జిల్లాలో ఆదిమానవులు నివాసమున్నారా? | - | Sakshi
Sakshi News home page

జిల్లాలో ఆదిమానవులు నివాసమున్నారా?

Published Tue, May 30 2023 11:46 AM | Last Updated on Tue, May 30 2023 11:58 AM

తవ్వకాల్లో బయటపడిన ఉడుము దంతాలు, దవడ - Sakshi

తవ్వకాల్లో బయటపడిన ఉడుము దంతాలు, దవడ

జిల్లాలో ఆదిమానవులు నివాసమున్నారా? అడవుల్లో లక్షల ఏళ్ల నాడు ఆవులు, గుర్రాలు, జింకలు తిరుగాడాయా? అంటే అవుననే అంటున్నారు వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన పరిశోధకులు. దాదాపు ఏడు దశాబ్దాలుగా ఇక్కడ పరిశోధనలు జరుగుతున్నాయి. గుండ్లకమ్మ, పాలేరు, మన్నేరు, నాస వాగు పరిసరాల్లో విస్తృత స్థాయిలో పరిశోధనలు చేశారు. తాజాగా పామూరు మండలంలో గుజరాత్‌ రాష్ట్రం బరోడాలోని ఆర్కియాలజీ మహారాజా సాయాజీరావు యూనివర్శిటీకి చెందిన విద్యార్థులు చేస్తున్న పరిశోధనల్లో దాదాపు 2.5 లక్షల ఏళ్లనాటి అవశేషాలను గుర్తించారు. హోమో ఎరక్టాస్‌ అనే తెగకు చెందిన ఆదిమానవులు ఆ అవశేషాలను వినియోగించినట్లు భావిస్తున్నారు. పరిశోధకులతో ముచ్చటించగా ఎన్నో ఆసక్తికరమైన అంశాలు వెలుగుచూశాయి. వాటి గురించి తెలుసుకుందామా.. 

ఒంగోలు, సాక్షిప్రతినిధి: నదీ పరీవాహక ప్రాంతాల్లోనే నాగరికత అభివృద్ధి చెందింది అనేది అందరికీ తెలిసిందే. ఆదిమానవులు నదుల పక్కనే ఉన్న కొండ దిగువ ప్రాంతాల్లో నివాసముంటూ జీవనం సాగించారన్నది చరిత్రకారులు చెబుతూ వస్తున్నారు. అందుకే పరిశోధకులు ఎక్కువగా నదీ పరీవాహక ప్రాంతాలనే ఎంచుకుంటుంటారు. ఈ క్రమంలో జిల్లాలో గుండ్లకమ్మ, పాలేరు, మాకేరు, మన్నేరు వాగులను ఆర్కియాలజీ విభాగానికి చెందిన విద్యార్థులు ఎంచుకున్నారు.

దాదాపు ఏడు దశాబ్దాలుగా దేశంలో వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్థులు ఆర్కియాలజీ అధికారుల సాయంతో పరిశోధనలు చేస్తున్నారు. మాకేరు, మన్నేరు, పాలేరు..వాటికి అనుబంధ వాగులు కనిగిరి ప్రాంతంలోనే ఎక్కువగా ప్రవహిస్తున్నాయి. ఈ ప్రాంతంలో ఉమ్మడి మద్రాసు రాష్ట్రం ఉన్నప్పటి నుంచి పరిశోధనలు చేశారు. ఆదిమానవుని ఆనవాళ్లతో పాటు ఆవులు, గుర్రాలు, ఉడుములు, జింకల అవశేషాలు, రాతి పనిముట్లు గుర్తించారు.  


– 1950లో ఎన్‌ ఐజాక్‌ అనే శాస్త్రవేత్త గుండ్లకమ్మ, పాలేరు నది పరివాహక ప్రాంతాల్లో పరిశోధన చేశారు. అప్పట్లో కర్నూలు జిల్లాలో అంతర్భాగంగా కనిగిరి, కంభం తదితర గ్రామాలు ఉండేవి. ఆయా గ్రామాల్లోని నదీ పరివాహక ప్రాంతాల్లో ఆయన పరిశోధన చేశారు. ఆయన సమరి్పంచిన పీహెచ్‌డీ రికార్డులో ఈ ప్రాంతంలో ఆదిమానవులు నివశించారని ప్రస్తావించారు. అలాగే 1975లో వి.మధుసూదన్‌ రావు అనే శాస్త్రవేత్త ఆంధ్ర యూనివర్శిటీలో పీహెచ్‌డీ చేశారు.

ఈయన పెదఅలవలపాడు, వెలిగండ్ల మండలాల్లోని పాలేరు, మన్నేరు పరివాహక ప్రాంతాల్లో పర్యటించి పరిశోధన పత్రాలను సమరి్పంచారు.  అంతేకాకుండా 2004–05 సంవత్సరాల్లో హైదరాబాద్‌కు చెందిన జియాలజిస్ట్‌లు గుండ్లకమ్మ, మన్నేరు ప్రాంతాల్లో పర్యటించారు. ఇండోనేషియాలో బద్దలైన అగ్ని పర్వతాల ఆనవాళ్లకు సంబంధించి, వాటి నుంచి వచ్చే బూడిదను ఈ ప్రాంతాల్లో ఆయన కనిపెట్టారు. ఇది గాలి ద్వారా వచ్చింది. దీని వల్ల జంతు జాతులు అంతరించడం,  మానవుల సంఖ్య తగ్గినట్లు నివేదికలున్నాయి. దానికి సంబంధించిన ఆనవాళ్లు (రాతియుగం నాటి పనిముట్లు, జంతు జాలాలు, అవశేషాలు కని్పంచాయి) కూడా ఇక్కడే ఉన్నాయి.  


ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలోని కందుకూరు సమీపం మాచవరం గ్రామానికి చెందిన దేవర అనిల్‌ కుమార్‌ గుజరాత్‌లోని ఆర్కియాలజీ మహారాజా సాయాజీరావు యూనివర్శిటీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఆయన తన సీనియర్‌ సమరి్పంచిన పరిశోధనలకు సంబంధించిన రికార్డులు అధ్యయనం చేశారు. అలాగే జిల్లాకు చెందిన ప్రొఫెసర్‌ కొండా శ్రీనివాసులు ఇచ్చిన సమాచారం మేరకు ఆయన సలహాలు, సూచనలతో పలుమార్లు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నేషనల్‌ జియో ఫిజికల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎన్‌జీఆర్‌ఐ) హైదరాబాద్‌ వారి ద్వారా జీపీఆర్‌ సర్వే నిర్వహింపజేసి వారు సూచించిన ప్రాంతంలో మధ్య ప్రాచీన యుగం నాటి, రాతి యుగం నాటి ఆదిమానవుని, జంతు జలాలపై లోతైన పరిశోధన ప్రారంభించిన అనీల్‌ కుమార్‌ పలు ఆసక్తికరమైన అంశాలు వెల్లడించారు.  2017–18 సంవత్సరాల నుంచి గుండ్లకమ్మ, పాలేరు, మన్నేరు పరివాహక ప్రాంతాలైన సీఎస్‌పురం, డీజీపేట, పెద అలవలపాడు, హనుమంతునిపాడు, సింగరాయకొండ, నెల్లూరు జిల్లాలోని జడదేపి తదితర ప్రాంతాల్లో పరిశోధన చేశారు.

కనిగిరిలోని మన్నేరు వాగులో ఎక్కువ శాతం మధ్యప్రాచీన రాతియుగం (70 వేల ఏళ్లు) కాలం నాటి అవశేషాలు, సర్ఫేస్‌ సర్వేలో (బయటకు కనిపించేవి) నాలుగు కిలోమీటర్ల మేర ఉన్నాయి. నీటి కోత ఎక్కువ జరగడం వల్లే అధిక సంఖ్యలో అవశేషాలు ఉన్నందున మన్నేరు వాగును ఎంచుకున్నట్లు ఆయన చెబుతున్నారు. హనుమంతునిపాడు వద్ద పాలేరులో 2.50 లక్షల ఏళ్ల నాటి రాతి పనిముట్లు లభించాయి.  2019 మన్నేరు వాగులో పరిశోధన చేసి కొన్ని అవశేషాలను గుర్తించారు. 2020లో ఒకటిన్నర నెల తవ్వకాలు జరపగా అక్కడ చాలా ప్రాచీన కాలం నాటి, ఆసక్తికర అవశేషాలు దొరకడంతో పూర్తి స్థాయిలో సైంటిఫిక్‌గా లోతుగా పరిశోధన చేస్తున్నట్లు చెప్పారు.

ప్రస్తుతం పామూరు మండలం మోట్రాలపాడు మన్నేరు వాగులో  హైదరాబాద్‌లోని  ఎన్‌జీఆర్‌ఐ (నేషనల్‌ జియోఫిజికల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌కు) చెందిన వారితో  జీపీఆర్‌ (జియోగ్రౌండ్‌ ఫెనిటిరేటింగ్‌ రాడార్‌) కింద రాళ్లు, గుంతలు ఉన్నాయా అనేది తెలుసుకునేందుకు సర్వే చేశారు.  డాక్టర్‌ సక్రమ్, డాక్టర్‌ ఆనంద్‌ పాండేల ఆధ్వర్యంలో 12 మంది ఎంఏ విద్యార్థులు ఈ నెల 13, 14, 15 తేదీల్లో సర్వే చేశారు. ఎక్కడెక్కడ అవశేషాలు ఉన్నాయనే దానిపై క్షుణ్ణంగా సర్వే చేసేందుకు వాళ్లు సూచనలు ఇచ్చారు. వాళ్లు చూపించిన ప్రదేశాల్లో తవ్వకాల్లో జరిపేందుకు చర్యలు తీసుకుంటున్నారు.  

జీవితాంతం పరిశోధనలు చేస్తా.. 
జిల్లాలో చారిత్రక విశేషాలను తెలుసుకునేందుకు నిరంతరం సర్వే చేస్తా. ఎన్జీవోలు ఫండింగ్‌ ఇచ్చి తాను చేస్తున్న పరిశోధనలను ప్రోత్సహిస్తునాŠిన్య.  ఆధునిక మానవుల పరిణామ క్రమానికి సంబంధించి మరిన్ని పరిశోధనలు జరిగేందుకు, కొత్త విషయాలు వెలుగులోకి వచ్చేందుకు ఈ పరిశోధన ఫలితాలు దోహద పడతాయి. అమెరికాకు చెందిన నేషనల్‌ జోబ్రోసిక్‌ సొసైటీ, వెన్నర్‌ గ్రండ్‌ ఫౌండేషన్, లీకే ఫౌండేషన్‌ తదితర సంస్థల ద్వారా ఫండ్‌ సమకూరింది. లీకే ఫౌండేషన్‌ వారు ప్రపంచం మొత్తంలో 25 మందికి ఇస్తే ఇండియాలో నాకు మాత్రమే వచ్చింది. తాము చేస్తున్న పరిశోధనకు మోటరాలపాడు సర్పంచ్‌ మెడబలివి గురవయ్య పూర్తి సహాయసహకారాలు అందిస్తున్నారు.  
– దేవర అనీల్‌ కుమార్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్, కందుకూరు    

వెలుగు చూసిన ఆనవాళ్లివీ.. 
మోట్రాలపాడు మన్నేరు వాగులో మధ్య ప్రాచీన రాతి యుగం నాటి రాతి పనిముట్లు (ఫ్లెయిట్స్, పాయింట్స్, స్కేపర్స్, బ్యోరింగ్స్, బోరఫ్, లిబల్‌బా టెక్నాలజీకి చెందిన పనిముట్లు) ఓఎస్‌ఎల్, యురీనియం సీరిస్‌ ద్వారా 70 వేల ఏళ్ల నాటివిగా గుర్తించారు. అలాగే 40, 50 వేల ఏళ్ల నాటి వైల్డ్, మచ్చిక జాతికి చెందిన ఆవులు, జింకలు, గుర్రాలు, ఉడుముల (వైల్డ్‌ జాతికిచెందిన) దంతాలు, ఎముకలు, ఇతర అవశేషాలను కనుగొన్నారు. ఈ అవశేషాలు ఒకే ప్రాంతంలో (మన్నేరు వాగు ప్రాంతం) సర్ఫేస్‌గా (పైన కనిపించేవి)  సుమారు నాలుగు కిలో మీటర్ల దూరంలో ఎక్కువ శాతం ఉన్నాయి. అంతేగాక ఇక్కడ వాగు కోతలు జరిగాయి. దీంతో పూర్తి స్థాయిలో ఇక్కడే పరిశోధన చేస్తున్నారు. 

ప్రపంచ దేశాల్లోని అత్యున్నత ల్యాబ్‌లో..
కేవలం సర్వేతో కాకుండా .. తవ్వకాల్లో దొరికిన సాంపిల్స్, ఆనవాళ్లను ప్రపంచంలోని అత్యున్నత ల్యాబ్‌లకు పంపించి వాటి వివరాలను తెలుసుకుంటున్నారు. అవి ఎంత పురాతనమైనవి, ఏ కాలం నాటివి, ఎన్నేళ్ల కిందటివి అన్న వివరాలను సేకరిస్తున్నారు.  గుజరాత్‌లోని ఇస్రో ల్యాబ్, ఆ్రస్టేలియా, పోర్చుగల్, హార్వర్డ్‌ యూనివర్శిటీ, యూఎస్‌ఏ (అర్బనా)లోని ల్యాబ్‌లకు పంపి అవి ఏకాలం నాటివి అని సాంకేతికంగా నిర్ధారణ చేస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/3

2
2/3

3
3/3

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement