పదం నుంచి పథంలోకి... గోదారి | Sai papineni writes more essays on Godavari | Sakshi
Sakshi News home page

పదం నుంచి పథంలోకి... గోదారి

Published Sat, Feb 22 2014 2:22 AM | Last Updated on Mon, Aug 13 2018 7:54 PM

పదం నుంచి పథంలోకి... గోదారి - Sakshi

పదం నుంచి పథంలోకి... గోదారి

నాగరికతలో లిపి ఆవిర్భావం ఒక మహోదయం అయితే లిపినీ లిపి వల్ల ఉద్భవించిన సాహిత్యాన్నీ పట్టుకొని ఆ నాగరికత దారుల్లో తిరిగి ప్రయాణించడం ఒక మహాద్భుతం. మానవ పథం, సాహిత్య పదం కలసి మెలసి సాగి ఒకదానికి ఒకటి బాసటగా నిలిచాయి. ఒకదాని ఆధారంగా మరొకదానిని తరచి చూడటం, తెలుసుకోవడం ప్రతి తరానికి అవసరమే. గతంలో రాహుల్ సాంకృత్యాయన్ ‘ఓల్గా నుంచి గంగ వరకు’, తిరుమల రామచంద్ర ‘హంపీ నుంచి హరప్పదాకా’ ఆ కోవలో విశేషమైనవి. ఆ దారిలో చేసిన అలాంటి ప్రయత్నమే ఇది. గతంలోకి ప్రయాణం. మనిషి నడిచి వచ్చిన దారినీ మూలాలనీ సాహిత్య సాంస్కృతిక సంకేతాల ద్వారా తెలుసుకునే ప్రయత్నం ఇది. సాంఘిక చరిత్రే కాదు సాహిత్య చరిత్ర కూడా విపులంగా అధ్యయనం చేసిన సాయి పాపినేని రాస్తున్న వ్యాసాలను ఇక మీద సాక్షి సాహిత్యం పేజీలో వారం విడిచి వారం అందిస్తున్నాం. ఫిక్షన్, ఫ్యాక్ట్ కలగలసిన ఈ నవీన శీర్షికను ఆదరిస్తారని ఆశిస్తున్నాం.
 
 ఈ సాలు నల్లేరు (కృష్ణానది) కొంచెం ముందుగా దాటాలి. వేసంగిలో మందలన్నీ దారిపడితే పోయినేటిలా పచ్చికకి కరువు...  
 
 క్రీ.పూ.2000- అందేరు  వద్ద గంటకల్లు గుట్ట
 (నేటి కర్నూలు జిల్లాలో హంద్రీ నది ఒడ్డున ఒక
 కొండ చరియ)
 ఆశగా తలెత్తి తనవంకే చూస్తున్న ఎర్రోడి దోసిట్లోకి తోలుతిత్తిలోని నీళ్లు వంచుతూ ఓరకంట నవ్వింది చింగి. ఆ నవ్వుకే ఉబ్బిపోయి కళ్లు ఇంతలా విప్పార్చాడు ఎర్రోడు. వాడివి పెద్దేరు నీళ్లలా నీలికళ్లు. అదాటున చూస్తే దడుసుకొనేట్లు తెల్లగా పాలిపోయిన దెయ్యం తోలు. అందుకే ఎర్రోడితో ఎవ్వరూ కలవరు. మనుషుల్తో కలవకున్నా ఎన్ని ఆవులైనా ఒక్కడే కాయగలడు. ఒకటా రెండా.. మందలు లెక్క కట్టాలంటే కాలివేళ్లు చాలవు. చిన్ననాటి నుండి చింగి ఒక్కతే వాడితో మాటలు కట్టిన నేస్తం.
 
 వాడు కూనగా ఉన్నప్పుడే ఉత్తరపు లోకాన్నించి (ఉత్తర భారతదేశంలో సింధులోయ నాగరికత ప్రదేశం) ఎత్తుకొచ్చాడటంట, అగ్గప్ప. అతడు మందకాపు. చింగి తల్లికి తోబుట్టువు. గూటికి పెద్ద దిక్కు. దండులో ఏడు గూళ్లకి ఏడుగురు పెద్దక్కలు. చింగి తల్లి అందరిలో పెద్దది. ప్రతి చలికాలం కుప్పకి అగ్గిపెట్టే పని ఆమెదే.
 
 చల్లగా వీచిన కొండగాలికి భుజాలు ముడుచుకొంది చింగి. దండల మధ్య నిక్కిన గుండెల్లోకి జారిన రంగు పూసల వంక తదేకంగా చూస్తూ ‘రేపు తెల్లారాక గంటకల్లు కాడికి వస్తావే చింగీ! కొత్త బొమ్మ చెక్కా. చూపిస్తా!’ చేతిలో వెలక్కాయలా గుండ్రటి మద్దురాయిని పెకైగరేసి పట్టుకుంటూ అన్నాడు, ఎర్రోడు.
 గంటకల్లు గుట్ట మీద కాట్రేడి బొరియ ఉంది. ప్రతి పున్నమికీ వేట బలిచ్చి జట్టుకూటికి దండంతా అక్కడే చేరేది. మొక్కుబడి చెల్లించాక గుర్తు చెక్కేపని మాత్రం ఎర్రోడిదే. వాడు చెక్కితే మనిషైనా గొడ్డైనా అట్లనే ప్రాణంతో లేసొస్తదేమో అన్నట్లుంటది.
 ‘పెద్దక్కలంతా అందేరుకి తెన్నుదిక్కు పోతున్నారు. కాకిపెసలు, రేగిపళ్లు ఇరగగాసినాయట. రేపు గాదు ఇంకోమారు చూద్దాంలే’ అంది చింగి.
 ‘రేగిపళ్లే గదే నేను తెచ్చిపెడతానులే’ దీనంగా మొహంబెట్టి అడిగాడు.
 ‘సరేలే, పొద్దు గుంకేలోగా కొండంచు ఏటికాడకి పోయి నా పందిగోర్లు (చెంచులు వేటకి వాడే ఒకరకమైన పదునైన బోన్లు) చూసుకోవాలి. ఏదులూ, బెట్టుడతలూ ఏమైనా ఉచ్చులో చిక్కినాయేమో. ఇప్పుడు తోడొస్తానంటే రేపు నీతో వస్తా’ అని కళ్ళెగరేసింది.
 ‘సరే పద’ అంటూ ఆకాశం వంక చూసి ఎదురుగా ఉన్న రావిచెట్టు వైపు ఉరికాడు.
 ‘ఇదిగో ముందే చెబుతున్నా వేట ఏదైనా చిక్కితేనే రేపు నీతో వచ్చేది’ అని కేకేసి విరగబడి నవ్వసాగింది చింగి.
 పడమటెండ నీడ సరిగ్గా మనిషి నిలువుంది.
 ‘బిన్నగా ఉరికితే పొద్దులోగా రావచ్చును’ అంటూ ముందుకి సాగాడు ఎర్రోడు.
 ‘ఏడకిరా?’ ఎదురొచ్చాడు అగ్గప్ప.
 ‘ఏటికాడికి, చింగవ్వ ఉచ్చులు చూసేందుకు’ అంటూ చింగి చేయందుకొని ముందుకురికాడు ఎర్రోడు.
           
 పొద్దుగుంకి చీకట్లు అలముకోసాగాయి. పెద్దక్క దగ్గర మాటల్లో కూచున్నాడు అగ్గప్ప.
 ‘లోయలో పచ్చిక పలచనైపోయినాదే. చలి కూడా ముదరుతాంది. కుప్పలు కాల్చేదింకెప్పుడంటావ్?’ చుక్కల వంక చూస్తూ అడిగాడు, అగ్గప్ప.
 గూడెంలో ఏడు గూళ్ళున్నట్లు ఆకాశంలో కూడా ఏడు పెద్దక్కల గూళ్ళనే చుక్కలు. ప్రతియేటా అవి నడినెత్తికి ఎక్కినప్పుడే అక్కల పండగ. మందలు దారిపట్టేది.
 ‘ఇంకెంత నెలపొడిచి మూన్నాళ్ళేగా. పున్నమి పదినాళ్ళున్నాది. ఈ సాలు దారికాపుకి నిలువురాటు నాటాల. ఎరుకేగా?’ అంది పెద్దక్క.
 
 ‘మూడు నిలువుల బండ. దిగువాకి దొర్లించాలి అంతే. రేపే ఆ పనిచేసి బలికి ఆలపోతులు దానికే కట్టేస్తా. ఇక నీవెప్పుడంటే అప్పుడే దారిపట్టు’
 ‘ఆ పనిజెయ్యి. ఈ సాలు నల్లేరు (కృష్ణానది) కొంచెం ముందుగా దాటాలి. వేసంగిలో మందలన్నీ దారిపడితే పోయినేటిలా పచ్చికకి కరువు... ఇంతకీ చింగి  కనబడదు, పొద్దుగుంకియాడకిబోయినాదో?’
 ‘ఆ ఈడకే యేటికాడ ఉచ్చులు చూసేందుకు. తొందరలేదులే ఎర్రోడు తోడుబోయినాడు’     
 ‘ఆ ఎర్రోడిని నీవే మొచ్చుకోవాల. ఆ దెయ్యం కూనని నీవేగాదా నా నెత్తిన బెట్టావ్. ఈ సాలు దేవుళ్లకాడ మంచి వెలకి బేరం పెట్టి వదిలించుకోవాల’
 
 ‘ఆ పనిజెయ్యి. ఆలాగన్నా వాడి లోకానికి వాడుబోతాడు’,  అంటూ నిట్టూర్చాడు అగ్గప్ప. ఏనాడో ఉత్తరపు దారిన వాడి తల్లి ఊరు పారి తనని కలిసినాది. నిండు చూలు. కూనని తన చేతబెట్టి అది చచ్చినాది. లేగదూడలతో బాటూ వాడినీ సాకి ఈ దిక్కు తెచ్చినాడు. పెద్దక్క ఆనాడే వద్దనుండే. తెల్లతోలు, దెయ్యంబిడ్డ, కొండ మీద పండబెట్టమని జెప్పినా తానే పట్టుబట్టి సాకినాడు. కానీ ఈడ దండులో ఇంతమంది ఉన్నా ఆడికెవ్వరూ లేరు. ఆ దయ్యాల లోకమే మెరుగు. అయినా ఆడికేమి, ఏడున్నా నెగ్గుకొస్తాడు అనుకుంటూ ఏటితట్టు బాటపైన చూపుబెట్టాడు.
 దూరంగా ఎర్రోడూ, చింగి చెట్టపట్టలేసుకోని గుట్టెక్కుతున్నారు. ఎర్రోడి భుజాన్నేదో రెండు బారల వేట.
           
 రాత్రి కొట్టిన కొండగొర్రె తోలు తీసి, అగ్గిగుంట మీద సెగ తగిలేట్లు వేలాడగట్టి, పెద్దక్కకి ఎరుక జెప్పి, చింగితో సహా గంటకల్లు జేరాడు, ఎర్రోడు.
 ఇంకా తెల్లారలేదు.
 పడమటికి కుంగుతున్న చుక్కలు చూపిస్తూ, ‘అదిగో అదే ఒడయ. అది ఆడి చేతిలో విల్లు. ఆ మూడు సుక్కలు ఆడిసిరిన కోలు. ఆ ముందు పారతా ఉన్న కొమ్ముల మెకమే జన్నిగట్టు. అంటే ఆ దేవుళ్ళ లోకానికి తాత. ఆ ముందున్న జింక ఆడి కూతురే. కోలుమొన పోటుకి తాత విడిసిన అగ్గి నేలబడి ఈ లోకాలు, మనుషులు, మెకాలు పుట్టుకొచ్చినాయంట... అదే కత. దీన్ని ఆ ఎర్రబండ మీన చెక్కినా’..
 ‘మంచి కత! నీకెవరు జెప్పినారు’.. అడిగింది చింగి.
 ‘పోయినసాలు నాకాడ మూటెడు బల్లెం మొనలు తీసుకొని ఇదిచ్చినాడే ఆ దేవుళ్లయ్యే’.. అని మెడలో వేలాడుతున్న పూసలదండ చూపించాడు ఎర్రోడు.
 ‘ఈయేడు పెద్దక్కకి సాలినన్ని రాగిపూసలూ, నూలు గుడ్డలూ ఇచ్చి నన్ను కొనుక్కుంటానని జెప్పినాడు. దేవుళ్ళ మాట వైనం కూడా నేర్పిస్తాననుండె.’. గర్వంగా అంటూ వాడు కత బొమ్మ చెక్కిన బండ వైపుకి గెంతాడు.
           
 పేడకుప్పలు తగలబెట్టి గంటకల్లు గుట్ట వదిలి పూర్తి నెల గడిచింది. వెయ్యికి పైన ఆవుల మంద. మధ్యలో మరో రెండు మందలు కలిసాయి.
 ఉమ్మితో తడి చేసిన చూపుడువేలు పెకైత్తాడు ఎర్రోడు. గాల్లో తేమ తెలుస్తోంది. అంటే దారి మరెంతో దూరంలేదు. అడవి కూడా చిక్కబడింది. కొండల మధ్య బయళ్లలో మంద ముందుకు సాగుతోంది. ఒకసారి దారి తగిలితే ఇక పచ్చికకు కొరత ఉండదు.
 ‘ఏటిగట్టునే మూడు నెలలు సాగితే చాలు దేవుళ్ల ఊళ్లు’.. తెలిసిన విషయమే మరోసారి చింగికి చెప్పసాగాడు. ‘తెన్నుదిక్కు మందలన్నీ ఆ దారినే పట్టేది. ఆ దారి కొననే బలిబేరాల బయళ్లు. దేవుళ్లు ఆ దారినే గోదారి అంటారు. వానాకాలానికల్లా వేలకొలదీ గోవులు.. జన్నాలకీ, జాతర్లకీ కావల్సినన్ని పశువులు. వెయ్యూళ్ల లోకమది... మాలోకం’.. అంటూ ఆనందంగా చింగి కళ్లలోకి చూసాడు.
 అంటే నన్నొదిలేసి ఆళ్ళల్లో కలిసిపోతావురా.. అంటున్న చింగి కళ్ళలోంచి రాలిన నీటిబొట్టు చూసిన ఎర్రోడి గుండెల్లో ఏదో ములుకు గుచ్చుకున్నట్టు కలుక్కుమంది.

ఆ దారే గోదారి
  వేద వాజ్ఞ్మయంలో క్రతువులలో ఉపయోగించిన గోవుల సంఖ్యా ప్రమాణాలు చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగక మానదు.  అంత పెద్ద సంఖ్యలో పశువులను  దక్షిణాపథం నుండే గ్రహించి ఉంటారనటానికి దక్కన్ పీఠభూమిలో దొరికిన ఆ కాలానికి చెందిన అనేక శిలాచిత్ర లేఖనాలే సాక్ష్యం.
 
దక్కన్ పీఠభూమిలో జనావాసాలు క్రీ.పూ.10000 నాటికే ఉన్నాయని శాస్త్రజ్ఞుల అభిప్రాయం. కానీ, ఇనుప యుగంలోనే దక్షిణ భారతదేశంలో పరిణతి చెందిన సాంఘిక వ్యవస్థ స్థిరపడింది. క్రీ.పూ. 3000కి చెందిన సింధూలోయ నాగరికతకు, దక్షిణాదిలోని నవీన శిలాయుగం సంస్కృతులకి వాణిజ్యపరమైన సంబంధాలు ఉండేవని ధ్రువీకరించవచ్చు. శాస్త్రజ్ఞులు తుంగభద్ర, హంద్రీ పరీవాహక ప్రాంతాల్లో క్రీ.పూ.2000 నాటి అనేక పశుపోషక జనజాతుల ఆవాసాలు కనుగొన్నారు. వీటిలో కర్నూలు జిల్లాలోని ఉతునూరు, గుత్తి-బళ్లారి రైల్వే మార్గంపైన కుప్గల్లు, గుల్బర్గ జిల్లాలోని బుధిహాల్ ముఖ్యమైనవి. శాస్త్రజ్ఞులు ఈ తరహా ఆవాసాలను బూడిదకుప్ప సంస్కృతులు (యాష్‌మౌండ్ సైట్స్) అంటారు.
 
 అవి సంచార జాతులే. కానీ ప్రతి సంవత్సరమూ అదే ప్రదేశంలో తాత్కాలిక ఆవాసాలు ఏర్పరచుకున్న ఆనవాళ్లు ఉన్నాయి. సంవత్సరానికి ఒకసారి పేడ కుప్పలను తగులబెట్టే ఆచారం కనిపిస్తోంది. ఇప్పటికీ రాయలసీమలో సంక్రాంతి పండుగకు కాటమరాయుడి జాతర్లలో పిడకలతో భోగిమంట వేసే ఆచారం ఉంది. కొష్టాల విస్తీర్ణం, పేడ కుప్పల పరిమాణాలను బట్టి ఒక్కొక్క జనావాసంలో పశువుల సంఖ్య 800 నుండి 1200 వరకూ ఉండొచ్చని అంచనా వేశారు. ఐతే, మానవ ఆవాసాలు (హెర్‌‌త్స) ఏడు నుంచి పన్నెండు మించి గుర్తించలేకపోయారు. అంటే ఒక జనజాతి గుంపు లేదా గూడెంలో పాతిక నుండి యాభై వరకూ జనం ఉండేవారని తెలుస్తోంది. సంఖ్యా  ప్రమాణాలని బట్టి చూస్తే పాతికకి మించిన పశువులు.
 
