
ప్రాణాలకు ఉచ్చు
● వేటగాళ్ల దాడులతో ప్రాణాలు కోల్పోతున్న పులులు, వన్యప్రాణులు ● చిరుత మృతితో ఉలిక్కి పడిన అధికార యంత్రాంగం ● ఉచ్చులో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న చిరుతను కాపాడలేని సిబ్బంది ● గత ఐదేళ్లలో 7 పులుల మృతి
నల్లమల అభయారణ్యంలోని వన్యప్రాణులకు స్మగ్లర్ల నుంచి ముప్పు ఉంది. పులులు, చిరుతలను వేటాడి వాటి చర్మాలను ఇతర ప్రాంతాలకు తరలించేందుకు కొందరు స్మగ్లర్లు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నారు. పటిష్టమైన భద్రత, నిఘా వ్యవస్థలున్నాయని అటవీ అధికారులు చెబుతున్నా వేటగాళ్ల బారి నుంచి వన్యప్రాణులను కాపాడలేకపోతున్నారు. ఈనెల 16వ తేదీ యర్రగొండపాలెం మండలంలోని కొలుకుల బీట్‌లో వేటగాళ్ల ఉచ్చుకు చిరుత బలైన సంఘటనతో వన్యప్రాణుల భద్రత మరోసారి ప్రశ్నార్థకమైంది.
నల్లమలలో తిరిగే పెద్దపులి (ఫైల్)
కొలుకుల వద్ద వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకుని మృతి చెందిన చిరుతపులి (ఫైల్)
మార్కాపురం/యర్రగొండపాలెం/పెద్దదోర్నాల: నల్లమల అటవీ ప్రాంతం సుమారు 6.50 లక్షల హెక్టార్లలో విస్తరించి ఉంది. ఈ ప్రాంతంలో 87కు పైగా రాయల్ బెంగాల్ టైగర్లు, సుమారు 100 కు పైగా చిరుతలు తిరుగుతున్నాయి. వీటితోపాటు వందల సంఖ్యలో దుప్పులు, జింకలు, నీల్‌గాయ్‌లు, ఎలుగుబంట్లు ఉన్నాయి. పులుల సంరక్షణకు అటవీ శాఖాధికారులు చర్యలు చేపడుతున్నప్పటికీ వేటగాళ్లు పన్నుతున్న ఉచ్చుల్లో అడవి పందులతోపాటు వన్యప్రాణులు బలవుతున్నాయి. యర్రగొండపాలెం మండలంలోని కొలుకుల బీట్‌లో ఈనెల 15వ తేదీ వేటగాళ్లు ఏర్పాటు చేసిన ఉచ్చులో పడి చిరుత మృతి చెందడం చర్చనీయాంశమైంది. దీంతో నల్లమల అటవీ ప్రాంతంలో గత ఐదేళ్లలో 7 పులులు మృతి చెందినట్లైంది.
కఠినతరమైన చట్టాలున్నా.. ఆగని వన్యప్రాణుల వేట
వన్య ప్రాణులు, అటవీ సంరక్షణకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం ప్రవేశపెట్టింది. 1973 మార్చి 1న దానిని అమలులోకి తెచ్చింది. అప్పటి నుంచి శిక్షలు కఠినతరం చేస్తూ ప్రత్యేక చట్టాలు అనుసంధానిస్తూ వస్తున్నా.. వన్యప్రాణుల మరణాలు మాత్రం ఆగడం లేదు. వన్యప్రాణులను వేటాడితే నాన్‌బెయిలబుల్ కేసు నమోదు, అభయారణ్యంలో అనుమతి లేకుండా ప్రవేశిస్తే ఎన్నో రకాలుగా క్రిమినల్ కేసులు ఉంటాయి. పులుల అభయారణ్యంలోని వన్య ప్రాణులను వేటాడితే 2006–యాక్టు ప్రకారం శిక్షలు కఠినంగానే ఉంటాయి. దీంతో పాటు అక్రమంగా ఆయుధాలు కలిగి అరణ్యంలోకి ప్రవేశించడం, వన్యప్రాణుల ప్రశాంతతకు విఘాతం కలిగించినా కేసులు నమోదు చేసి శిక్షలు విధిస్తారు. 2002 జీవవైవిధ్య పరిరక్షణ చట్టం ప్రకారం అరుదైన, సంరక్షక వృక్ష, జంతుజాలం సంచరించే ప్రాంతాల్లోకి అనుమతులు లేకుండా వెళ్లినా, వాటికి హాని కలిగించినా శిక్షలు తప్పవు. నాన్ బెయిలబుల్ వారెంట్‌తోపాటు రూ.10 లక్షల వరకు జరిమానా ఉంటుంది. అయితే ఇంతటి కఠినతరమైన చట్టాలు అమలులో ఉన్నా వన్య ప్రాణులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. వేటగాళ్లు కొన్ని వన్యప్రాణుల కోసం వేసే ఉచ్చులతో చిరుతలు, పెద్దపులులు అంతమవుతున్నాయి.
శనివారంపై దృష్టి సారించని అటవీశాఖాధికారులు
నల్లమల అభయారణ్య పరిధిలో ఉన్న గ్రామాలపై అధికారులు దృష్టి సారించాల్సి ఉంది. కనీసం వారంలో ఒక్క శనివారం అయినా అటవీ శాఖ సిబ్బంది ప్రత్యేక నిఘా ఉంచితే వన్యప్రాణులను కాపాడినవారవుతారు. సహజంగా వేటగాళ్లు అడవి పందులు, జింకలు, కణితులు, కొండ గొర్రెలు, కుందేళ్లు లాంటి అటవీ జంతువులతోపాటు పక్షులను వేటాడేందుకు ప్రతి శనివారం అడవుల్లోకి వెళ్లి ఉచ్చులు ఏర్పాటు చేస్తారు. ఆదివారం వేకువ జామునే వారు ఆయా ప్రాంతాలకు వెళ్లి ఉచ్చులో చిక్కుకున్న ప్రాణులను పట్టుకొని వాటి మాంసాన్ని అమ్ముకుంటుంటారు. ఈ తంతు బహిరంగ రహస్యమైనా అటవీ శాఖాధికారులకు మాత్రం పట్టదని పలువురు విమర్శిస్తున్నారు. పెద్దదోర్నాల, యర్రగొండపాలెం, పుల్లలచెరువు, పెద్దారవీడు మండలాల్లోని కొన్ని గ్రామాలకు చెందిన వేటగాళ్లు వన్యప్రాణులను వేటాడి వాటి మాంసాన్ని విక్రయించటమే ఉపాధిగా మార్చుకున్నారు.
వన్యప్రాణులదీ ఇదే పరిస్థితి
● గత ఏడాది డిసెంబరు 27న ఒంగోలు సమీప పొలాల్లో జింక రైతులకు చిక్కడంతో వారు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో జింకల పార్కుకు తరలించారు.
● 2023 డిసెంబరులో పొదిలి మండలం కంభాలపాడు వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొని జింక మృతి చెందింది.
● 2023 డిసెంబరు 23 దోర్నాల మండలం జమ్మిదోర్నాల వద్ద కుక్కల దాడిలో కృష్ణజింక మృతి చెందింది.
ఉచ్చులో చిక్కుకున్న చిరుతను కాపాడలేని సిబ్బంది
యర్రగొండపాలెం మండలం కొలుకుల సమీపంలో ఈనెల 15వ తేదీ రాత్రి వేటగాళ్లు ఏర్పాటు చేసిన ఉచ్చులో చిక్కుకుని ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న చిరుత పులిని అటవీ శాఖ సిబ్బంది కాపాడలేకపోయారు. వారి కళ్లముందే మరుసటి రోజు ఆ చిరుత ప్రాణాలు వదిలింది. అటువంటి సంఘటనలు చోటు చేసుకున్న సమయంలో ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడం, వారి అనుమతి కోసం ఎదురు చూడటం ఏంటని పర్యావరణ ప్రేమికులు ప్రశ్నిస్తున్నారు. ఉచ్చులో చిరుత పులి చిక్కుకొని తప్పించుకోవటానికి తీవ్రంగా ప్రయత్నించింది. తనను రక్షించేందుకు ఎవరైనా వస్తారేమోనని అరవడం మొదలు పెట్టింది. దాని గాండ్రింపులు విన్న సమీప గ్రామస్తులు అటవీ శాఖాధికారులకు సమాచారం ఇచ్చారు. ఆలస్యంగా అయినా స్పందించిన వారు సంఘటన స్థలానికి వెళ్లారేతప్ప ఆ చిరుతను రక్షించేందుకు ప్రయత్నించలేదని పలువురు తెలిపారు. ఉచ్చువేసిన వేటగాడు చిరుతను కాపాడటానికి అక్కడికి వెళ్లి ఇరువైపులా ఉచ్చులకు కట్టిన తాళ్లను తెంచివేశాడు. అటువంటి సమయంలో నిస్సహాయస్థితిలో ఉన్న దానిని గ్రామస్తుల సహకారంతో రక్షించేందుకు సిబ్బంది ప్రయత్నించకుండా ఉన్నతాధికారుల రాక కోసం ఎదురు చూస్తూ కాలం గడిపారు. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న చిరుత ఉన్న ప్రాంతానికి వెళ్లేందుకు వారు అనుమతి ఇవ్వలేదు. చివరకు ఆ చిరుత ప్రాణాలు వదిలింది. ఇప్పటికై నా అధికారులు అటవీ ప్రాంతాలపై దృష్టి సారించి వేటగాళ్ల బారి నుంచి వన్యప్రాణులను కాపాడాలని పలువురు కోరుతున్నారు.
మృత్యువాత పడుతున్న పులులు, చిరుతలు
ఈ ఏడాది ఫిబ్రవరి 16వ తేదీన యర్రగొండపాలెం మండలం కొలుకుల సమీపంలో వేటగాళ్ల ఉచ్చులో పడి చిరుతపులి మృతి చెందింది.
గతేడాది అర్ధవీడు మండలం వెలగలపాయ సమీపంలో విద్యుత్ కంచె తగిలి చిరుత మృతి చెందింది.
2023 నవంబరు 10న శ్రీశైలం ఘాట్‌లో గుర్తుతెలియని వాహనం ఢీకొని చిరుత మృతి చెందింది.
అదే ఏడాది రోడ్డు దాటుతున్న ఏడాదిన్నర వయస్సున్న చిరుతపులి పిల్ల గుర్తుతెలియని వాహనం ఢీకొని మృత్యువాత పడింది.
2022 జనవరి 6న దోర్నాల మండలం రోళ్లపెంట సమీపంలో బావిలో పడి చిరుతపులి ప్రాణాలు కోల్పోయింది.
2021 నవంబరు 12న గిద్దలూరు–నంద్యాల మధ్య చలమ రైల్వేస్టేషన్ సమీపంలో రైల్వేట్రాక్ దాటుతూ ప్రమాదవశాత్తు రైలుకిందపడి పెద్దపులి మృతి చెందింది.
2020 ఏప్రిల్‌లో యర్రగొండపాలెం సమీపంలోని గాలికొండ అటవీ ప్రాంతంలో వృద్యాప్యంతో తీవ్రమైన ఎండ వేడిమి తట్టుకోలేక పెద్దపులి చనిపోయింది.
జనారణ్యంలోకి వన్యప్రాణులు
ఇటీవల కాలంలో చిరుతలు, పెద్దపులులు, ఎలుగుబంట్లు జనారణ్యంలోకి వస్తున్నాయి. మార్కాపురానికి చుట్టుపక్కల నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న పెద్దదోర్నాల, పుల్లలచెరువు, యర్రగొండపాలెం, పెద్దారవీడు, అర్ధవీడు, గిద్దలూరు తదితర మండలాల్లో ఉన్న అటవీ సమీప గ్రామాల్లోకి పెద్దపులులు, చిరుతలు, ఎలుగుబంట్లు ఆహారం కోసం, రోడ్డు దాటుతూ జనావాసాల్లోకి వచ్చి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఇదే సమయంలో అవి గేదెలు, ఆవులు, ఎద్దులపై దాడిచేసి తింటున్నాయి. పెద్దదోర్నాల మండలంలోని నల్లగుంట్ల, వై చర్లోపల్లి, తుమ్మలబైలు, శ్రీశైల శిఖరం, బొమ్మలాపురం, ఘాట్‌రోడ్డు, అర్ధవీడు మండలంలోని వెలగలపాయ, మాగుటూరు తాండ, గన్నెపల్లి, లక్ష్మీపురం, దొనకొండ, మార్కాపురం మండలం గొట్టిపడియ, పెద్దారవీడు మండలం గుండంచర్ల తదితర గ్రామాల శివార్లలో చిరుతలు, పెద్దపులులు వస్తున్నాయి. ఇదే సమయంలో గిద్దలూరు – నంద్యాల మధ్య ఉన్న అటవీ ప్రాంతంలో రాత్రిపూట చిరుతలు, పెద్దపులులు వచ్చి రైలును ఢీకొని ప్రాణాలు విడుస్తున్నాయి. వీటితోపాటు పొలాల్లో రైతులు అడవి పందుల బెడద నుంచి పంటలను కాపాడుకునేందుకు ఏర్పాటు చేసిన విద్యుత్‌త తీగలు తగిలి చిరుత పులులు మృతిచెందుతున్నాయి. ఇక జింకలు కూడా జనావాసాల్లోకి వచ్చి మృత్యువాత పడుతున్నాయి.

ప్రాణాలకు ఉచ్చు

ప్రాణాలకు ఉచ్చు

ప్రాణాలకు ఉచ్చు

ప్రాణాలకు ఉచ్చు
Comments
Please login to add a commentAdd a comment