ప్రపంచ వ్యాప్తంగా ఇది వ్యక్తిత్వ నిర్మాణయుగం. ఈ యుగ సంకేతంగా ప్రపంచంలో వెలుగొందుతున్న మేధావుల్లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ప్రసిద్ధులు. విద్య మానవుడిని ప్రపంచీకరించాలని కుల వివక్ష కోరల్లోకి దింపకూడదని అంబేడ్కర్ ఆశించారు. ఆ కోణంలో ఆయన ప్రపంచ మానవ సంస్కృతికి ప్రతీక. గతంలో డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్‌ను నిరసించి, నిరాకరించి, అపహాస్యం చేసిన వారంతా ఈ రోజు ఆయన్ని భుజాలకెత్తుకుని మోస్తున్నారు. భారత రాజ్యాంగ శిల్పిగా, స్త్రీ విముక్తి ప్రదాతగా, మానవతా దార్శనికుడిగా, బౌద్ధ తత్వబోధకుడిగా, వ్యక్తిత్వ నిర్మాణ దక్షుడిగా,యుగకర్తగా సామాజిక విప్లవ మార్గాన్ని నిర్దేశించిన అంబేడ్కర్ బోధనలను చిత్తశుద్ధితో పాటించడమే ఆయనకు మనమిచ్చే నివాళి.
డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ సామాజిక రాజకీయ వేత్త. భారత రాజ్యాంగ శిల్పి, స్త్రీ విముక్తి ప్రదాత, మానవతా దార్శనికుడు, బౌద్ధ తత్వబోధకుడు, వ్యక్తిత్వ నిర్మాణ దక్షుడు. యుగకర్త, సామాజిక విప్లవ మార్గాన్ని నిర్దేశించిన బోధకుడు. సమాజాన్ని మార్చిన చరిత్రకారుడు. ఈ రోజు ఆయన 128వ జయంతి. సంవత్సరాలు గడిచే కొద్దీ ఆయన ప్రపంచ మేధావిగా విస్తరిస్తున్నారు. గతంలో అంబేడ్కర్‌ను నిరసించి, అపహాస్యం చేసిన వారంతా ఈ రోజు ఆయన్ని భుజాలకెత్తుకుని మోస్తున్నారు.
తాను పొందిన విద్యా సౌగంధ్యాన్ని మొత్తం సమాజానికి పంచటం అంబేడ్కర్ ప్రారంభించాడు. అందుకే ఆయన మాటలను వినడానికి ప్రజలు లక్షలాదిగా సమీకృతులయ్యారు. ఆ మాటలలో సత్యనిష్టమైన శక్తి ఉంది. చీకటిని తొలగించే వెలుగు దివ్వెలలా ఆయన మాటలు ప్రజ్వలనాలయ్యాయి. 1923కే ఆయన బారెట్ లా కూడా పూర్తి చేసి బాంబే వచ్చాడు. ఆయనకు 32 ఏళ్ల వయస్సు నాటికి భారతదేశంలో పేరెన్నిక గన్న విద్యా సామాజికవేత్తగా నిలబడ్డాడు. 1927లో జరిగిన మహద్ చెరువు పోరాట సందర్భంగా అంబేడ్కర్ మనుస్మృతిని దగ్ధం చేశారు. కులానికి, అస్పృశ్యతకి మూలమైన మనుస్మృతిని తగులబెట్టడంతో ఒక్కసారిగా హిందూ సమాజం ఉలిక్కిపడి ఆయన వైపు చూసింది. మనుస్మృతిని తగులబెట్టిన సంఘటన చారిత్రాత్మకమైంది.
అంబేడ్కర్ గొప్ప పరిశోధకునిగా భారతదేశానికి నూతన వెలుగులు ఆవిష్కరించారు. తన కుల నిర్మూలన గ్రంథం ద్వారా ‘కులం ఒకనాడు జనించింది, మరొకనాడు అంతరిస్తుంద’ని స్పష్టం చేశారు. కులం, అస్పృశ్యత పోయి, ప్రధాన స్రవంతిలోకి దళితులు రావడం వల్ల, వ్యవసాయ పారిశ్రామిక ఉత్పత్తులు పెరుగుతాయని, జ్ఞాన సంపద పెరుగుతుందని స్పష్టం చేశారు. దళితులు గొప్ప ఉత్పత్తి శక్తులు. గిరిజనులు ప్రకృతి శక్తులు. వీరిని నిర్లక్ష్యం చేయడం వల్ల భారతదేశం అభివృద్ధి చెందదని తేల్చి చెప్పారు. ప్రగాఢ అధ్యయనం, లోతైన అవగాహన, అనుభవం, ఆచరణ ఉన్నందునే ఆయన మాటలు సత్యనిష్ఠం అయ్యాయి. బుద్ధుని ధార్మిక సూత్రాలను, నీతి సూత్రాలను అంబేడ్కర్ తన రాజ్యాంగంలో అవసరం అయిన చోటంతా పొదుగుతూ వెళ్ళారు.
విద్య శూద్రులకు, అతి శూద్రులకు చెప్పగూడదనే నిర్ణయం వలన భారతదేశం నిరక్షర భారతంగా మిగిలిపోయింది. మళ్ళీ అక్షర భారతంగా అంబేడ్కర్ మలచాడు. భారతదేశంలో విద్య సార్వత్రికం కావడానికి, దేశంలోని అన్ని కులాల విద్యార్ధులు ప్రపంచ దేశాల్లో అత్యున్నత విద్యను అభ్యసించడానికి అంబేడ్కర్ అందరికీ చదువుకునే హక్కుతోపాటు ఉపకార వేతనాల సౌకర్యాన్ని ప్రతిపాదించడం, రిజర్వేషన్ల సౌకర్యాన్ని కలిగించడం వల్లనే జరిగింది. విద్యను శూద్ర, అతిశూద్ర, ఆదివాసీలందరికి కలిగించడం ఒక చారిత్రక మలుపునకు దారితీసింది. అంబేడ్కర్ గొప్ప రాజ నీతిజ్ఞుడు. నీతికి, నిజాయితీకి ఆయన నిలువెత్తు సాక్ష్యం. దళితులు తమ రాజకీయ పార్టీలను తాము నిర్మించుకొని ఓటు వేసుకొనే స్థాయికి ఎదగాలని ప్రబోధిం చారు. రాజ్యాధికారం ప్రధానమైన ‘కీ’ అని, ఆ తాళాలు చేతిలో ఉంటే అన్ని తలుపులు మనం తీయవచ్చని చెప్పారు.
భారతదేశ పునర్నిర్మాణానికి ప్రజాస్వామ్యం పునాది అని మాట్లాడే, పోరాడే స్వేచ్ఛ వల్లే సామాజంలో మార్పు వస్తుందని చెప్పారు. లౌకిక, సామ్యవాదాల వైపు దేశం నడవకపోతే మత ఘర్షణలు, కులాధిపత్య దాడులు జరుగుతాయని, అందుకే దళితుల్లో చదువుకున్న వారు కుల నిర్మూలన వైపుగా సామాజిక సమానత వైపుగా సమాజాన్ని నడిపించే బాధ్యతను కలిగి ఉండాలని చెప్పారు. అంబేడ్కర్ మానవ హక్కుల కోసం పోరాడే క్రమంలో హిందూకోడ్ బిల్లు కోసం కేంద్ర న్యాయమంత్రిగా రాజీనామా ఇవ్వడానికి వెనుకాడని పోరాటయోధుడు. 1956 అక్టోబర్‌లో నాగపూర్‌లో 5 లక్షల మంది అణగారిన ప్రజలకు బౌద్ధ దీక్షనిచ్చి తన సమీకరణశక్తిని ప్రపంచానికి చాటినవాడు. విద్యనభ్యసించడం కాదు విద్యా వ్యవస్థల నిర్మాణంలో భాగంగా ఔరంగాబాదులో అత్యున్నత విద్యా సంస్థల నిర్మాణం గావించాడు. ఆయన నీతి, వ్యక్తిత్వం, దేశ భవితవ్యం, స్త్రీ ఔన్నత్యం కోసం నిరంతరంగా ఒక యోధుడులా పనిచేశాడు. 1932 తరువాత ఆయన గడిపిన ప్రతిరోజూ భారతదేశ చరిత్రకి ఒక డాక్యుమెంట్ వంటిది. బుద్ధుడిని, అంబేడ్కర్‌ని అధ్యయనం చెయ్యకుండా భారతదేశంలో సమసమాజ నిర్మాణం సాధ్యపడదు.
అంబేడ్కర్ గొప్ప సామాజిక శాస్త్రవేత్త, మానవ పరిణామ శాస్త్రవేత్త. మానవ పరిణామ శాస్త్రవేత్తలు, భారతీయ చరిత్రకారులు, సామాజిక శాస్త్రకారులు ఆయన ప్రతిపాదించిన సిద్ధాంతాలను ఇప్పటివరకు చరిత్రకు సామాజిక శాస్త్రానికి అన్వయించలేక పోతున్నారు. అందుకే ఏ దేశాలు వెళ్ళినా వీళ్ళకు కులభావాలు పోవడం లేదు. కులం అనేది దేశం మారితే పోదు. గాంధీ, నెహ్రూ ఎందరో భారతీయ మేధావులు ఇతర దేశాలలో చదివారు. వాళ్ళ కులం బలపడింది కానీ పోలేదు. దానివల్ల వాళ్ళు ప్రపంచ మానవులు కాలేకపోయారు. ప్రపంచ మానవులు కావాలంటే మానవ పరిణామ శాస్త్రం అర్థం కావాలి. ప్రపంచం ఈనాడు శాస్త్రీయ వైజ్ఞానిక ప్రగతిలో పయనిస్తుంది. కులాలు, మతాలు, స్త్రీ అణచివేత, ఇతరులను పీడించే గుణాలు మనిషిని ఎదగకుండా చేస్తాయి. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న భారతీయులు అక్కడి అలవాట్లుకు కూడా బానిసలు అవుతున్నారు. విద్యను ఒక వ్యాపారంగా భావించి విద్య ద్వారా ధనార్జన కోసం పాకులాడుతున్నారు. అందుకే ఏ దేశంలో వ్యాపారం చేసినా, వాళ్ళు ధనం సంపాదించగలుగుతున్నారు గాని ప్రపంచ వ్యక్తిత్వాన్ని సంతరించుకోలేక పోతున్నారు. అంబేడ్కర్ విద్య మానవుణ్ణి ప్రపంచీకరించాలని చెప్పాడు.
ప్రపంచ వ్యాప్తంగా ఇది వ్యక్తిత్వ నిర్మాణయుగం. ఈ యుగ సంకేతంగా ప్రపంచంలో వెలుగొందుతున్న మేధావుల్లో అంబేడ్కర్ ప్రసిద్ధులు. ఈ ప్రపంచ దార్శనికునికి రెండు తెలుగు రాష్ట్రాల్లో స్మృతివనాలు వెలిశాయి కాని, నిర్మాణం త్వరితగతిన సాగడం లేదు. భారతదేశంలో వున్న అన్ని విశ్వవిద్యాలయాల్లోనూ అంబేడ్కర్ పీఠాలు వెలిశాయి. కానీ తగిన నిధులు విడుదల కావడం లేదు. అంబేడ్కర్‌ను విస్మరించడం అంటే, దేశ భవిష్యత్తు్తను దెబ్బతీయడమే. ప్రత్యామ్నాయ సంస్కృతీ నిర్మాతగా అంబేడ్కర్‌ను విస్మరించడం అంటే, దేశ భవిషత్తును దెబ్బతీయడమే మానవీయ సంస్కృతీ నిర్మాతగా అంబేడ్కర్ ప్రపంచ మానవ సాంస్కృతిక ప్రతీక, ఆయన మార్గంలో నడుద్దాం..
(నేడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 128వ జయంతి సందర్భంగా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ముఖ్య అతిధిగా వ్యాస రచయిత సమర్పిస్తున్న స్మారకోపన్యాస పత్రం)
వ్యాసకర్త : డా‘‘ కత్తి పద్మారావు, సామాజిక తత్వవేత్త, నవ్యాంధ్ర పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు
సెల్ : 98497 41695
Comments
Please login to add a commentAdd a comment