 ఇది సంఖ్యాపరంగా అనురూపం (డిస్‌ప్రపోర్షనేట్) అని ప్రొ.పద్దయ్య వంటి శాస్త్రజ్ఞుల అభిప్రాయం.  మరి అంత పెద్ద సంఖ్యలో పశువులను గ్రహించగల నాగరికత ఆ కాలంలో, అంటే క్రీ.పూ.2000 కాలంలో, ఎక్కడ ఉంది? సింధు నాగరికతకి చెందిన కాలింబగన్ (రాజస్థాన్), లోథల్ (గుజరాత్), రాఖీగఢి (హర్యానా) మొదలైన ఆవాసాలలో సామూహిక యజ్ఞవాటికలు ఉన్నట్లు శాస్త్రజ్ఞులు గుర్తించారు. సింధు, సరస్వతి పరివాహిక  ప్రాంతంలో (పాకిస్తాన్, పంజాబ్, రాజస్తాన్, హర్యానా), గుజరాత్ రాష్ట్రంలలో వెయ్యికి పైగా ఆ నాగరికతకి చెందిన పట్టణ, గ్రామీణ ఆవాసాలు కనుగొనటం జరిగింది. యజ్ఞాలలో గోవధ, గోదానం అన్నది వేదకాలం నుండి ఉన్న ఆచారం.  వేద వాజ్ఞ్మయంలో క్రతువులలో ఉపయోగించిన గోవుల సంఖ్యా ప్రమాణాలు చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగక మానదు.  అంత పెద్ద సంఖ్యలో పశువులను  దక్షిణాపథం నుండే గ్రహించి ఉంటారనటానికి దక్కన్ పీఠభూమిలో దొరికిన ఆ కాలానికి చెందిన అనేక శిలాచిత్ర లేఖనాలే సాక్ష్యం. సింధు నాగరికత ముద్రలపైనున్న పశువుల చిత్రాలకు, ఈ శిలా చిత్రాలకూ ఉన్న సామ్యం ఈ వాదనని బలపరుస్తోంది.
 
 అంతేకాక అదే కాలానికి చెందిన ఋగ్వేదంలోని సరమా అనే  కుక్క కథ దక్షిణ దేశం నుండి వచ్చే అసంఖ్యాకమైన గోసంపద గురించి ప్రస్తావిస్తుంది. రస అంటే నర్మదా నదికి అవతలి వైపు పాణీ అనే అసురజాతివారు గోవులని తస్కరించటం, సరమా అనే కుక్క సాయంతో ఇంద్రుడు దారి కనుక్కొని ఆ గోవులను తిరిగి సాధించి అంగీరసులకు ఇవ్వటం, ఆ కథ సారాంశం. ఆ బూడిద కుప్ప సంస్కృతులవద్దనే రాతి పనిముట్లు చేసే కర్మాగారాలు కూడా గవేషణలలో బయల్పడ్డాయి. ఇవేకాక ఆ పరిసరాలలో దొరికిన కుండపెంకులు, ఖననంలో ఉపయోగించిన సామాగ్రులు, ఇతర వస్తువులూ పరిశీలించి, ఈనాటి ఆదిమ గణజాతుల  జీవనాధార వ్యవస్థతో సంధానం చేస్తే, అప్పటి జీవనశైలి, వస్తు సంస్కృతి పట్ల అవగాహన కలుగుతోంది. వాతావరణం, పర్యావరణ పరిస్థితులు, పచ్చిక బయళ్ల ఉనికి పరిశీలిస్తే ఆ జనజాతుల యొక్క సంచార వలయాన్ని గ్రహించవచ్చు. వర్షాకాలం నుండి సంక్రాంతి వరకు పీఠభూముల్లోని బయళ్లలో, చిట్టడవుల్లో పచ్చిక సమృద్ధిగా దొరుకుతోంది. ఫిబ్రవరి నెల నుండి వేసవి గడిచేంతవరకూ పచ్చిక ఉనికి కృష్ణా, గోదావరి నదీ పరీవాహక ప్రాంతాలకి పరిమితమవుతుంది.
 
  గోదావరి జన్మస్థలమైన నాసిక్ ప్రదేశం సింధు నాగరికతకి దక్షిణపుటెల్ల. ఉత్తర దిశగా వెళ్ళే రహదారి గోదావరి నదిని అనుసరించింది అనడానికి చారిత్రక ఆధారాలున్నాయి. గోదావరి, గౌతమి అనే నామాలలోని గో, గౌ శబ్దాలు గోవులకు సంబంధించినవే. తెలుగులో దారి-తెన్ను.. అనే పదబంధం ఈనాటికీ వాడుకలో ఉంది. తెన్నూ అంటే ద్రవిడ భాషలో దక్షిణ దిక్కు. దారి అనే పదం ఒకప్పుడు ఉత్తరపు దిశనే సూచించి ఉండవచ్చు. ఉత్తర పథానికి తీసే గోవుల దారి గోదారి అయి, కాలక్రమేణా ఆ నదీనామంగా స్థిరపడి సంస్కృతీకరించబడి గోదావరి అయి ఉండవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement