానాల్ని కూడా పార్లమెంటే నిరాకరించడం రాజ్యాంగ ఉల్లంఘన కాదా? అందులో దక్షిణ భారతదేశం నుంచి వెళ్లిన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సంక్షోభంలో ఉందనడం విషయాన్ని పక్కదారి పట్టించడమే! బీజేపీ రాష్ట్రాలన్నీ అప్పుల్లోనే కాదు... మత ఘర్షణల్లో, వర్ణాధిపత్య, కులాధిపత్య ఊబిలో కూరుకుపోయి ఉన్నాయి. దక్షిణ భారత రాష్ట్రాల నుండి బీజేపీ రాష్ట్రాలు అనేక విషయాలు నేర్చుకోవాల్సి ఉంది కూడా! అక్కడ లౌకిక వాదం మంటగలుస్తూ ఉంది. పార్లమెంటులో ఉత్తరాది గొంతుల ఆధిపత్యం కొనసాగుతుంది.
లౌకిక రాజ్యానికి ప్రధానమంత్రిగా ఉన్న మోదీ ఒక మతాధిపతిగా గుడులు గోపురాలను సందర్శించి అనుచితమైన మతపరమైన ప్రసంగాలు చేయడం చూస్తే... రాజ్యాంగంలోని ప్రజాస్వామ్య లౌకిక వాద, సామ్యవాద భావజాలాన్ని నిరాకరించి మత విద్వేషాలు, వర్ణ విద్వేషాలు, అçస్పృశ్యత ఆచరణను కొనసాగిస్తున్నారని అర్థమవుతుంది. నిజానికి భారతదేశం తాత్విక పునాదుల మీద నిలబడి ఉంది. ముఖ్యంగా చార్వాకుడు, సాంఖ్యులు, జైనులు, బౌద్ధులు ఎంతో తత్వశాస్త్రాన్ని అందించి అచంచలమైన మానవ అభ్యుదయానికి పునాదులు వేశారు. ఈ తత్వశాస్త్ర అధ్యయనం మోదీకి లేకపోవడం వల్ల ఆయన హిందూ మతవాద భావనలకు, కల్పిత కథలకు మాత్రమే పరిమితమవ్వడం వల్ల ప్రపంచ దేశాల్లో భారతదేశ సమున్నత గౌరవాన్ని నిలబెట్టలేకపోతున్నారు. భారతదేశంలో వచ్చిన తాత్విక మూలాలు ఎక్కువగా దక్షిణ భారతం నుండే జనియించాయి. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళ భాషల్లో భారతదేశ పునరుజ్జీవన, సాంçస్కృతిక పునాదులున్నాయి.
అయితే వాటి మూలాలను దెబ్బతీయడానికే ఉత్తర భారత పుక్కిటి గాథలను ప్రచారం చేస్తున్నారు. దక్షిణాది రాజ్య పాలకుల్ని, నాయకుల్ని ప్రతినాయకులుగా చూపిస్తున్నారు. రాముడు, కృష్ణుడు, పరశురాముడు... వీళ్లందరూ ఉత్తరభారతం నుండి పుట్టిన అవతారాలే. రావణాసురుడు, కుంభకర్ణుడు, వాలి... వీరంతా దక్షిణ భారతం నుంచి రాగా, మధ్య భారతం నుంచి నరకాసురుడు, ఈశాన్య భారతం నుంచి మహిషాసురులను ప్రతినాయకులుగా చేసి వారిని వధించే ఘట్టాల్ని ప్రచారం చేస్తున్నారు. దీనివల్ల దళిత, బహుజన, మైనారిటీల నాయకత్వ పునాదులను ధ్వంసం చేయాలనే ప్రయత్నం జరుగుతుంది. విశ్వవిద్యాలయాల్లో కూడా పుక్కిటి çకథలే ప్రచారం చేసి సాంకేతిక, సాంçస్కృతిక, తాత్విక, జ్ఞాన, విజ్ఞాన సంస్కృతులపై దాడులు చేస్తున్నారు. మరో ప్రక్క రాజకీయంగా రాష్ట్రాల మధ్య వైరుద్ధ్యాలు, వర్ణాల మధ్య వెరుద్ధ్యాలు, మతాల మధ్య వెరుద్ధ్యాలను సృష్టి్టంచే పనిని ఆరెస్సెస్ ముమ్మరంగా చేస్తోంది.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ను విస్మరించాలనే బృహత్తర ప్రయత్నం జరుగుతోంది. అంబేడ్కర్ తన ప్రణాళికలో భారత సమైక్యతకు, ఉన్నతికి ఈ సూత్రాలు అందించారు. భారతీయులందరికీ హక్కుల సమానత్వం. ప్రతి పౌరుడూ తనను తాను అభివృద్ధి చేసుకోవడానికి ప్రభుత్వం సోపానం కావాలి. మత, ఆర్థిక, రాజకీయ, స్వాతంత్య్రాలు ప్రతి భారతీయుడి హక్కు. సమాన అవకాశాలు ప్రతి భారతీయుడి హక్కు. మనిషిని మనిషి, వర్గాన్ని వర్గం, దేశాన్ని దేశం దోచుకోవడం మానేయాలి. ఈనాడు డాక్టర్ భారతదేశాన్ని సమైక్యంగా, సమున్నతంగా, సమ సమాజ నిర్మాణ దక్షతతో నడపాలంటే, మోదీ కేంద్ర పాలన ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ దక్షిణ భారతదేశమే కాక అన్ని లౌకికవాద శక్తులూ అంబేడ్కర్ మార్గంలో నడిచి భారతదేశాన్ని రక్షించుకోవాల్సిన చారిత్రక సందర్భం ఇది. భారత రాజ్యాంగమే భారతదేశ పునర్నిర్మాణానికి గీటురాయి.
డాక్టర్ కత్తి పద్మారావు
వ్యాసకర్త రచయిత, సామాజిక విశ్లేషకుడు.
మొబైల్: 9849749695
Comments
Please login to add a commentAdd a comment