రుక్మిణీ కల్యాణం అలంపురం క్రీ.శ.1150 | Rukmini kalyanam alampuram AD .1150 | Sakshi
Sakshi News home page

రుక్మిణీ కల్యాణం అలంపురం క్రీ.శ.1150

Published Sat, Sep 20 2014 3:23 AM | Last Updated on Mon, Aug 13 2018 7:54 PM

రుక్మిణీ కల్యాణం  అలంపురం క్రీ.శ.1150 - Sakshi

రుక్మిణీ కల్యాణం అలంపురం క్రీ.శ.1150

‘అన్నింటికీ ఆ గోపాలుడే ఉన్నాడులేవే. ఇప్పుడు దాని పెళ్లికి ఏం తొందరొచ్చిందని?’ విసుక్కుంటూ అన్నాడు విష్ణుదాసు.
 అక్క ఊరుకోలేదు. ‘నీవిట్లాగే అంటూ కృష్ణారామా అని పద్యాలు పాడుతూ కూర్చుంటే ఎలారా? నేనా వెధవముండని. ఇంట్లో ఈడొచ్చిన పిల్ల! నీ పెళ్ళాం పోయాక ఆడదిక్కులేని సంసారాన్ని ఇన్నాళ్లూ నెట్టుకొచ్చాను. ఇక నావల్లకాదు. ఇకనన్నా దేవుడూ దేవుడూ అని తిరగకుండా దాని పెళ్లీపెటాకుల సంగతి చూడు. పాపం పిచ్చపిల్ల! కట్టుకోడానికి చిరుగుల్లేని పరికిణీ కూడా లేదు’ అంటూ కళ్ల నీళ్లు పెట్టుకుంది.

విష్ణుదాసుకు చిరాకు వేసింది. చిరచిరలాడుతూ ఇల్లు వీడివచ్చి తుంగభద్ర ఒడ్డున కూర్చున్నాడు. భార్యావియోగంతో జీవితాన్ని భగవదర్పితం చేసి గురువులు తనకిచ్చిన అక్షరజ్ఞానాన్ని ‘కృష్ణలీలామృతం’ అనే కావ్యం రచించడానికే అంకితం చేసాడు విష్ణుదాసు. ప్రతి శనివారం కేశవాలయంలో అతడు చెప్పే కథాకాలక్షేపం వింటూ భక్తిరసంలో ఓలలాడని వాడు కృష్ణాతుంగభద్రా అంతర్వేదిలోనే లేడు. నవబ్రహ్మేశ్వర శివాలయాల శిఖరాలతో దేదీప్యమానంగా విలసిల్లే బ్రహ్మపురిలో ఆ దినాల్లో మాత్రం విష్ణునామం మార్మోగింది. తన కావ్యంలోని శ్రీకృష్ణ జన్మవృత్తాంతాన్ని విష్ణుదాసు పాపనాశి గుడిలో గానం చేస్తుండగా విని కందూరి దండనాయకుడు బొల్లయరెడ్డి ఆ గ్రంథాన్ని తనకు అంకితమివ్వమని ఎంత ప్రాధేయపడినా వినలేదు. భగవంతుని కైంకర్యాన్ని ఒక మానవమాత్రునికి అర్పించడమా? ఇప్పుడు కూతురి పెళ్లి కోసం ఆ పని చేయాల్సి వస్తుందా?

‘దాని పెళ్లి చేసి ఒక అయ్యచేతిలో పెట్టడం కన్నవాడిగా నా కర్తవ్యం. కాని ఉంఛవృత్తిని ఎంచుకొని పొలాల్లో మిగిలిన గింజలు ఏరుకొని బతుకు వెళ్లదీస్తానని వ్రతం పట్టిన వాడికి కూతురుగా పుట్టడమే దాని కర్మా! ఇదే కవిత్వం ముదిగొండ చాళుక్యభూపతి కొలువులో చెబితే అష్టైశ్వర్యాలతో తులతూగవచ్చు. రుక్కమ్మకి మహారాజులాంటి సంబంధం చేయవచ్చు. ఒక తండ్రిగా తన ధర్మం నెరవేర్చాలంటే ఆ పరమాత్మునికై వండిన నైవేద్యాన్ని ఒక పామర రాజాధముడికి సమర్పించాలా? తప్పదు. గోవిందా! నీవే దిక్కు! ఈ గ్రంథం నీ ఆస్తి! ఇక దీనిని నీవే కాపాడుకోవాలి’ అనుకుంటూ తాళపత్రాలపై ఘంటం పెట్టాడు. అతడి ఆలోచనలే చంపకమాలగా అక్షరరూపంలో ప్రత్యక్షమయ్యాయి.

సులభుడ వీవటంచు, నిను చూడగ నెంచితి యేను, మూర్ఖుడన్
అలసత పాడిగాదు నిక, నావులకాపరి నన్ను గావగన్
కలహపు మాటలేల, తమకన్నను రాజులె మేలు, ఇమ్మహిన్
నిలకడ లేనివాడ విక, నీకథ పాడను, రమ్ము ఎమ్మెయిన్

 ఇక రాయడానికి కలం కదలలేదు. అలాగే చెట్టుమొదలుకి జారగిలపడ్డాడు. నల్లరేగడిపై మండుటెండ! తుంగభద్ర లంకలపై ఆవులను మేపుతున్న గొల్లవాడొకడు చెట్టుకింద శోషవచ్చి పడున్న విష్ణుదాసుని చూసి పరుగెత్తుకొచ్చాడు.‘అయ్యో అయ్యోరూ. ఇంత గాడ్పులో ఈడకొచ్చిండావే? ముద్దయినా కుడిచినావా లేదా?’ అంటూ చలిదిమూటలోని జొన్న సంకటి ముద్ద అందిస్తున్న ఆలకాపరి- విష్ణుదాసు మగత కళ్లకి వెన్నముద్దలందిస్తున్న శ్రీకృష్ణుడిగా తోచాడు.‘గోపాలా. పిలువగానే పలికే దేవుడివి. నీ కోసం రాస్తున్న ఈ కావ్యం చాళుక్యరాజుకి ఇవ్వదలిచాను. అంతకు మించి నాకు దారి కనబడదు’ అంటూ ఒడిలోని తాళపత్రాలు గొల్లవాడి చేతిలో పెట్టి ‘నా రుక్మిణమ్మ పెళ్లికి వేరే దారి చూపి నీ సొత్తు ఎలా కాపాడుకుం టావో నీదే భారం!’ అన్నాడు.

‘ముందటగా ముద్ద కడుపు అయ్యోరూ. రుక్కమ్మంటే మసూరి మాలచ్చిమి. ఆయమ్మ మనువంటే ఎల్లారికీ సంబరమే. ఊరేమన్నా ఒట్టిపోయినాదా? అందరం తలో చెయ్యేసినామా వైభోగంగా సెయ్యొచ్చు’ అంటున్న గొల్లవాడి మాటలు- ‘రుక్మిణి నా కోసం అవతరించిన మహాలక్ష్మి. ఆమె వివాహమంటే నాకూ ఇష్ణమే. నేనున్నానుగా? నీ ధర్మం నీవు నెరవేర్చు! రుక్మిణీ కళ్యాణం వైభవంగా నిర్వహించడం నాది బాధ్యత’ అని అభయమిస్తున్న శ్రీకృష్ణుడి వచనాలుగా తోచాయి.

 ఉంఛదీక్షకి తిలోదకాలిచ్చి రాజాశ్రయం కొరకు కుమార్తెతో సహా కళింగానికి వెళ్లే వర్తకుల బిడారుతో కలిసి ముదిగొండకి ప్రయాణమయ్యాడు విష్ణుదాసు.  ‘ఛల్’ అని అదిలిస్తూ గుర్రాన్ని తరాటుగతిలో ముందుకి నడిపాడు క్రిష్ణయ్యలెంక కత్తిని చక్రంలా తిప్పుతూ. గరుడదృష్టితో యుద్ధానికి దూకితే పాతికమంది బందిపోట్లకు ఒక్కడే సమాధానం చెప్పగలడు. అంత చిన్నతనంలోనే వర్తక బిడారుని రక్షించే వీరబలింజ ముమ్మూరిదండుకి నాయకుడు. నల్లని మేనిఛాయ, విశాలమైన కళ్ళు, కోటేరేసిన ముక్కుతీరు, కండలు తిరిగిన ఆరడుగుల శరీరంతో చూసినవారి చూపు మరల్చుకోలేని అందగాడు. గూడుబండిలో ప్రయాణిస్తున్న రుక్మిణిని ఘడియ ఘడియకీ పలకరించనిదే క్రిష్ణయ్యకి పొద్దుపోదు.

పూడూరులో కృష్ణానది బల్లకట్టు వద్ద ఆ కన్యకి చేయందించినప్పటి కరస్పర్శ నెలరోజుల ప్రయాణంలో అతడి కనులకు నిద్దుర దూరం చేసింది. వర్ధమానపురి సంతలో కొనిచ్చిన సిరిమువ్వలజత ఆమె ముంగాళ్ళపై మెదుల్తుంటే ఆ లత్తుక దిద్దిన పాదాలు తన అరచేతులలో పట్టి ముద్దాడాలనే తపన. పొట్లకెరెలో (పటాన్‌చెరు) కూచిపూడి భాగవతులు ఆడే రుక్మిణీ కల్యాణం నాటకం చూస్తున్నప్పుడు ఆమె కనులలో మెదిలిన భావం అతడికి అర్థం కాకపోలేదు. కాని ఆమె బ్రాహ్మణకన్య. తాను బలిజశెట్టి. ఆమె తండ్రికది అంగీకారం కాకపోవచ్చు. కన్యాపహరణం! అందునా బాపనపిల్ల! ఎలా? ఇక రెండు యోజనాలలో కొలనుపాక (కరీంనగర్ జిల్లా). అక్కడ నుంచి తూర్పుకి రాజమహేంద్రి మీదుగా కళింగమార్గం. ముదిగొండ మరెంతో దూరం లేదు. ఇక జాప్యం చేస్తే పిల్ల చేజారిపోతుంది.

 కొలనుపాక ఐదు మార్గాల కూడలి. ఉత్తరాదికి అయోధ్య రాచబాట. శ్రీరామచంద్రునిచే నిర్మించబడ్డ రహదారి. కాశీకి వెళ్లే మార్గం. మరొకటి కొరివిసీమ (ఖమం జిల్లా) ద్వారా వెలనాటికి (కృష్ణా, గుంటూరు తీరప్రాంతం). ఇంకొకటి దక్షిణాన పలనాడు మీదుగా కంచి రాజమార్గం. ఏ దిక్కు పోయినా పట్టుకోవడం బ్రహ్మతరంగాదు. విష్ణుదాసు కృష్ణలీల కావ్యంలో రుక్మిణీ కల్యాణ ఘట్టం రాయడం పూర్తయిననాడే రుక్మిణీ, క్రిష్ణయ్యల జంట పలనాటి మార్గాన పలాయనమయింది.

 కృష్ణార్పణంగా రచించిన కృతిని మానవునికి అంకితమివ్వాలనే నిర్ణయానికి కారణం విష్ణుదాసుకి కుమార్తె పట్ల పితృధర్మం. ఆ భగవంతుడి అనుగ్రహమే కావచ్చు ఇప్పుడా భవబంధం నుంచి విష్ణుదాసుకి విముక్తి కలిగింది. కట్టిన ముడుపు రాజులపాలు కాకుండా కాపాడుకోటానికి ఆ దేవుడే స్వయంగా దిగివచ్చి రుక్మిణీ కల్యాణాన్ని తన కనుల ముందట పునఃప్రదర్శించాడు. విష్ణుదాసుడి ఆనందానికి అంతులేక పోయింది. కృష్ణలీలామృతాన్ని పరవశంగా గానం చూస్తూ ఇంటిదారి పట్టాడు.

కనుల ముందు కదిలే కుంచె బొమ్మలూ మనసుల్లో కలకాలం నిశ్చలంగా నిలిచే చలనచిత్రాల ద్వారా భక్తిరసాన్ని తనదైన పంథాలో మన తెలుగువాళ్లకి అందించిన బాపూ స్మృతికి, స్ఫూర్తికి ఉడతాభక్తిగా ఈ కథాకుసుమం...                                       
  - సాయి పాపినేని + 91 9845034442
 
జాతి ఐక్యతకి రహదారి భక్తి సాహిత్యం
 

తెలుగు సాహిత్యానికి వరవడి భక్తి సాంప్రదాయం నుంచే వచ్చింది. వైదిక బ్రాహ్మణమతం నేడు మనం గుర్తించే హిందూమతంగా పరిణామం చెందడానికి ఆంధ్రదేశంలో చుట్టుపక్కల రాష్ట్రాల కంటే కాస్త ఎక్కువ వ్యవధి తీసుకొన్న మాట వాస్తవం. అయినప్పటికీ హిందూమతంలో వచ్చిన సరికొత్త ఝంఝామారుతం తాకిడికి కోస్తాంధ్రలో వేళ్ళూనిన బౌద్ధమతం, తెలంగాణ- రాయలసీమ శుష్కభూముల్లో ప్రాచుర్యానికి వచ్చిన జైనమతం  నిలువలేక పోయాయి. ఒక వంక గండకత్తెరలూ త్రిశూలాలతో తాండవం చేసే వీరశైవం, మరోవంక పారవశ్యపు మత్తులో పదాలు పద్యాలు పాడుతూ నాట్యంచేసే వైష్ణవం, చెదురుమదురుగా మిగిలిన శాక్త, సౌర్య, గాణపత్య, స్కాంధ సాంప్రదాయాలూ, ఆటవిక జనజాతుల నమ్మకాలూ మాత్రమే కాక బౌద్ధ, జైన మతాల్లో జనసామాన్యానికి నచ్చిన పూజాక్రమాలన్నింటినీ తనలో ఇముడ్చుకొన్న నూతన క్రమమే హిందూమతం. పండగకి పబ్బానికి సామాన్యుల చేదోడుగా ఉంటూ ఊరూరా నివసించిన పేద బాపనయ్యలు ఈ మతానికి మూలస్తంభాలుగా నిలిచారు. యజ్ఞయాగాలకి బదులు సామాన్య స్త్రీపురుషులకి అందుబాటైన వ్రతాలు, దీక్షలు, పూజలు మానవునికి దేవుళ్ళకి వారధులయ్యాయి. ముడుపులు కట్టడం, తీర్థాలు దర్శించడం సర్వసామాన్యం అయింది.

రాజప్రాపకం ఉన్న చోట్ల వెలసిన ఆలయాలు ఈ మతానికి కేంద్రబిందువులయ్యాయి. దేవుళ్ళకి రాజలాంచనాలు లభించాయి. అలంపురంలో మొదలైన ఆలయ శిల్పసంస్కృతి భాగవత, శివపురాణ గాథలని అద్భుతమైన రీతుల్లో చిత్రించి భక్తులకి దేవుడి రూపాలు సాక్షాత్కరింప జేస్తే- బమ్మెర పోతన, గోన బుద్ధారెడ్డి వంటి మహాకవులు ఆ కథలను పద్యాల రూపాన ప్రజల నాల్కలపై పలికించారు. నాటి సాహిత్యానికి పురాణాలు, ఇతిహాసాలలోని గాథలే ముఖ్యాంశాలైనా స్వతంత్రమైన తెలుగు భాషలో నాటి సామాజిక పరిస్థితులని ప్రతిబింబిస్తూ రచనలు సాగాయి. నెల్లూరులో తిక్కన రాసిన భారతం ఓరుగల్లు భాగవతం రాసిన పోతనకి వరవడైతే గుంటూరు శ్రీనాథుడు సభలో కనకాభిషేకం గ్రహించాడు. రాజకీయంగా నాడులు, వాడలుగా విభజింపబడినా తెలుగునాడు సాహిత్యం వల్ల సంస్కృతిపరంగా ఒకటయింది.

ఆ కలయికకు వాణిజ్యంతో పాటూ పెరిగిన బండి మార్గాలు దోహదం చేశాయి. కాశీ నుంచి అయోధ్య, ప్రయాగ, ఉజ్జయినిలను కలుపుతూ బోధన్ వద్ద ఆంధ్రదేశంలో ప్రవేశించిన అయోధ్యరాజమార్గం- కంచి రామేశ్వరాలకి సాగి దేశంలో అతి పెద్ద రహదారి అయింది. సూరత్ నుండి దక్షిణానికి వచ్చే రాజమార్గం పటన్‌చెరు, అలంపురం, గుత్తి, పెనుగొండల మీదుగా మధురై వరకూ వెళ్ళేది. దక్షిణాన వివిధ రాజధానులను కలుపుతూ తూర్పు పడమరలుగా మరిన్ని రహదారులు ఉండేవి. ధాన్యకటకం నుండి వేంగి, రాజమండ్రి మీదుగా బెంగాల్‌కి ఒక మార్గం. అలంపురానికి మోటుపల్లి నుండి అద్దంకి, వినుకొండ, త్రిపురాంతకం ద్వారా ఒకటి, కంచి నుండి కాళహస్తి బాటలు, దేశమంతా అల్లుకొని దూరాలు తగ్గించాయి. సామాన్య ప్రజలు కూడా ఉద్యోగాలకీ వివాహాలకీ దూరపు సంబంధాలు కలుపుకొనసాగారు.
 బండ్లు పోలేని బాటల్లో పల్లకీలు, గుర్రాలు, ఏనుగులు, ఒంటెలు వినియోగించారు. రహదారులలో సత్రాలు, సంతలు, బండ్లు రిపేరు చేసే కార్ఖానాలు ఉండేవి. ఎడ్లు, గుర్రాలను అద్దెలకిచ్చే వ్యవస్థ ఉండేది. బిడారులుగా పోయే వర్తకులను రక్షించేందుకు ముమ్మూరి దండులు, వీరబలిజలు వంటి యోధుల దుండ్లు ఉండేవి. వీరు మార్షల్ ఆర్ట్స్‌లో ప్రవీణులు. పల్నాటిచరిత్ర, సింహసనద్వాత్రింశికల్లో ఫణిదృష్టి, కపిదృష్టి, శార్దూలదృష్టి వంటి యుద్ధవిద్యా విన్యాసాలు చదివితే ‘స్నెక్ ఇన్ మంకీస్ షాడో’, ‘క్రౌచింగ్ టైగర్’ వంటి షావోలిన్ కుంగ్‌ఫూ సినిమాలు గుర్తొస్తాయి.    
 
 పదం నుంచి పథంలోకి 15   సాయి పాపినేని
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement