Sai papineni
-
మాలకాకి
బోయి భీమన్న రాసిన ‘కూలీరాజు’ నాటకం పుస్తకం పక్కనపెట్టి, ఈజీచెయిర్లో కాళ్లు జాపుకొని ఆంధ్రపత్రిక తెరిచాడు డాక్టర్ దాస్. ముందు పేజీలో ‘రామరాజ్యం’ అనే శీర్షికతో కాశీనాథుని నాగేశ్వరరావు రాసిన సంపాదకీయం చదువసాగాడు. హరిజనుల్లో వస్తున్న కాస్తోకూస్తో అభివృద్ధి పట్టణాలకే పరిమితమైందనీ, గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడేలా ఉందని, అసలైన రామరాజ్యం రావాలంటే గ్రామాల్లోని పీడితప్రజల ఉద్ధరణకి గాంధీజీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ నడుం కట్టాలని దాని సారాంశం. అది చదివాక దాస్‌కు తన ఊరు గుర్తుకొచ్చింది. దానిని విడిచివచ్చి పాతికేళ్లు. అమ్మా, అయ్యా, తమ్ముళ్లూ... గూడెంలో చుట్టాలూ, ఊర్లో జనాలూ... ఏమయ్యారో? ఎలా వున్నారో? నిశ్చయానికి వచ్చి గోడకి తగిలించిన టెలిఫోన్ అందుకొని తన అసిస్టెంటుతో ‘మిస్టర్ పిళ్లే.. దిసీజ్ డాక్టర్ దాస్.. అర్జంట్ పని మీద ఊరెళ్లాలి. వారం రోజులు హాస్పిటల్‌కి రానని సూపర్నెంట్‌కి కబురు చేయండి. తరువాత- ఇవాళ జీటీలో పలాసకి ఒక ఫస్ట్ క్లాస్ సీటు రిజర్వ్ చేస్తారా. థాంక్యూ’ అని ఫోను పెట్టేసి బట్టలూ, షేవింగ్ సెట్టూ ఒక చిన్న బ్యాగులో సర్ది, గబగబా తయారై, బీరువాలోంచి కొన్ని పచ్చనోట్లు జేబులో పెట్టుకొని భార్యకి విషయం చెప్పి స్టేషన్‌కి బయల్దేరాడు. రైలుపెట్టె కిటికీలో టెలిగ్రాఫ్ స్తంభాల్లా తాను ఊరువిడిచి వచ్చిన నాటి సంఘటనలు అతడి కళ్లముందు పరుగెత్తసాగాయి.. ఆ రోజు... ఊళ్లో పెద్దోళ్ల పిల్లలంతా నాయుడుగారి దేవిడీలో చేరి ‘అంటాడు’ ఆడుతున్నారు. అంగడి శెట్టి కొడుకు దొంగపడితే ‘నన్నంటుకోకే నామాలకాకీ’ అని పాడుతూ అందరూ పరుగులు పెడుతున్నారు. అప్పట్లో బడిని ఊరి గుడి నుంచి కొత్త భవంతికి మార్చాక మాలల పిల్లల్ని కూడా బళ్ళో చేర్చుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయినా మాలలతో కలిసి చదివేందుకు ఇష్టంలేని పెద్దలు తమ పిల్లలని బడి మాన్పించడంతో ఆ బడి నాలుగు రోజుల్లోనే మూతబడింది. బడి మూసేశాక ఊరి పిల్లలకి నాయుడుగారి దివాణమే బడి. రంగారావ్ మేస్టారు గన్నేరుచెట్టు నీడలో సైకిల్ స్టాండేసి వసారాలోకి వచ్చేసరికి అందరూ బుద్ధిమంతుల్లా పలకా బలపాల్తో బాసినపట్లేసుకొని కూర్చున్నారు. ఆయన పట్నం నుంచి వచ్చిన ప్రైవేట్ మాస్టారు. ఆ రోజు ఇంగ్లిషు పాఠం. కొట్టంలో గొడ్లకి కుడితిపెట్టి, గడ్డేసి, చాటుగా గన్నేరు చెట్టు నీడలో కూర్చొని ఎండుపుల్లతో మాస్టారి ప్రశ్నలకి సమాధానాలు పాదులోని తడిమట్టిలో రాస్తూ పాఠం వినసాగాడు కన్నదాసు. అప్పుడప్పుడు అతడి వంక చూసినా చూడనట్లే ఉండే మాస్టారు ఆ రోజుపాఠం ముగిశాక ‘ఒరేయ్.. సైకిల్లో గాలి తగ్గినట్లుంది. సెట్టిగారి అంగళ్లో గాలి పంపుంది. అక్కడి దాకా తోసుకురా’ అని బయలుదేరాడు. మాస్టారు అతడితో మాట్లాడడం అదే మొదటిసారి. గుడి మలుపు తిరగగానే ‘చదువు కోవాలనుంటే నాతో పట్నం రారా. బళ్లో చేర్పిస్తాను’ కలకండ పలుకుల్లా తీయని మాస్టారి పలుకులు అతడి భవిష్యత్తును మార్చేస్తాయి. కానీ అయ్య ఒప్పుకోడు. తండ్రి పడిన బాకీ తీర్చాలంటే తనకు దివాణంలో చిన్న పాలేరు పని తప్పదు. అదేమాట మాస్టారికి చెప్పాడు. ‘నీ ఇష్టం. నాకు వాల్తేరు కాలేజీలో ఉద్యోగం వచ్చింది. రేపు మధ్యాహ్నం బండిలో వెళ్లిపోతున్నాను. వీలైతే బండెక్కు’ అని సమాధానం కోసం ఎదురు చూడకుండా సైకిలెక్కి కాశీబుగ్గవైపు సాగిపోయాడు. ఆ రోజు కట్టకింద మోస్తున్న పశువుల్ని అలాగే వదిలేసి, ఎవరికీ చెప్పకుండా బండెక్కాడు కన్నదాసు. వాల్తేరులో ఎఫ్ఏ వరకూ, రాయవెల్లూరులో వైద్యం, లండన్‌లో ఎఫ్ఆర్సీఎస్ చేసి గత ఐదేళ్లుగా మద్రాస్ రైల్వే హాస్పిటల్లో సర్జన్‌గా ఎంతో పేరు గడించాడు. పలాస స్టేషన్లో బండి దిగాడు డాక్టర్ దాస్. ఐదు మైళ్ల బండిబాటలో ఒంటెద్దు బండి ముసలయ్య నోట ఊళ్లో విషయాలు కొన్ని తెలిశాయి. గూడెంలో తల్లిదండ్రులని, సొంత వాళ్లని చూడాలని అతడి మనసు తొందర పెట్టసాగింది. గూడేనికి పోవాలంటే ఊరి మెరకదార్లోనే పోవాలి. ఊరి మొదల్లో బండి దిగి నడిపించసాగాడు ముసలయ్య. నాయుడుగారి దివాణం ముందు పోతూ ఉంటే ‘ఎవర్రా.. బండిలో?’ అనే కేకేశాడు నాయుడు. ముసలయ్య తడబడుతూ ‘మ మ్ మ్ మాలోళ్ల సంగడి కొడుకయ్యా! పట్నంలో డాకటేరు’ అన్నాడు. ‘హుమ్.. మధ్యాహ్నం జీడితోటకెళ్లాలి. బండి ఇక్కడే ఉంచి వాడ్ని నడిచిపొమ్మను’ అని ‘కాస్త అక్షరాలు వస్తే చాలు. ఈ నాయాళ్ల కళ్లు నెత్తికెక్కుతాయ్’ అని పైకి వినిపించేలా అంటూ లోపలికెళ్లాడు నాయుడు. దీనంగా అర్థించే ముసలాడి మొహం చూసి, రెండు నాణాలు వాడి చేతిలో పెట్టి, బ్యాగ్ భుజాన్నేసుకొని మౌనంగా గూడెం వైపు నడిచిపోయాడు డాక్టర్ ఎం.కెదాస్- ఎం.డి ఎఫ్ఆర్సీఎస్. గూడెం ఏమీ మారలేదు. గుడిసెల మీద కాంగ్రెస్, కమ్యూనిస్ట్ జెండాలు చూస్తూ బురదలో కాలేశాడు దాస్. మిలమిలా మెరిసే అంబాసిడర్ బూటు బురదలో కూరుకుపోయింది. వాటిని అక్కడే విడిచి ఉత్తికాళ్లతో ఇల్లుచేరాడు. పాతికేళ్ల తరువాత అంత పెద్దోడై తిరిగొచ్చిన సంగడి కొడుకుని చూసి గూడెంలో సంబరం అంతింత కాదు. పాటలు పాడారు. ఆటలు ఆడారు. దాసు ఇచ్చిన పది రూపాయలతో ఆ సాయంత్రం అమ్మోరికి వేట తెగింది. ఇంట్లో డైనింగ్ టేబుల్, పింగాణీ ప్లేట్లకి అలవాటు పడ్డ దాసుకి మట్టి కంచంలో సంకటికూరలు రుచించలేదు. ఎట్టాగూ ఎక్కూవ బ్యామ్మర్లు మాకంటె ఎట్టాగూ ఎక్కూవ ఏదైనా మాకంటె!! అందారు పుట్టిరి హిందమ్మ తల్లీకి అందారు ఒక్కటై ఉందారి సక్కంగ!! అంటూ యువకులూ పిల్లలూ పాడిన ‘మాలోండ్ర పాట’తో తాను కూడా గొంతు కలిపాడు. తనవాళ్ల కోసం ఏదో చేయాలనే తహతహ! సేవా సంస్థల ద్వారా ఆర్థిక సహాయం చెయ్యొచ్చు. కానీ అవి సక్రమంగా ఉపయోగపడతాయనే నమ్మకం లేదు. ఏదైనా హాస్పిటలో, స్కూలో కట్టించి దగ్గరుండి చూసుకుంటేనే ఏదైనా ప్రయోజనం. కానీ పట్నంలో ఉద్యోగం, హోదా, సంపాదన వదిలి రావడం సాధ్యమా? అందుకు తన భార్యాబిడ్డలు సహకరిస్తారా? అలాగే ఆలోచిస్తూ తమ్ముడు తనకై ప్రత్యేకంగా తెప్పించిన నులక మంచంపై బ్యాగ్ తలగడగా పెట్టుకొని చుక్కలవంక చూస్తూ పడుకున్నాడు. ఎంత ప్రయత్నించినా నిద్రపట్టలేదు. మురుగు కంపు, కుక్కల గోల, ముసిరే దోమలు! గొంగళి కప్పుకుంటే ఉక్కపోత. రాత్రంతా ఎటూ తెమలని ఆలోచనలు. ఏమేమో చేద్దామనే తపన. సాధ్యమా కాదా అనే సందేహం. తెల్లవారకముందే లేచి చొక్కా తొడుక్కొని మొహం కడుక్కునేందుకు బావి వద్దకు చేరాడు. సేవా సమాజం హరిజనులకై ‘ప్రత్యేకంగా’ తవ్వించిన ఆ బావి ఎప్పుడో పూడిపోయింది. వీధి మధ్య తొట్టిలో నీళ్లు రేకుడొక్కులో పట్టుకొని కాలకృత్యాలకై రైలుకట్ట చేరుకున్నాడు దాస్. రైలుకట్ట మీద మద్రాస్ మెయిల్ ఆగింది. రెడ్ సిగ్నల్! ఆలోచనలతో ప్రమేయం లేకుండా అతడి కాళ్లు అటువైపు ఈడ్చుకెళ్లాయి. రేకుడొక్కు విసిరేసి బండెక్కేశాడు డాక్టర్ దాస్. - సాయి పాపినేని ఫోన్: +91 9845034442 -
బిళ్ల బంట్రోతు
యంగ్మెన్స్ లిటరరీ అసోసియేషన్ :: గుంటూరు- ఏప్రిల్ 1911 ‘ఏమోయ్. ఇవాళ సాయంత్రం వచ్చేటప్పటికి బాగా ఆలస్యమౌతుంది. వెంకన్నకి చెప్పి మిద్దె మీద నాలుగు పక్కలేయించు. బందరు నుంచి కుర్రాళ్లొస్తున్నారు. వినిపించిందా?’ కోటు జేబులో బక్రాం కాలరు తురుముకుంటూ కేకేశాడు వకీలు రాజారావు. ‘భోజనాలకి వస్తారుగా? ఎంతమందేమిటి?’ అడిగింది అర్థాంగి. ‘లేదు లేదు. భోజనాలు నారాయణ్‌రావ్ గారింట్లో. కాస్త తమలపాకులూ మంచినీళ్లూ పైన పెట్టించు. చాలు’ బల్ల మీదున్న దేశాభిమాని పత్రిక చంకలో పెట్టుకుని ‘ఒరే కాసీం. ముందు క్లబ్బుకి పోనీయ్’ అంటూ వాకిట్లో నిలిచి ఉన్న గూడు జట్కాబండిలో కూర్చున్నాడు. రైల్వేగేటు దాటాక ఏసీ కాలేజీ కాంపౌండు వద్ద బండాపగానే కత్తెర మార్కు సిగరెట్ల టిన్నుతో పరిగెత్తుకొచ్చాడు కిళ్లీకొట్టు రంగయ్య. జేబులోంచి అణాబిళ్ళ తీసిస్తూ ‘ఏంటి విశేషాలు.. రంగయ్యా’ అని పలకరించాడు రాజారావు. ‘తమరికి చెప్పాను గాదయ్యా? మా కోటిగాడికి బంట్రోతు ఉద్యోగం’ తల గోక్కుంటూ నాన్చాడు. ‘అవునవును. ఇవాళ జడ్జిగారిని కలిసి గుర్తు చేస్తాను. అయినా వాడికేం తక్కువ? ఫస్టుఫార్మ్ వరకూ చదివాడు. కోర్టులో అందరికీ తలలో నాలుక. నారాయణరావుగారే వాడిని సిఫారసు చేశారు’ ‘అంతా మీ దయ. ఈ ఏడాది వాడికి పెళ్లి కూడా చేద్దామని’ ‘నీవు నిశ్చింతగా ఉండు. వాడికి ఉద్యోగం వచ్చిందే అనుకో’ అని హామీ ఇచ్చి ముందుకు సాగాడు రాజారావ్. రీడింగ్ రూమ్ ముందు బండాపగానే ఎదురొచ్చాడు శేషగిరి. ‘నిన్నటి హిందూ పేపరు చూశారా?’ అన్నాడు.‘అప్పుడే ఎక్కడ? మద్రాస్ మెయిల్ రావాలి. మనవాడు బెజవాడ నుంచి తేవాలి. మూడ్రోజుల క్రితం పేపరు ఇవాళ వేశాడు. అయినా ఏంటో విశేషం?’ ‘ఆహ్... ఏముంది? ఈ అరవాళ్ల పొగరు బాగా బలిసిపోయింది. మనవాళ్లు వెనకబడ్డ జాతట. మనకి బుర్రలేదట. తెలుగుగడ్డ మీద ఒక్క ప్రముఖుడూ పుట్టలేదట’ ‘నిజమే కదా? మనవాళ్లకి ఒక్క జిల్లా కలెక్టర్ లేడు. జిల్లా జడ్జి లేడు. రోజూ ఎవడో ఒక అరవాడికి ‘మిలార్డ్’ అంటూ సలాం కొట్టాలి’ అని సిగరెట్టు వెలిగించి పేముకుర్చీలో కూర్చుంటూ ‘ఇంతకీ కోర్టుకి వస్తున్నారా లేదా?’ అన్నాడు. ‘ఆ ఉంది లేండి ఒక పనికిమాలిన కేసు. తక్కెళ్లపాడు పార్టీ. తోడికోడళ్ల తగువుకి వాజ్యం తెచ్చి బంగారంలాంటి పొలాలు బీడు పెట్టారు. వాయిదా అడగమని గుమాస్తాకి చెప్పాను. నాలుగు వాయిదాలు పడితేగానీ దిమ్మ తిరిగి బేరానికి రారు. అయిన ఇవాళ ఈ అరవవాళ్ల సంగతేదో చూడాలి. ఇక్కడే గజిట్ పుస్తకాలు బయటికి తీసి మన మద్రాసు రాష్ట్రంలో మనవాళ్లెన్ని ఉద్యోగాల్లో ఉన్నారో అరవాళ్లు ఎన్నిట్లో ఉన్నారో కూపీ లాగాలి. ఇంతకు ముందే చలపతిరావుగారు దేశాభిమాని పత్రికకి ఏదైనా రాయమని అడిగారు’ ‘ఎందుకండీ కొరివితో తలగోక్కోవడం? రేపు కోర్టులో మళ్లీ అరవ జడ్జీ ముందే నిల్చోవాలి. సరేలేండి... సాయంత్రం బందరు కుర్రాళ్లు కొందరు వస్తున్నారు. వాళ్లలో రామస్వామని కమ్మవాడు. చాకులంటి కుర్రాడు. మంచి కవి. నారాయణరావ్ గారింట్లో భోజనాలు. మీరూ వస్తే బాగుంటుంది’ ‘తప్పకుండా. వారు కూడా కబురంపారు’ క్లబ్బు లోపలికి చూస్తూ ‘ఒరే సాంబయ్యా. ఇడ్డెన్లు వచ్చాయా’ అని కేకేసి, బల్ల మీది హిందూ పేపర్ రాజారావ్ చేతికందించాడు. సాంబయ్య తెచ్చిన ఇడ్లీలని నేతిలో ముంచి కరేపాకు పొడి అద్దుకుని ‘ఇంట్లో ఎన్ని పలహారాలున్నా ఈ మణీహోటల్ ఇడ్లీ తినందే రోజు గడవదు. ఏమంటారు?’ అన్నాడు రాజారావ్. ‘అంతేమరి. హోటలు కూడు కూడా ఈ అరవ్వాళ్లు పెడితేనే మనకి’ అంటూ పొట్లాం అందుకన్నాడు శేషగిరి. ‘ఇంతకీ సబ్‌కోర్టులో బంట్రోతు ఉద్యోగం విషమేమయిందో తెలిసిందా?’ ‘ఆహ్. అదేముంది మన కోటిగాడి విషయం మీరందరూ సిఫారసు చేశారుగా. నిన్న బెంచిక్లర్కు వరదరాజాన్ని అడిగాను. పన్నెండు దరఖాస్తులు వచ్చాయట. మనవాడికి ఉన్న అర్హతలు ఎవరికీ లేవు. ఖాయంగా వాడికే అని చెప్పాడు. అదే నేను కూడా వాడికి చెప్పాను’ అన్నాడు శేషగిరి. ముందు రోజు రాత్రి కొరిటెపాడు గుడి దగ్గర నాలుగు వేటలు తెగాయి. కోటయ్యకి దఫేదారు ఉద్యోగం ఖాయమయిందని ఊరంతా పండగ చేసుకున్నారు. తెనాలి నాటక సమాజానికి పాతిక రూపాయలు పోసి ‘కురుక్షేత్రం’ నాటకం కూడా ఆడించాడు కోటయ్య. రాత్రి తాగిన మత్తులోంచి తేరుకునేటప్పటికి ఎండ చుర్రని కాల్తోంది. మొగం కాళ్లు కడుక్కుని హడావుడిగా కోర్టుకి పరుగెత్తాడు.బార్ అసోసియేషన్ రూమ్ బయట వకీళ్లంతా రుసరుసలాడుతూ వాదులాడుకుంటున్నారు. కోటయ్యని చూడగానే మొహాలు చాటేసి అక్కడ నుండి తప్పుకున్నారు. మెల్లగా ద్వారం దగ్గరకెళ్లి చేతులు కట్టుకు నిల్చున్నాడు కోటయ్య. వకాలత్ కాగితాల్లో తల ముంచి కూర్చున్న రాజారావ్ సిగరెట్టు పీక మూలకి విసిరి గదిలోంచి బయటికి వస్తూ ‘పర్లేదు లేరా. ఇప్పుడు కాకపోతే పోయింది. ఈసారి తప్పకుండా చూద్దాం’ అని సమాధానం కోసం ఎదురుచూడకుండా కోర్టుహాల్లోకి వెళ్లిపోయాడు. కోటయ్య గుండె జారిపోయింది. ఉద్యోగమొచ్చిందని బడాయిగా ఊరందరికీ పండగ చేశాడు. రాలేదంటే ఊళ్లో తలకొట్టేసినట్టే.పరిగెత్తుకుంటూ చెట్టు కింద ఉన్న శేషగిరి వద్దకి వెళ్లాడు. అతడి ముఖంలో మారిన రంగులు విషయం చెప్పకుండానే తేటతెల్లం చేశాయి. చెట్టు కిందే ఉన్న పళంగా కుప్పకూలిపోయాడు. ఆ రాత్రి విందులో చర్చంతా తమిళుల గురించే.‘చివరికి బిళ్ల బంట్రోతు ఉద్యోగానికి కూడా మన తెలుగవాళ్లకి దిక్కులేదు. ఆఖరి నిమిషంలో ఎక్కడో కుంభకోణం నుండి తెప్పించిన దరఖాస్తును చూపించి, వాడెవడికో ఉద్యోగమిస్తూ ఉత్తర్వులు జారీ చేశాడా అరవ సబ్‌జడ్జి. చూస్తే వాడికి ఓ అంటే నా రాదు. తెలుగు మాట్లాడటం కూడా రాదట’ శేషగిరి మధ్యాహ్నమంతా కూర్చుని మద్రాసు రాష్ట్రంలో ప్రభుత్వోద్యోగుల పట్టిక తయారు చేశాడు. ‘సగానికి పైగా జనాభా ఉన్న తెలుగు వాళ్లకి కనీసం పది శాతం ఉద్యోగాలు కూడా లేవు. జడ్జీలే కాదు, రెవెన్యూ, విద్య, సరే, ఏ డిపార్ట్మెంట్ చూసినా అరవవాళ్లే, ఛీ’ ‘చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా గతమెంతో ఘనకీర్తి కలవోడా’ విందులో బందరు కుర్రాడు రామస్వామి పాడిన పాట కూడా ఎవరినీ ఉత్తేజ పర్చలేకపోయింది. మర్నాడు కోర్టు దగ్గర గూడుబండి దిగంగానే చెట్టు కింద గుమికూడిన జనాన్ని చూశాడు రాజారావ్. గబగబా నల్లకోట్లని అడ్డు తొలగించుకుంటూ ముందుకెళ్లాడు. చెట్టుకి వేలాడుతున్న కోటిగాడి శవం. అదే క్షణంలో నిర్ణయించుకున్నాడు. ‘ఏది యేమైనా సరే ఈ అరవాళ్ల జాడ్యం వదలాలంటే తెలుగువాళ్ల ప్రత్యేక రాష్ట్రమే మందు. అది సాధించే వరకూ నిద్ర పోకూడదు’ అతడి మనసులోని భావం చుట్టూ ఉన్నవారందరి ముఖాల్లో ప్రతిబింబించింది. - సాయి పాపినేని ఫోన్: +91 9845034442 -
ఒంగోలు గిత్త
గుండ్లకమ్మ... దేవరంపాడు చెక్‌డ్యామ్ క్రీ.శ.1878 శ్రీరాములునాయుడు ఒంగోలు పక్కన మామిడిపాలెం మునసబు. చెన్నపట్నం నుంచి ఒంగోలు స్టేషన్ దాకా రైలుబండి నడుస్తుంది. ఉత్తరాన పదిమైళ్ల దూరంలో గుండ్లకమ్మపై రైలువంతెన నిర్మాణం జరుగుతోంది. అది పూర్తయితే ఒక్క రోజులో పొగబండి మీద బెజవాడకి పోవచ్చు. విన్సెంట్ పుణ్యమా అని ఎడ్లబండిలో కాకుండా రైలుపట్టాల మీద ట్రాలీలో రావడం వల్ల పని చూసుకొని సాయంత్రానికి ఇల్లు చేరొచ్చు. ‘అయ్యగారూ... చీకటి పడేలోగా ఒంగోలు పోవాల. ట్రాలీ నాలుగింటికల్లా బయలు దేరకపోతే మా స్టేషన్ మాస్టర్ ఊరుకోడు’ అన్నాడు విన్సెంట్. ‘సరేలేరా. రాముడిని చూసుకొని అట్లాగే వచ్చేస్తా’ అని కేకేసి రంగయ్య వైపు నడవసాగాడు. ‘అదేందయ్యా? రేపు జాతరకి ఉండట్లా’ అడిగాడు వెనకగా నడుస్తున్న పాలేరు కోటిగాడు. ‘లేదురా. రాత్రికి ఇంటికి పోవాల. నువ్వుగూడా పద’ ‘అయ్యా. నీవు కూకలేయనంటే ఒక మాట’ తుండు విదిలించి తల గోక్కుంటూ నసిగాడు. చెప్పకుండానే కారణం గ్రహించాడు నాయుడు. ‘ఏందిరా. మతంగానీ మార్చుకుంటున్నావా’ తలూపాడు కోటిగాడు. దూరం నుండే చేయూపి ఎదురొచ్చాడు పాస్టర్ రంగయ్య. అతడు నాయుడికి మేనమామ కొడుకు. నెల్లూరు చర్చీబళ్లలో అప్ఫోర్తు చదివాడు. పదేళ్ల క్రితం జ్యూయెట్ అమ్మ మతమిచ్చింది. ప్యాంటూ చొక్కాతో అచ్చం దొరల్లే ఉన్నాడు. గత ఆరేళ్లుగా దేశాన్ని కరువు రక్కసి పీడిస్తోంది. బాధితులని ఆదుకునేందుకు పనికి ఆహార పథకం కింది క్లోవ్ దొరకి సర్కారు కాలవ కాంట్రాక్టు వచ్చింది. ఆ పనంతా రంగయ్య మీదే. ‘ఏంది ఇలా వచ్చావ్ బావా? రాముడిని చూట్టానికా లేకపోతే...నా మాట విని మతంగానీ పుచ్చుకుంటున్నావేంది?’ అడిగాడు రంగయ్య. ‘నా సంగతి సరేగానీ రేపు ఏంది హడావుడి?’ ‘పద ఆ పక్కకి పోయి మాట్లాడుదాం’ అని వేపచెట్టు కిందున్న గుడారంలోకి దారి తీసాడు రంగయ్య. బల్ల, రెండు కుర్చీలు, విశ్రాంతికి మడతమంచం. బల్ల మీద రెమింగ్టన్ టైప్మిషను. కాగితాల దొంతర. అది క్లోవ్ దొర ఆఫీసు. నిలువు గుంజకి తగిలించిన శిలువా, ఈతచాప, ఆయన ప్రార్థనా మందిరం. గత ఐదేళ్లుగా బాధితుల మధ్యనే క్లోవ్‌దొర జీవనం. చలువకుండలో మంచినీళ్లు ఎత్తి నోట్లో పోసుకుంటూ కావాలా అని సైగ చేశాడు రంగయ్య. దాంతో నాలుక పిడచ కట్టుకుపోతున్నా ‘వద్దులే’ అన్నాడు నాయుడు. ‘నీవేమీ మారలేదు బావా. పరవాలేదులే ఇవి నా కోసం ఏటి నుండి తెప్పించినవే’ అని నీళ్లందించాడు రంగయ్య. చెంబు అందుకుని తాగకుండా పక్కన పెట్టాడు. ‘ఏముంది. ఆరేళ్లు గడిచినా కరువు తీరే ఆశ లేదు. ఇప్పుడు కాలవ పనిలో ఆరువేలకి పైచిలుకే ఉన్నారు. నిన్నటికి నిన్న పాతికమంది పడమటోళ్లు దిగారు. బొత్తిగా ఎముకల గూళ్లు. కాలవ పనా... పూర్తిగావచ్చింది. సర్కారు సహాయం కూడా ఇక రాదు. ఆయినా అదెంత. మనిషికి పౌను ధాన్యం, అణా బత్యం. అదీ మగాళ్లకే. ఆడాళ్లకీ పిల్లలకీ అర్ధణా మాత్రమే. పిల్లా మేకా తిండానికి ఏంది? అమెరికాలో క్రైస్తవులని దేహీ అని వాళ్లిచ్చిన చందాలతో నెట్టుకొస్తున్నాం. ఇప్పుడు సర్కారు కాంట్రాక్టు లేకపోతే వీళ్లకి గంజికి కూడా దిక్కుండదు’ వింటున్న నాయుడి కళ్లలో నీళ్లు తిరిగాయి. ‘మరెలారా’ బొంగురుపోయిన గొంతుతో అడిగాడు. ‘మన క్లోవ్‌దొర సంఘం పేరు అమెరికన్ బాప్టిస్ట్ మిషన్. నీకు తెలుసుగా? అమెరికాకి ఫొటోలూ పాంప్లెట్లూ ఎన్ని పంపించినా మన బాధలు వాళ్లకెలా పట్టేట్టు? మత ప్రచారం అంటే అక్కడి దొరలకికాస్తా ఆసక్తి. కానీ ఒకటీ అరాతో లాభం లేదు. ఏదైనా బ్రహ్మాండమైన పని చేస్తేగానీ అక్కడ పత్రికలలో రాయరు. అలాగైతేనే ఒంగోలు మిషన్కి చందాలు తెచ్చుకోవడానికి వీలవుతుంది అని క్లోవ్‌దొర వాదం’ ‘బ్రహ్మాండమా.. అంటే’ ‘ఏమీ లేదు. మద్రాస్ నుండి అమెరికా పత్రికల వాళ్లు వస్తున్నారు. వారి ముందు సామూహికంగా రెండు వేల మందికి గుండ్లకమ్మలో దివ్యస్నానం ఇచ్చి మతం మారిస్తే ఇక చూస్కో. అమెరికాలో ఒంగోలు మిషన్ పేరు దద్దరిల్లుద్ది. దాంతో పదివేల మందికి మరో పదేళ్లు అన్నం పెట్టొచ్చు. సర్కారు కాంట్రాక్టు లేకపోయినా ఒంగోలులో ఆసుపత్రి, చర్చీ, స్కూలు కట్టించి జనాలకి పని కల్పించవచ్చు. ఏమంటావ్ బావా’ ‘ఆహ్’ అని బిత్తరపోయి చెంబులో నీళ్లు గడగడా తాగేశాడు నాయుడు. ఏటి ఒడ్డున డచ్చి ఫారం. ‘రాముడికి చూసి చాలా దినాలయింది. నన్ను చూడందే వాడు పచ్చిగడ్డయినా ముట్టేవాడు కాదు. ఎలా ఉన్నాడో? వెంట తీసుకుపోదామంటే ఊళ్లో పాటిదబ్బల మీద కూడా గడ్డి మొదలవడం లేదు’ అన్నాడు శ్రీరాములు నాయుడు. ‘కర్మయ్యా. కానీ ఈడ పర్లేదయ్యా. ఆవుల దొర మనోడిని కన్నబిడ్డల్లే చూసుకుంటుండాడు’ ‘అవున్రా. ఆ దొరే లేకుంటే ఊళ్లలో ఈ మాత్రం పాడి కూడా మిగిలేది గాదు’ ‘అయ్యా! మరోమాట. రంగయ్యన్న చెబుతా... అదేదో నెట్టల (సౌతాఫ్రికాలో న్యేటల్) దేశమంట. నెలకి పది రూపాయల జీతమంట. ఎటు చూసినా నీళ్లు, చెరుకు తోటలంట. చెన్నపట్నంలో ఓడెక్కితే ఇక అంతా వాళ్లే చూసుకుంటారంట. నేనూ నా ఆడదీ’.. ఒక క్షణం తటపటాయించి ‘అయ్యా నీ అనుమతి అయితేనే’ అని దీనంగా ముఖం పెట్టాడు. ‘ఆరినీ... నీవట్లా దేశాలు పట్టి పోతే ఇంట్లో నీ ముసిలాళ్లకి ఎవరు చూస్తార్రా’ గదిమాడు. ‘దానికి ముందస్తుగానే మణిషికి ముప్పై రూపాయలు ఈడనే ఇస్తారంటయ్యా. ముసలోళ్లకెంతయ్యా? రోజుకి అర్దణా కర్సు. నాలుగేళ్లు తిండికి ఇబ్బంది లేదు. కావస్తే ఒక పది రూపాయలు పారేసి రెండెకరాలు కొనుక్కొని యవసాయం చేయొచ్చు’ ‘హూ... ముప్పై రూపాయలు. ఇద్దరికి అరవై. అంటే దాదాపు వెయ్యి అణాలు. నాలుగైదేళ్లు తిండికి ఢోకాలేదు. అన్నాళ్లు బతికుంటే సేద్యమే చేస్తారులే’ వేళ్లపై గుణించుకుంటూ ముందుకు సాగాడు. ఫారం ఇంకా ఫర్లాంగ్ దూరంలో ఉండగానే యజమానిని ఎలా పసిగట్టాడో కంచె దూకి ఉరుకుతూ ఎదురొచ్చాడు రాముడు. మూపురం వద్దకు ఎనిమిదడుగుల ఎత్తు, మచ్చలేని తెల్లని ఒంగోలు గిత్త. రాముడి మెడపై ముఖం ఆనించిన శ్రీరాములు నాయుడికి కళ్లలో నీళ్లూరాయి. రాముడి ఉరుకు చూసి వెంటబడి పరిగెత్తుకు వచ్చాడు పశువుల డాక్టరు వోన్‌ట్రోప్ దొర. అతడి వెనుకనే ఫాదర్ క్లోవ్. ‘నాయుడు గారూ. మన్చీ టైమ్‌కి వచ్చినారూ. రేపు పేద్ద పండగ వున్దీ. పెద్దలూ మీరూ ఉండావలె’ అన్నాడు ఫాదర్ క్లోవ్. ‘అవును. రంగయ్య చెప్పాడు. మీరు చేస్తున్న పనికి మేమూ మా ఊరూ ఎప్పుడూ ఋణపడి ఉంటాం. కానీ నాకు వెళ్లక తప్పదు’ రాముడి గంగడోలు నిమురుతూ అన్నాడు. ‘సరే యువర్ విష్. మీకూ ఒక్క విషయమూ చెప్పావలె. డాక్టర్ వోన్‌ట్రోప్ వచ్చే నెల రోటర్‌డ్యాం పోతూనారు. ఇక్డ నున్చి కొన్ని మంచి స్పెసిమెన్స్ వాల్లతో తీస్కుపోతారు. మీ రామ్‌డూ మంచీ సీడ్బుల్. వాల్లతో తీస్కుపోతాన్కి మీ పర్మిషన్ కోరినారు. బట్ రామ్‌డూ మీకూ కొడుకూ లాన్టీవాడు. అన్దూకే నో అని చెప్పాను’ అన్నాడు ఫాదర్ క్లోవ్. ట్రాలీలో బెంచీ మీద కూర్చున్న నాయుడికి దుఃఖం ఆగడం లేదు. రైలు పట్టాలపై పరిగెత్తుతూ ట్రాలీని తోసి గెంతి పక్కన చేరాడు విన్సెంట్. ‘ఊరుకోండి అయ్యగారూ... ఇంకెన్నాళ్లు? ఈ యేడు కాస్త వానలు కురిస్తే రాముడిని ఇంటికి తీసుకురావచ్చు’ అన్నాడు సముదాయింపుగా. ‘ఇంకెక్కడి రాముడురా... వెంకడూ. వంద రూపాయలకి నా కొడుకుని అమ్ముకున్నాన్రా’ అంటూ కండువాలో ముఖం దాచుకున్నాడు శ్రీరాములు నాయుడు. - సాయి పాపినేని ఫోన్: +91 9845034442 -
నెమిలిడేగ
తుల్యభాగ ఒడ్డున పోలమ్మపుట్ట క్రీ.శ. 1757 తూ.గో.జిల్లా, రాయవరం ‘రారా కోడిబా.. పాపారాయుడరా...’ గిర్రున తిరుగుతూ నెమలిడేగని నదిలోకి విసిరేసాడు సూరన్న. నల్లని మెడ రిక్కించి, బంగారు రంగులో నిగనిగలాడే రెక్కలు బారజాచి క్షణాల్లో ఈదుతూ ఒడ్డు చేరిన పాపారాయుడిని చంకలోకెత్తుకొని పొట్ట నిమురుతూ ‘ఇంకాస్త కొవ్వు కరగాల్రా పాపాయ్’ అంటూ మరోసారి నీళ్ళలోకి విసిరాడు. కనుమరోజు పెద్దాపురంలో పందెం. సూరన్న ప్రత్యేకంగా పెంచే నెమలిడేగలంటే గోదావరి సీమలో తిరుగులేదు. ‘మనోడిని కొట్టే పుంజు సర్కారులోనే లేదు సూరయ్యా. కడియం పెట్టి పెద్దాపురం నుంచి మనోడిని ఊరేగించుకొస్తుంటే మండపేటోళ్ళ గుండెల్లో మండాల, బీమారపోళ్ళు బిక్కసావు సావాల. పోలమ్మ గుళ్లో ఏట బలిస్తానని మొక్కుకున్నా’ మెత్తటి తుండుగుడ్డతో పాపారాయుడిని తుడుస్తూ మీసం తిప్పాడు పాలేరు భీముడు. గెలిచిన పుంజుకి బంగారు కడియం, ఐదొందల రూపాయల బహుమానం ప్రకటించాడు పెద్దాపురం జగదేవరాజా. ‘ఏమోరా. పరాసు (ఫ్రెంచ్) కోళ్ళతో పోటీ!’ ‘పరాసులా? ఆడమ్మబాబులా? మనోడెవడు? తాండ్రపాపడు! పిఠాపురం అల్లుడూ! బొబ్బిలిపులి!’ పొడిబట్ట చుట్టి పాపారాయుడిని సూరన్న చేతికందించాడు. ధనుర్మాసం. ఇంటికెళ్లే దారిలో రంగవల్లులు తీర్చి గొబ్బిసుద్దులు పాడుతూ సూరన్నపై వాలుకళ్లతో వయ్యారా లొలక బోసే పడుచుపిల్లలు. ‘ఏం బావా. ఈసారి పాపాయికి బంగారు కడియమటగా? నాకేమిస్తావ్?’ ఎదురొచ్చింది కమలం, సూరన్న మేనత్త కూతురు. ‘కడియమెందుకే. ఒక ముదిస్తే వడ్డాణమే చేయిస్తా’ అని మరదలిని ఆటపట్టించాడు. ‘ముద్దిస్తే వడ్డాణమంటే ఇక్కడ మేమంతా లేమూ?’ రెండుచేతులూ పెకైత్తి హరిదాసు కుండలో చాటెడు బియ్యం పోస్తూ అడిగింది అతడి మేనమామ చిన్న భార్య కనకం. ‘నీ వారానికి వడ్డాణం చాలదత్తా, పలుపుతాడు కావాలి’ అని ఎగతాళిచేస్తూ ముందుకి సాగాడు. మలుపు తిరగంగానే ‘సూరన్నా.. మనవూరి పౌరుషం నిలిపే నెమిలిడేగ.. మన పాపారాయుడు’ అంటూ ఆటవెలదిలో పద్యమందుకున్నాడు గుడిచెట్టు కింద కాపుకాసిన స్తోత్రాల బాపనయ్య. చలుక భీముని సరిపాటి పౌరుసమును పల్లనాటి బెమ్మ పోరు పటిమ బలిజ సూర్యనింట బుట్టిన మా ఊరి మగటిమిగల పుంజు పాపరేడు తన కోడిపుంజుని మెచ్చుకుంటే చాలు సూరన్నకి ఒళ్ళూపైనా తెలీదు. రూపాయకాసు వాని దోసిట్లో పడేసి పాపారాయుడి గడ్డం దువ్వుతూ ఇంటికి చేరాడు. ‘ఒరే తమ్ముడూ. ఇవ్వాళ కోటిపల్లి రేవుకెళ్ళాలి. నీ బావగారు వస్తున్నారు గుర్తుందిగా?’ కాళ్ళకి నీళ్ళతో ఎదురొచ్చింది అతడి పెద్దక్క సామ్రాజ్యం. ‘సరే అన్నం పెట్టు. బండి రాగానే బయలుదేరుతా’ అంటూ పెరట్లో మామిడిచెట్టుకి కట్టిన లగ్గం పాపయ్యకి తగిలించాడు. ‘ఈసారి మీ పొలంలో బంగారం పండింది నాయుడూ అక్కుళ్ళు ఎకరానికి పదిహేను మూటలన్నా ఉంటుంది’ అన్నాడు సరాఫు సాంబిరెడ్డి. నైజాం సర్కారు గుత్తేదార్లకి అతడి లెక్కంటే లెక్కే. ‘కలవసం తీసేస్తే నూటముప్పై బస్తాలు. గుడికి, కొత్వాలుకి, తాసిల్దారుకి, గుత్తానికి పోగా వంద బస్తాలు. ఊర్లో కొలుపులకి పది. ఇక మిగిలినదాన్లో జమీందారి పన్ను యాభై బస్తాలు. ఫిర్కాలో పన్ను వసూలంతా రాదారి నావ కెక్కించి రాజమండ్రి పంపమని రాజావారి పురమానం.’ వింటున్న రామస్వామి గుండెలు గుభేలుమన్నాయి. ‘అదేంటి సాంబయ్యా? నూటికి నలభైయేగా పన్ను?’ అంటూ నిలుచుని చోద్యం చూస్తున్న కరణం వంక చూశాడు. ‘ఏం చేస్తాం నాయుడూ. మన ఖర్మ. సర్కారు భూముల్ని పరాసులకి దత్తం చేశాక ఆ బూచిదొర పన్నులు అరవైకి పెంచాడు. దానికి మన్నే సుల్తాన్ విజీనారం రాజావారి మద్దతు’ అన్నాడు కరణం పేర్రాజు. ‘చిన్నదాని పెళ్ళి మాఘమాసంలో పెట్టుకున్నాం. పండిందంతా ఈ పరాసులు దోచుకుంటే ఇక రైతులు పండించేమి లాభం?’ తలుచుకున్న కొద్దీ గుండె మండిపోతుంది. నూటయాభై పండిస్తే మిగిలేది ముప్పై మూటలా? ఐదొందలు కూడా రాలదు. ‘ఇది అన్యాయం కరణంగారూ, మిగతా రైతులకి తెలుసా?’ ‘మీదే మొదటి బందోబస్తు. రాజావారిని అడిగేందుకు ఆయన పెద్దాపురంలో లేరు. బొబ్బిలి రాయలు పన్ను కట్టేందుకు నిరాకరించారట! రాజావారు ఎటూ తేల్చుకోలేకుండా ఉన్నారని జోగినాథం పంతులు చెప్పగా విన్నాను’. ‘రేపు కనుమ సంబరాలకి పెద్దాపురం వస్తారుగా? అప్పుడు మనమంతా కట్టుగా వెళ్ళి రాజావారి కాళ్లపై బడితే?’ ‘ఆ దారీ లేదు. పెద్దాపురంలో ఐదొందల మందితో పరాసు దళం నిలబెట్టాడు బూచి. బొబ్బిలి విషయం తేలేదాకా మనకీ తిప్పలు తప్పవు. మన కర్మయింతే చేయగలిగింది లేదు.’ కాళ్ళలో సత్తువపోయి అలాగే కూలబడిపోయాడు రామస్వామి బావగారితోని ఇల్లు చేరేసరికి ఇల్లంతా స్తబ్దుగా ఉంది. వస్తూనే పాపారాయుడి వద్దకి ఉరికాడు సూరన్న. ‘ఏమయ్యింది అత్తయ్యా?’ గుడ్ల నీరుకుక్కుకుంటూ నీళ్ళందించిన అత్తగారిని అడిగాడు ప్రకాశం. రాజానగరం కొత్వాలీలో గుమస్తా, రామస్వామికి మేనల్లుడు. మేనమామ వద్ద విషయం తెలుసుకున్నాడు. ‘ఇది మనకు కాదు మామయ్యా. దేశానికే పట్టిన పీడ. బసాలత్ జంగు పుణ్యాన పరాసుల పాలబడ్డాం. కొన్నాళ్ళు ఓపికబట్టాలి. బొబ్బిలి మీదకి విజయరామరాజు దండు వెడలింది కదా. అటు వాడికీ, ఇటు ఈ పరాసు రాక్షసులకీ బుద్ధిచెప్పగలవాడు ఒక్కడే. తాండ్రపాపయ్య. రేపు కనుమ పండగకి పెద్దాపురం వెళితే విషయం తెలుస్తుంది. చిన్నమ్మ పెళ్ళి గురించి అప్పుడే ఆలోచించొచ్చు’ ‘పెళ్ళికి కనీసం వెయ్యి రూపాయల ఖర్చు. అప్పు చేసి రెండోపంట చేతికిరాకపోతే ఉన్న పొలానికే ఎసరు’ అని తలపట్టుకున్నాడు. ‘లే మామయ్యా! పద గుడివద్దకు వెళ్దాం. ఇవ్వాళ పల్నాటియుద్ధం బుర్రకథట! కాస్తలా తిరిగొచ్చి పదిమందినీ కలిస్తే బాగుంటుంది’ అని లేవదీశాడు. పెద్దాపురంలో పందిరి కింద ఇరవై అడుగుల బరి. రాజాగారి తమ్మపడిగెకి అటూ యిటూ పరాసు బూచి దొర, మన్నె సుల్తాన్ విజయరామరాజు. బొబ్బిలితో యుద్ధానికి పెద్దాపురం రాజాని కూడగట్టుకు వెళ్ళాలని సర్వప్రయత్నాలూ జరుగుతున్నాయి. జగదేవరాజా ఎటూ తేల్చడు. ఆఖరి పందెం! సూరన్న నెమిలిడేగ పాపారాయుడికీ, పరాసు నోర్డు పుంజుకీ పందెం. జనమంతా సూరన్న పక్షమే. ‘పరాసు పుంజు గెలిస్తే జగదేవరాజు పరాసుల పక్షం చేరేందుకు సిద్ధమట! అదే పరాసు పుంజుపై మీ నెమలిడేగ గెలిస్తే అది బొబ్బిలి వీరులు అజేయులని సూచిస్తుంది. మన రాజావారికి వెనుకంజ వేయక తప్పదు,’ ప్రకాశం చెవిలో చెప్పాడు దివాన్ జోగినాథం. ‘మంచిది. నా బావమరిది పెంచిన పాపారాయుడిని కొట్టే పుంజు ఇంకా పుట్టలేదు. పరాసుల పొగరు కాస్తంతయినా అణుగుతుంది’ తొడగొట్టాడు ప్రకాశం. ‘దానివల్ల నీకేం ఉపయోగం? యుద్ధానికి వెళ్ళినా లేకున్నా పన్ను కట్టకతప్పదు. అదే ఓడిపోతే ఐదువేల రూపాయలు. నీ మరదలు పెళ్ళికి ఏ అవాంతరమూ ఉండదు. ఆలోచించు’ ప్రకాశం తల గిర్రున తిరిగింది. ఐదువేలు! చిటికెడు పప్పుమందుతో మామ కష్టాలన్నీ తీరినట్లే. కానీ... ‘సూరన్నని ఒప్పించడం సాధ్యమా?’ చిన్నమ్మ పెళ్ళి ధూంధాంగా చేద్దామనుకున్నాడు రామస్వామి. తోబుట్టువు పెళ్ళికోసం పందెం ఓడిపోయి, ఊరి పరువుతీసిన సూరన్నంటే కోపంతో ఊరివాళ్ళెవరూ పెళ్ళికి రాలేదు. పందిరి బోసిపోయింది. ఊళ్ళో మొగం చూపించలేక ఇల్లూ బంధువులూ వదిలి తుంగభద్ర ఒడ్డులో రాయచూరు సర్కారుకి వలసపోయాడు సూరన్న. - సాయి పాపినేని ఫోన్: +91 9845034442 -
దండుబాట
లంగరు బండ క్రీ.శ. 1600 ::: బండమీద చందుపట్ల పదం నుంచి పథంలోకి 21 టపా సమయం. టపాబంటు వచ్చే సమయానికి ఊళ్లో ఒకొక్కరూ ఒకొక్కరూ మర్రిచెట్టు వద్దకి చేరుకుంటున్నారు. మొదట ఫౌజ్దార్ రహీంఖాన్ వచ్చేశాడు. ఎప్పుడో పెషావర్ నుండి వలప వచ్చిన రహీంఖాన్ మల్కిభ రాముడి సుల్తానీలో చందుపట్ల ఫిర్కాలో ఫౌజ్దార్గా నియమించబడ్డాడు. అతడు ఒంటిచేత్తో రోహిల్లా బందిపోట్లని ఎదిరించి గ్రామాన్ని కాపాడిన వీరకథ ప్రసిద్ధం. అతడి కోసమని అరుగు మీద గుడుగుడు పళ్ళెంలో కణకణమండే నిప్పులు వేసి ఊదసాగాడు వెట్టి మల్లేసు. ఇంకా ఊరి పెద్దమనుషులూ ఆరడుగుల ఎత్తుండే పఠాన్దొరలు కూడా జనం సలాములు అందుకుంటూ అరుగుపై వచ్చి కూచున్నారు. ఎండమావుల మధ్య కాళ్లకు గజ్జెల మోతతో పరుగెత్తుకొస్తున్న టపాబంటు రూపం కనపడగానే అందరిలో ఉత్సుకత పెరిగింది. టపా వచ్చిందంటే గోల్కొండ ఖబర్లు తెలుస్తాయి మరి. ‘బారెమాలిక్ గట్ల మొగలాయిల కాడ్నుండి రాయబారి వచ్చిండట?’ తూర్పు మాగాణి యాదిరెడ్డి ఎవర్నీ ఉద్దేశించకుండా అడిగాడు. ‘ఔ! ఢిల్లీ పాదుషా జలాలుద్దీన్(అక్బర్) హుకూమత్ జబర్దస్త్‌గా ఉందంట’ సమాధానం ఇచ్చాడు రహీంఖాన్. మాట పూర్తియ్యేలోగా టపా వచ్చేసింది. అక్కడే సిద్ధంగా ఉన్న మరో టపాబంటు టపా సంచి అందుకొని తర్వాతి గమ్యానికి పరుగందుకున్నాడు. ‘ఖాన్ సాహెబ్! గోల్కొండ నుంచి మీ ఊరికి టపా ఉంది’ అంతవరకూ పరిగెత్తుతూ వచ్చిన అలసటతో గసపెడుతూ అంగీలో భద్రం చేసిన సిక్కా కమ్మను రహీంఖాన్‌కు అందించాడు టపాబంటు నల్లసిద్ది. అరబీ లిపిలో ఉన్న ఆ కమ్మను వెదరు గొట్టం నుంచి బయటకి లాగి చూడగానే ‘ఒరే మల్లాయ్! పెద్దనాయుడుగార్ని దౌడెల్లి తోల్కరా. గోల్కొండ కాడ్నించి ఖబరని చెప్పు’ అని వెట్టివాడిని పురమాయించి ఉత్తరం చదవడంలో పడ్డాడు రహీంఖాన్. చూస్తున్న జనంలో విశేషం తెలుసుకోవాలనే ఆత్రం. గోల్కొండ నుంచి ప్రత్యేకంగా కబురు రావడం మాములు విషయం కాదు. కానీ పెద్దనాయుడు వచ్చేదాకా రహీంఖాన్ నోరు విప్పలేదు. పెద్దనాయుడు వచ్చాడు. రహీంఖాన్ అరబ్బీలో ఉన్న పత్రం చూపించాడు. నాయుడికి అర్థంకాని ఆ లిపిలో ఏముందో చెప్పాడు. నాయుడి సంబరానికి అంతులేదు. పాలమురు తరఫ్దార్ నుండి నాయుడిని పదూళ్ళ ఫిర్కాకి గుత్తేదార్‌గా నియమిస్తూ పంపిన నియామక పత్రం అది. ‘గోల్కొండలో ఎవురో ఖాస్ ఆద్మీ ఉన్నట్టున్నాడు. అన్నీ వరాలు నీకే ఇచ్చాడు’ అన్నాడు రహీంఖాన్ నవ్వుతూ. పెద్దనాయుడు అంతా ఆ దేవుడి దయ అన్నట్టు ఆకాశంలో చూశాడు. ‘గోల్కొండ నుంచి ఫిరంగి దెయ్యాల (డచ్చివాళ్ళు) దళమొకటి వస్తుందట. మచిలీబందర్ వెళుతూ ఈడ్నే నాల్గుదినాలు మకాం ఉంటుందట. వాళ్ల మంచీ చెడ్డా చూడాలి’ అన్నాడు రహీంఖాన్. పెద్దనాయుడు అలాగే అని తలాడించాడు. ‘మరో ఖబర్ కూడా ఉంది. మచిలీబందర్లో సర్కారీ కార్ఖానాకి నూరుమంది నేతగాళ్ళు కావల్నెంట. ఆడమనిషికి దూది వడకేంటికి తెలిసింటే సాలు. ఖానా పీనా ఇచ్చి జంటకి వారానికొక హొన్ను బత్యం. ఎవరైనా ఉంటే చూడు. దళంతో పాటు పంపించేద్దాం’ అంటూ అలవాటుగా పెద్దనాయుడికి హుక్కా గొట్టం అందించాడు రహీంఖాన్. నాయుడు తీసుకోలేదు. ‘వద్దులే భాయీ. నా సుట్ట ఉందిలే. నీ తురకల గుడుగుడు పిలిస్తే కులం సంకరమైనట్లు’ అని, నవ్వుతూ మొలలో దోపిన సంచిలోంచి పొగాకు కట్ట తీశాడు. ‘ఇంతకీ ఈ నేతగాండ్ల పనికి పంపేందికి నీ దమాక్లో ఎవరైన ఉండిరా?’ అన్నాడు నాయుడు. రహీంఖాన్ నవ్వాడు. ‘నీ ఇరాదా నాకు సంఝాయెలే. నీ కొడుకుల్లో ఒకడిని పంపేటికి యోచన్జేస్తుండావ్ కదా’ అన్నాడు. పెద్దనాయుడు దాచలేదు. అతడికి ఐదుగురు కొడుకులు. ఒకడు దేశాలు పట్టిపోగా మరొక నలుగురు గట్టెక్కాల్సి ఉంది. పెద్దనాయుణ్ణి చూస్తూ రహీంఖాన్ సతమతం అయ్యాడు. అసలు సంగతి నాయుడికి ఎలా చెప్పాలి? కబురు పూర్తిగా ఎవరికీ చెప్పకుండా తనలోనే దాచుకున్నాడు. సమయం వచ్చేదాకా రహస్యంగానే ఉంచితే మంచిదనే నిర్ణయానికి వస్తూ ‘నాయుడూ. నయీముద్దీన్ అనీ మీర్‌జుమ్లా దివాన్లో దబీర్గా ఉంటుండు. ఈ ఫిరంగుల్తో వస్తుండు. నా ఇంట్లనే మకాం. కాని వాని ఖానాకి మీ ఇంట్లనయితే వంటలు ఖాస్గా ఉంటవి. కాస్త లచ్చక్కతో సెబుతావె?’ ‘అదెంత భాగ్యం భాయ్. నువ్ ఫికర్ చేయకు’ అన్నాడు పెద్దనాయుడు. గోల్కొండ కోట గుమ్మం వద్ద ఫర్మానా పెట్టెని సేవకులకి అందించి ఉత్సాహంగా గుర్రమెక్కాడు దబీర్ నయీముద్దీన్. కారవాన్ రాస్తా రద్దీగా ఉంది. మూసీనది దాటితే సుల్తాన్ కట్టిస్తున్న కొత్త షహర్. ఫిరంగులకి అక్కడ విడిది. చుట్టూ తోటలతో అందమైన నగరం బాగ్‌నగర్! అతడు పన్నెండేళ్ల క్రితం ఇంట్లోంచి పారిపోయి దేశమంతా తిరిగాడు. ఉర్దూ, మరాఠి, ఫార్సీలే కాక బుడతకీచుల వద్ద ఫిరంగి (ట్రేడ్ఫ్రెంచ్) భాష కూడా నేర్చుకున్నాడు. బుడతకీచుల దుబాసీగా గోల్కొండ వచ్చి మీర్‌జుమ్లా అమీన్ ఉల్ ముల్క్ ప్రాపకం సంపాదించాడు. గోల్కొండ అమీర్లలో ఒకడిగా ఎదిగాడు. బందేనవాజ్ గిసుద్రాజ్ ఖంఖాలో ఇస్లాం మతం స్వీకరించి నయీముద్దీన్గా పేరు మార్చుకున్నాడు. రోహిల్లాబండ (షాలిబండ) వద్ద డచ్చి వర్తకుల దండు ప్రయాణానికి సిద్ధంగా ఉంది. మచిలీబందర్లో రంగువస్త్రాల కర్మాగారాలు నెలకొల్పేందుకు సుల్తాన్ నుండి ఫర్మానా సాధించడమేగాక మడపొలెంలో తుపాకీ మందు కార్ఖానాకీ మిరాసీ సంపాదించాడు. రెండేళ్ళు కళ్ళు మూసుకుంటే రాజ్యంలో ఏ పదవి కావాలన్నా కొనగలిగేటంత ధనం! నన్ను చూస్తే బాపు ఎంత సంతోషిస్తాడో? చందుపట్లలో నాలుగు రోజుల మకాం తరువాత నయీముద్దీన్ కారవాన్ కదిలింది. మర్రిచెట్టు కింద అరుగు మీద నిలుచొని మరోసారి చేయి వూపి వీడ్కోలు చెప్పాడు నాయుడు. ఇక అసలు రహస్యం చెప్పేందుకు సమయమొచ్చింది అనుకుంటూ ‘పద నాయుడు భాయ్! నీకొక ఖాస్ ఖబర్ చెప్పాల’ అని దూరంగా తాటితోపులో దారి తీశాడు రహీంఖాన్. ‘భాయ్! ఈ నాల్గురోజుల్ నీ ఇంట్ల ఉన్న మాలిక్ నయీముద్దీన్ సాహెబ్‌ని చూసిండవు గాదె?’ చిరునవ్వుతో అడిగాడు. ‘ఔ! ఆ సాహెబ్‌ని సూస్తా వుంటే ఎవడో దగ్గర మనిషుల్ని సూస్తన్నట్లుంది’. ‘మల్ల అంత దగ్గరంటోడ్ని గుర్తుపట్టిండ్లా నాయుడూ భాయ్?’ అడిగాడు రహీంఖాన్ తీక్షణంగా నాయుడి కళ్లలోకి చూస్తూ. అంతవరకూ ఎక్కడో మనసు లోతుల్లో తోచిన చిన్న సందేహం ఒక్కసారిగా విశ్వరూపంతో అతడి కళ్లముందుకొచ్చింది. నిజమా? చిన్నప్పుడు ఇంటి నుండి పారిపోయిన తన పెద్దకొడుకు నర్సింగు నాయుడే ఈ నయీముద్దీన్ సాహెబా? ‘ఎందుకు చెప్పలేదు?’ అంటూ ఖాన్ సాహెచ్ భుజం పట్టుకొని కుదిపేశాడు. రహీంఖాన్ మౌనంలో కూడా నాయుడికి సమాధానం దొరికింది. కులం, సాంప్రదాయం ప్రాణంగా భావించే తాను, తన కొడుకు ముస్లిముల్లో కలిశాడంటే ఊరివాళ్లకి మొహమెలా చూపగలడు? ఇరవై ఏళ్ల స్నేహంలో తన గురించి తనకంటే ఖాన్‌కే ఎక్కువ తెలుసు. ఉబికివస్తున్న కన్నీళ్లు అణుచుకుంటూ ఖాన్ భుజంపై తలవాల్చాడు నాయుడు. - సాయి పాపినేని ఫోన్: +91 9845034442 ‘ఆ... గోల్కొండ నుంచి ఫిరంగి దెయ్యాల (డచ్చివాళ్ళు) దళమొకటి వస్తుందంట. మచిలీబందర్ వెళుతూ ఈడ్నే నాల్గుదినాలు మకాం ఉంటుందంట. వాళ్ల మంచీ చెడ్డా చూడాలి’ అన్నాడు రహీంఖాన్. -
ప్రబంధం
కొండవీడు క్రీ.శ.1515 పల్లకీకి అడ్డుగా వచ్చినందుకు భటుడి తాపుకి అటుగా వెళుతున్న చాకలివాని గాడిద మీద పడ్డాడు దండిభట్టు. ‘ఛీ గాడిదా!’ అన్నాడు భటుడు. ఆ మాట దండిభట్టును అన్నాడో గాడిదను అన్నాడో తెలియలేదు. పల్లకీ నిలిచిపోయింది. ‘ఎందుకురా దానినంటావ్? మీ ఆంధ్రదేశంలో కవులకంటే గాడిదలే నయం. కనీసం మాసినగుడ్డలైనా మోస్తాయ్’ అన్నాడు పల్లకీలోని హమ్మీరపాత్రుడు. ఆ తర్వాత అతని చూపు దండిభట్టు మీద పడింది. ‘ఏమయ్యా కవిగార్ధభా. దుక్కలా ఉన్నావ్. ఏదన్నా పనీపాటా చేసుకోలేవూ?’ అని ఛీత్కరిస్తూ ముందుకు సాగాడు. దండిభట్టుకి కోపమొచ్చింది. ‘విద్యానగరం కృష్ణరాయలు ఉదయగిరి పట్టాడట. ఇంకెంతో కాలం లేదులే. నీ చావు మూడిందిలే. నీవూ నీ వడ్డెరాజూ మట్టిగొట్టుకుపోతారులే’ అని మనసులో తిట్టుకున్నాడు. దండిభట్టు ఉద్దండపిండం. అనేక యక్షగానాలు రచించాడు. అతడు రచించిన ‘ఊర్వశీ పురూరవం’అనే ప్రబంధం అర్థ్ధశబ్దాలంకారాలలో, అష్టాదశవర్ణనలలో దానికదే సాటి. కానీ గజపతుల పాలనలో తెలుగు కావ్యానికి ఆదరణే లేదు. ‘శ్రీనాథ కవిసార్వభౌముడినే అష్టకష్టాలకి గురిచేసిన ఈ వడ్డెరాజులని ఆశ్రయించబూనడం నాదే తప్పు. కళకి గుర్తింపులేని ఈ సీమలో ఇక మనలేను. తక్షణమే దేశం విడిచి పోతాను’ అని ఉబుకుతున్న కన్నీళ్లని అణచుకుంటూ, తాను చిన్ననాటి నుండి ఎరిగిన నూనె వర్తకుడికి తన గోడు వెళ్లబోసుకున్నాడు దండిభట్టు. ‘ఎక్కడికి పోతావయ్యా భట్టూ? రాజమహేంద్రంలో రెడ్డిరాజుల వైభవం వీరభద్రారెడ్డితోనే నశించింది. ఓరుగల్లు తురకల వాతబడింది. రాచకొండ వెలమలు అన్నీ వదిలిపెట్టి వెలుగోడులో తలదాచుకున్నారు. ఇక మిగిలింది కర్నాటకం. అంతదూరం ఏం పోతావ్? కమ్మనాటిలో నాకు తెలిసిన చౌదరయ్య ఉన్నాడు. నీలాంటి పండితులంటే ప్రాణంపెట్టే చోడరాయుడు. ఒక్కగానొక్క కూతురు! ఆమెకి మంచి గురువు కావాలని అడిగాడు. నీ ప్రబంధం చూస్తే నాలుగూళ్లు ఇచ్చి జీవితాంతం పోషించగలడు. నేనెలాగూ అటే పోతున్నాను. నాతో కూడా రా’ అని సముదాయించాడు. చోడరాయుడిది కమ్మనాటిలో నూరుగ్రామాల సంస్థానం. వందమంది అశ్వికులు, దానికి పదిరెట్లు కాలిబంట్లతో ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండే సైన్యం. తీరంలో ఉప్పుమళ్లు, రంగుబట్టల నేతగాళ్లు, కాల్పట్టణం రేవు సుంకాలు, జీడి, తమలపాకుల తోటల నుండి వచ్చే ఆదాయం వల్ల మహల్లో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ నర్తిస్తూ ఉంటుంది. ఆశ్రీతులకూ, కవి పండితులకూ కల్పతరువు. ఇంతున్నా రాయుడికి పుత్రసంతానం లేదు. ఒక్కర్తే కూతురు! ఆమె గురువుగా చోడరాయుడి కొలువులో అన్ని సౌకర్యాలూ ఉన్నా దండిభట్టు మనసు మనసులో లేదు. ఉదయాన్నే పట్టుబట్టలతో, తలపై కురుమాపు పాగాతో మహల్ వెలుపల తోటలోని నృత్యమంటపం చేరుకున్నాడు. నల్లరాతి స్తంభాలపై అపూర్వ శిల్పసంపద, నిలువెత్తు కలంకారీ తెరల మధ్య, రంగవల్లులు చిత్రించిన చలువరాతి నేలపై, వెండిరేకుతో తాపడం చేసిన దేవదారు తమ్మపడిగిపై కూర్చొని శిష్యురాలి రాకకోసం ఎదురు చూడసాగాడు. అతడి ఆలోచనలన్నీ ఆమె మీదే! తప్పని తెలుసు. శిష్యురాలు కూతురుతో సమానం. కానీ ఆమె సమక్షంలో ఏదో నిస్సహాయత ఆవరిస్తోంది. ఆమె సౌందర్యం అలాంటిది. పండితుడనని నమ్మి కూతురి విద్యాభ్యాసాన్ని తనకప్పగించిన రాయుడికి ఆగ్రహం కలిగించడం ఆత్మహత్యా సదృశమే. తెల్లని కావంచు పరికిణీ, అదే రంగు పైటతో, సగమారిన కేశాలని జారుముడి వేసి, మెడలో సంపెంగమాల తప్ప వేరే ఆభరణాలు లేకుండా నెమలి నడకలతో ఎదురుగా వచ్చి కూర్చొన్న శిష్యురాలిని చూస్తూ కళ్లార్పలేకపోయాడు దండిభట్టు. పాట మొదలెట్టింది. అది తాను రచించిన ‘హైమవతీ కల్యాణం’ అనే యక్షగానంలోని ఘట్టం! తపోదీక్షలో ఆమెని పట్టించుకోని పరమశివుని కోసం, అభిసారికయై ఎదరుచూస్తున్న పార్వతిలా, శివరంజని రాగంలో ఆలపించసాగింది శిష్యురాలు. విరహాగ్నిలో దహించుకుపోతూ యవ్వనాన్ని ఎరగట్టి నాయకుడిని తన పొందుకు ఆహ్వానిస్తున్నట్లు ఆ అందాలరాశి పాడే ఒక్కొక్క చరణం అతడి గుండెని అదుపుతప్పేలా చేస్తోంది. తమకంతో చేయి పట్టుకున్నాడు. గురువు స్పర్శకి ఒక్క క్షణం ఏమీ తోచక నివ్వెరపోయిందా పదహారేళ్ళ ఆడబడుచు. కందిపోయిన లేతరెమ్మలాంటి మణికట్టుని విడిపించుకొని ఆందోళనతో ఇంటివైపు పరుగెత్తింది. చేతజిక్కిన ఆమె పెచైంగుని చూస్తూ నిశ్చేష్టుడై నిలిచిపోయాడు దండిభట్టు. కళింగాన్ని జయించి కొండవీడు వచ్చిన శ్రీకృష్ణదేవరాయల విజయస్కంధావారంలో కవితాగోష్ఠికి దండిభట్టుకి ఆహ్వానం దొరికింది. చక్రవర్తి ఎదుట ‘ఊర్వశీ పురూరవం’ ప్రబంధం వినిపించసాగాడు.చిన్న తప్పిదానికి తనను వీడిపోతున్న అప్సరస ఊర్వశిని గూర్చి విలపిస్తూ, పురుచక్రవర్తి పాడే ఒక్కొక్క పద్యంలో, కవి మనఃఫలకం ముందు అర్ధనగ్నంగా పారిపోతున్న ఆమె రూపే ప్రత్యక్షమై వింటున్న సభికుల కళ్ళలో నీళ్ళునింపాయి. ఆ కవి తన్మయత్వానికి ప్రతిస్పందించని పండితుడు లేడు.రాయలవారి చేతులు ఆనందపారవశ్యంతో అతడిని బంధించాయి. ‘ఆహా, ఎంత సహజమైన వర్ణన! తమ కవితావేశానికి ప్రేరణనిచ్చిన ఆ సౌందర్యమూర్తి ఎవరో సెలవిస్తే సంతోషిస్తాం’ అన్నారు రాయలవారు. దండిభట్టుకి రాయలవారి ప్రశంసకన్నా చోడరాయునిపై పగతీర్చుకునే అవకాశం వచ్చిందనే ఆనందమే ఎక్కువయింది. ఆనాడు... కూతురి చేయి పట్టుకున్నందుకు కాల్పట్టణపు వీధుల్లో తనను బెత్తాలతో కొట్టించి, నగ్నంగా పరుగెత్తించిన ఆ చౌదరయ్యను అతడు మర్చిపోలేదు. జరిగిన సంఘటనలో తన తప్పేమీ కనపడలేదు. అమాయకంగా కనిపిస్తూ ఓరచూపులతో, వలపు పాటలతో, తన నిగ్రహాన్ని ఛేదించిన ఆమె ఒక కామపిశాచి అన్నదే ఆ ఉన్మాది పిచ్చి ఆలోచన! ‘ప్రభూ! ఆమె ఎవరో కాదు, కమ్మనాటి చోడుని కుమార్తె. తన నగరిలో రాణీవాసానికి అర్హురాలు. కానీ...’ అని తటపటాయించాడు. ‘సందేహమెందుకు కవివర్యా?’ ‘చోడుడు ఓడ్ర గజపతికి ఆప్తుడు. తమతో వియ్యానికి అంగీకరించడేమో?’ ‘వియ్యం కాకపోతే కయ్యం. కావలసిన సైన్యంతో తమరే స్వయంగా వెళ్ళి మా ఆజ్ఞని చోడుడికి తెలియపర్చగలరు’ అన్నాడు రాయలు. విజయనగర మదగజాల పదఘట్టనలకి కాల్పట్టణం నేలమట్టమయింది. ఎదురుతిరిగిన చోడుడ్ని ఇనుపశూలకెక్కించి, తన అవమానాన్ని కళ్లజూసిన పౌరుల ఇళ్లు తగులబెట్టించి, తనను కాదన్న ఆమెను నగ్నంగా బండికొయ్యపై కట్టి, ఎండలో ఒంగేరు మార్గమంతా ఊరేగిస్తూ, వెర్రినవ్వుతో అట్టహాసం చేస్తూ కొండవీడు చేరాడా మదోన్మాది దండిభట్టు. తన కవితావ్యామోహం, కవి పండిత పక్షపాతంతో అనాలోచితంగా చేసిన నిర్ణయంవల్ల వచ్చిన అనర్థాన్ని తెలుసుకొన్న రాయలవారి మనస్సు పశ్చాత్తాపంతో కుంగిపోయింది. మానవ మృగమైన ఆ కుకువి దండిభట్టు నుదురుపై కుక్క పాదం ముద్ర వేయించి, దేశాన్నుంచి బహిష్కరించాడు. తన దుర్నిర్ణయానికి కారణమైన ప్రబంధాన్ని స్వహస్తాలతో అగ్నికి ఆహుతి చేసినా రాయలవారి మనసు చల్లారలేదు. సాయి పాపినేని -
శాపం
విద్యానగరం క్రీ.శ.1370 హంపి మాల్యవంతం రఘునాథుని ఆలయం మెట్ల కింద పదడుగులెత్తున్న హనుమంతుడి విగ్రహంతో మొరపెట్టుకుంటున్నాడు పూజారి లకుమయ్య. ‘పదేళ్లుగా నీ సేవలోనే ఉన్నాను. ఎదుగూ బొదుగూ లేదు. పెళ్లీపెటాకులు లేవు. పది రూకలు వెనకేసుకోలేని బీద బాపడికి పిల్లనెవరిస్తారు? నేనూ నీలాగే బ్రహ్మచారిగా బతుకువెళ్లదీయాలా? ఇకనైనా కరుణించవయ్యా హనుమయ్యా!’ ఇంతలో ‘ఇదిగో లకుమయ్యా’ అంటూ పెద్దగుళ్లో పూజారి మెట్లపై నుండే కేకేసాడు. ‘శాయనాచార్యుల నుండి వర్తమానమట. ఎందుకో తెలియదు. వెంటనే వారి ఇంటికెళ్లి వారి ఆజ్ఞ ఏదో తెలుసుకురా. వెళ్లేటప్పుడు ఈ మడిగుడ్డలు వదిలి కాస్త శుభ్రంగా తయారై వెళ్లు’. వెంటనే అర్చన పూర్తి చేసి ఇల్లు చేరాడు లకుమయ్య. ఇంటి అవతారం ఎలా ఉందని? నట్టింట కట్టేసిన లేగదూడ, చుట్టూ గడ్డిగాదం, మూల మోపుగట్టిన దర్భలు, చూరుకు వేలాడుతున్న పెరికలు... ఆడదిక్కులేని ఇల్లు. లకుమయ్య మడిబట్టలు ఆరేసి, మడిచి పెట్టిన పాత నూలు ధోవతి కట్టుకుని, గుళ్లోంచి తెచ్చిన పన్నీరు జల్లుకుని, ఎందుకైనా మంచిదని అరువు తెచ్చుకొన్న మ్లేచ్ఛుల కుప్పసం ఒంటిపై తొడుక్కొని, నెత్తిన పెట్టుకొనే కుళ్లాయి కోసం ఇల్లంతా గాలించసాగాడు. ఆ కుళ్లాయి అతడి తాతలిచ్చిన ఒకే ఒక ఆస్తి. వెంజావళి పట్టుబట్టపై, కాళహస్తి అద్దకపు బొమ్మ నుదురుపై కనపడేట్లు, ఎంతో నైపుణ్యంతో కుట్టాడెవరో పింజారి సాయెబు. శాయనాచార్యులంటే విద్యానగర రాజ్యాన్ని నడిపించే ప్రధానామాత్యుడు. ఆయన వద్దకు సభామర్యాదకి తగిన దుస్తులు, కుళ్లాయి లేనిదే ప్రవేశమే దొరకదు. ‘వెళ్లేది వేదాలకి భాష్యం రాసిన శాయనాచార్యుని వద్దకే అయినా బ్రాహ్మణులకీ పండితులకీ కూడా ఈ తురకల శిరోభూషణం తప్పదు’ అని గొణుక్కున్నాడు. ఇంతకీ ఈ కుళ్లాయి ఎక్కడ చచ్చిందో? హమ్మయ్య! దొరికింది! అరగూడు వెనకమూల పడున్న కుళ్లాయిని దుమ్ముదులిపి తలపై పెట్టుకున్నాడు. ముఖం చూసుకోవడానికి అద్దం లేదు. అయినా నా మొహం చూసేదెవరు? ఈ ఒంటి బాపడికి సింగారం ఒకటి అనుకుంటూ బయలుదేరాడు. శుక్రవారం మధ్యాహ్నం! రాచవీధిలో రద్దీ అంతంత మాత్రం కాదు. రంగురంగుల అంగీలలో అరబ్బీ వర్తకులు, మసీదులో ప్రార్థనల అనంతరం మలబారి బజారులోని దుకాణాలపై పడ్డారు. ఒకవైపు అత్తరు ఘుమఘుమలు, మరోవైపు మత్స్యమాంసాలతో పలావు బియ్యం వాసనలు. ముక్కుమూసుకొని గబగబా అడుగులేయసాగాడు. వెయ్యికిపైగా ఉప్పరవాళ్లు... రాతికోటకి మరమ్మత్లు చేస్తున్నారు. కోట- ముట్టడికి సిద్ధమవుతోంది. యుద్ధమేమన్నా రానుందా? ముట్టడి ఆలోచన రాగానే వణికిపోయాడు లకుమయ్య. తొమ్మిదేళ్ల క్రితం కాల్బుర్గి సుల్తాను దాడిలో లకుమయ్య ఇల్లంతా నాశనమయింది. తాతతండ్రులూ, తల్లీపెదతల్లులూ, అన్నలూ, వదినలూ, అక్కచెల్లెళ్లూ అందరూ కైజార్లకి బలయ్యారు. పాతికమందితో కళకళలాడే సంసారం! బావిలో దాంకొని తానెలాగో బతికిబట్టకట్టాడు. ఆస్తంతా పోయి ఏకాకిగా మిగిలాక ఆంజనేయుడి పాదాల వద్ద అర్చకత్వం దక్కింది. గుడి పక్కన దోసెడు కొంపలో బతుకు నెట్టుకొస్తున్నాడు. హేమకూటంపై శాయనాచార్యుని మహల్ చేరాడు. ఆచార్యుని కొరకు వచ్చే పోయే వారి కోసం బయట పందిట్లో రోజూ అన్న సంతర్పణే! కమ్మటి నేతి వాసనలు అతణ్ణి నిలవనీయలేదు. పందిరివైపు ఈడ్చుకెళ్లాయి. కోనేట్లో కాళ్లు కడుక్కొని బంతిలో కూర్చున్నాడు. ఇలాంటి భోజనం చేసి ఎన్నాళ్లయిందో? తాంబూలం వేసుకొని, నెతి ్తమీద కుళ్లాయిని సర్దుకుంటూ ఉంటే వెతుక్కుంటూ వచ్చాడు రక్షకదళపతి. ‘ఎక్కడికి పోయావయ్యా పూజారయ్య! అయ్యవారు నిన్ను తక్షణం తీసుకురమ్మన్నారు’ అని జబ్బపుచ్చుకొని లాక్కెళ్లాడు. చావిట్లో ఉయ్యాలబల్లపై కూర్చొని పది మంది లేఖకులకి శ్రావ్యమైన కంఠంతో వేదాల సారాంశం వినిపిస్తున్న శాయనాచార్యుని చూడగానే సాష్టాంగపడి నమస్కరించాడు. ‘ఏమయ్యా.. నువ్వేనా మాల్యవంతం ఆంజనేయుడి పూజారివి? మధురావిజయానికి వెళ్లే ముందు కంపన యువరాజుని మంత్రపుష్పంతో దీవించావట. నీ దీవెనల వల్లనే సునాయాసంగా మధుర సుల్తానుపై విజయం సిద్ధించిందట. వెయ్యి వరహాలు పారితోషికంగా అనుగ్రహించారు. చిన్న భండార్‌ని కలిస్తే హుండీ రాయించి ఇస్తాడు’. వెయ్యి వరహాలా! ఇక తనకి పిల్లనివ్వటానికి ఎవరికీ అభ్యంతరం ఉండదు. వింటున్న లకుమయ్యకి ఆచార్యునికి బదులు తనని అనుగ్రహిస్తున్న హనుమంతుడే కనిపించాడు. రాయచూరు దుర్గం పట్టుకొని సుల్తాను దండుని ఊచకోత కోస్తూ విజయనగర సైన్యం ముందుకి సాగుతోందని వార్త. కాని రాత్రికి రాత్రి పరిస్థితులు తారుమారయ్యాయి. శరణుజొచ్చిన శత్రువుకి అభయమిచ్చి విజయోత్సవాలలో మునిగి వున్న రాయల శిబిరంపై సుల్తాన్ సైనికులు రాత్రిపూట ఫిరంగులతో దాడి చేశారు. పది మంది అంగరక్షకులతో బీదరైతు వేషంలో పలాయనమై ఎలాగోలా ప్రాణాలతో రాజధాని చేరాడు చక్రవర్తి దేవరాయలు. వెన్నంటి వచ్చిన సుల్తాన్ ముయిజ్జాం సేనలు విద్యానగరాన్ని ముట్టడించాయి. బయటి మట్టికోట ఎన్నాళ్లో నిలవదు. ఫిరంగుల మోతలకి చెవులు చిల్లులు పడుతున్నాయి. బయటివాడల ప్రజలని కొంపాగోడూ వదిలిపెట్టి రాతికోటలో తలదాచుకొమ్మని ఆదేశాలు జారీ అయ్యాయి. మాల్యవంతం వాడంతా నిర్మానుష్యమైంది. పదేళ్లుగా తన తోడూనీడా అయిన హనుమయ్యని వదిలి రానని మొండికేశాడు లకుమయ్య. అడిగినవన్నీ ఇచ్చే నా దేవుడే నా ప్రాణానికి కాపు అంటూ ఆంజనేయుడి విగ్రహం కాళ్ల వద్దే తిండీ నిద్రా లేకుండా ఉండిపోయాడు. బహమనీ దండ్లు బయటివాడల్లో ప్రవేశించాయి. ఇళ్లూ గుళ్లూ కొల్లగొడుతూ ముందుకి సాగాయి. కసి తీర్చుకోవటానికి ఒక మనిషి కూడా లేడు! ఆఖరికి హనుమంతుడి విగ్రహం ముందు శోషవచ్చి పడున్న లకుమయ్య వారి కళ్లబడ్డాడు. బంగారు పతకాలు, మఖ్మల్ తొడుగులతో తెల్లని అరబీ గుర్రంపై ప్రత్యక్షమైన సుల్తాన్ ముయిజ్జాంనీ అతడి చుట్టూ చిందులు వేస్తున్న బంట్లనూ చూసి, భయంతో దేక్కుంటూ తన దేవుడి కాళ్లపైబడ్డాడు లకుమయ్య. పదేళ్ల క్రితం తన కుటుంబాన్ని కడతేర్చిన కైజార్లు అతడి కళ్లముందు మెదిలాయి. అతడి చేష్టలు సుల్తానుకి నవ్వు తెప్పించాయి. ‘హహ్హా! ఏరా! ఈ రాతిబొమ్మ నిన్ను రక్షిస్తుందా?’ ‘బేవకూఫ్’ అతడి భటులు వంత పలికారు. ‘అదీ చూద్దాం! వెంటనే కోట తలుపులు పగలగొట్టే యంత్రాన్ని సిద్ధం చేయండి. ముందు ఈ విగ్రహం పనిబట్టి తరువాత ఈ కాఫిర్ పని చూద్దాం’ అన్నాడు సుల్తాన్. రెండడుగుల నిడివిగల ఇనుప దూలం. ఎనుబోతులు లాగే చక్రాల బండిపై వేగంగా వచ్చి విగ్రహాన్ని తాకింది. నల్లరాతి విగ్రహం చెక్కుచెదరలేదు. కానీ లకుమయ్య కళ్లు మాత్రం నిప్పులు చెరిగాయి. ‘ఓరీ మ్లేచ్చుడా! నీవు చేసే ఈ పాపానికి ఇల్లు చేరేలోగా చస్తావ్!’ అని శపించి, మరోసారి విగ్రహంవైపు రెట్టింపు వేగంతో దూసుకొస్తున్న దంచనానికి అడ్డుగా నిలిచాడు. పిడుగుపాటులా తాకిన దెబ్బకి హనుమంతుడి విగ్రహం పెళపెళమంటూ విరిగిపడింది. మధ్య చిక్కిన బక్కబ్రాహ్మడి దేహం ఆ తాకిడిని ఏ మాత్రమూ తగ్గించలేకపోయింది. కానీ ఆ బీద బాపడి శాపం మాత్రం ఫలించింది! విజయోత్సాహంతో తిరుగుముఖం పట్టిన సుల్తాన్ని అతడి దాయాది దావూద్‌ఖాన్ మార్గమధ్యంలోనే హత్య చేసి కాల్బుర్గి సింహాసనాన్ని ఆక్రమించాడు. మహమ్మదీయ దండయ్రాతలు మహమ్మదీయుల రాక యుద్ధతంత్రంలో హిందూరాజులకి కొత్త సవాలు విసిరింది. ఫిరంగులు, తుపాకులు, మందుపాతరలు, వేగంగా పరుగెత్తే గుర్రాలపై నుండే టర్కీవిల్లుతో బాణాలు కురిపించే అశ్వికులు... ఇవి మహమ్మదీయ సేనలకి పైచేయినిచ్చాయి. పురాతమైన ధర్మశాస్త్రానికి కట్టుబడి చేసే ద్వంద్వ యుద్ధాల ఆచారాలకి రోజులు చెల్లాయి. హిందూరాజులకు రాత్రియుద్ధం నిషిద్ధం. లొంగిపోయిన శుత్రువుకి అభయమిచ్చి ఒప్పందం చేసుకొని తగిన పరిహారం పొందటం ఆనవాయితీ. కానీ మహమ్మదీయ సైన్యాధ్యక్షులు లొంగినట్లు నటించి ఏమరుపాటులో ఉన్న శుత్రువుపై రాత్రుల్లో దాడికి పూనడం వంటివి చేసారు. ముఖ్యంగా ఓడిన శుత్రువు మళ్ళీ తలెత్తకుండా ప్రజలలో భయోత్పాతాలు సృష్టిస్తూ చావుదెబ్బ కొట్టడం వారి యుద్ధనీతి. యుద్ధాలలో ప్రాణనష్టం, ఆస్తినష్టం అనేవి సర్వసామాన్యం. కానీ హిందూ రాజులు బ్రాహ్మణులకి వారి ఆస్తులకి అపకారం తలబెట్టలేదు. మహ్మదీయ దండయాత్రల్లో మొట్టమొదటిసారి బ్రాహ్మణులు శత్రువు ఆగ్రహాన్ని చవిచూసారు. అదే విషయం నాటి సాహిత్యంలో కూడా ఎత్తిచూపారు. అయితే రాజకీయాల్లో మతాన్ని వాడుకోవటానికి, మతసంస్థలని ధ్వంసం చేయటానికి, మతాల పేరిట తలబడటానికి మహమ్మదీయ దాడులకి మునుపే ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. యుద్ధాల్లో పతనమైన అనేక జైన, బౌద్ధ శిథిలాలు ఈనాటికీ మౌనంగా ఆ నిజాన్నే చెబుతాయి. అంతెందుకు వీరశైవం, వీరవైష్ణవాల మధ్య జరిగిన సంగ్రామమే పల్నాటియుద్ధం అని కొందరి అభిప్రాయం. రాజకీయ ప్రయోజనాలకి మతం ముసుగువేసి సామాన్యుల్లో ఆవేశకావేశాలు రగిలించటం నేటికీ ప్రపంచమంతా కనిపిస్తూనే ఉంది. 1303లో ఆంధ్రదేశం మొట్టమొదటిసారిగా మహమ్మదీయ దాడులకి గురయ్యింది. ఇరవై యేళ్ళ తరువాత తుగ్లక్ సేనలు వరంగల్లుని పట్టి చక్రవర్తి ప్రతాపరుద్రుని బందీగా తీసుకెళ్ళడంతో కాకతీయ సామ్రాజ్యం పతనమయింది. గంగూ బహ్మన్ అనబడే ఒక బ్రాహ్మణుడు ఇస్లాం మతం పుచ్చుకొని ఖిల్జీ చక్రవర్తి దాసుడై, తన ప్రతిభా పాటవాల వల్ల ఢిల్లీ దర్బారులో అత్యున్నత స్థానానికి ఎదిగి, కాకతీయుల అనంతరం అల్లావుద్దీన్ హసన్ గంగూ బహ్మన్షా అనే పేరుతో గుల్బర్గాలో స్వతంత్ర సామ్రాజ్యం నెలకొల్పడంతో దక్షిణ భారతదేశంలో మహ్మదీయ అధికారం స్థిరపడింది. తుంగభద్రకి దక్షిణాన విజయనగర సామ్రాజ్యం స్థాపించబడింది. కృష్ణా తుంగభద్రా అంతర్వేది ఇరురాజ్యాల మధ్య యుద్ధభూమిగా మారింది. ఐతే ఇదే ప్రాంతంలో రెండు మతాల మధ్య సామరస్యం కూడా వృద్ధి చెందింది. దక్షణదేశానికి అరబ్బు వర్తకులతో సంబంధాలు ఎన్నో శతాబ్దాలుగా ఉన్నాయి. రాజకీయ, ఆర్థిక కారణాల వల్ల అనేక మంది ఇస్లాం మతం స్వీకరించినా సామాజిక చట్రంలో భాగస్వాములుగానే ఉన్నారు. కొందరు కింది వర్గాలవారికి సమాజంలో స్థాయిని పెంచుకోవటానికి ఇస్లాం ఒక కొత్త అవకాశం చూపింది. భవనాల నిర్మాణంలో, వేషభాషల్లో, లలితకళల్లో, రాజ్యవ్యవహారాల్లో హిందూ ముస్లిం శైలుల మేళవింపుతో ఒక సరికొత్త పాలకవర్గ సంస్కృతి పుట్టింది. నాటి పౌరులు, తలకి పెట్టుకునే టోపి నుండి కాళ్ళకి వేసుకునే చెప్పులదాకా మహమ్మదీయ ఫ్యాషన్లని అనుకరించారు. విజయనగరంలో తలపై కుళ్ళాయి, ఒంటిపై గౌనులాంటి కుర్పారసం, భుజంపై శాలువా వంటివి పాలకవర్గంలో రివాజుగా మారాయి. తిరుపతిలో శ్రీకృష్ణదేవరాయల విగ్రహం, అన్నమాచార్యుని వర్ణచిత్రాలలో ఇలాంటి కుళ్ళాయిని చూస్తాము. ఇది టర్కీలో ధరించే ‘కుల్లాహ్’ అనే పొడవాటి టోపీ. కవిసార్వభౌముడు శ్రీనాథునికి కూడా రాజదర్శనానికి వెళ్ళేటప్పుడు ఈ కొత్త ఫ్యాషన్ అనుకరించక తప్పలేదు. ‘కుళ్ళాయించితి కోకచుట్టితి మహాకూర్పాసమున్ దొడ్డితిన్’ అనే పద్యమే దీనికి నిదర్శనం. సాయి పాపినేని 9845034442 -
మైలసంత
ఓరుగల్లు, క్రీ.శ. 1300 ఆ రోజు ముఖ్య సమావేశం. బాహత్తర నియోగాధిపతి (చీఫ్ సెక్రటరీ) పిలుపు అందుకోగానే అన్ని శాఖల అధిపతులతో పాటుగా హడావుడిగా రాతికోటలోని సభామంటపం చేరాడు దండనాయకుడు (పోలీస్ కమిషనర్) సింగమనాయుడు. ఇంకా సమావేశం మొదలవలేదు. అధికారులంతా ముఖమండపంలో ఎదురు చూస్తున్నారు.‘ఎందుకో అత్యవసర సమావేశం?’ మండపంలో కూర్చొని వున్న గజసాహిణి గోన విఠలరెడ్డిని అడిగాడు సింగమనాయుడు. గోన విఠలరెడ్డి వర్ధమానపురం రాజు. కాకతీయుల అపారమైన గజసైన్యానికి నాయకుడు. ‘ఏముందప్పా? నూటికి ముప్పై కప్పంగా కట్టినా భాండాగారం వట్టిపోయిందని ఒకటే గొడవ. అంబయ్యదేవుడిని ఓడించాక ఖజానాలో చేరిన నలభై కోట్లు కోటగోడ మరమ్మతుకే సరిపోయాయట. నాయకుల కప్పాలు, భూములపైన ఆదాయం, వాణిజ్యపన్నులూ అన్నీ కలిపి ఈసారి ఎనభై కోట్లే వచ్చాయట. అవి వీరభటుల బత్యాలు, నవలక్ష ధనుర్థారులకే చాలడంలేదు. ఇక వాళ్లని కూడా గ్రామాలనికి తోలి నాయంకరాలకి పంచాలని అయ్యగారి ఉద్దేశ్యం. వడ్డమాను ఆదాయమంతా ఆరువేల ఏనుగుల్ని మేపడానికే చాలదు. ఇక వీళ్లు కూడా మా పైనబడితే మా రాజ్యాల్లో ఏమీ మిగలదు’ అన్నాడు గోన విఠలరెడ్డి. ఇంతలో రొప్పుకుంటూ వచ్చిన తలారి సాంబడు ‘దన్నాయకులు సింగప్రభువులకి దండాలు. మైలసంతలో దిక్కులేని శవం పడి ఉందట’ అన్నాడు. సింగమనాయుడు ఉలిక్కిపడ్డాడు. ‘ఎన్నడూ లేనిది ఇదేం ఉపద్రవం?’ అనుకుంటూ హుటాహుటిగా బయల్దేరాడు. ఓరుగల్లు కోట బయట వందల కొలదీ అంగళ్లతో దేశవిదేశాల వర్తకులతో ప్రతి మంగళవారం మైలసంత జరుగుతుంది. ఆ సంత నుంచి ప్రభుత్వానికి సుంకాల ద్వారా వచ్చే ఆదాయమే సాలుకి మూడుకోట్లు, పటిష్టమైన రక్షణ వ్యవస్థ మధ్య ఇలాంటి అవాంఛనీయ సంఘటనలకి తావులేదు. మరి ఇది ఎలా జరిగినట్టు? నూనె అంగళ్ల మధ్య భటులు కట్టిన దడి మధ్యలో బోర్లా పడివున్న శవం. కంసాలి వేషంలో వచ్చిన గజదొంగ కన్నప్పది. చుట్టూ పరికించి చూశాడు సింగమనాయుడు. దుకాణాలలో లావాదేవీలు మామూలుగానే జరుగుతున్నాయి. చోద్యానికి వచ్చిన జనాలు భటులు కలుగచేసుకోవడంతో దూరంగా పారిపోయారు. ‘చచ్చినవాడు కంసాలివాడట. అక్కలవీధిలో విడిది. శవం అప్పటికే నీలిరంగు తిరిగి ఉంది. అంటే హత్య జరిగి చాలాసేపే అయింది. బహుశా నిన్న సాయంత్రమే మరణించి ఉంటాడు’ వివరించాడు తలారి సాంబడు. ‘కావలి భటులకి వివరాలు చెప్పకుండా ఊరు దాటడం సాధ్యం కాదు. అలాంటప్పుడు అతడు కోటదాటి బయటకి ఎలా వచ్చినట్లు? ‘అక్కలవీధిలో విచారిస్తే తెలుస్తుంది!’ ‘ఊ! శవాన్ని గోళకీమఠానికి శవపరీక్షకి పంపండి’ అని తలారి భటులకి ఆదేశమిచ్చి కోటవైపు కదిలాడు సింగమనాయుడు. సంతలో విపరీతమైన రద్దీ. తమలపాకులు, టెంకాయలు, నువ్వులు, గోధుమలు, ఆవాలు, పెసలు, వడ్లు, ఉప్పు, బెల్లం, మిరియాలు, పసుపు, ఉల్లి, అల్లం... ప్రతిదానికి ప్రత్యేకమైన అంగళ్లు. గంపలో గాజుబుడ్లతో ‘సంపెంగనూనె...’ అని అరుస్తూ గుర్రానికి అడ్డం వచ్చిన మాలపిల్లని అదిలించి వేగంగా ముందుకి కదిలాడు సింగమనాయుడు. పట్టుబట్టల దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. కాకతమ్మ బోనాల పండుగ ఇంకా ఎన్నాళ్లో లేదు. అక్కసాలెవాడ వద్ద దండాలు పెడుతూ ఎదురొచ్చాడు సుంకాధికారి. చుట్టూ ఉన్న తగరం, సీసం, రాగి, ఇనుము కర్మాగారాల ఠంగుఠంగనే సుత్తుల శబ్దంలో అతడు చెప్పేది వినపడక గుర్రం దిగాడు సింగమనాయుడు. ‘ఏమిటి సంగతి?’ ‘ఏముంది ప్రభూ! ఈ సాలు మిరియాలపై సుంకం పదోవంతు కూడా రాలేదు. అంటే బొక్కసానికి ముప్పైలక్షలు నష్టం. ఏమైందని మన కరణాలని అడిగితే అమ్మకాలే లేవంటారు. పన్ను కట్టాల్సిందే అని పట్టుబడితే ఈ వర్తకులు తీర్పరుల సభక్తి (ట్రిబ్యునల్) వ్యాజ్యం తెచ్చారు’ ‘మిరియాల చారు లేకుండా ముద్ద దిగని మన ప్రజలు ఉప్పూకారాలు మానేసే వ్రతం పట్టారా ఏమిటి? ఊహ్. మీ తిప్పలు మీరు పడండి. నా తిప్పలు నాకున్నాయి. సంతలో ఎవరో కంసాలిని హత్య చేశారు. బంగారం కోసమై ఉండొచ్చు. దొంగసొమ్ము కొనేవాళ్ల మీద కాస్త నిఘా పెట్టండి. ఎవరిపైనన్నా అనుమానం వస్తే వెంటనే తలారికి తెలియపర్చండి.’ ‘చిత్తం ప్రభూ’ అని సెలవు తీసుకున్నాడు సుంకాధికారి. పూటకూళ్లింట్లో కన్నప్ప అద్దెగదిని చూపిస్తూ ‘ఇదే గది. పాపం అబ్బాయి మంచివాడే! వచ్చి వారమైంది. ఎవరితోనూ గొడవలేదు’ అంటూ మారుతాళంతో తలుపు తెరిచింది పూటకూళ్ల సీతక్క. గది చక్కగా సర్దినట్లుంది. దానిని పరిశీలించే పని తలారి సాంబడికి అప్పజెప్పి ‘వ్యాపారం కోసం ఎవరెవరిని కలిసాతో తెలుసా? అతడి కొరకు వచ్చినవాళ్ల వివరాలేమైనా ఉన్నాయా?’ సీతక్కని అడిగాడు సింగమనాయుడు. ‘అతడి కోసం ఎవరూ రాలేదు. కాని నాలుగురోజుల క్రితం అనుమయ్యశెట్టిని పరిచయం చేయమని కోరితే నేనే చేశాను’ ‘కంసాలికి జొన్నల వ్యాపారితో ఏంపని?’ ‘అతడి వద్ద నగలేవో బేరానికి పెట్టాలని.’ ఇంతలో ‘అయ్యా! తమరిది చూడాలి’ గదిలోంచి కేకపెట్టాడు సాంబడు. సంచిలో నల్లబట్టల మధ్య చోరవృత్తికి కావాల్సిన పరికరాలు. ‘ఇతడు కంసాలి కాదు. దొంగ’ అన్నాడు తలారి సాంబడు. ‘అంటే, వీడు అనుమయ్యశెట్టి ఇంటికి కన్నం వేయటానికి పథకం వేశాడా? ఆ మూడో గోనెసంచి విప్పండి. అందులో ఏముందో?’ అన్నాడు సింగమనాయుడు. విప్పారు. జొన్నలు. గోనెసంచి మీద నీలిరంగు ముద్ర ఉంది. అనుమయ్యశెట్టిది. మూతివిప్పి తలకిందులు చేశాడు. జలజలమని రాలే జొన్నల మధ్య మరో మూట. సంచిలో సంచి! మూటవిప్పాడు సింగమనాయుడు. నల్లబంగారం! ‘పదండి. వెంటనే అనుమయ్యశెట్టి కోష్టాలు పరిశీలించాలి. సాంబయ్యా.. నువ్వు వెంటనే సుంకాధికారి మల్లన్నని అక్కడికి తోడ్కొనిరా’ అంటూ బయలుదేరాడు దండనాయకుడు సింగమనాయుడు. తీర్పరుల ధర్మాసనం ముందు పొగడదండతో దోషిగా నిలబడ్డాడు అనుమయ్య. సామాన్యుల ఆహారమైన జొన్నలపై కాకతీయ రాజ్యంలో సుంకంలేదు. ధనికులు తినే వడ్లూ, గోధుమలూ, ఇతర దినుసులపై సుంకం మాడబడివీసం- అంటే 16వ వంతు. సుగంధద్రవ్యాలు, హస్తకళ సామాగ్రులపై మాడబడిచిన్నం- అంటే 8వ వంతు. కానీ నల్లబంగారమనే మిరియాలపై మాత్రం అత్యధికంగా మాడబడిపణం- అంటే సగం. ‘గత పది నెలలుగా జొన్నల సంచులలో మిరియాలు తేవటం ద్వారా అనుమయ్య ఎగవేసిన సుంకం ముప్పైలక్షల మాడలకి పైబడే’ అంటూ నేరాన్ని వివరించాడు వడ్ల వ్యవహారి (ప్రాసిక్యూటర్). శెట్టి ఆస్తిపాస్తులు జప్తు చేసి అతడి వద్ద కొనగోళ్లు చేసిన అంగళ్లపై మడిగసుంకం (అంగడిపన్ను) రెండు రెట్లు పెంచాల్సిందిగా సుంకాధికారికి ఆదేశాలిచ్చాడు మైలసంత తీర్పరి. ‘రహస్యం తెలుసుకొని బెదిరించి డబ్బు గుంజేందుకు వచ్చిన కన్నప్పని హత్య చేయించినందుకు, నిందితునికి తగిన శిక్ష విధించేందుకు దండ న్యాయస్థానానికి అప్పగించడమైనది’ అంటూ లేచాడు తీర్పరి. అంతా ఎటువాళ్లటు వెళ్లిపోయారు. సింగమనాయుడికి కన్నప్ప గుర్తొచ్చాడు. పాపం దొంగకన్నప్ప! వచ్చింది దొంగతనానికే అయినా వీడి వల్ల ఇంటిదొంగలు బయటపడ్డారు అనుకుంటూ ఇంటిదారి పట్టాడు సింగమనాయుడు. లోటు బడ్జెట్ కాకతీయ సామ్రాజ్యం ఒక ఫెడరల్ వ్యవస్థ. మధ్యయుగం ఆరంభంలోనే కే ంద్రీకృత ప్రభుత్వానికి రోజులు చెల్లాయి. రాజ్యం నాడులు, విషయాలుగా విభజింపబడి, అవి సామంతరాజుల చేతుల్లో ఉండేవి. వాళ్లు అవకాశం వచ్చినప్పుడల్లా తిరుగుబాటు చేసేవారు. ఆ పరిస్థితుల్లో ఓరుగల్లు చక్రవర్తికి కుడిభుజాలుగా నిలిచిన గోన, మల్యాల, చెరకు, రేచర్ల నాయకులు ఆంధ్రసామ్రాజ్యం ముక్కచెక్కలు కాకుండా కాపాడారు. కాని కుట్రలూ కుతంత్రాలూ సాగేవి. నేడో రేపో తెగబడేందుకు ఢిల్లీలో పొంచి ఉన్న ముస్లిం సైన్యాల భయం ఒకటి. దాంతో రాజధాని రక్షణ అత్యంత కీలకమై ఏడు ప్రాకారాలతో ఓరుగల్లు కోట నిర్మించి ఎప్పటికప్పుడు మరమ్మతులు చేస్తూ శత్రుదుర్భేధ్యం చేయక తప్పలేదు. చక్రవర్తి రక్షణకై నవలక్ష ధనుర్థారులతో మూలబలాన్ని పోషించారు. యుద్ధసమయంలో సామంతుల సైన్యాలు చక్రవర్తికి సహాయపడేవి. ప్రతాపరుద్రీయం, సిద్ధేశ్వరచరిత్ర అనే గ్రంథాల్లో కనిపించే కాకతీయ సామ్రాజ్యపు ఆదాయ వ్యయాల (పక్కన ఉన్న) పట్టిక చూస్తే ఆనాటి ఆర్థిక వ్యవస్థ ఎంత అస్తవ్యస్తంగా ఉందో అర్థమవుతుంది. వ్యయం ఆదాయం (ప్రతాపాలు = రూపాయలు) చక్రవర్తి తులాభారం 3.5 కోట్లు చక్రవర్తి నిత్యవైభవాలకి 3.6 కోట్లు జీతాలు నవలక్ష ధనుర్ధారులకి 38 కోట్లు జీతాలు ఇతరులు, రక్షకభటులు 50 కోట్లు సత్రాలు 1 లక్ష బ్రాహ్మణులకి దానాలు 1.3 కోట్లు అంతఃపురం, ద్వారపాలకులకు 3.8 కోట్లు గుర్రాలు, ఏనుగులు 2.5 కోట్లు ఆలయానికి మఠాలకి(వ రంగల్లు) 1 కోటి రాజగృహాల నిర్మాణం 1 కోటి సామంతుల కప్పం 24 కోట్లు భూములనుండి ఆదాయం 20 కోట్లు వాణిజ్య సుంకాలు 44 కోట్లు మొత్తం 88 కోట్లు లోటు 16 కోట్లు మొత్తం 104 కోట్లు 104 కోట్లు అంటే అదొక లోటు బడ్జెట్! చక్రవర్తి ఆదాయం రక్షణ వ్యవస్థకే చాలేది కాదు. ఆదాయం పెంచేందుకు పన్నులు వసూలు చేసే వ్యవస్థని పటిష్టం చేశారు. సామంతులు కూడా సైన్యపు భారాన్ని మోసేందుకు వ్యవసాయాభివృద్ధికై చెరువులు, కాలువలు తవ్వించారు. వాణి జ్యానికి ప్రోత్సాహం లభించింది. వాణిజ్యాన్ని నియమితం చేసేందుకు ప్రతి పట్టణంలో రెండు రకాల సంతలను ప్రభుత్వమే నిర్వహించేది. పట్టణం మధ్యలో మడిసంత, ఊరి వెలుపల మైలసంతలను నిర్వహించారు. వరంగల్‌లోని ఖాన్సాహెబ్తోట ప్రాంతంలో ఒకప్పటి మైలసంత ఉండేది. ఆ సంతలో అమ్మిన వస్తువులూ వాటిపై పన్నుల వివరాలు కూడా అక్కడి శాసనంలో దొరుకుతాయి. కోటలో సుంకాల వల్ల ధరలు ఎక్కువ. అయితే మైలసంతలో తక్కువ పన్నుతో ఉత్పత్తిదారులే స్వయంగా అమ్ముకునే అవకాశం ఉండేది నేటి రైతుబజార్లలా! అయితే ప్రతాపరుద్రుని కాలానికి సామంతులపై కప్పం భారం విపరీతంగా పెరిగింది. 72 శాఖల అధికారుల జీతాలకి బదులుగా, రాజ్యాన్ని 72 నాయంకరాలుగా విభజించి వారికి పన్నుల వసూలు, సైన్యాన్ని పోషించడం వంటి బాధ్యతలు అప్పగించడం జరిగింది. వారిలో వెలమలు ఎక్కువ. అది ముందు నుంచీ కాకతీయుల ధ్వజం పట్టి సామ్రాజ్యాన్ని కాపాడిన సామంతుల కన్నెర్రకి కారణమైంది. ఇదే తరువాతి యుగంలో వెలమల, రెడ్ల మధ్య వైరానికి దారితీసింది. - సాయి పాపినేని ఫోన్: +91 9845034442 -
ఓడరేవు మోటుపల్లి, క్రీ.శ. 1250
పదం నుంచి పథంలోకి 15 ఊరంతా కోలాహలంగా ఉంది. వెదకబోయిన తీగ కాలుకి తగిలినట్టు గణపతిదేవచక్రవర్తి మోటుపల్లికి వేంచేశారు. దక్షిణదేశ జైత్రయాత్ర ముగిసిందట! కవిబ్రహ్మ తిక్కన సోమయాజి ప్రార్థనపై కంచి రాజేంద్రచోళుని ఓడించి తెలుగు చోడరాజు మనుమసిద్ధిని నెల్లూరు సింహాసనంపై నిలిపి కుటుంబసమేతంగా ఓరుగల్లు తిరిగివెళ్తూ మోటుపల్లిలో ఆగారు. తాను ఏనాటి నుంచో దర్శించుకుందామనుకుంటున్న ప్రభువు ఇంత సులువుగా అందుబాటులోకి వచ్చారన్న కబురు తెలిసి ఉక్కిరిబిక్కిరయ్యాడు పాపయ్య శెట్టి. తవాయి (థాయ్‌లాండ్) ద్వీపకల్పం నుంచి ఓడల మీద సరుకు వేసుకొని వచ్చిన బడలిక అంతా ఆ ఒక్క కబురుకే తుడిచి పెట్టుకుపోయింది. పాపయ్యశెట్టి సామాన్యమైన వర్తకుడు కాడు. తవాయిలోని తిన్-గ్యుయ్ పట్టణ తెలుగు నకరానికి అధ్యక్షుడు. అక్కడ స్థిరపడి వ్యాపారంలో లాభాలు చూసి ఎన్నో యేళ్ళ తరువాత స్వదేశంలో కాలుపెట్టాడు. తన వెంట ఒక్కొక్క నౌకలో యాభై బారువాల (75 టన్నులు) అగరు, కర్పూరం, జవ్వాజి, చందనం, మిరియాలు, జాజికాయ, జాపత్రి మొదలైన సుగంధ ద్రవ్యాలతో వెలనాటి తీరం చేరాడు. నిజానికి ఇప్పుడు కూడా అతడు వచ్చేవాడు కాదు. కాని పరిస్థితులు మారాయి. మంజి (దక్షిణ చైనా) ప్రాంతాన్ని పాలించే మంగోల్ ఖాఖాన్ చంపా- తరుణసీరి (బర్మా) జయించి అక్కడి వర్తకస్థావరాలని పట్టుకున్నాడు. అతడి తమ్ముడు కుబ్లయ్ఖాన్ నౌకాసైన్యాలు యవద్వీపాలని జయించాయి. రేవు పట్టణాలలో వాళ్ళు చేసిన బీభత్సం అంతింత కాదు. దినదిన గండంగా అక్కడ జీవించడంకన్నా వ్యాపారానికి స్వస్తి చెప్పి స్వదేశం చేరితే మంచిదని పాపయ్యశెట్టి ఉద్దేశం. ‘తూర్పుసముద్రంలో నౌకావర్తకానికి ఇక రోజులు చెల్లాయి. ఇక్కడే ఉంటే మనం సంపాదించి దాచుకున్నదంతా ఆ మంగోలు ఖానుడి పాలవుతుంది. మనం మన ప్రాంతం వెళ్లిపోదాం. పుష్యమాసం తరువాత బయలుదేరితే తుఫానుల బెడద ఉండదు కనుక నేరుగా సముద్రమధ్య మార్గంలో దొంగల భయం లేకుండా మోటుపల్లి చేరవచ్చు. అక్కడ కాకతి గణపతిదేవచక్రవర్తి ధర్మప్రభువు. ఒకసారి ఆంధ్రతీరం చేరితే మనకి కావలసిన సహకారం అందుతుంది’ అని సాటి వర్తకులని ఒప్పించాడు. తీరానికి కోసు దూరంలో సముద్రంలో లంగరేసిన వల్లీ నావలను వదిలి, చిన్న కప్పలి పడవలో నలుగురు వీరభటులతో మోటుపల్లి చేరాడు. అప్పుడుగానీ హాయిగా ఊపిరి పీల్చుకోలేదు పాపయ్యశెట్టి. మోటుపల్లి స్థానకరణం, అయ్యావళి ఇన్నూరు సంఘాధిపతి రేవణ్ణశెట్టి ఇతర సంఘముఖ్యులతో కలిసి పాపయ్యశెట్టికి స్వాగతం పలికాడు. ‘రేపు కేశవాలయం వద్ద మహోత్సం జరుగుతుంది. తమరు పాల్గొనాలని మా ఆకాంక్ష’ అని ఆహ్వానించాడు. పక్కనే ఉన్న రేవణ్ణ శెట్టి అతడి మనసుని తొలుస్తున్న అసలు విషయం అడిగేశాడు. ‘శెట్టరే! ఇంతకీ మీ ఓడలో తెచ్చిన సామాగ్రి ఏనో?’. పాపయ్యశెట్టి తలెత్తి సముద్రంలో లంగరేసి ఉన్న నావలను చూస్తూ ‘ఏముంది శెట్టిగారు! తూర్పుదీవుల వాళ్ళం. కర్పూరం, కస్తూరి, జవ్వాజి. మొత్తం కలిపి ఐదు వందల బారువులు’ అని బదులిచ్చాడు . విన్నంతనే రేవణ్ణ శెట్టి ముఖం తెల్లగా పాలిపోయింది. **************** అర్ధరాత్రి. లంగరు వేసిన నావల్లో కలకలం మొదలయ్యింది. అవి మెల్లమెల్లగా మునిగిపోవడం మొదలుపెట్టాయి. పాపయ్య శెట్టి కొయ్యబారి చూస్తూ ఉండగా నావల్లోని ముప్పై కుటుంబాల సభ్యులు గగ్గోలు పెడుతూ బెస్తవారి సాయంతో ఎలాగో ప్రాణాలతో ఒడ్డు చేరారు. ********** కుమారుడు రుద్రదేవుడు (మగవేషంలో ఉన్న రుద్రమదేవి), బావమరిది జాయప సేనాని, భార్యలు నారమ్మ, పేరమ్మ, పరివారం వెంటరాగా కేశవస్వామికి సేవలందించి గుడి నుంచి మరిలాడు సప్తమ చక్రవర్తి కాకతి గణపతిదేవుడు. అందుకోసమే కాచుకొని ఉన్న పాపయ్య శెట్టి భార్యపిల్లలతో సహా ‘మహాప్రభో! పాహి!’ అంటూ చక్రవర్తి పాదాలపై పడ్డాడు. అతడిని చూసి కుడిచెయ్యి అభయముద్రతో పెకైత్తి ఒక్క క్షణం అలాగే నిలిచాడు గణపతిదేవుడు. మరుక్షణం పాపయ్యశెట్టి చేతిలోని కొలతో చక్రవర్తి చుట్టూ గుండ్రంగా నేలపై గిరిగీసి మరలా సాగిలపడ్డాడు. ఆ హఠాత్ పరిణామానికి చక్రవర్తి పరివారమేగాక పురజనులు కూడా అవాక్కయ్యారు. అప్పు ఎగగొట్టి చెల్లించని వాళ్ళు దొరికితే వారి చుట్టూ గిరిగీసి వీధిలో నిలబెట్టడం ఆచారం. ‘ఎంత అపచారం’ ‘వీడికి భూమి మీద నూకలు చెల్లాయ్!’ ‘అయినా చక్రవర్తి ఇతడికి ఎలా బాకీ పడ్డాడు? గణపతిదేవుని కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. అది గమనించిన జనంలో కలకలం మొదలయింది. రక్షకభటులు కత్తులు దూశారు. ‘ఆగండి’ అంటూ ముందుకొచ్చింది ఆరేళ్ళ రాకుమారుడి వేషంలో ఉన్న రుద్రమ్మ. ‘ఏమోయ్ శెట్టి! సముద్రంలో మీ నావలు మునిగిపోయిన విషయం మాకు తెలిసింది. కానీ ఈ విషయంలో చక్రవర్తి మీకెలా బాకీ పడ్డారో చెప్పగలవా?’ కుమార్తె రుద్రమ పలికిన ముద్దుమాటలకు కోపం నుంచి తేరుకున్నాడు చక్రవర్తి. తన చుట్టూ గీత గీసినవాడు సామాన్యుడు కాదు. తూర్పు దీవులలో ప్రాముఖ్యం కలిగిన వర్తక శ్రేణి నాయకుడు. పరిహారం చెల్లించకుండా గీసిన గీత దాటడం సంఘ నియమాలని అతిక్రమించడమే. రాజైన తానే నియమాలు పట్టించుకోకుంటే ఇక ప్రజల మాటేమిటి? అతడి వాదన ఏమిటో విందాం అనుకొని, ‘ఊ! చెప్పవయ్యా శెట్టి! మేము మీకెలా ఋణపడ్డామో? అన్నాడు చక్రవర్తి. శెట్టి జవాబు ఇవ్వలేదు. గుడి వైపు చూశాడు. ‘చక్రవర్తి ఈ నకరశెట్టికి బాకీపడిన మాట వాస్తవమే’ అంటూ వీరభద్రుని గుడిలోంచి సమర్థింపుగా చిన్న చిర్నవుతో బయటికి వచ్చాడు మహామంత్రి శివదేవయ్య దేశికుడు. త్రిశూలధారి... విశాలమైన ఫాలంపై అడ్డబొట్టు... చుట్టూ మూగిన జనం కూడా శివదేవయ్య మంత్రి వంకకి తిరిగారు. ‘రేవు పట్టణాలలో దిగే వర్తకులకి రక్షణ కల్పిస్తామని చక్రవర్తి చేసిన శాసనం నిజమైతే ఈ శెట్టికి వచ్చిన నష్టానికి తమరూ తమ అధికార యంత్రాంగమే బాధ్యులు. చేసిన వాగ్దానం తప్పితే ఎంతటి రాజునైనా నిర్బంధించడంలో తప్పు లేదు’ అన్నాడు శివదేవయ్య. ‘అదెలా సాధ్యం గురుదేవా? రేవులోని సరుకులకి కరణాలు, రాజోద్యోగులూ బాధ్యత వహించగలరు. కానీ సముద్రంలో మునిగిపోయిన నావలకి వారెలా బాధ్యులు?’ అడిగాడు చక్రవర్తి. ‘అవి మునిగిపోవడం ప్రకృతి వైపరీత్యం వల్ల కాదు. దానికి కారకులు తమ శరణులో ఉన్న కొందరు పౌరులే’ అని బదులిచ్చాడు శివదేవయ్య. ‘గురుదేవులకి తెలియనిది లేదు. తమరు వివరించి నన్ను ఋణవిముక్తుణ్ణి చేసి ఈ చిక్కు నుండి బయటపడే ఉపాయం చెప్పగలరు’ అన్నాడు చక్రవర్తి. ముఖంపై ఎంత అణుచుకున్నా దాగని చిరునవ్వుతో ‘అసలు తప్పు మీదే! కళింగ, కాంచీపురాలు జయించి విజయోత్సవాల పేరున దేశంలో కనీవినీ ఎరుగని రీతిలో వసంతోత్సవాలు సంకల్పించారా లేదా? ఆ ఉత్సవాలలో వెదజల్లేందుకు కస్తూరి, కర్పూరహిమం, అగరు, జవ్వాజుల కొరకు నభూతోనభవిష్యతి అనే విధంగా సుగంధ భాండాగారాలు కట్టించారా లేదా?’ అడిగాడు శివదేవయ్య. అవునని తలూపాడు చక్రవర్తి. ‘వాటిని నింపేందుకు దేశం నలుమూలల నుంచి సుగంధ ద్రవ్యాలని అధిక ధరకి కొని దాచిన సరుకుని తమరికి లాభానికి అమ్మాలనుకోవడంలో వర్తకుల తప్పేమిటి? అది వారి నైజం. ఇలాంటి సమయంలో ఈ శెట్టి తన వెంట తెచ్చిన ఐదొందల బారువుల సరుకు కనుక రేవులో దింపే సుగంధ ద్రవ్యాల ధర సగానికి పడిపోతుంది. అందువల్ల సభ్యులకి కలగబోయే నష్టాన్ని నివారించేందుకు రాత్రికిరాత్రి నావలకి తూట్లు పొడిపించి ముంచే పాపం అయ్యావళి సంఘం రేవణ్ణశెట్టికి తప్పలేదు. పరోక్షంగా పాపయ్యశెట్టి నష్టానికి బాధ్యత తమదే. పరిహారం నిర్ణయించి, అతడు ఒప్పుకుంటే తమరు గీత దాటవచ్చు’ అన్నాడు శివదేవయ్య దేశికుడు. న్యాయం తప్పడం గణపతి దేవుని రక్తంలో లేదు. ఆయన అంగీకారంగా తల ఊపి పాపయ్య శెట్టి వైపు వరం ఇచ్చే దేవుడిలా చల్లని చిర్నవ్వు నవ్వాడు. - సాయి పాపినేని ఫోన్: +91 9845034442 -
రుక్మిణీ కల్యాణం అలంపురం క్రీ.శ.1150
‘అన్నింటికీ ఆ గోపాలుడే ఉన్నాడులేవే. ఇప్పుడు దాని పెళ్లికి ఏం తొందరొచ్చిందని?’ విసుక్కుంటూ అన్నాడు విష్ణుదాసు. అక్క ఊరుకోలేదు. ‘నీవిట్లాగే అంటూ కృష్ణారామా అని పద్యాలు పాడుతూ కూర్చుంటే ఎలారా? నేనా వెధవముండని. ఇంట్లో ఈడొచ్చిన పిల్ల! నీ పెళ్ళాం పోయాక ఆడదిక్కులేని సంసారాన్ని ఇన్నాళ్లూ నెట్టుకొచ్చాను. ఇక నావల్లకాదు. ఇకనన్నా దేవుడూ దేవుడూ అని తిరగకుండా దాని పెళ్లీపెటాకుల సంగతి చూడు. పాపం పిచ్చపిల్ల! కట్టుకోడానికి చిరుగుల్లేని పరికిణీ కూడా లేదు’ అంటూ కళ్ల నీళ్లు పెట్టుకుంది. విష్ణుదాసుకు చిరాకు వేసింది. చిరచిరలాడుతూ ఇల్లు వీడివచ్చి తుంగభద్ర ఒడ్డున కూర్చున్నాడు. భార్యావియోగంతో జీవితాన్ని భగవదర్పితం చేసి గురువులు తనకిచ్చిన అక్షరజ్ఞానాన్ని ‘కృష్ణలీలామృతం’ అనే కావ్యం రచించడానికే అంకితం చేసాడు విష్ణుదాసు. ప్రతి శనివారం కేశవాలయంలో అతడు చెప్పే కథాకాలక్షేపం వింటూ భక్తిరసంలో ఓలలాడని వాడు కృష్ణాతుంగభద్రా అంతర్వేదిలోనే లేడు. నవబ్రహ్మేశ్వర శివాలయాల శిఖరాలతో దేదీప్యమానంగా విలసిల్లే బ్రహ్మపురిలో ఆ దినాల్లో మాత్రం విష్ణునామం మార్మోగింది. తన కావ్యంలోని శ్రీకృష్ణ జన్మవృత్తాంతాన్ని విష్ణుదాసు పాపనాశి గుడిలో గానం చేస్తుండగా విని కందూరి దండనాయకుడు బొల్లయరెడ్డి ఆ గ్రంథాన్ని తనకు అంకితమివ్వమని ఎంత ప్రాధేయపడినా వినలేదు. భగవంతుని కైంకర్యాన్ని ఒక మానవమాత్రునికి అర్పించడమా? ఇప్పుడు కూతురి పెళ్లి కోసం ఆ పని చేయాల్సి వస్తుందా? ‘దాని పెళ్లి చేసి ఒక అయ్యచేతిలో పెట్టడం కన్నవాడిగా నా కర్తవ్యం. కాని ఉంఛవృత్తిని ఎంచుకొని పొలాల్లో మిగిలిన గింజలు ఏరుకొని బతుకు వెళ్లదీస్తానని వ్రతం పట్టిన వాడికి కూతురుగా పుట్టడమే దాని కర్మా! ఇదే కవిత్వం ముదిగొండ చాళుక్యభూపతి కొలువులో చెబితే అష్టైశ్వర్యాలతో తులతూగవచ్చు. రుక్కమ్మకి మహారాజులాంటి సంబంధం చేయవచ్చు. ఒక తండ్రిగా తన ధర్మం నెరవేర్చాలంటే ఆ పరమాత్మునికై వండిన నైవేద్యాన్ని ఒక పామర రాజాధముడికి సమర్పించాలా? తప్పదు. గోవిందా! నీవే దిక్కు! ఈ గ్రంథం నీ ఆస్తి! ఇక దీనిని నీవే కాపాడుకోవాలి’ అనుకుంటూ తాళపత్రాలపై ఘంటం పెట్టాడు. అతడి ఆలోచనలే చంపకమాలగా అక్షరరూపంలో ప్రత్యక్షమయ్యాయి. సులభుడ వీవటంచు, నిను చూడగ నెంచితి యేను, మూర్ఖుడన్ అలసత పాడిగాదు నిక, నావులకాపరి నన్ను గావగన్ కలహపు మాటలేల, తమకన్నను రాజులె మేలు, ఇమ్మహిన్ నిలకడ లేనివాడ విక, నీకథ పాడను, రమ్ము ఎమ్మెయిన్ ఇక రాయడానికి కలం కదలలేదు. అలాగే చెట్టుమొదలుకి జారగిలపడ్డాడు. నల్లరేగడిపై మండుటెండ! తుంగభద్ర లంకలపై ఆవులను మేపుతున్న గొల్లవాడొకడు చెట్టుకింద శోషవచ్చి పడున్న విష్ణుదాసుని చూసి పరుగెత్తుకొచ్చాడు.‘అయ్యో అయ్యోరూ. ఇంత గాడ్పులో ఈడకొచ్చిండావే? ముద్దయినా కుడిచినావా లేదా?’ అంటూ చలిదిమూటలోని జొన్న సంకటి ముద్ద అందిస్తున్న ఆలకాపరి- విష్ణుదాసు మగత కళ్లకి వెన్నముద్దలందిస్తున్న శ్రీకృష్ణుడిగా తోచాడు.‘గోపాలా. పిలువగానే పలికే దేవుడివి. నీ కోసం రాస్తున్న ఈ కావ్యం చాళుక్యరాజుకి ఇవ్వదలిచాను. అంతకు మించి నాకు దారి కనబడదు’ అంటూ ఒడిలోని తాళపత్రాలు గొల్లవాడి చేతిలో పెట్టి ‘నా రుక్మిణమ్మ పెళ్లికి వేరే దారి చూపి నీ సొత్తు ఎలా కాపాడుకుం టావో నీదే భారం!’ అన్నాడు. ‘ముందటగా ముద్ద కడుపు అయ్యోరూ. రుక్కమ్మంటే మసూరి మాలచ్చిమి. ఆయమ్మ మనువంటే ఎల్లారికీ సంబరమే. ఊరేమన్నా ఒట్టిపోయినాదా? అందరం తలో చెయ్యేసినామా వైభోగంగా సెయ్యొచ్చు’ అంటున్న గొల్లవాడి మాటలు- ‘రుక్మిణి నా కోసం అవతరించిన మహాలక్ష్మి. ఆమె వివాహమంటే నాకూ ఇష్ణమే. నేనున్నానుగా? నీ ధర్మం నీవు నెరవేర్చు! రుక్మిణీ కళ్యాణం వైభవంగా నిర్వహించడం నాది బాధ్యత’ అని అభయమిస్తున్న శ్రీకృష్ణుడి వచనాలుగా తోచాయి. ఉంఛదీక్షకి తిలోదకాలిచ్చి రాజాశ్రయం కొరకు కుమార్తెతో సహా కళింగానికి వెళ్లే వర్తకుల బిడారుతో కలిసి ముదిగొండకి ప్రయాణమయ్యాడు విష్ణుదాసు. ‘ఛల్’ అని అదిలిస్తూ గుర్రాన్ని తరాటుగతిలో ముందుకి నడిపాడు క్రిష్ణయ్యలెంక కత్తిని చక్రంలా తిప్పుతూ. గరుడదృష్టితో యుద్ధానికి దూకితే పాతికమంది బందిపోట్లకు ఒక్కడే సమాధానం చెప్పగలడు. అంత చిన్నతనంలోనే వర్తక బిడారుని రక్షించే వీరబలింజ ముమ్మూరిదండుకి నాయకుడు. నల్లని మేనిఛాయ, విశాలమైన కళ్ళు, కోటేరేసిన ముక్కుతీరు, కండలు తిరిగిన ఆరడుగుల శరీరంతో చూసినవారి చూపు మరల్చుకోలేని అందగాడు. గూడుబండిలో ప్రయాణిస్తున్న రుక్మిణిని ఘడియ ఘడియకీ పలకరించనిదే క్రిష్ణయ్యకి పొద్దుపోదు. పూడూరులో కృష్ణానది బల్లకట్టు వద్ద ఆ కన్యకి చేయందించినప్పటి కరస్పర్శ నెలరోజుల ప్రయాణంలో అతడి కనులకు నిద్దుర దూరం చేసింది. వర్ధమానపురి సంతలో కొనిచ్చిన సిరిమువ్వలజత ఆమె ముంగాళ్ళపై మెదుల్తుంటే ఆ లత్తుక దిద్దిన పాదాలు తన అరచేతులలో పట్టి ముద్దాడాలనే తపన. పొట్లకెరెలో (పటాన్చెరు) కూచిపూడి భాగవతులు ఆడే రుక్మిణీ కల్యాణం నాటకం చూస్తున్నప్పుడు ఆమె కనులలో మెదిలిన భావం అతడికి అర్థం కాకపోలేదు. కాని ఆమె బ్రాహ్మణకన్య. తాను బలిజశెట్టి. ఆమె తండ్రికది అంగీకారం కాకపోవచ్చు. కన్యాపహరణం! అందునా బాపనపిల్ల! ఎలా? ఇక రెండు యోజనాలలో కొలనుపాక (కరీంనగర్ జిల్లా). అక్కడ నుంచి తూర్పుకి రాజమహేంద్రి మీదుగా కళింగమార్గం. ముదిగొండ మరెంతో దూరం లేదు. ఇక జాప్యం చేస్తే పిల్ల చేజారిపోతుంది. కొలనుపాక ఐదు మార్గాల కూడలి. ఉత్తరాదికి అయోధ్య రాచబాట. శ్రీరామచంద్రునిచే నిర్మించబడ్డ రహదారి. కాశీకి వెళ్లే మార్గం. మరొకటి కొరివిసీమ (ఖమం జిల్లా) ద్వారా వెలనాటికి (కృష్ణా, గుంటూరు తీరప్రాంతం). ఇంకొకటి దక్షిణాన పలనాడు మీదుగా కంచి రాజమార్గం. ఏ దిక్కు పోయినా పట్టుకోవడం బ్రహ్మతరంగాదు. విష్ణుదాసు కృష్ణలీల కావ్యంలో రుక్మిణీ కల్యాణ ఘట్టం రాయడం పూర్తయిననాడే రుక్మిణీ, క్రిష్ణయ్యల జంట పలనాటి మార్గాన పలాయనమయింది. కృష్ణార్పణంగా రచించిన కృతిని మానవునికి అంకితమివ్వాలనే నిర్ణయానికి కారణం విష్ణుదాసుకి కుమార్తె పట్ల పితృధర్మం. ఆ భగవంతుడి అనుగ్రహమే కావచ్చు ఇప్పుడా భవబంధం నుంచి విష్ణుదాసుకి విముక్తి కలిగింది. కట్టిన ముడుపు రాజులపాలు కాకుండా కాపాడుకోటానికి ఆ దేవుడే స్వయంగా దిగివచ్చి రుక్మిణీ కల్యాణాన్ని తన కనుల ముందట పునఃప్రదర్శించాడు. విష్ణుదాసుడి ఆనందానికి అంతులేక పోయింది. కృష్ణలీలామృతాన్ని పరవశంగా గానం చూస్తూ ఇంటిదారి పట్టాడు. కనుల ముందు కదిలే కుంచె బొమ్మలూ మనసుల్లో కలకాలం నిశ్చలంగా నిలిచే చలనచిత్రాల ద్వారా భక్తిరసాన్ని తనదైన పంథాలో మన తెలుగువాళ్లకి అందించిన బాపూ స్మృతికి, స్ఫూర్తికి ఉడతాభక్తిగా ఈ కథాకుసుమం... - సాయి పాపినేని + 91 9845034442 జాతి ఐక్యతకి రహదారి భక్తి సాహిత్యం తెలుగు సాహిత్యానికి వరవడి భక్తి సాంప్రదాయం నుంచే వచ్చింది. వైదిక బ్రాహ్మణమతం నేడు మనం గుర్తించే హిందూమతంగా పరిణామం చెందడానికి ఆంధ్రదేశంలో చుట్టుపక్కల రాష్ట్రాల కంటే కాస్త ఎక్కువ వ్యవధి తీసుకొన్న మాట వాస్తవం. అయినప్పటికీ హిందూమతంలో వచ్చిన సరికొత్త ఝంఝామారుతం తాకిడికి కోస్తాంధ్రలో వేళ్ళూనిన బౌద్ధమతం, తెలంగాణ- రాయలసీమ శుష్కభూముల్లో ప్రాచుర్యానికి వచ్చిన జైనమతం నిలువలేక పోయాయి. ఒక వంక గండకత్తెరలూ త్రిశూలాలతో తాండవం చేసే వీరశైవం, మరోవంక పారవశ్యపు మత్తులో పదాలు పద్యాలు పాడుతూ నాట్యంచేసే వైష్ణవం, చెదురుమదురుగా మిగిలిన శాక్త, సౌర్య, గాణపత్య, స్కాంధ సాంప్రదాయాలూ, ఆటవిక జనజాతుల నమ్మకాలూ మాత్రమే కాక బౌద్ధ, జైన మతాల్లో జనసామాన్యానికి నచ్చిన పూజాక్రమాలన్నింటినీ తనలో ఇముడ్చుకొన్న నూతన క్రమమే హిందూమతం. పండగకి పబ్బానికి సామాన్యుల చేదోడుగా ఉంటూ ఊరూరా నివసించిన పేద బాపనయ్యలు ఈ మతానికి మూలస్తంభాలుగా నిలిచారు. యజ్ఞయాగాలకి బదులు సామాన్య స్త్రీపురుషులకి అందుబాటైన వ్రతాలు, దీక్షలు, పూజలు మానవునికి దేవుళ్ళకి వారధులయ్యాయి. ముడుపులు కట్టడం, తీర్థాలు దర్శించడం సర్వసామాన్యం అయింది. రాజప్రాపకం ఉన్న చోట్ల వెలసిన ఆలయాలు ఈ మతానికి కేంద్రబిందువులయ్యాయి. దేవుళ్ళకి రాజలాంచనాలు లభించాయి. అలంపురంలో మొదలైన ఆలయ శిల్పసంస్కృతి భాగవత, శివపురాణ గాథలని అద్భుతమైన రీతుల్లో చిత్రించి భక్తులకి దేవుడి రూపాలు సాక్షాత్కరింప జేస్తే- బమ్మెర పోతన, గోన బుద్ధారెడ్డి వంటి మహాకవులు ఆ కథలను పద్యాల రూపాన ప్రజల నాల్కలపై పలికించారు. నాటి సాహిత్యానికి పురాణాలు, ఇతిహాసాలలోని గాథలే ముఖ్యాంశాలైనా స్వతంత్రమైన తెలుగు భాషలో నాటి సామాజిక పరిస్థితులని ప్రతిబింబిస్తూ రచనలు సాగాయి. నెల్లూరులో తిక్కన రాసిన భారతం ఓరుగల్లు భాగవతం రాసిన పోతనకి వరవడైతే గుంటూరు శ్రీనాథుడు సభలో కనకాభిషేకం గ్రహించాడు. రాజకీయంగా నాడులు, వాడలుగా విభజింపబడినా తెలుగునాడు సాహిత్యం వల్ల సంస్కృతిపరంగా ఒకటయింది. ఆ కలయికకు వాణిజ్యంతో పాటూ పెరిగిన బండి మార్గాలు దోహదం చేశాయి. కాశీ నుంచి అయోధ్య, ప్రయాగ, ఉజ్జయినిలను కలుపుతూ బోధన్ వద్ద ఆంధ్రదేశంలో ప్రవేశించిన అయోధ్యరాజమార్గం- కంచి రామేశ్వరాలకి సాగి దేశంలో అతి పెద్ద రహదారి అయింది. సూరత్ నుండి దక్షిణానికి వచ్చే రాజమార్గం పటన్‌చెరు, అలంపురం, గుత్తి, పెనుగొండల మీదుగా మధురై వరకూ వెళ్ళేది. దక్షిణాన వివిధ రాజధానులను కలుపుతూ తూర్పు పడమరలుగా మరిన్ని రహదారులు ఉండేవి. ధాన్యకటకం నుండి వేంగి, రాజమండ్రి మీదుగా బెంగాల్‌కి ఒక మార్గం. అలంపురానికి మోటుపల్లి నుండి అద్దంకి, వినుకొండ, త్రిపురాంతకం ద్వారా ఒకటి, కంచి నుండి కాళహస్తి బాటలు, దేశమంతా అల్లుకొని దూరాలు తగ్గించాయి. సామాన్య ప్రజలు కూడా ఉద్యోగాలకీ వివాహాలకీ దూరపు సంబంధాలు కలుపుకొనసాగారు. బండ్లు పోలేని బాటల్లో పల్లకీలు, గుర్రాలు, ఏనుగులు, ఒంటెలు వినియోగించారు. రహదారులలో సత్రాలు, సంతలు, బండ్లు రిపేరు చేసే కార్ఖానాలు ఉండేవి. ఎడ్లు, గుర్రాలను అద్దెలకిచ్చే వ్యవస్థ ఉండేది. బిడారులుగా పోయే వర్తకులను రక్షించేందుకు ముమ్మూరి దండులు, వీరబలిజలు వంటి యోధుల దుండ్లు ఉండేవి. వీరు మార్షల్ ఆర్ట్స్‌లో ప్రవీణులు. పల్నాటిచరిత్ర, సింహసనద్వాత్రింశికల్లో ఫణిదృష్టి, కపిదృష్టి, శార్దూలదృష్టి వంటి యుద్ధవిద్యా విన్యాసాలు చదివితే ‘స్నెక్ ఇన్ మంకీస్ షాడో’, ‘క్రౌచింగ్ టైగర్’ వంటి షావోలిన్ కుంగ్‌ఫూ సినిమాలు గుర్తొస్తాయి. పదం నుంచి పథంలోకి 15 సాయి పాపినేని -
గుడి పండగ
ఎఱంద ప్రాంతంలో అప్పలకొండ క్రీ.శ.1100 (నేటి సింహాచలం) పదం నుంచి పథంలోకి 14 మహాపాత్రుడు వైఖాసన క్రమంలో వరాహనృసింహుని దేవస్థానాధిపతి. క్షేత్రంలో భండారి, శ్రీకరణం, కోష్టకరణం (కొట్టులెక్కల అధికారి), ఆచార్యుడు, అర్చకులు, బోయలు, గొల్లలు, సానులు గల పరిషత్తులో అతడి మాటంటే వేదవాక్కు. అతడి కొడుకు తిరిగి వచ్చిన సందర్భంలో మహాపాత్రుని ఇంట్లో సందడి అంతింత కాదు. దానికి తోడు కటకమానపు గిరిప్రదక్షిణం కళింగంలోనే పెద్దపండగ. ‘పండగ కాగానే కోడలిని ఇంటికి తెచ్చుకుంటే బాగుంటుంది, ఏమంటారు?’ అడిగింది మహాపాత్రుడి ఇల్లాలు. ‘అవునవును! ఇవాళ మంచిరోజు. శకునాలూ బాగున్నాయి. గుడికి వెళ్ళగానే నీ అన్నకి కమ్మ రాసి శ్రీకూర్మానికి పంపిస్తాను. కార్తీకమాసంలో ముహూర్తం పెట్టి పంపిస్తే మనవాణ్ని శోభనానికి పంపిద్దాం’ ‘మనమూ వెళ్దామండీ. అన్నయ్యనీ వదినెనీ చూసి చాలా నాళ్ళయింది’ ‘పోయిన సంక్రాంతికే గదే వెళ్లావ్? నేనయితే కోడలిని పెళ్ళిలో చూడటమే. ఏడే ళ్ళయింది. గుడి పనులతో క్షణం తీరిక దొరకదు. అయినా ఈసారి తప్పదులే. అప్పగింతలకి మనం లేకుంటే ఎలా?’ మూల కూర్చోని వెక్కివెక్కి ఏడుస్తోంది ముత్యాలు. ‘అక్కా! ఏడ్వమాకే. నువు లానంటే నానెట్టాగే పోయేది?’ పూరింటి వసారా అరుగు మీద బారెడు జడకి మొగలిరేకులు అల్లి, సింగారాన్ని రాగి అద్దంతో చూసుకుని మురిసిపోతూ అడిగింది దాని చెలె ్లలు కన్నమ్మ- ‘బేగా తయ్యరైపో. ఏటంటావ్?’ అంది. ‘ఆడ్ని పొట్టనెట్టుకున్న ఆ దేముణ్నేటికే నాను మొక్కేది? నువె ్వల్లు. నాను లాను’ కొంగుతో మొగం తుడుచుకుంటూ జవాబిచ్చింది ముత్యాలు. ‘నీవో మారు నాతో వచ్చీయ్. పెదపాత్రులకి మొరెట్టుకుని గుళ్ళో సాతాని పనో దివిటీల పనో ఏదన్నా ఇిప్పిస్తా’ అంటూ ప్రాధేయపడింది కన్నమ్మ. ‘ఆ దివిటీల పనే నా పానం తీసింది. మద్దిలపాలెం పండక్కి ఆయేళ పోమాకరా అంటే ఇనిపించుకోలేదు సచ్చినోడు. పందిరి అంటించి ఆడనే సచ్చాడు. నావొల్ల కాదులేయ్. ఒగ్గేయ్’ ‘కొండచుట్టే పండగే! తీర్థాల దంక తానాలు చేసి పొద్దుటాలకి వచ్చీయొచ్చు. దారంట ప్రతి పల్లెలో, పాలెంలో చలిది కుండలు, దద్దోనాలు పెడతారు. ఆడతా పాడతా పోయేసి మొక్కి తిరిగొచ్చీద్దాం’ ముత్యాలు మొగుడు అప్పడు గుళ్ళో దివ్వెకోల పట్టేవాడు. మద్దిలపాలెం ఊరి పండగలో చినరడ్డి పోయించిన కల్లు దాగిన మైకంలో ఆడే పందిరి అంటించాడని పంచాయతీ పెద్దలు తీరుమానం చేసారు. రెక్కాడితేగాని డొక్కాడని బతుకులు. ఏదన్నా పని లేకుంటే బతుకు గడవదు. సాతాని పనికి రోజుకి మూడు కాకిరూకల బత్తెం, గుళ్ళో ప్రసాదం, పానకం. కానీ ఆడు చేసిన తప్పిదానికి జాతర్లో ఆరుగురు చచ్చారు. ఆడికి బదులుగా పని అడిగేటికి మొగం చెల్లదు. ఏటి చేయాలో దిక్కుతోచని ముత్యాలుకి చెల్లెలి మాట సబబే అనిపించింది. సరే పద! అని బయలుదేరింది. గిరి ప్రదక్షిణం పనులకి తోడు రాజమహేంద్రి ఆస్థానం నుంచి గుడి లెక్కలు చూసేందుకు భోగపరీక్షకుడు (ఆడిటర్) వస్తున్నాడని కబురు వచ్చింది. కొష్టాల లెక్కలు, జీతబత్యాలు, స్వామివారి కానుకలూ కట్నాలే కాక గుడి మాన్యాలు, పశువులు, పాడి ప్రసాదాలు అన్నిటినీ పర్యవేక్షించి మహారాజుకి నివేదించడం అతడి పని. ఏమాత్రం లెక్కతప్పినా ఉద్యోగాలకే ముప్పు. దాంతో మహాపాత్రుడికి క్షణం తీరికలేదు. వియ్యంకుడికి కమ్మ రాస్తానన్న విషయం హడావుడిలో మరిచిపోయాడు. ‘వచ్చేవాడు యముడు! కైలాసనాథ దేశికుడు. శైవుడు! దక్షారామంలో శ్రీగంధం మూడు పుట్ల తేడా వచ్చిందని కోష్టకరణాన్ని తొలగించి గ్రామం నుంచి వెలి వేయించాడు. శివాలయంలోనే అలా చేస్తే మన నిలువుబొట్టని వదులుతాడా?’ బిక్కమొహంతో ఎదురు నిలిచాడు భండారి. ‘మన గుళ్ళో అలాంటి తేడాలకి ఆస్కారం లేదు. మొన్ననేగా చందనోత్సవం తరువాత అన్ని లెక్కలూ చూశాం. అనవసరంగా అధైర్యపడక ఈ పండగ పనులు చూడండి.’ ‘అలా కాదు పాత్రులూ! ఒకటా రెండా? డెబ్భైవేల వశువులు అంటే ఏడొందలకి పైన గొల్లకాపర్లు. కొండ చుట్టూ వెయ్యి గోచరాల పంటపొలాలు అంటే ఐదువేల కాపు కుటుంబాలు. పూలతోటల మాలదాసర్లు, పంచాణం వాళ్ళు, వంటవాళ్ళు, గుళ్ళో పని చేసే సాతానులు, భోగంవీధిలో సానులు... వీళ్ళలో ఏ ఒక్కరు తప్పు చేసినా అది మన తలకి చుట్టుకుంటుంది. ఒకసారి అందరినీ పిలిపించి లెక్కలు మరోసారి విచారిస్తే మంచిది.’ ‘సరే అలాగే చేద్దాం! అందరినీ రేపు ఉదయాన్నే పిలిపించండి’ ‘రేపా? మరి తీర్థం స్నానాల వద్ద అన్నదానాలు, ప్రసాదాలు ఎవరు పర్యవేక్షిస్తారు?’ ‘ఆ విషయంలో భయం లేదు. అబ్బాయి నరసింహుడు వచ్చాడుగా! వాడిని నియోగిస్తాను. అరే! అసలు విషయం మరిచాను’ కొడుకు మాట రాగానే వియ్యంకుడికి రాయాల్సిన కమ్మ గుర్తుకొచ్చింది. వియ్యంకుడికి ఉత్తరం రాయటంలో నిమగ్నుడయ్యాడు. జోడుగుళ్ళలో మొక్కి కొండ చుట్టేందుకు సిద్ధమయ్యారు అక్కాచెల్లెళ్ళు. మొగుడు పోయిన ఒంటరిది! అయినా పసుపంచు పావడా, మందారపు రంగు వల్లెవాటు, అరముడితో బిగువుగా కట్టిన రవికెలో మిడిసిపడే మేని నిగారింపుతో ఉంది ముత్యాలు. ఆ మేని చూసి జోడు కట్టేందుకు పోటీపడే కుర్రకారు ఎకసెక్కాలతో, కొంటె పాటలతో దారి పొడుగునా దాని వెన్నంటే ఉన్నారు. మూడు యోజనాల (34 కిమీ) అడివిదారి! దారిలో అక్కడక్కడా కాపుల కొష్టాలు, అగ్రహారాలు, జాతరకి వేలాదిగా వచ్చిన భక్తుల కోసం ప్రతి కోసుకకి చలివేంద్రాలు, తాహతుకి తగినట్లు పౌరులు ఏర్పాటు చేసిన పొంగుళ్ళు, పులిహోర, దధ్యోదనం. తాగేందుకు చల్లముంతల్లో మజ్జిగ, పానకం, ఆగిన ప్రతిచోటా పందిళ్ళలో బొమ్మలాటలు, సానివాళ్ళ చిందులు, కథలు చెప్పే భాగోతులు, పాము- తేలుకాట్లకి బెణికిన కీళ్లకి విరిగిన ముళ్ళకి, బొబ్బలెక్కిన అరికాళ్ళకి పసరు కట్లుకట్టే ఆచారులు, శాస్త్రచికిత్స చేసే మంగళ్ళు... ఎంత నడిచినా అలుపే తెలియలేదు. మెట ్లకింద నుండే అప్పన్నకి మొక్కి, పొద్దు పొడిచేలోగా సముద్రతీరం చేరారు. ఎత్తివస్తున్న అలలని తొక్కుతూ ఒకరిపైనొకరు నురగ చల్లుకుంటూ సరసాలతో కేరింతలతో కాలమే తెలియలేదు. సముద్రపుటొడ్డున భక్తుల కోసం పెద్ద భోజనాల పందిరి. పందిరి కింద వంటవాళ్ళని వడ్డించేవాళ్ళనీ పురమాయిస్తూ క్షణం తీరిక లేకుండా ఉన్న నరసింహాచారిని సమీపించారా అక్కాచెల్లెళ్ళు. వంటికి అతుక్కున్న చీరెలో, నడుము దాటే తడిసిన కురులతో మత్స్యకన్యలా వస్తున్న ముత్యాలుపై నుంచి చూపు మరల్చుకోలేక పోయాడు చినసాత్రుడు. ఒక చెవితో దాని చెల్లెలు చెప్తున్న గోడు వింటున్నా అతడి మనసంతా దాని పొందు కోసం ఆరాటపడసాగింది. ఎలా? అని ఆలోచించగా ఉపాయం తట్టింది... రంగసాని! సానిమున్నూరు గణానికి నాయకురాలు. ఇలాంటి విషయాలలో ఆమే సరియైన ఉపాయం చెప్పగలదు! రేపు సాయంకాలం గుడి వెనక నాట్యమండపానికి రావే. అక్కడ ఏ సంగతీ చెబుతాను’ కనులంతా దాని రూపాన్నే నింపుకోని వణికే గొంతుతో చెప్పాడు నరసింహాచారి. పాతికేళ్ళు గ డిచాయి.... స్థానాధికారి నరసింహాచార్య మహాపాత్రుని నీడలో, రంగసాని శిక్షణలో, అనతికాలంలోనే సానిమున్నూరు గణానికే తలమానికంగా ఎదిగింది ముత్యాలమ్మ. భోగంవీధిలో రెండంతస్తుల మేడ, కళింగంలో నూరెకరాల మాగాణి, పరిచారికలు, మందిమార్బలం... చందనోత్సవంలో ఆమె చెంచులక్ష్మి వేషానికి గజ్జె కడితే ఆ నాట్యం చూసేందుకు కళింగన గరం, రాజమహేంద్రం వంటి నగరాల నుంచి కూడా జనం వస్తారు. వృద్ధాప్యంలో ఆమె దానం ఇచ్చిన 16 బారువుల (2300 కిలోలు) వెండితో నృత్యమండపానికి తొడుగు వేసిన పంచాణం కంసాలి ప్రతిభని ప్రశంసిస్తూ నరసింహాచార్య మహాపాత్రుడే స్వయంగా ముఖమంటపంలో దానశాసనాన్ని వేయించాడు. ఠి మహాపాత్రుడు వైఖాసన క్రమంలో వరాహనృసింహుని దేవస్థానాధిపతి. క్షేత్రంలో భండారి, శ్రీకరణం, కోష్టకరణం (కొట్టులెక్కల అధికారి), ఆచార్యుడు, అర్చకులు, బోయలు, గొల్లలు, సానులు గల పరిషత్తులో అతడి మాటంటే వేదవాక్కు. అతడి కొడుకు తిరిగి వచ్చిన సందర్భంలో మహాపాత్రుని ఇంట్లో సందడి అంతింత కాదు. దానికి తోడు కటకమానపు గిరిప్రదక్షిణం కళింగంలోనే పెద్దపండగ. ‘పండగ కాగానే కోడలిని ఇంటికి తెచ్చుకుంటే బాగుంటుంది, ఏమంటారు?’ అడిగింది మహాపాత్రుడి ఇల్లాలు. ‘అవునవును! ఇవాళ మంచిరోజు. శకునాలూ బాగున్నాయి. గుడికి వెళ్ళగానే నీ అన్నకి కమ్మ రాసి శ్రీకూర్మానికి పంపిస్తాను. కార్తీకమాసంలో ముహూర్తం పెట్టి పంపిస్తే మనవాణ్ని శోభనానికి పంపిద్దాం’ ‘మనమూ వెళ్దామండీ. అన్నయ్యనీ వదినెనీ చూసి చాలా నాళ్ళయింది’ ‘పోయిన సంక్రాంతికే గదే వెళ్లావ్? నేనయితే కోడలిని పెళ్ళిలో చూడటమే. ఏడే ళ్ళయింది. గుడి పనులతో క్షణం తీరిక దొరకదు. అయినా ఈసారి తప్పదులే. అప్పగింతలకి మనం లేకుంటే ఎలా?’ మూల కూర్చోని వెక్కివెక్కి ఏడుస్తోంది ముత్యాలు. ‘అక్కా! ఏడ్వమాకే. నువు లానంటే నానెట్టాగే పోయేది?’ పూరింటి వసారా అరుగు మీద బారెడు జడకి మొగలిరేకులు అల్లి, సింగారాన్ని రాగి అద్దంతో చూసుకుని మురిసిపోతూ అడిగింది దాని చెలె ్లలు కన్నమ్మ- ‘బేగా తయ్యరైపో. ఏటంటావ్?’ అంది. ‘ఆడ్ని పొట్టనెట్టుకున్న ఆ దేముణ్నేటికే నాను మొక్కేది? నువె ్వల్లు. నాను లాను’ కొంగుతో మొగం తుడుచుకుంటూ జవాబిచ్చింది ముత్యాలు. ‘నీవో మారు నాతో వచ్చీయ్. పెదపాత్రులకి మొరెట్టుకుని గుళ్ళో సాతాని పనో దివిటీల పనో ఏదన్నా ఇిప్పిస్తా’ అంటూ ప్రాధేయపడింది కన్నమ్మ. ‘ఆ దివిటీల పనే నా పానం తీసింది. మద్దిలపాలెం పండక్కి ఆయేళ పోమాకరా అంటే ఇనిపించుకోలేదు సచ్చినోడు. పందిరి అంటించి ఆడనే సచ్చాడు. నావొల్ల కాదులేయ్. ఒగ్గేయ్’ ‘కొండచుట్టే పండగే! తీర్థాల దంక తానాలు చేసి పొద్దుటాలకి వచ్చీయొచ్చు. దారంట ప్రతి పల్లెలో, పాలెంలో చలిది కుండలు, దద్దోనాలు పెడతారు. ఆడతా పాడతా పోయేసి మొక్కి తిరిగొచ్చీద్దాం’ ముత్యాలు మొగుడు అప్పడు గుళ్ళో దివ్వెకోల పట్టేవాడు. మద్దిలపాలెం ఊరి పండగలో చినరడ్డి పోయించిన కల్లు దాగిన మైకంలో ఆడే పందిరి అంటించాడని పంచాయతీ పెద్దలు తీరుమానం చేసారు. రెక్కాడితేగాని డొక్కాడని బతుకులు. ఏదన్నా పని లేకుంటే బతుకు గడవదు. సాతాని పనికి రోజుకి మూడు కాకిరూకల బత్తెం, గుళ్ళో ప్రసాదం, పానకం. కానీ ఆడు చేసిన తప్పిదానికి జాతర్లో ఆరుగురు చచ్చారు. ఆడికి బదులుగా పని అడిగేటికి మొగం చెల్లదు. ఏటి చేయాలో దిక్కుతోచని ముత్యాలుకి చెల్లెలి మాట సబబే అనిపించింది. సరే పద! అని బయలుదేరింది. గిరి ప్రదక్షిణం పనులకి తోడు రాజమహేంద్రి ఆస్థానం నుంచి గుడి లెక్కలు చూసేందుకు భోగపరీక్షకుడు (ఆడిటర్) వస్తున్నాడని కబురు వచ్చింది. కొష్టాల లెక్కలు, జీతబత్యాలు, స్వామివారి కానుకలూ కట్నాలే కాక గుడి మాన్యాలు, పశువులు, పాడి ప్రసాదాలు అన్నిటినీ పర్యవేక్షించి మహారాజుకి నివేదించడం అతడి పని. ఏమాత్రం లెక్కతప్పినా ఉద్యోగాలకే ముప్పు. దాంతో మహాపాత్రుడికి క్షణం తీరికలేదు. వియ్యంకుడికి కమ్మ రాస్తానన్న విషయం హడావుడిలో మరిచిపోయాడు. ‘వచ్చేవాడు యముడు! కైలాసనాథ దేశికుడు. శైవుడు! దక్షారామంలో శ్రీగంధం మూడు పుట్ల తేడా వచ్చిందని కోష్టకరణాన్ని తొలగించి గ్రామం నుంచి వెలి వేయించాడు. శివాలయంలోనే అలా చేస్తే మన నిలువుబొట్టని వదులుతాడా?’ బిక్కమొహంతో ఎదురు నిలిచాడు భండారి. ‘మన గుళ్ళో అలాంటి తేడాలకి ఆస్కారం లేదు. మొన్ననేగా చందనోత్సవం తరువాత అన్ని లెక్కలూ చూశాం. అనవసరంగా అధైర్యపడక ఈ పండగ పనులు చూడండి.’ ‘అలా కాదు పాత్రులూ! ఒకటా రెండా? డెబ్భైవేల వశువులు అంటే ఏడొందలకి పైన గొల్లకాపర్లు. కొండ చుట్టూ వెయ్యి గోచరాల పంటపొలాలు అంటే ఐదువేల కాపు కుటుంబాలు. పూలతోటల మాలదాసర్లు, పంచాణం వాళ్ళు, వంటవాళ్ళు, గుళ్ళో పని చేసే సాతానులు, భోగంవీధిలో సానులు... వీళ్ళలో ఏ ఒక్కరు తప్పు చేసినా అది మన తలకి చుట్టుకుంటుంది. ఒకసారి అందరినీ పిలిపించి లెక్కలు మరోసారి విచారిస్తే మంచిది.’ ‘సరే అలాగే చేద్దాం! అందరినీ రేపు ఉదయాన్నే పిలిపించండి’ ‘రేపా? మరి తీర్థం స్నానాల వద్ద అన్నదానాలు, ప్రసాదాలు ఎవరు పర్యవేక్షిస్తారు?’ ‘ఆ విషయంలో భయం లేదు. అబ్బాయి నరసింహుడు వచ్చాడుగా! వాడిని నియోగిస్తాను. అరే! అసలు విషయం మరిచాను’ కొడుకు మాట రాగానే వియ్యంకుడికి రాయాల్సిన కమ్మ గుర్తుకొచ్చింది. వియ్యంకుడికి ఉత్తరం రాయటంలో నిమగ్నుడయ్యాడు. జోడుగుళ్ళలో మొక్కి కొండ చుట్టేందుకు సిద్ధమయ్యారు అక్కాచెల్లెళ్ళు. మొగుడు పోయిన ఒంటరిది! అయినా పసుపంచు పావడా, మందారపు రంగు వల్లెవాటు, అరముడితో బిగువుగా కట్టిన రవికెలో మిడిసిపడే మేని నిగారింపుతో ఉంది ముత్యాలు. ఆ మేని చూసి జోడు కట్టేందుకు పోటీపడే కుర్రకారు ఎకసెక్కాలతో, కొంటె పాటలతో దారి పొడుగునా దాని వెన్నంటే ఉన్నారు. మూడు యోజనాల (34 కిమీ) అడివిదారి! దారిలో అక్కడక్కడా కాపుల కొష్టాలు, అగ్రహారాలు, జాతరకి వేలాదిగా వచ్చిన భక్తుల కోసం ప్రతి కోసుకకి చలివేంద్రాలు, తాహతుకి తగినట్లు పౌరులు ఏర్పాటు చేసిన పొంగుళ్ళు, పులిహోర, దధ్యోదనం. తాగేందుకు చల్లముంతల్లో మజ్జిగ, పానకం, ఆగిన ప్రతిచోటా పందిళ్ళలో బొమ్మలాటలు, సానివాళ్ళ చిందులు, కథలు చెప్పే భాగోతులు, పాము- తేలుకాట్లకి బెణికిన కీళ్లకి విరిగిన ముళ్ళకి, బొబ్బలెక్కిన అరికాళ్ళకి పసరు కట్లుకట్టే ఆచారులు, శాస్త్రచికిత్స చేసే మంగళ్ళు... ఎంత నడిచినా అలుపే తెలియలేదు. మెట ్లకింద నుండే అప్పన్నకి మొక్కి, పొద్దు పొడిచేలోగా సముద్రతీరం చేరారు. ఎత్తివస్తున్న అలలని తొక్కుతూ ఒకరిపైనొకరు నురగ చల్లుకుంటూ సరసాలతో కేరింతలతో కాలమే తెలియలేదు. సముద్రపుటొడ్డున భక్తుల కోసం పెద్ద భోజనాల పందిరి. పందిరి కింద వంటవాళ్ళని వడ్డించేవాళ్ళనీ పురమాయిస్తూ క్షణం తీరిక లేకుండా ఉన్న నరసింహాచారిని సమీపించారా అక్కాచెల్లెళ్ళు. వంటికి అతుక్కున్న చీరెలో, నడుము దాటే తడిసిన కురులతో మత్స్యకన్యలా వస్తున్న ముత్యాలుపై నుంచి చూపు మరల్చుకోలేక పోయాడు చినసాత్రుడు. ఒక చెవితో దాని చెల్లెలు చెప్తున్న గోడు వింటున్నా అతడి మనసంతా దాని పొందు కోసం ఆరాటపడసాగింది. ఎలా? అని ఆలోచించగా ఉపాయం తట్టింది... రంగసాని! సానిమున్నూరు గణానికి నాయకురాలు. ఇలాంటి విషయాలలో ఆమే సరియైన ఉపాయం చెప్పగలదు! ‘రేపు సాయంకాలం గుడి వెనక నాట్యమండపానికి రావే. అక్కడ ఏ సంగతీ చెబుతాను’ కనులంతా దాని రూపాన్నే నింపుకోని వణికే గొంతుతో చెప్పాడు నరసింహాచారి. పాతికేళ్ళు గ డిచాయి.... స్థానాధికారి నరసింహాచార్య మహాపాత్రుని నీడలో, రంగసాని శిక్షణలో, అనతికాలంలోనే సానిమున్నూరు గణానికే తలమానికంగా ఎదిగింది ముత్యాలమ్మ. భోగంవీధిలో రెండంతస్తుల మేడ, కళింగంలో నూరెకరాల మాగాణి, పరిచారికలు, మందిమార్బలం... చందనోత్సవంలో ఆమె చెంచులక్ష్మి వేషానికి గజ్జె కడితే ఆ నాట్యం చూసేందుకు కళింగన గరం, రాజమహేంద్రం వంటి నగరాల నుంచి కూడా జనం వస్తారు. వృద్ధాప్యంలో ఆమె దానం ఇచ్చిన 16 బారువుల (2300 కిలోలు) వెండితో నృత్యమండపానికి తొడుగు వేసిన పంచాణం కంసాలి ప్రతిభని ప్రశంసిస్తూ నరసింహాచార్య మహాపాత్రుడే స్వయంగా ముఖమంటపంలో దానశాసనాన్ని వేయించాడు. సాయి పాపినేని -
మహమ్మారి
పదం నుంచి పథంలోకి 11 పిఠాపురం క్రీ .శ ...700 , నేటి పిఠాపురం జంధ్యం తెగలాగి వీపుమీద తన్నిన తాపుకి కోట బయటకొచ్చి పడ్డాడు సుబ్బిశాస్త్రి. ఏ పాపమూ ఎరుగనని ఎంత మొత్తుకున్నా విన్నవాళ్లు లేరు. గుడిలో అమ్మవారి రత్నాలహారాన్ని దొంగిలించి సిద్ధులగుట్టలో చాకలిసానికి ఇచ్చాడని పంచాయితీలో అందరూ నమ్మారు. బ్రాహ్మణ పుట్టుక వల్ల పెద్ద శిక్ష తప్పింది. కాలో చెయ్యో నరక్కుండా వెలివేసి వదిలారు. కారుతున్న రక్తం పంచె చెంగుతో తుడుచుకుంటూ ఎటువెళ్లాలో దిక్కుతోచక నిట్టూరుస్తూ లేచి అలాగే నిలుచుండి పోయాడు. గుడిలో నగల భోషాణానికి వేసిన ఐదు తాళాలూ వేసినవి వేసినట్లే ఉన్నాయి. తాళం చెవులు ఒక్కొక్కటి కరణం శ్రీకంఠయ్య, గణాచారి శివలింగప్ప, పంచాణం కంసాలి కొమరయ్య, తలారి నాగయ్య లెంక, భొగంసాని చంద్రవ్వల ఇళ్లలో ఉంటాయి. వాటిలో ఏ ఒక్కటి లేకపోయినా పెట్టె తెరవటం సాధ్యం కాదు. మూసి వున్న భోషాణంలో హారం ఆ చాకలిదానికి ఎలా చేరిందో తెలీదు. గారడీ విద్య చేసే లింగబోయడి సహాయంతో తాను ఆ హారాన్ని మాయం చేసి తనకిచ్చాడని దాని వాంగ్మూలం. దానికి ఋజువు హారానికి చుట్టబెట్టిన పట్టుగుడ్డ. అది తన ఉత్తరీయం నుండి చింపినదే. ఇంట్లో బట్టలబుట్టలోని కొత్త ఉత్తరీయంలో ముక్క బయటకెలా వచ్చినట్లు? సాక్ష్యానికి లింగడు కూడా లేడు. ఎక్కడ మాయమయ్యాడో? సిద్దులగుట్ట్ట పురహూతి ఉపాసకులకీ నెలవు. ఒకవేళ గారడీ ద్వారానే హారాన్ని దొంగిలిస్తే అదెలా జరిగిందో అక్కడి మంత్రగాళ్లకి తెలియకపోదు. నిశ్చయానికి వచ్చి దూరంగా కనిపించే గుట్టవైపు నడిచాడు. అదొక చంపుడుగుడి. చేతిలో కుళ్లి ఈగలు ముసురుతున్న మనిషి తలతో పురహూతిక భయంకరమైన విగ్రహం చూసే ధైర్యం లేక తల వంచుకుని బిరబిరా అడుగులేస్తూ మహామారీచి వద్దకి చేరాడు సుబ్బిశాస్త్రి. మహామారీచివి లోతైన పెద్ద కళ్లు. నుదుటిపై నల్లని బొట్టు. తల మీద మర్రిపాలతో చుట్టిన సిగకొప్పు. మెడలో పుర్రెల మాల. బంగారం, పాదరసాల మిశ్రమంతో పూసిన మైపూత తప్ప వేరే ఆచ్ఛాదనం లేని శరీరం. మొదట చూసి భయకంపితుడైన మాట నిజమే. కానీ ఆమె తనని కన్నతల్లిలా చేరదీసింది. వంటిమీద గాయాలని చిటికెలో నయం చేసింది. తన గోడు విని సాయం చేసేందుకు ముందుకొచ్చిన ఆ మహాతల్లి అంటే ఒకప్పటి భయం స్థానంలో భక్తీ, ప్రేమా చోటుచేసుకున్నాయి. ఆమె పురహూతి ఉపాసకురాలు. మట్టిని బంగారం చేయగల పరుసవేది. రసవిద్యతో మృత్యువుని జయించింది.ఆమెది వందల యేళ్ల వయస్సు. కానీ ఆమె శరీరంలో యవ్వనపు పటిమ ఏమాత్రమూ తగ్గలేదు. నిగ్రహ తంత్రాలయిన మారణ, వశీకరణ, స్తంభన, ఉచాటన, విద్వేషణ విద్యలలో ఆమెకి తిరుగులేదట. ‘రారా కొడకా! నీ పంట పండింది. ఈ రాత్రికే గుహ్యసాధకుల మండలం. నీకు అభిశేచకం చేసి గుహ్యసమాజంలో ఒకడిని చేస్తాను. సాధన చేస్తే అష్ట సిద్ధులూ నీ పరం చేస్తాను. నిన్నెదిరించే మంత్రగాడు లేకుండా చేస్తాను. ఇక నీ ఊరిని బూడిదే చేస్తావో గెలుచుకొని ఏలుకుంటావో నీ ఇష్టం’ అని కపాలపాత్రలోని గౌడీ సారాయిని గొంతులో పోసుకుంటూ ‘ఇంతకీ గుహ్యసాధనకి నీ జోడు ఎన్నుకున్నావా?’ అడిగింది మహామారీచి. ‘లేదు తల్లీ. ఇంకా నిర్ణయించుకోలేదు’ అన్నాడు. ‘ఏరా? ఇంత మంది జోగినులలో నీకు ఒక్కముండ కూడా నచ్చలేదా? సరే. నన్ను కూడుతావా? డాకినీ విద్యలో నన్ను మించినది లేదు. నచ్చానా చెప్పు’ అంటూ ఒళ్లు విరుచుకుందా మహమ్మారి. జుగుప్స కలిగించే ఆలోచన!తల్లిలాంటి దానితో పొందా? కానీ తాంత్రిక సాధనలో అది మామూలే. సరేనని తలూపాడు, సుబ్బిశాస్త్రి.అర్ధరాత్రి! దివిటీల వెలుగులో అష్టభుజి యంత్రం చుట్టూ గుండ్రంగా కూర్చున్న సిద్ధుల మధ్య హ్రీం! క్రీం! బీజమంత్రాలతో యంత్రపూజ సాగింది. మద్యం, మాంసం, మత్స్యం నైవేద్యం అయినంతనే ఎర్రకలువలు, కదంబమాలలతో అలంకరించుకొన్న జోగినులు ఆ సిద్ధుల జతకట్టారు. వాళ్లలో తనకు ఎదురు వాంగ్మూలం చెప్పిన చాకలి దానిని చూడగానే సుబ్బిశాస్త్రి తల గిర్రున తిరిగింది. చివరగా వయ్యారపు నడకతో వచ్చి సుబ్బిశాస్త్రి ఒడిలో చేరింది మహామారీచి. పాతిక నిండని పడుచుపిల్లలా కనిపిస్తున్న ఆ సిద్దురాలిని చూస్తున్న సుబ్బిశాస్త్రి గుండె ఆశ్చర్యమే కాక ఒక కొత్త ఉత్తేజంతో స్పందించింది. అతడి గుండెదడకి సరిపోయేలా ఎనుము తోలు డప్పులపై తొడ ఎముకలతో మోదుతూ ప్రవేశించిన ఇద్దరు భయంకరులైన సిద్ధుల మధ్య సూన్యంలోకి చూస్తూ మెడలో వేపరెమ్మలు, నిమ్మకాయల హారంతో, చేతిలోని గండకత్తెరని తిప్పుతూ, చిందులు వేస్తూ వచ్చి మధ్యలో నిలిచిన యువకుడిని చూడగానే సుబ్బిశాస్త్రి ప్రాణం లేచివచ్చింది. అతడు నెలరోజులుగా ఊరిలో కనపడకుండా పోయిన తన స్నేహితుడు లింగబోయడే. అతడు సాక్ష్యం చెబితే శిక్ష నుంచి బయటపడొచ్చు. కానీ నిలిచిన వెంటనే ఎడమచేత సిగని అందిపుచ్చుకొని కుడిచేతిలోని గండకత్తెరని గిర్రునతిప్పి ఒకే వేటు తన మెడపై వేసుకున్నాడు. తలలేని మొండెం పురహూతిక విగ్రహం వైపు రెండడుగులు వేసి కుప్పకూలి పోయింది. దాని చేతిలోని తలబంతి దొర్లుకుంటూ సుబ్బిశాస్త్రి ముందు ఆగింది. రాలిన తలను చూసి సుబ్బిశాస్త్రి నిరాశతో కుప్పకూలిపోయాడు. కొంతకాలంలోనే సుబ్బిశాస్త్రికీ మహామారీచికీ స్నేహం కుదిరింది. మహామారీచి అసలు పేరు మాణిక్యం. సిద్దగుట్ట మహమ్మారి రూపం ఒక వేషం మాత్రమే. ప్రతి ఆరేళ్లకి ఒక కొత్తపిల్లకి ఆ వేషం కడతారు. లేకుంటే, వందల ఏళ్లుగా యవ్వనంతో ఉండటం నరమానవులకి సాధ్యమా?‘ఎంత త్వరగా పారిపోతే అంత మంచిది’ అని సుబ్బిశాస్త్రి చెవిలో చెప్పింది మాణిక్యం. ఆరెళ్లు పూర్తవుతున్నందువల్ల ఆ ప్రాణానికి ప్రమాదం.‘నిజమే. కాని ఎక్కడికని పారిపోతాం. ఊళ్లో అయితే మావాళ్ల మధ్య ఎవరికీ భయపడే అవసరం లేదు. కానీ అది సాధ్యం కాదు.’అతడి భుజంపై తల ఆన్చి ఆలోచనలలో పడింది మాణిక్యం, ‘సాధ్యమే! ఎందుకు కాదు? పద మీ ఊరెళదాం’ అంటూ ఒక్క ఉదుటున లేచింది. ‘దొంగతనం చేసిందెవరో నాకు తెలుసు’. ‘కానీ మనం చెబితే వినేదెవరు? దానికి తోడు లింగడు కూడా చచ్చాడు.’ అడిగాడు విషయం తెలుసుకున్న సుబ్బిశాస్త్రి.‘ఆరేళ్లుగా జనాన్ని మోసం చేయడమే వృత్తిగా బతికినదాన్ని. నా యుక్తులూ, శక్తులూ చూద్దువుగాని, పద.’మంత్రగత్తె మాణిక్యం గారడీలు చూడ్డానికి ఊరంతా పోగయ్యారు. ఆమె కనికట్టు మహిమతో ప్రతి ఒక్కరికీ కంసాలి కొమరయ్య పెరట్లో పాతిపెట్టిన నాలుగు భోషాణం తాళం చెవుల నకళ్లు కనిపించాయి. తవ్వి చూస్తే తాళం చెవులు దొరికాయి. పంచాయతీలో, కళపెళా కాగే నూనెలో చెయ్యిపెట్టి నిజం చెప్పమనే సరికి అసలు విషయం ఏకరువు పెట్టాడు కొమరయ్య. అసలేమయిందంటే కొమరయ్య నగని దొంగలించడం లింగడు చూశాడు. లింగడికి మత్తుమందుపెట్టి చాకలిదాని సహాయంతో రహస్యంగా సిద్ధులగుట్ట చేర్చాడు. లింగడికి ఊళ్లో సుబ్బిశాస్త్రి తప్ప ఎవరూ స్నేహితులు లేరు. ఏమైనా ఆరాతీస్తే అతడే తీయాలి. అందుకే, చాకలిదాని సాయంతో అతడింట్లోని బట్టని తెప్పించి సుబ్బిశాస్త్రిని కూడా నేరంలో ఇరికించాడు. కానీ లింగబోయడు చంపుడుగుళ్లో మహామారీచికి నిజం చెప్పడం వల్ల కంసాలి కొమరయ్య బండారం బయటపడింది. చంపుడుగుళ్లు తంత్రం అనే పదాన్ని టెక్నాలజీకి పర్యాయపదంగా వాడుతున్నాం. ప్రఖ్యాత చరిత్రకారుడు ఎన్.ఎన్.భట్టాచార్య- భారతీయ తంత్రం ఆదిమకాలం నుంచి మానవునికి వారసత్వంగా వచ్చిన శాస్త్రీయ జ్ఞానాన్ని తనలో ఇముడ్చుకున్న ఒక హేతువాద పద్ధతి అంటారు. భారతీయ తంత్రం అతి పురాతనమైనది. దాని ఛాయలు ఋగ్వేదంలోనే ఉన్నాయి. అధర్వణవేదం తంత్రవిద్యలకి మూలగ్రంథం అనుకోవచ్చు. తాంత్రిక పద్ధతులు వజ్రయాన బౌద్ధంలో, జైనంలో, శాక్త, శైవాల్లో కూడా కనిపిస్తాయి. మంత్రతంత్రాలు, మూఢనమ్మకాలు మానవుడికి స్వాభావికం. ఏ దేశమైనా, మతమైనా, సమకాలీన సమాజపు విలువలనీ, నియమాలనీ స్థిరపరిచేవైతే అవి మంచివి. లేదంటే క్షుద్రమైనవీ. సభ్యసమాజానికి దూరంగా, రహస్యంగా కొన్ని మానవాతీత శక్తులు సంపాదించడమే ధ్యేయంగా ఈ మార్గాన్ని ఆచరించే వారిని వామాచారులు అన్నారు. సభ్య మతాచారాలు కుడిచేతికి సంబంధించినవైతే తాంత్రిక పద్ధతులు ఎడమచేతివి. దక్షిణదేశంలో వామాచార సిద్ధులు నివసించిన ప్రదేశాలకు బంగారం, రంగురాళ్ల నిక్షేపాలకు సంబంధం ఉంది. బంగారాన్ని తీసిన తావులోనే అనేక సిద్ధ, శాక్త స్థావరాలు ఏర్పడ్డాయి. ఒక చిత్తూరు జిల్లాలోనే పైడిపల్లి, కనకమ్మసత్రం, పొన్నూరు అనే ఊళ్లలో జైనుల జ్వాలామాలినీ అనే తాంత్రిక దేవత విగ్రహాలు తవ్వకాలలో దొరికాయి. పైడమ్మ, పైడితల్లి, బంగారమ్మ, కనకమ్మ, హొన్నమ్మ, అవనాక్షి, పొన్నియమ్మ అనే శాక్తేయ దేవతల పేర్లు బంగారానికి సంబంధించినవే. విలువైన పదార్థాల ఉనికిని రహస్యంగా ఉంచేందుకు ప్రజలలో భయోత్పాతం కలిగించే ఆచారాలు, కథలు ప్రచారం చేస్తారు. అశ్లీలమైన ఆచారాలు, నరబలులకి ఆటపట్టయిన చంపుడుగుళ్లంటే హడలుతో ప్రజలు వాటికి దూరంగా మసిలారు. ఆంధ్రదేశంలో శక్తిపీఠాలుగా పేరుగన్న ఊర్లన్నీ మధ్యయుగంలో సిద్ధసాధనకి, రసవాదానికి, తాంత్రిక వామాచారాలకీ ఆలవాలాలే. మట్టిని బంగారం చేసే పరుసవేది విద్య, సంజీవని ద్వారా చావును జయించడం, వశీకరణం, ధనాంజనం వేసి నిధుల జాడలు కనుగొనడం లాంటివి సాధించిన సిద్ధుల గురించి సాహిత్యంలో అనేక ప్రస్తావనలు ఉన్నాయి. విక్రమార్కుడు ఒక సిద్ధుని కాళికకి బలియిచ్చి సర్పవేది, పరకాయప్రవేశ విద్యలని సంపాదించిన కథ ఉంది. భవభూతి మాలతీమాధవం, మహేంద్రవర్మ మత్తవిలాసం, ఆనందగిరి శంకరవిజయం ఇలా ఎన్నో గ్రంధాలలో వామాచార ప్రస్తావన ఉంది. అంతేకాదు తాంత్రిక పద్ధతులను, ఫిలాసఫీని ఆవిష్కరించే ఎన్నో గ్రంథాలు రాయబడ్డాయి. వీటిలో శారదాతిలక, శక్తిసంగమ, తంత్రరాజ ముఖ్యమైనవి. ముఖ్యంగా ఆంధ్రదేశానికి సంబంధించినవి యోగినీజాలం, యోగినీహృదయం, మంత్రమాలిని, అఘోరేశి, క్రీడాఘోరేశ్వరి, మారీచి, మహామారీచి అనే గ్రంథాలు. మతంలో వెయ్యితలల్తో ప్రబలిన ఈ మహమ్మారిని నయంచేసి ఒక నూతన మతవ్యవస్థని సృజించగల వైద్యుడి అవసరం వచ్చింది. బ్రహ్మసూత్రాల్లోని ఆధ్యాత్మికత ఆలంబనగా, మహాయాన బౌద్ధంలోని మాధ్యమికవాదం సమరశంఖంగా, ప్రజల గుండెల్లోని భక్తి ప్రపత్తులే అస్త్రాలుగా, ఆదిశంకరుడు ఒక సరికొత్త స్మార్త వ్యవస్థకి శ్రీకారం చుట్టాడు. ఆసేతుహిమాచల పర్యంతం విజయదుందుభి మోగించి ఊరూరా దేవాలయాలనే జయకేతనాలు ఎగురవేసాడు. సాయి పాపినేని -
రగడ
రేనాటిలో పెన్నేరు గండి క్రీ.శ.575 (నేటి కడపజిల్లా- గండికోట) ఆకాశం మేఘావృతమై ఉంది. పెన్నేరు గండి కుడిగట్టుపై నిలిచి అవతలి వైపు దృష్టి సారించాడు దుగరాజు (యువరాజు) ధనంజయ చోళుడు. ‘ఈనాడైనా కొంచెం జల్లులు పడితే బాగుంటాది’ అంటూ తాళపత్ర గ్రంథంలో తలదూర్చి ఉన్న మాధవుని వంక చూసాడు. ‘ఈ మేఘాలు ఎక్కడి నించి వస్తాయో కాని ఒక్కక్షణం రేనాటిలో ఆగి కురిసే పాపానబోవు’ పుస్తకంలోంచి తలెత్తకుండా ప్రత్యుత్తరమిచ్చాడు స్నేహితుడు మాధవశర్మ. అతడు సంస్కృత కావ్యాలు చదివి వాటి తాత్పర్యాలు విడమర్చి చెబితే వినడం యువరాజుకి అలవాటు. ‘ఏమప్పా అంత దీర్ఘంగా చదువుతూండావ్?’ ‘కాళిదాసు కృతి మేఘదూతం’. ‘ఆహా! మహాకవప్పా! బిరాన కానీయ్’ అని శిలాపీఠంపై కూర్చున్నాడు. ‘కశ్చిత్కాంతా విరహ గురుణాస్వాధికారాత్ప్రమత్త...’ అంటూ మొదటి వృత్తాన్ని స్వరయుక్తంగా పాడి తెలుగులో తాత్పర్యం వివరించాడు మాధవుడు. ‘చక్కగా పాడినావు మాధవా’ అని భుజం తట్టాడు ధనంజయుడు- కానీ నీవు సంస్కృతంలో పాడినది అర్థమవదు చెప్పే తెలుగు తాత్పర్యం చెవులకు ఇంపుగా ఉండదు- అని మనస్సులో అనుకుంటూ ‘ఊ చెప్పు’ అని సైగ చేసాడు. ‘ఆషాఢస్య ప్రథమ దివసే మేఘమాశ్లిష్టసానుం వప్రక్రీడా పరిణిత గజ ప్రేక్షణీయం దదర్శ’ అని రెండవ వృత్తాన్ని ముగించి అర్థం వివరించసాగాడు మాధవశర్మ. వింటున్న ధనంజయుడు ఆకాశంలో మేఘాలని చూస్తూ ‘హాయిగా ఆషాఢ మాసాన ఆకాశదేశాన మార్గాన మెరిసేటి ఓ మేఘమా... అని మన భాషలో పాడుకుంటే ఎంత బాగుంటుంది. ఈ తాత్పర్యాలూ తత్సమాలూ లేకుండా అందరూ విని ఆనందిస్తారు ఏమంటావ్?’ అడిగాడు యువరాజు. ‘ఛీఛీ.. అంత మహాకావ్యాన్ని ఈ దేశీభాషలో పాడటమంటే బురదలో పన్నీరు పోయటమే దేవభాషని అవమానించటం’ అంటూ కోపంగా పుస్తకాన్ని మూసేసాడు మాధవశర్మ. ‘అది కాదులే మాధవా! సంస్కృతంలో ఉన్న పురాణాలనీ కావ్యాలనీ అందరికీ అర్థమయేటట్లుగా మన భాషలో అందంగా రాస్తే జనాలు సైతం పాడుకొని ఆనందిస్తారుగా...’ అంటున్న ధనంజయుడికి అడ్డుచెబుతూ, ‘అందమా? ఈ పామర అనాగరిక భాషకి అందమా? మాట సరిగ్గా పలకలేని వీళ్ళ నోటబడితే శబ్దాలు అసంబద్ధాలై వికృతంగా అవుతాయి’ అని మూతి బిగించాడు. ‘నీవు విద్వాంసుడివప్పా. కంచిలో చదువుకొనుండినావు. అందుకే నీకలాగనిపిస్తాది. కానీ ఈడనే బతుకుతా ఉండే ఈ జానపదుల పల్లెపాటల్లో అందం లేకపోలేదు’ అన్నాడు ఎర్రబడిన ముఖంతో దుగరాజు. యువరాజు ఉక్రోషానికి కారణం అతడికి సంస్కృతం తెలియకపోవడమే అని గ్రహించాడు మాధవశర్మ. ‘పేదవాని కోపం పెదవికి చేటు’ అనే జనవాక్యం తెలియనివాడు కాదు. వెంటనే ఏదోవిధంగా సర్దిచెప్పకపోతే నష్టం అతడికే. ‘యువరాజా! మీ దూరదృష్టి, నిశితమైన మేధస్సు ముందు నా విద్య ఏపాటికి? ఎంతటి మహాకావ్యాన్నయినా ఒక్కసారి వినినంతనే దాని లోతుపాతులు అర్థం చేసుకోగల సామర్థ్యం మీకే ఉంది. ప్రజాహితం గురించి ఆలోచించే మీకు ఈ కావ్యాలని ప్రజల భాషలో అందివ్వాలనే కోరిక కలగటం సమంజసమే. కానీ...’ అంటూ తటపటాయించాడు, మాధవశర్మ. ‘ఊహ్’, మాధవుడి పొగడ్తలకి కాస్త శాంతించాడు ధనంజయుడు. ‘అయితే ఈ విషయం రేపటి పండిత గోష్ఠిలో ప్రస్తావించవలసిందే. ఆ పని నీవే చేయాలి’ అని తీర్మానించాడు. చెన్నకేశవస్వామి ఆలయంలో రేనాటిలోని పండితులూ, తర్కవేత్తలూ, కళాకారులు, శ్రేష్ఠులూ, గామండులూ, రట్టలూ, కావ్యనాటకాదులలో ఆసక్తి ఉన్న పౌరులు తమతమ హోదాకి తగినట్లు వరుసలలో ఆసీనులయ్యారు. సభాధ్యక్షుడికి నమస్కరించి మంటపంలో కూర్చున్నాడు ఎరికల్ ముత్తురాజు ధనంజయ చోళ దుగరాజు. వేదపండితుల ఆశీస్సులతో మొదలై కవి పండితుల ప్రశంసలతో కొన్ని గంటలు గడిచాయి. ఇక అసలు అంశం ప్రస్తావించవలసిన సమయం వచ్చింది. మాధవుడు లేచి సభకి నమస్కరించాడు. ‘ఆదికవి వాల్మీకితో ఆవిష్కృతమై వేదవ్యాసునిచే విరచించబడి పాణినిచే నిర్దేశింపబడి భాస, భారవీ, భర్తృహర్యాదుల కృతులచే సంపన్నమై శూద్రక, కాళిదాసాది మహాకవులని మనకందించిన సంస్కృత భాషా సరస్వతిని కనుగొనడం మహా పండితులకే అసులభం. అటువంటి సంస్కృత పురాణ, కావ్య, నాటక క్రమాన్ని తెలుగుభాషలో సామాన్య జానపదులకు అందుబాటులోకి తేవాలని యువరాజు ఉద్దేశం. అదే ఈనాటి చర్చాంశం...’ ముందు వరుసలలో పండితులు అవాక్కయ్యారు. కానీ లెస్స లెస్సంటూ వెనుక వరుసలలోని పురజనుల కరతాళ ధ్వనులు మిన్నంటాయి. ‘వెయ్యేళ్ళు వర్ధిల్లు దుగరాజా. ఈ పండితుల నోటబడి పరుషమైన సాహిత్యం, సరళమైన తెలుగు భాష తీయందనంతో మరింత శోభించగలదు’, అంటూ లేచాడొక దిగంబర జైనుడు. మూడు బారల దండాన్ని పెకైత్తి చిందులు తొక్కుతూ పదం అందుకున్నాడు. ‘కరికాళ సోండ్రమగ రేనాణ్టి దుగరాజు పగతుండ్ర యమరాజు ఎరిగండ్ర ముతురాజు’ జనం అతడి గళంతో గళం కలిపారు. ‘ఆపండీ... ఈ రగడ!’ సభాధ్యక్షుడి ఉరుములాంటి గర్జనతో సభలో కోలాహలం కాస్త సద్దుమణిగింది. ‘ఇది పండితగోష్ఠా? తిరునాళా? ముందు వరుసలలోని పండిత బ్రాహ్మణులు తప్ప మిగిలినవారు వెంటనే నిష్ర్కమించండి’ అన్నాడు. ‘ఇది అధర్మం, అనుచితం!’ అంటూ లేచాడొక రట్ట యువకుడు. ‘ఈ చర్చాంశం అందరికీ సంబంధించినది. గీర్వాణం బలిసిన మీ బ్రాహ్మణులేనా? మేమెలా అనర్హులం?’ అవునూ! అవునూ! అంటూ సభలో మరలా కలకలం చెలరేగింది. ‘ఏమిటవునూ?’ మరోసారి అధ్యక్షుడి గొంతు సభలో మార్మోగింది. ‘వేదాలలో పుట్టిన గాయత్రి, జగతి ఆది వృత్తాలు స్వర ప్రధానాలయితే కావ్యరచనకి ప్రాణం వర్ణవృత్తాలు. జయదేవ, పింగళాది ఛందశ్శాస్త్రజ్ఞులు, పాణినీ, పతంజల్యాది వైయ్యాకరణులు నిర్దేశించినదీ కావ్య విధానం. తకిటతక తాళాల పల్లెపాటల దేశిభాషలో కావ్య రచన అసాధ్యం.’ ‘ఉహ్. తేనె తెలుగట. ఈ పామర భాషకి ఒక ఛందస్సు లేదు. ఒక వ్యాకరణం లేదు. సంస్కృత సరస్వతి కాలిగోటికి సరితూగదీ తెలుగు’ అంటూ ఈసడించాడు ముందు వరుసలోని మరొక పండితుడు. ‘భుటులారా వీరందరినీ వెడలగొట్టి ద్వారాలు మూయండి. పండితుల చర్చ ఆ పిమ్మట సాగగలదు’ అని తీర్మానించాడు సభాధ్యక్షుడు. ‘ఆగండి’ అంటూ లేచి నిలుచున్నాడు యువరాజు ధనంజయుడు, ‘సభాధ్యక్షులు మాట మన్నించాల్సిందే. ప్రస్తుత పరిస్థితిలో మన భాష కావ్యరచనకి అనర్హమే. కానీ వారు చెప్పిన సంగీతానికి స్వర, వర్ణ, తాళాలు మూడు ముఖ్యమే. జానపదుల పదాలకి తాళం ముఖ్యం. మన పల్లెపాటల్లో దాగి వున్న లయ తాళాలను వెలికితీసి కావ్యరచనలోని స్వరవర్ణాలకు జోడిస్తే, భాషాసరస్వతికి మరింత అందం చేకూరుతాదని మా అభిప్రాయం. అయితే తెలుగు ఛందస్సుకి, వ్యాకరణానికి ఒక మంచి రూపం ఇవ్వవలసి ఉండె. గురువుల అనుమతితో మ్రితుడు మాధవశర్మని అందుకు నియోగిస్తుంటిని. మరొక విషయం...’ అని ముందున్న పండిత బృందాన్ని తేరిపార చూస్తూ, ‘ఈనాటి నుండి రాజ్యంలో అన్ని రాచకార్యాలు పామరులకు కూడా తెలిసేటివిధంగా తెలుగుభాషలో సాగగలవు. ఇందుకు ఛందస్సు, వ్యాకరణాల అవసరం లేదు. లిపి, వచనాలు చాలు. ఇది చెన్నకేశవుని అనగా, రేనాడు ఏలే, ఎరికల్ ముత్తురాజు ధనంజయుడి శాసన!’ అని పౌరజనుల చప్పట్ల మధ్య సభ చాలించాడు. ఈ శీర్షికపై మీ స్పందన రాయండి: saipapeneni@gmail.com తెలుగుభాషలో మొట్టమొదటి శాసనం కడపజిల్లా కలమళ్ల చెన్నకేశ్వరాలయంలో దొరికిన రేనాటి ధనంజయశర్మ శాసనం తెలుగుభాషలో మొట్టమొదటిది. మద్రాస్ మ్యూజియం చేరిన ఆ శాసన శకలం దురదృష్టవశాన అదృశ్యమయింది. అంతేకాదు తెలుగువారి వారసత్వ సంపదలో భాగమైన అనేక చారిత్రక శిల్పాలు, అవశేషాలు మద్రాస్ మ్యూజియంలో ఉన్నాయి. తెలుగుభాషకి క్లాసికల్ లాంగ్వేజ్‌గా గుర్తింపు రావటానికి కలమళ్ళ శాసనం ఎంతో కీలకమైనది. తమిళ భాషావేత్తలు, చరిత్రకారులు తెలుగుకి ప్రాచీనభాషగా గుర్తింపు రావటాన్ని ఎంతో వ్యతిరేకించారు. అదే సమయంలో కలమళ్ళ శాసనం మాయమవటం కొన్ని అనుమానాలకి తావు ఇస్తుంది. ఎట్టకేలకు ఎందరో భాషాభిమానులు, భాషాశాస్త్రజ్ఞుల కృషి ఫలితంగా ఆలస్యంగానైనా తెలుగుభాషకి క్లాసికల్ లాంగ్వేజ్ గుర్తింపు లభించింది. భాషగా తెలుగు అతి ప్రాచీన కాలం నుండీ వ్యవహారంలో ఉందనేది నిజం. భరతుని నాట్యశాస్త్రంలో వాత్సాయనుని కామశాస్త్రంలో ‘ఆంధ్రీ’ అనే భాష ప్రసక్తి ఉంది. అదే తెలుగు. క్రీ.శ.1వ శతాబ్దికి చెందిన వాశిష్ఠీపుత్ర పులుమాని నాణెంలో తెలుగులో రాసిన ‘అరహన కు వహిత్థీ మకనాకు తిరు పులుమావి కు’ అనే ఐతిహ్యం కనిపిస్తుంది. ఇందులో ‘కు’ అనే షష్ఠీ విభక్తి ప్రత్యయం తెలుగులో ఉంది. ఈ ఐతిహ్యం తెలుగు ఛందస్సుకు చెందిన ‘రగడ’లో ఉందని భాషావేత్తలు చెప్తారు. అంతేకాదు ఆంధ్రదేశం అనాది నుండీ రచనా వ్యాసంగానికి ఆటపట్టు. వైదిక పరంపరలో మొట్టమొదటి ధర్మశాస్త్రజ్ఞుడు క్రీ.పూ.6వ శతాబ్దికి చెందిన ఆపస్తంభుడు ఆంధ్రుడే. క్రీ.పూ.1వ శతాబ్దంలో రచించబడిన ‘అష్టసహస్రిక’ అనే బౌద్ధగ్రంథంలో అధికభాగం ఆంధ్రప్రాంతానికి చెందిన అంధక శాఖీయులే రచించారు. హీనయాన బౌద్ధానికి మూలమైన పిటకాలు ‘అంధక’ భాష నుండే పాళిభాషలోకి అనువదించబడ్డాయని బుద్ధఘోషుడు ‘మజ్జెమనికాయం’ పీఠికలో చెప్పుకున్నాడు. అంటే ఆంధ్రభాషలో రచనలు చేయడం క్రీస్తు పూర్వం నుండే ఉందని తెలుస్తుంది. మహాయాన బౌద్ధగ్రంథాలు రచించిన నాగార్జునుడు, ఆర్యదేవుడు, దిన్నాగుడు ఆంధ్రులే. కానీ బౌద్ధయుగంలో ప్రాకృతాల్లో సాగాయి. 4వ శతాబ్ది నుండీ బ్రాహ్మణ భూస్వామ్య వ్యవస్థ బలపడటంతో సంస్కృతం విజృంభించింది. క్రీ.శ. 5 నుండి 7వ శతాబ్ది వరకు సంస్కృత సాహిత్యానికి స్వర్ణయుగం అంటారు. కాళిదాసు, భాసుడు, బాణభట్టు మొదలైన మహాకవులు భారత రామాయణాది ఇతిహాసాలలోని ఘట్టాలనే కాక లౌకిక సంప్రదాయంలోని ఎన్నో కథలకి కావ్య, నాటక రూపాలిచ్చారు. శూద్రకుని మృచ్ఛకటికం, విశాఖదత్తుని ముద్రారాక్షసం, భారవి కిరాతార్జునీయం, కాళిదాసు శాంకుతలం, మేఘదూతం, హర్షుని నాగానందం, నైషధం, బాణుడి కాదంబరి, భర్తృహరి సుభాషితాలు ప్రజలలో ఎంతో ఆదరణ చూరగొన్నాయి. భారతీయ సాహిత్యం, నాటక ప్రక్రియ, పాశ్చాత్య కళారూపాలకంటే ఎంతో ఉత్కృష్టమైనవని జగానికి చాటిచెప్పాయి. ఆకాలంలో సంస్కృతం విద్యద్భాషగా విలసిల్లింది. కవులకు, గురువులకు, రాజప్రాపకం దొరికింది. వ్యవహారాలు సంస్కృతంలో నడిచాయి. దక్షిణదేశంలోని అనేక సంస్కృత శాసనాలు అందుకు నిదర్శనం. ఆ భాషమీద పట్టుగల బ్రాహ్మణులు సమాజంలో అగ్రస్థానానికి ఎదిగారు. దేశీభాషయైన తెలుగుకి చిన్నచూపు ఎదురయింది. అటువంటి పరిస్థితులలో, తెలుగుకి ప్రాముఖ్యం ఇచ్చిన రేనాటి ధనంజయుడు, తెలుగువారికి చిరస్మరణీయుడు. -
మిత్రలాభం
వేలూరు గురుకులం క్రీ.శ.463 మెదక్ జిల్లా చేగుంట వద్ద వెల్లూరు వరాహదేవుడికి ఇద్దరు ప్రాణమిత్రులు. ఒకడు విష్ణుకుండిన రాకుమారుడు ఇంద్రవర్మ, రెండోవాడు వాకాటక యువరాజు హరిసేనుడు. ఇద్దరూ వేలూరు గురుకులంలో విద్యాభ్యాసం పూర్తి చేసుకొని స్వంతవూళ్లకి బయలుదేరనున్నారు. ఇంద్రవర్మ విష్ణుకుండిన రాజధాని వేంగీపురికైతే (ప.గో.జిల్లా, దెందులూరు), హరిసేనుడు వాకాటక రాజధాని వత్సగుల్మానికి (మహారాష్ట్రలోని వాషిం). ఒకరు తూర్పు, మరొకరు పడమర. అంతలో యుద్ధం అని వార్త తెచ్చాడు వరాహదేవుడు. ఈ పరిస్థితుల్లో ప్రయాణం శ్రేయస్కరం కాదు. ‘యుద్ధమా! ఎవరెవరికి?’ అడిగారు హరిసేనుడు, ఇంద్రవర్మ. ‘మీ తండ్రులు మధ్యే యుద్ధం. వేంగిసైన్యం వాకాటక రాజ్యంపై దండయాత్రకి సిద్ధంగా ఉంది. వాకాటకుల అధీనంలో ఉన్న ఈ తెలుగు ప్రాంతాన్ని కూడా ఆంధ్రరాజ్యంలో కలుపుకోవడమే విష్ణుకుండినుల ఉద్దేశం’ అని వివరించాడు వరాహదేవుడు. ‘అందుకు మా తండ్రిగారు మహారాజు సాహసించరే? వాకాటకులకు, విష్ణుకుండినులకు ఉన్న స్నేహ బాంధవ్యాలు ఈనాటివి కావే?’ ఆశ్చర్యంగా అడిగాడు ఇంద్రవర్మ.స్నేహితులు వేలూరు గురుకులంలో కలిసి చదువుకున్నారు. ఆరేళ్లు ఆరు నిమిషాల్లా గడిచిపోయాయి. సహాధ్యాయులంతా రాజవంశాలకి, ధనిక వర్తకసంఘాలకి, పండిత కుటుంబాలకి చెందినవారే. గురుపీఠానికి అధ్యక్షుడు విష్ణువర్మ. రాజనీతి శాస్త్రంలో కౌటిల్యుడికి ఏమాత్రమూ తీసిపోడు. రాజతంత్రాన్ని పంచతంత్రమనే కథల రూపంగా చిరుతప్రాయంలోనే విద్యార్థుల తలకెక్కించాడు. వాకాటక, గాంగ, కదంబ, విష్ణుకుండిన ప్రభుత్వాలలో అనేకమంది మంత్రులు, రాకుమారులు ఆయన శిష్యులే. ‘అహ్హహ్హా! అంటే తరతరాలుగా వస్తున్న వైవాహిక స్నేహ సంబంధాలని విడిచిపెట్టి మాతోనే వైరానికి దిగుతారా, మా మామగారు?’ కందగడ్డలా ఎర్రబడిన ముఖంలో కోపాన్ని దిగమింగుతూ అడిగాడు హరిసేనుడు. ఇంద్రవర్మ, హరిసేనులు స్నేహితులేకాదు, మేనమరుదులు కూడా. ఇంద్రవర్మ తల్లి, వాకాటక మహారాజు దేవసేనుడి చెల్లెలూ, విష్ణుకుండిన మహారాజు మాధవవర్మకి పట్టమహిషి. ‘మా తండ్రిగారు అటు తూర్పున కళింగాన్ని (ఉత్తరకోస్తా), ఇటు దక్షిణాన రేనాటినీ (రాయలసీమ) వేంగిలో విలీనం చేసిన మహావీరుడు. ఇక గోదావరి వరకూ ఉన్న తెలుగు సీమలన్నింటినీ కలిపి ఆంధ్రదేశాన్ని నైసర్గిక ఎల్లల వరకూ ఒకే రాజ్యం కిందకి తేవడం ఒకందుకు మంచిదేనేమో!’ పౌరుషంగా తండ్రిని సమర్థిస్తూ మిత్రుడు హరిసేనుడి వంక చూశాడు ఇంద్రవర్మ.వరాహదేవుడి మనసు మనస్సులో లేదు. అతడి ప్రాణస్నేహితులలో ఒకడు వాకాటకుడు, ఒకడు విష్ణుకుండినుడు. ఇప్పుడు వాళ్ల తండ్రుల మధ్య యుద్ధం. వరాహదేవుడిది వేలూరు వంశం. అతడి తండ్రి గోదావరిలోయ నుంచి కృష్ణాతీరం వరకూ కొండపడమటి తెలుగుసీమలకు (తెలంగాణ) సంస్థానాధిపతి. వాకాటకులకి సామంతుడేగాక ముఖ్యమంత్రి కూడా! కానీ ఇటు విష్ణుకుండినులు భాషా సంస్కృతి రీత్యా తోటి తెలుగువాళ్లు. తానెవరి పక్షం వహించాలి? ‘ఈ యుద్ధంవల్ల విద్యావ్యాసంగాలకూ, పరిశ్రమలకూ ఆలవాలమై విలసిల్లే ఈ ప్రాంతం మరుభూమి కావల్సిందేనా? మీ రెండు రాజ్యాల మధ్యా స్నేహ సంబంధాలు ఉన్నంత కాలం ఈ ప్రశ్న ఉదయించలేదు. ఏది దారి? ఒకవేళ యుద్ధం ఆపాలన్నా పదిహేడేళ్లు నిండని మన మాట వినేది ఎవరు?’ అని నిట్టూర్చాడు, వరాహదేవుడు.స్నేహితుడు హరిసేనుడికి ముఖం చూపలేక తలదించుకొని అడుగులేయసాగాడు ఇంద్రవర్మ. వేంగిదేశం దక్షిణాపథానికే ధాన్యాగారం. గురుకులంలో అతడు చదివిన రాజతంత్రం ప్రకారం పరిశ్రమలూ ఖనిజసంపదా అపారంగా ఉన్న పక్క రాజ్యాన్ని జయించాలనే అతడి ఉద్దేశ్యం సరైనదే. దాని వలన తన స్నేహితుడితో వైరం అనివార్యమా? వేంగి రాజ్యానికి చుట్టూ శత్రువులే ఒక వాకాటకులు తప్ప! ఉత్తరభారతదేశపు గుప్తరాజు అండ వాకాటకులకి ఏనాటి నుండో ఉంది. భవిష్యత్తులో అది వేంగికే ప్రమాదంగా పరిణమించవచ్చు, అనే ఆలోచనలతో సతమతమౌతూ ‘యుద్ధనివారణ సాధ్యమా?’ అని పైకి అడిగాడు. తలతిప్పి చూసి స్నేహితుడి మాటల్లో ధ్వనించిన విచారాన్ని గమనించిన హరిసేనుడికి కోపం తగ్గిపోయింది. ‘మన సందేహాలకి సమాధానం చెప్పగలవాడు ఒక్కడే! ప్రపంచానికే తలమానికమైన జ్యోతిష శాస్త్రవేత్త ఆర్యభటాచార్యుడు. ఆర్యభటుడి నక్షత్రాశాల ఇక్కడికి దగ్గరే. వెళ్లి కలుద్దామా?’ అడిగాడు.సరేనని ముగ్గురూ ఆర్యభటుని నక్షత్రశాల చేరుకున్నారు. చీకటి పడింది. ఆకాశంలో కనబడే నక్షత్రాలని, గ్రహాలని గుర్తించి వెంటనే వాటి స్థానాలని నక్షత్రశాలలోని ఖగోళ చిత్రపటంపై సూచించేందుకు ఓపికగా అంచలంచలుగా ఎదురుచూసే నలుగురు విద్యార్థులు తప్ప గుట్టపై ఎవరూ లేరు. కింద గురుకులం పూర్తి అంధకారంలో ఉంది. ఆచార్యుడు ఆర్యభటుడు కూడా గుట్టదిగి వడివడిగా నక్షత్రశాల వైపు అడుగులేయసాగాడు. అరుగు మీద కూర్చొనివున్న ముగ్గురు కుర్రవాళ్లని చూసి ఆగాడు. ‘ఏవరు? రాత్రిపూట ఇక్కడేమి చేస్తున్నారు?’ పరిచయాల అనంతరం ముగ్గురు స్నేహితులనీ లోనికి ఆహ్వానించాడు.ఆచార్యుని నక్షత్రశాల ప్రవేశించటం వాళ్లకదే మొదటిసారి. నక్షత్రశాల మధ్యలో ఏడడుగుల ఎత్తు భ్రమయంత్రం (దిక్సూచి) గిర్రున తిరుగుతోంది. వివిధ గ్రహాలని, రాశులని, నక్షత్ర మండలాలని చిత్రించిన, అర్ధగోళాకారపు స్వయంవాహ (ఆటోమాటిక్) యంత్రం కప్పుకి వేలాడుతుంది. మూడడుగుల వ్యాసంగల వర్తులాకారపు పీఠాలపై కర్ణం (హైపోటెన్యూస్), తుర్యగోళం (క్వార్టర్ ప్లేట్), యష్టి (రూరల్) మొదలైన పరికరాలు కనిపిస్తున్నాయి. చుట్టూ నల్లని గోడలపై మరిన్ని ఖగోళ చిత్రపటాలు. మిత్రులు ముగ్గురూ నోళ్లెళ్లబెట్టి చూస్తూ ఉండిపోయారు. నల్ల మిరియాలు జల్లిన వేడి అంబలి తాగి సేదతీరి, ఆచార్యుడికి తమ సంకటస్థితి నివేదించారా ప్రాణమిత్రులు. ‘ఎక్కాలు రాసుకునే లెక్కల పండితుడిని. యుద్ధం ఆపడం నావల్ల ఏమవుతుంది? అయినా పిల్లలు మీరడిగారు కనుక ప్రయత్నిస్తాను’ అని చిరునవ్వు నవ్వాడు. ప్రఖ్యాత గణిత ఖగోళ శాస్త్రజ్ఞుడు ఆర్యభటుడు. అమావాస్య మధ్యాహ్నం. కృష్ణా గోదావరీ నదుల మధ్య రెండు యోజనాల విస్తీర్ణంగల మహాపట్టణం వేంగి. ఆంధ్రుల రాజధాని నగరం. వేంగీ నగరంలో చిత్రరథస్వామి కోవెల ముందు అశేషమైన జనం గుమికూడారు. మహారాజు మాధవవర్మ, మహామంత్రి, పుర ప్రముఖులు, ఆర్యభట పండితుడి సందేశం వినేందుకు వచ్చారు.ఆరోజు మధ్యాహ్నం సంపూర్ణ సూర్యగ్రహణం వస్తుందన్న విషయం ఆర్యభటుడికి తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. చేతిలోని నిలువెత్తు యష్టిని నేలపై నిలిపాడు ఆర్యభటుడు. ఆ కర్ర నీడని గమనిస్తూ ఉపన్యాసం ఆరంభించాడు. ‘వాకాటక, విష్ణుకుండినుల మధ్య వైరం గ్రహాలూ, దేవతలూ అంగీకరించరు. రాహుకేతువులు వేంగి సామ్రాజ్యానికి గ్రహణాన్ని సూచిస్తున్నారు. యుద్ధమే మీ ఉద్దేశ్యమైతే ఈ క్షణంలో నా మంత్రోఛ్ఛారణతో ఆ గ్రహాల ఆగ్రహాన్ని దర్శింపజేస్తాను’ అని కళ్లు మూసుకొని జపం చేయసాగాడు. ఆర్యభటుడు కళ్లు మూసుకున్న మరుక్షణమే సూర్యుడు మసకబారసాగాడు. కొంతసేపటి తరువాత పూర్తిగా అదృశ్యమైన సూర్యుని చూసి భయంకంపితుడైన మహారాజు ఆర్యభటుని ఆజ్ఞ పాఠించి వెంటనే యుద్ధవిరమణ ఘోషణ చేసాడు. ఆచార్యుని ప్రార్థనతో గ్రహాలు శాంతించాయి. గ్రహణం వీడింది. ఆకాశంలో చిత్రరథస్వామి మళ్లీ దర్శనమిచ్చాడు.ప్రయత్నం సఫలమైనా ఆచార్యుడి ముఖంలోని విచారం వరాహదేవుడిని ఆశ్చర్యపరిచింది. కారణం అడిగిన శిష్యులతో ‘విజ్ఞానాన్ని దేశకల్యాణానికి ఉపయోగిస్తే తప్పులేదు. కానీ అమాయక ప్రజల మూఢవిశ్వాసాలని స్వార్థానికి ఉపయోగిస్తే, భవిష్యత్తులో మన భారతీయ శాస్త్రీయ విజ్ఞానానికి గ్రహణం పట్టక తప్పదు’, అన్న ఆర్యభటుని మాటలు వరాహదేవుడికి జీవితాంతం గుర్తుండిపోయాయి. ఈ శీర్షికపై మీ స్పందన రాయండి: saipapineni@gamil.com - సాయి పాపినేని శాస్త్రీయ విద్యలో తెలంగాణ ఆనాటి రాజులు పండితులను కళలను ఆదరించటమే కాక తాము కూడా ఎన్నో రచనలు చేశారు. అజంతా గుహలలో అధికభాగం వాకాటక మహారాజు హరిసేనుడు. అతడి మంత్రి వరాహదేవుల కాలంలో నిర్మించబడ్డాయి. విష్ణుకుండినరాజు ఇంద్రవర్మ మహాకవిగా కీర్తించబడ్డాడు. ఛందస్సుపై అతడు రచించిన గ్రంథం ‘జనాశ్రయఛందోవిచ్ఛితి’. ఇంద్రవర్మ హయాంలో ఆంధ్రరాజ్యం శ్రీకాకుళం నుండి నెల్లూరు వరకూ పశ్చిమాన బళ్లారి వరకూ విస్తరించింది. క్రీ.శ. 5వ శతాబ్దం భారతీయ శాస్త్రీయ విజ్ఞానానికి స్వర్ణయుగం అంటాడు. తెలంగాణ ఆనాటి లౌకిక విజ్ఞానానికి ఆయువుపట్టుగా విలసిల్లింది. హైదరాబాద్‌కి 50 కి.మీ. దూరంలో వేలూరు వాస్తవ్యులైన పండితులు మంత్రులుగా అప్పటి భారత రాజకీయాలు నిర్దేశించారు. అజంతా గుహల శాసనాలు మూడు తరాలుగా వాకాటకులకు ప్రధాన మంత్రులైన ఆ వంశాన్ని ప్రస్తావిస్తాయి. విష్ణుశర్మ రచించిన ‘పంచతంత్రం’ రాజనీతిని ఆసక్తికరమైన కథల ద్వారా ముగ్గురు వాకాటక రాకుమారులకు అందించిన నిదర్శన కావ్యం. మొదట పర్షియాలో ‘ఖలీల్ వా దిమ్నా’గా పరిచయమై, పిదప అరబ్బీ, ల్యాటిన్, జర్మన్, ఇంగ్లిష్లలోనేకాక చైనా, జపాన్, కావి (ఇండోనేసియా) భాషలలో క్రీ.శ.16వ శతాబ్దానికి పూర్వమే అనువదింపబడింది. ఇక నవీనయుగంలో ప్రపంచంలోని అన్ని ముఖ్య భాషల్లోకీ అనువదింపబడిన భారతీయ గ్రంధం ఇదొక్కటే. వాకాటక రాకుమారులకు రాజకీయ పాఠాలు బోధించిన విష్ణుశర్మ మన హైదరాబాద్ ప్రాంతం వాడే అని చారిత్రకుల అభిప్రాయం. ఇక భారతదేశంలో ప్రాచీన యుగం నుండీ గణిత, ఖగోళ శాస్త్రాలు ఎంతో పరిణతి చెందాయన్న విషయం తెలిసినదే. వేదవాజ్ఞ్మయంలోని శుల్వసూత్రాలు, ‘పైథాగరస్ థీరం’ పైథాగరస్‌కు మూడు శతాబ్దాల ముందే భారతీయ ఇంజనీర్లకు తెలుసని నిరూపిస్తాయి. సున్న, డెసిమల్, అంకెలు భారతీయులు ప్రపంచానికి ఇచ్చిన శాస్త్రీయ వారసత్వమే. ప్రాచీన గణిత శాస్త్రజ్ఞులలో అగ్రగణ్యుడు ఆర్యభటుడు. గెలీలియోకి వెయ్యేళ్ల పూర్వమే భూమి గోళాకారంలో ఉందని సూచించాడు. జామెట్రీకి ఆయువుపట్టైన ‘పై’ యొక్క విలువను 3.1416గా నిరూపించాడు. త్రికోణమితిలోని (ట్రిగొనామెట్రీ) ‘సైన్’ విలువకు పట్టికలు తయారుచేశాడు. సూర్య చంద్ర గ్రహణాలు - చంద్రగ్రహం భూమికి సూర్యునికి మధ్య రావటం వల్లనూ, భూమి ఛాయ చంద్రుని మీద పడటం వల్లనూ సంభవిస్తాయని ప్రకటించిన మొట్టమొదటి ఖగోళశాస్త్రజ్ఞుడు ఆర్యభటుడే. ఈ మహామేధావి స్వస్థలం అశ్మకదేశం, అంటే తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా పరిసరాలు. అతడు రచించిన ఆర్యభటీయం అనే గ్రంథమే గాక తదుపరి శాస్త్రజ్ఞులు రచించిన గ్రంథాలలో ప్రస్తావించబడిన అతడి గణిత, ఖగోళ సిద్ధాంతాలను ‘అశ్మకతంత్రం’ అని పిలిచారు. ఆర్యభటుని సిద్ధాంతాలను ఆచరించే శాస్త్రజ్ఞులను ‘అశ్మకీయులు’ అనేవారు. అంటే, ఆర్యభటుని తరువాత కూడా తెలంగాణలో గణిత ఖగోళ శాస్త్రాలపై పరిశోధనలు సాగించారని తెలుస్తుంది. బాసర, వేములవాడ, కొలనుపాక, అలంపురం పట్టణాలు ఉన్నత విద్యాకేంద్రాలుగా వికసించాయి. ధార్మిక శాస్త్రాలయిన వేద, వేదాంగ, ఆగమ శాస్త్రాలు చెప్పే పాఠశాలలు గ్రామగ్రామాలలో వెలిశాయి. అయితే క్రీ.శ. 5వ శతాబ్దం తరువాత దేశంలో ఆర్థిక రాజకీయ సంక్షోభం వల్ల విద్యావికాసం కుంటుపడింది. దేవాలయాలకు, వైదిక పండితులకు చేసిన దానశాసనాలు మాత్రమే కనిపిస్తాయి. అందువలన ధార్మిక ప్రాముఖ్యం పెరిగి లౌకిక విద్యలు వెనకబడ్డాయి. శాస్త్రీయజ్ఞానాన్ని ఆలంబనంగా చేసుకొని భుక్తికోసం అమాయక ప్రజలని భయోత్పాతులని చేసి విద్యలని స్వలాభానికి వాడుకొనే తంత్రవేత్తలూ, మంత్రగాళ్లూ బయలుదేరారు. దేశంలో స్వచ్ఛమైన శాస్త్రీయ విద్యకి గ్రహణం పట్టింది. -
భిక్షువు
పదం నుంచి పథంలోకి 5 ధాన్యకటకం (గుంటూరు జిల్లా, అమరావతి) క్రీ.శ.100 హాన్ వంశపు యువరాజు యాన్‌కు ఇదంతా నమ్మశక్యంగా లేదు. నిజంగానే తాను భారతదేశానికి చేరానా? నిజంగానే చేరాడు. ఇప్పుడు తెలుగు గడ్డ మీద ఉన్నాడు. దీనికి నేపథ్యం ఉంది. యాన్ అన్న చైనా చక్రవర్తి మింగ్. ఆయనకు ఒక కలవచ్చింది. ఆ కలలో సువర్ణదేహంతో సూర్యుని తలదన్నే ప్రకాశంతో ఆకాశంలో ఎగురుతూ ఒక మహాపురుషుడు కనిపించాడు. అది ఎవరని విచారిస్తే అతడే బుద్ధుడు అని తెలిసింది. బుద్ధుడు ఇండియాలో ఐదొందల సంవత్సరాల క్రితం ‘డావో’ అంటే ధర్మమార్గాన్ని సామాన్య మానవులకు ఆచరణయోగ్యమైన సూత్రాలుగా ఉపదేశించాడని కూడా తెలిసింది. వాటిని తెలుసుకోవాలి. అందుకే తన తమ్ముణ్ణి ప్రయాణం కట్టమన్నాడు. ఇండియాకు వెళ్లి ఆ ప్రవచనాలను తెలుసుకొని, ఆ మతానికి చెందిన గ్రంథాలని చైనా రాజ్యానికి తీసుకురమ్మని ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞను శిరసావహించడంలో భాగంగా యాన్ దక్షిణచైనాలో గ్వాంగ్‌ర (కాంటన్ తీరంలోని రేవుపట్టణం) నుంచి ఆంధ్రప్రదేశపు వర్తకుల సహాయంతో నాలుగు నెలలు హిందూ మహాసముద్రం చుట్టి తెన్గ్యూ(తెలుగు) తీరంలోని ధాన్యకటకానికి చేరాడు యాన్.ధాన్యకటకం అతి సుందరమైన నగరం. నదికి కుడి ఒడ్డున యాైభై ‘లీ’ (పదిమైళ్ళు. 1 మైలు = 5 లీ) నిడివిగల మహానగరం. నగరంలో వంద అడుగుల ఎత్తై మహాచైత్యం ఉంది. అది మింగ్ చక్రవర్తికి కలలో కనిపించిన బుద్ధుని భౌతిక అవశేషాలపై కట్టిన స్తూపం. అక్కడ ధాన్యకటకంలోనే బుద్ధుని అష్టాంగమార్గాన్ని ఆచరించే ఆచార్యులు వందలకొలదిగా ఉన్నారు. ఇంతమందిలో ఎవరిని ఆశ్రయించాలి? నది ఒడ్డున విదేశీయుల కొరకు ప్రత్యేకించబడిన పేటలో రెండంతస్తుల మేడ యాన్ రాకుమారుని పరివారానికి విడిది. విపణివీధి ప్రపంచపు నలుమూలల నుండీ వచ్చిన వర్తక శ్రేష్టులతో ఎప్పుడూ కిటకిటలాడుతూ ఉంటుంది. వీధికి ఇరువైపులా లెక్కలేనన్ని అంగళ్ళు. కళ్ళు చెదిరిపోయేలా రంగురంగుల వస్త్రాలు, ఆభరణాలు, చందనం, కస్తూరి, జవ్వాజి, అగరు, కర్పూరం, వీధిలో వేసే ప్రతి అడుగుకి మనసుని ఆహ్లాదపరిచే సువాసనలు. దంతం, పాలరాయి, కంచు, మంజిష్టల్లో వద్దంకుల (శిల్పులు, వడ్రంగులు) ప్రతిభని ప్రతిబింబించే అపురూప శిల్పసంపద. ఇక ఆహార సామాగ్రుల విషయం సరేసరి. ధాన్యకటకపు పేరు సార్థకమయ్యేలా రకరకాల ధాన్యాలు, పప్పు నూనె దినుసులు, సుగంధ ద్రవ్యాలు. శాలి, మహాశాలి, వ్రీహి, శ్యామకం అని వడ్లలోనే పలురకాలు. ఆంధ్రదేశంలోని నేత కార్మికుల ప్రతిభ అసామాన్యం. పట్టు వస్త్రాలేకాదు, ఉల్లిపొరకన్నా సన్ననైన నూలు రవపట్టం నేయటంలో కూడా దిట్టలు. యాన్ రాకుమారుడికి స్థానిక, విదేశ వర్తకులతో విందులూ వినోదాలతో రెండు నెలలు గడచిపోయాయి. అయినా వచ్చిన పని ఏమాత్రమూ ముందుకు సాగలేదు. అక్కడికి పశ్చిమంగా 500 లీ (100 మైళ్లు) నదీమార్గంలో వెళితే శ్రీపర్వతం (నాగార్డుని కొండ) అనే విశ్వవిద్యాలయం ఉంది. శ్రీపర్వత విశ్వవిద్యాలయంలో అనేక బౌద్ధ గ్రంథాలు ఉన్నాయట, వాటిని చైనా భాషలో వివరించగల ఆచార్యులు కూడా ఉంటారట! ఆ విశ్వవిద్యాలయం ముఖ్యాచార్యుడి పేరు డ్రాగన్ వీరుడు (నాగ - అర్జునుడు). ఆయన ఆహ్వానం లేనిదే వెళ్ళడానికి వీలులేదు. ప్రయత్నిస్తే అక్కడి నుంచి అనుమతి రావడం లేదు. ఆరోజు కామునిపౌర్ణమి. ఊరంతా పండగ. పచ్చని తోరణాలతో, మొగలి చిలకలతో అలంకరించి వీధులు, సంబరాలలో ప్రజలు ఒకరిపై ఒకరు జల్లుకున్న రంగురంగుల పుప్పొడి జాజరతో నిండిపోయాయి. జనం మధ్యలో దారిచేసుకొంటూ చైత్యం వైపు నడవసాగాడు యాన్. అడుగడుగునా అవరోధమే. నృత్యాంగనలు, వివిధ వాయిద్యాలతో పాటగాళ్ళు, పగటి వేషగాళ్లు, విటులు, మధుపానపు మత్తులో చిందులేస్తున్న పురజనులు. వీలు ఉండాలే గానీ ధాన్యకటకంలో ప్రతి రోజూ పండగే! ఒక్క రోమ్ సామ్రాజ్యపు వాణిజ్యం ద్వారా నగరానికి వచ్చే ఆదాయమే కోటి పణాలకి మించుతుంది. ధాన్యకటకపు పౌరుల తలసరి ఆదాయం వంద పణాలకి పైనే. ప్రపంచంలోనే అంతటి సంపన్నమైన నగరం మరొకటి ఉండదేమో! ఎదురుగా వేల దీపాల కాంతితో చైత్యం ధగధగా వెలిగిపోతుంది. చైత్యకుల ఆరామం ముందర ఐదు నిలువుల స్వస్తి తోరణం. ఠంగుఠంగని మోగే గంటలతో బౌద్ధారామంలో కూడా పండగ వాతావరణం నెలకొని ఉంది. ఎదురుగా ఉన్న మైదానంలో నిలువెత్తు యవనిక(స్టేజి), సాయంకాలం ప్రదర్శించాల్సిన నాటకం కొరకు సిద్ధం అవుతోంది. ఎటు చూసినా ఉరుకులు పరుగులు పెడుతున్న భిక్షువులు. ఏమిటో హడావుడి? రాకుమారుడు యాన్, ఆరామంలో అందరికీ సుపరిచితుడే. పలకరించిన వారినందరికీ ఒంటిచేత్తో నమస్కరిస్తూ ఆచార్యుని విడిది చేరాడు. పీఠంపై అసమాన తేజస్సుతో వెలిగిపోతున్న ఒక ఆచార్యుడిని చూశాడు. ఆ బుద్ధభగవానుడే ఎదుట ప్రత్యక్షమయ్యాడా? అని ఒక క్షణం నివ్వెరపోయాడు. యాన్. అతడే ఆచార్య నాగార్జునుడు. అప్రయత్నంగా ఆచార్యుని పాదాలవద్ద సాగిలపడ్డాడు. ‘లే రాకుమారా!’ ఆచార్యుని మాటలు శుద్ధమైన చైనాభాషలో వినపడేసరికి, యాన్ ఆశ్చర్యం ద్విగుణీకృతం అయింది. ‘మీరు వచ్చిన పని దాదాపు పూర్తయింది. శ్రీపర్వతంలోని మత గ్రంథాల నకళ్లు, టీక తాత్పర్యాలతో సహా సిద్ధంగా ఉన్నాయి. ఇక మూడు నెలల్లో వేసవి ముగిసి, సముద్రపు గాలులు నైఋతి నుండి వీస్తాయి. అది మీ ప్రయాణానికి అనుకూలం. అయితే తథాగతుని బోధనలని అక్కడి మతగురువులకు, మీ అన్న మింగ్ చక్రవర్తికి విశదీకరించటం ఆవశ్యకం. దాని కొరకు, విశ్వవిద్యాలయంలోని ఆచార్యుడు కశ్యపమాతంగుడు,తన శిష్యబృందంతో పాటూ మీతో మీ దేశానికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. మీరు అనుమతిస్తే అది మాకెంతో సంతోషదాయకం. ఏమంటారు?’ అన్నాడు నాగార్జునుడు. సమాధానంగా తలవూపుతూ మౌనంగా ఆయన పాదాలపై వాలిపోయాడు చైనా కుమారుడు. చైనాకి తిరుగు ప్రయాణానికి సమయం దగ్గరపడింది. శాతకర్ణి చక్రవర్తి సమకూర్చిన ఓడలు గ్రంథాగారంతో సహా రేవులో సిద్ధంగా ఉన్నాయి. కృష్ణమ్మ అలల మీదుగా వీచి చల్లబడిన పడమటి గాలి మండుటెండల వేడి నుండి కాస్త ఉపశమనం కలిగిస్తోంది. చైనా సాంప్రదాయపు హాన్పూ దుస్తులు వదిలేసి ప్రాంతీయమైన సన్నని పట్టుపంచె, అంగీ ధరించి శ్రీపర్వతంలోని ఆచార్యుని ఉపన్యాసమందిరం వైపు నడవసాగాడు యాన్. అక్కడ కొలువైన విశ్వవిద్యాలయాన్ని ఆశ్చర్యంగా చూస్తున్నాడతడు. విశ్వవిద్యాలయంలో యవన, ద్రవిడ, పారశీక శైలుల్లో అనేక కట్టడాలు. గ్రంథాలయాలు, ఉపన్యాసకూటాలూ, యవనికలూ, వాస్తు శిల్పాగారాలూ, వైద్యశాలలూ, యంత్రాగారాలూ, రసాయన ప్రయోగశాలలూ, వాటి చుట్టూ వసతి గృహాలూ, భోజనశాలలు. క్రీడాంగణంలో సాయంకాలం వ్యాయామానికి నేల యీనినట్లు వచ్చిన విద్యార్థి బృందాలు. జ్ఞానార్జనే ధ్యేయమైతే శ్రీపర్వతానికి మించిన విద్యాలయం ప్రపంచంలోనే లేదు.యాన్ మనఃస్థితి సందిగ్ధావస్తలో ఉంది. అక్కడ మధ్యచైనాకి తిరిగి వెళితే సమస్త రాజభోగాలు ఉంటాయి. ఇంకా పితృదేవతలు అనుగ్రహిస్తే చక్రవర్తిత్వం కూడా దక్కవచ్చు. ఇక్కడే ఉంటే భిక్షువృత్తి స్వీకరించాలి, కానీ అపారమైన జ్ఞాన సముపార్జనకి అవకాశం, అపర బోధిసత్వుడైన ఆచార్యుని శిష్యరికం దొరుకుతాయి. తన భవిష్యత్తు ఏదో నిర్ణయించుకొనే సమయం వచ్చింది. అతడి మనస్సు ఆచార్యుని వైపే మొగ్గింది. తెల్లని తెరచాపలతో రెక్కల గుర్రాలలాంటి పన్నెండు నావలు చైనా ప్రయాణానికి సిద్ధంగా కృష్ణానదిలో ఓలలాడుతున్నాయి. ఒడ్డుపై నిలిచి వాటికి వీడ్కోలు పలికాడు, జ్ఞానతృష్ణతో రాచరికాన్నే త్యజించిన బౌద్ధ భిక్షువు యాన్. అపరబోధిసత్వుడు ఆచార్య నాగార్జునుడు క్రీ.శ. మూడవ శతాబ్దిలో చైనాలో రచించబడిన ‘లిహ్వోలున్’ అనే గ్రంథంలో బౌద్ధమతం ఏవిధంగా కృష్ణాతీరం నుండి చైనాకి పాకిందో వివరించబడింది. ఈ గ్రంథం ఇండియా తీరాన్ని ‘తెన్గ్యూ’ దేశమనే పేరుతో సంబోధించింది. హాన్ వంశానికి సమకాలీనమైన శాతవాహన సామ్రాజ్యంలో బౌద్ధమతం ఎంతో ఉచ్ఛదశలో ఉంది. ఆంధ్రప్రదేశ్ నలుమూలలలో దొరికిన బౌద్ధ శిథిలాలే అందుకు నిదర్శనం. అజంతా చిత్రాలు, అమరావతి శిల్పసంపద ఆనాటి వైభవోపేతమైన జనజీవనానికి అద్దంపడతాయి. అంతేకాదు చైనా, టిబెట్, శ్రీలంకల్లో దొరికిన బౌద్ధ వాఞ్మయం ఆనాటి వాణిజ్యాన్ని, వస్తు సంస్కృతిని వివరిస్తాయి. ‘పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్ సీ’ అనే రోమన్ గ్రంథం దక్షిణ భారతదేశంలోని రేవు పట్టణాలు, వ్యాపారం, పరిశ్రమల గురించి వివరిస్తుంది. క్రీ.శ. 1వ శతాబ్దిలో రచించబడిన రోమన్ గ్రంథం, ‘హిస్టోరియా న్యాచురాలిస్’ రచయిత, ప్లైనీ ద ఎల్డర్, క్రిష్ణాతీరంలో తయారయ్యే వస్త్రాల కోసమే రోమన్ స్త్రీలు సాలుకి కోటి సెస్టర్సీస్ (రోమన్ వెండినాణెం) వెచ్చిస్తున్నారని వాపోయాడు. ముడినూలు, పట్టులను వస్త్రాలుగా నేసే సాలీలకి ఆంధ్రదేశం ఎల్లప్పుడూ ప్రఖ్యాతి గాంచింది. ఆధునికయుగంలో ఇంగ్లండ్‌లో పారిశ్రామిక విప్లవం, బ్రిటిష్ ప్రభుత్వపు ద్వంద్వ వైఖరివల్ల మిల్లుబట్టల తాకిడికి మన చేనేత పరిశ్రమ దాదాపు రూపు మాసిపోయింది. ఇక చైనా, జపాన్, ఆగ్నేయ ఆసియా దేశాలకి నాగరికతని, బౌద్ధమతాన్ని పంచినది ఆంధ్రదేశమే. నేటి నాగార్జునసాగర్ డ్యాం వద్ద శ్రీపర్వతం అనే మహావిశ్వవిద్యాలయం ప్రపంచానికే తలమానికమై విలసిల్లింది. ఆ కాలంలో ఆచార్య నాగార్జునుని శ్రీపర్వత క్షేత్రం ఎలావుండేదో తెలుసుకోవాలంటే చైనా యాత్రికులు ఫాహియాన్, హ్యూయెన్త్సాంగుల కథనాలు ఒక చక్కని ఆధారం. పదివేలకు పైగా దేశవిదేశాల విద్యార్థులు అక్కడ శిక్షణ పొందేవారు. భారత వైద్యశాస్త్ర వాఞ్మయంలో ఆచార్య నాగార్జునుడి ప్రశంస ప్రారంభించని గ్రంథం లేదు. సుశ్రుతుని శస్త్రవైద్య సంహితను సంకలనం చేసింది అతడే. ఆరోగ్య మంజరి అతడు రచించిన వైద్య గ్రంథాలలో ఒకటి. నేత్రవ్యాధులకి అతడు నిర్దేశించిన చికిత్స చైనాలోనూ ఎంతో ప్రసిద్ధిగాంచింది. పాదరసం, బంగారం మొదలైన ఖనిజాల రహస్యాలు విశదీకరించే రసరత్నాకరం భారతీయ రసాయనశాస్త్రానికే ఆదిగ్రంథం. అతడి మానవాతీత శక్తులపై అనేక కథనాలు ప్రపంచపు నలుమూలలా వ్యాపించాయి. ప్రకృతి ధర్మాలను ఔపోసన పట్టిన సిద్ధపురుషుడు. ఇక బౌద్ధ మహాయానానికి అతడే మూలపురుషుడు. తర్కంలో, తత్వశాస్త్రంలో అతడి ప్రజ్ఞ అనితరసాధ్యం. అతడి మాధ్యమికతత్వం, మతానికే కాక, ఆదిశంకరుని అద్వైతానికి కూడా ప్రామాణికం అయింది. క్లుప్తంగా చెప్పాలంటే అతడు వైద్య, రసాయన, ఖనిజ, ఖగోళ, వృక్ష శాస్త్రజ్ఞుడే కాక మహాయాన బౌద్ధాన్ని సిద్ధాంతీకరించిన తర్కవేత్త. అంతేకాదు, అతడొక గొప్ప రాజనీతిజ్ఞుడు. శాతవాహన చక్రవర్తికి ధర్మోపదేశం చేస్తూ ‘సుహృల్లేఖ’ అనే పేరుతో అతడు రాసిన ఉత్తరాల సంకలనం ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. ఇండియాలోనే కాదు, మధ్య ఆసియా దేశాల్లో కూడా విద్యాలయాల్లోని విద్యార్థులు సుహృల్లేఖని ప్రతిరోజు వల్ల వేసేవారని చైనా యాత్రికుడు ఇత్సింగ్ చెప్పాడు. అరిస్టాటిల్, ప్లాటో వంటి తత్వవేత్తలకి కూడా ఆచార్య నాగార్జునుని గంటం నుండి వెలువడిన అపారమైన రచనాపరంపర ముందు తలవొగ్గక తప్పలేదు. సాయి పాపినేని -
వారసుడు
దంతపురి, కళింగం - క్రీ.పూ.2 శతాబ్దం ప్రస్తుత శ్రీకాకుళం పట్టణం చుట్టుపక్కల ప్రాంతం పెద్దశెట్టి బుధదత్తుడి ఇంట్లో వేడుక. కొత్త నాట్యగత్తె ఆట ఆడబోతోందట. పెద్ద కోలాహలంగా ఉంది. బుధదత్తుడంటే మాటలా? నాగావళీ వంశధార నదుల అంతర్వేదిలోని నూరుగ్రామాలకి గృహపతి. తల్లిదండ్రులు, తమ్ముళ్లూ, ఇల్లరికపుటల్లుళ్లూ, చుట్టపక్కాలతో సందడి చేసే వంద పడకల లోగిలి. అంతర్వేదిలోనే కాదు మధ్య కళింగంలోనే అతడి మాటకి తిరుగులేదు. పదిహేడేళ్ల క్రితం పుష్యపౌర్ణమి పర్వదినాన పుట్టిన కుమారుడికి పుష్యగుప్తుడు అని పేరు పెట్టాడు. అతడిప్పుడు ఉదయగిరిలో (ఒడిశాలో భువనేశ్వర్వద్ద కొండగుహ) జైనస్వామి వద్ద గణిత వ్యాకరణాలు అభ్యసించి ఇంటికి రాబోతున్నాడు. కుమారుడి విద్య కోసం ఆ జైనసంఘానికి నాలుగు గ్రామాలపై వచ్చే ఆదాయాన్ని దానం చేసిన బుధదత్తుడు విద్యాభ్యాసం పూర్తి చేసుకొని వచ్చే కుమారుడి వేడుకలలో తక్కువ కోలాహలం చేస్తాడా? ఖర్చుకు వెనుకాడుతాడా? అందుకే ఈ నాట్యం. బుధదత్తుడు పుత్రోత్సాహంతో కుమారుడి స్నాతక మహోత్సవం కనీవినీ ఎరుగని రీతిలో సూర్యదేవుని ఆలయ ప్రాంగణంలో చేయటానికి సంకల్పించాడు. పూర్ణకుంభాలతో గుడి పూజార్లతో సహా ఎదురుకోలకి ఊరంతా కదిలివచ్చింది. ఆశ్వీయుజ మాసంలో ఎదురెండకి గొడుగుపట్టే బోయలు, మార్గమంతా కాలికి మట్టి అంటకుండా వెల్లవస్త్రాలు పరిచే రజకులు, చామరాలతో నర్తకులు, స్తోత్రపాఠకులు, మేళగాళ్లు ముందు కదిలారు. నవనవలాడే అందగాడు, కుర్రవాడు పుష్యగుప్తుడు ఆలయంలో ప్రవేశించగానే మొగలిరేకులతో అలంకరించిన నృత్య మంటపంలో గజ్జె ఘల్లుమంది. అతడి గుండె ఝల్లుమంది. మంటపంలో నాట్యకత్తె. పేరు నాగసిరి. కౌమారప్రాయం అంతా కొండగుహలలో గడిపిన ఆ పడుచువాడు మేళతాళాలకు గతిబద్ధంగా నాట్యం చేస్తున్న ఆ చక్కని చుక్కని కనులు విప్పార్చి చూస్తూ ఉండిపోయాడు. గుళ్ళో ఉత్సవం ముగిశాక నాగసిరిని తీసుకుని తల్లి చందసిరి ఇల్లు చేరేసరికి సూర్యుడు నడినెత్తికి వచ్చాడు. నృత్యం జయప్రదమైనందుకు ఆమెకు సంతోషంగా ఉంది. పెద్దశెట్టి బుధదత్తుడే స్వయంగా అడిగితే కాదనలేకపోయిందే తప్ప ఇంకా పూర్తిగా పక్వానికి రాని ఒక్కగానొక్క కూతురి నృత్యార్చనకు ఆమె పూర్తి సమ్మతంగా లేదు. అయితే ఏం? నాగసిరి రంగప్రవేశానికి బుధదత్తుడు చెల్లించిన మూల్యం- కాలువ దిగువన పది నివర్తనాల చెరకుతోట. ఇలాంటి కానుకలు, కాసులు చందసిరికి కొత్తకాదు. ఆమె గణికా నిగమానికి నాయకురాలు. ఆమె నిగమానిది నది ఒడ్డున నూరు నివర్తనాల వాడ. పగలూ రాత్రి కళకళలాగే భోగలాలసుల స్వర్గం. మధుశాలలు, భోజనశాలలు, వసతి గృహాలలో వెయ్యికిపైగా నగరవాసులకి ఆ వాడలో ఉపాధి దొరుకుతుంది. నగర గోష్టికి సాలుకి పన్నుల రూపంలో కట్టే ఆదాయమే లక్ష పణాలు మించుతుంది. కూతురు చేతికి అంది వస్తే కనకవర్షమేనని ఆమెకు తెలుసు. ఇంటి మండువాలో కూతురికి ముసలి దాసి చెల్లక్క దిష్టి తీస్తూ ఉంటే ‘అంతా అమ్మడి అదృష్టం’ అని మెటికలు విరిచింది చందసిరి. ‘సరే గానీ పెద్దశెట్టి కొడుకు ఎల్లాగున్నాడేటి?’ అని అడిగింది చెల్లక్క ‘అబ్బా! ఎంతందగాడే. మన్మథుడు దిగొచ్చినట్లు సుమా. అమ్మడి నాట్యం చూస్తూ రెప్పవేయలేదంటే నమ్ము’. ‘మరే. మన బంగారుకేటి తక్కువ? ఆ కుర్రాడిని చిటికినవేలున కట్టీసుకోలదు’. ‘నిజమేనే. అల్లాంటోడు ఒక్కడు దొరికితేచాలు తరతరాలు తిన్నా కరిగిపోని ఆస్తి. ప్చ్! లాభం లేదు. మనకి చిక్కటం కష్టమే’. ‘అదేటి? మన అమ్మడికన్నా అందగత్తె ఈ కళింగంలోనే లేదు. అరవైనాల్గు కళల పట్టి. అనుభవం లేదనేగాని ఒకసారి కూడితే దాన్ని విడిచి పెట్టడం బ్రహ్మతరంకాదు. ఆ!’ ‘నిజమే కానీ పెద్దశెట్టి ధర్మం తప్పని మనిషి. ఇతడు అతని వారసుడు కదా?’ ‘ఐతే? పుర్రెకొక బుద్ధి. జిహ్వకొక చపలం. అందరూ ఒకేలా ఉంటారేటి? ప్రయత్నించటంలో తప్పేటి? ఆ పని నాకొగ్గేయ్. నా దగ్గర ఉన్న విద్యలు నీకు తెలియవేటి?’ ‘ఏమో ఆ కుర్రోడు ఇక్కడ ఉంటే కదా మనకి దక్కేది. ఇవాళ దేవాలయంలో చూడాలి. అతడికి ఉద్యోగం ఇచ్చేందుకు నిగమాలన్నీ పోటీపడ్డాయి. ఉదయగిరిలో ఎక్కాలు కట్టడంలో ఆ కుర్రాడికి సాటిలేరట. మేమంటే మేమని వేలంపాటలా వేలకివేలు ఆశ పెట్టారు. ఆఖరికి బావరికొండ రేవు (విశాఖపట్టణం వద్ద బావికొండ) నగరశ్రేష్ఠి తన కూతురినిచ్చి పెళ్లిచేసి వారసత్వం కూడా కట్టబెట్టేందుకు ముందుకొచ్చాడు. పెద్దశెట్టి కూడా సరేనన్నాడు. కానీ ఇల్లరికానికి అప్పుడే ఏం తొందర పదేళ్ల తరువాత ఇంటికొచ్చాడు, కొన్నాళ్లు నా ఎదురుగా ఉంటాడు అని సర్దిచెప్పాడు’ అని పూసగుచ్చినట్లు వివరించింది చందసిరి. ‘మరీ మంచిది. నగరంలోనే ఉంటే ఏదోలా మచ్చిక చేసుకోవచ్చు’ అన్నది చెల్లక్క. ‘నీ మొహం! మన పెద్దశెట్టి నీడలో నీ పప్పులేం ఉడకవు సుమా’ అంతలో మడిచిన పంచె కుచ్చిళ్లని చిటికెనవేలుకి చుట్టి విలాసంగా ముంగిట్లోకి వచ్చాడు బాదరాయణుడు. ఒకప్పుడు ఉత్తమవంశంలో పుట్టిన నగరప్రముఖుడు. కానీ భోగలాలసత్వానికి ఉన్నదంతా తగలేసి ఆఖరికి విటుడిగా గణికా నిగమంపై ఆధారపడి జీవితం సాగిస్తున్నాడు. చేతిలోని నాణాలు నిండిన పట్టుసంచిని చందసిరి దోసిట్లో జారవిడిచి ‘నాగసిరి నృత్యం మీదకు మరోమారు మనసు పోతోంది చందూ’ అంటూ పక్కనే ఉన్న పాన్పుపై చతికిలబడ్డాడు. చిక్కం విప్పి చూసిన చందసిరి ముఖంలో ఆశ్చర్యం. అందులో నూరు నిష్కాలు మేలిమి బంగారానివి ఉన్నాయి. ‘నీ ముఖానికి నాగసిరా? ఈ నిష్కాలు ఎక్కడివి?’ అంది చందసిరి. బాదరాయణుడు నవ్వాడు. ‘నాకు కాదులేవే. ఉన్నాడులే స్నేహితుడొకడు! పెద్దశెట్టి కొడుకు. పొద్దున్న దాని నాట్యం చూసి మనసు పారేసుకొన్నాడట. పాపం మరోసారి చూడాలని ఉబలాట పడుతున్నాడు’ అన్నాడు. అతడికి ఉత్సాహంగా ఉంది. ఈ బేరం కుదిర్చితే ఇరుపక్షాల నుంచి ఎంతో కొంత దక్కకపోదు. ఆ మాట వింటూనే చందసిరి ముఖంలో ఆనందానికి తోడు ఏదో సంశయం. ‘అది ఇంకా చిన్నపిల్ల. ఇప్పట్లో ఇలాటివన్నీ సాధ్యంకాదు’ అని చేతిలోని సంచిని తిరిగి ఇచ్చివేసింది. బాదరాయణుడు లొంగే ఘటం కాదు. ‘ఇది ముందుగా ఇచ్చిన బయానా అనుకో. ఈ సాయంత్రానికే తప్పనిసరిగా ఏర్పాట్లు చెయ్యి. వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకోకు’ అన్నాడు. చందసిరి కాసేపు ఆలోచించి ‘నీవింత చెప్పాక తప్పుతుందా’ అని తలవూపుతూ లేచి చెల్లక్కతో ‘ఏంటే ముసలిముండా! అల్లుడు ఎండనబడి వచ్చాడు. కాస్త ఫలహారం ఇద్దామన్న మర్యాద కూడా లేదూ?’ అంటూ అతడి చేతిలోని సంచిని తిరిగి లాక్కుంది. మూణ్ణెల్లు గడిచాయి. ‘ఇంకెన్నాళ్ళే చందూ?’ ముద్దముద్దగా తడబడే మాటలతో మల్లెపూల పరిమళంతో గుబాళిస్తున్న చందసిరి క్రీడోద్యానంలో పట్టుపరుపుపై కూర్చొని తాంబూలం ఆస్వాదిస్తూ అడిగాడు బాదరాయణుడు. ‘అంత ఆత్రంగా ఉందేంటి? అల్లుడిని కాస్త ఓపిక పట్టమను. చందసిరి కూతురంటే మాటలేంటి?’‘మరుండదేంటి? ప్రతిరోజూ ఇల్లాగే అందని పండులా ఊరిస్తుంటే అతడిని ఆపడం కష్టం. ఒకసారి చేజారిపోతే ఇక నా వల్లకాదు’ అన్నాడు చేతిలోని పాత్ర పెకైత్తి అందులోని ద్రాక్షమధువును గొంతులో పోసుకుంటూ.‘వచ్చే మాఘపౌర్ణిమకి అల్లాగే చేద్దామని చెప్పానుకదా?’ ‘మరీ తెగేదాకా లాగకు. ఆ తూర్పు ఉప్పుమళ్ళు ఎలాగోలా నీ పరంచేస్తానన్నాడు. వాటి అజమాయిషీ మాత్రం నా చేతిలో పెట్టు, ఏటంటావ్?’ అన్నాడు బాదరాయణుడు. మాఘపౌర్ణమి రానే వచ్చింది. పెళ్ళికి విచ్చేసిన అతిథులతో ఆవరణ అంతా నిండిపోయింది. వధూవరులు వచ్చారు. పెళ్లికొడుకు పుష్యగుప్తుడి మనసంతా అతడి నూతన వధువు పైనే. బావరికొండ పద్మశ్రేష్ఠి కూతురు పదహారేళ్ళ బంగారు బొమ్మ. ఈడూ జోడూ! నాగసిరి మాటే మర్చిపోయాడు. గృహస్తాశ్రమంలో ప్రవేశిస్తున్న కొడుకుని చూస్తే పెద్దశెట్టి మనసు ఆనందంతో నిండిపోయింది. చిరునవ్వుతో ఎదురుగా నిలిచి ఉన్న చందసిరిని సమీపించాడు. ‘ఈ మూడు నెలలూ నా వారసుడుని ఒక కాపు కాసినందుకు నీకేమిచ్చినా తక్కువే. వచ్చే గోష్టిలో ఆ ఉప్పుమళ్లు మీ నిగమానికి అప్పగించే బాధ్యత నాది, సరేనా?’ అంటూ చేతిలో చెయ్యేసి తన కృతజ్ఞత వ్యక్తం చేస్తున్న పెద్దశెట్టి మాటలకి చందసిరి సంతోషించినా ఆమె పెదాల మీద చిన్న విషాద వీచిక.నిజమే. భోగవాటికలో పాడు చేసేవారిని అందరూ చూస్తారు. పాడుకాకుండా చూసేవారిని ఎవరు గుర్తు పెట్టుకుంటారు? ఆ మాటే పెద్దశెట్టితో అంటే నవ్వి ‘పాడై పోయినవారు ఎందులోనూ మిగలరు చందూ. కాని పాడుకాని వారే అన్నింటికీ నిజమైన వారసులవుతారు’ అన్నాడు కొడుకువైపు గర్వంగా చూసుకుంటూ. పురుషార్థాలు మనిషిగా పుట్టిన ప్రతివాడు ధర్మం, అర్థం, కామం, మోక్షం అనేవి ఆర్జించాలని చూస్తాడు. ఈ పురుషార్థాలలో మోక్షం అన్నింటి కన్నా మిన్న. చిన్న తేడాలతో జైనుల కైవల్యం, బౌద్ధుల నిర్వాణం, బ్రాహ్మణ వ్యవస్థలోని మోక్షం ఒకటే. శాసన వాజ్ఞ్మయాలలోని ఆధారాలని పరిశీలిస్తే ఆనాటి నగరవాసులు అన్ని మతాలను సమదృష్టితో చూశారనిపిస్తుంది. ఒకే కుటుంబంలో కొందరు బౌద్ధం అవలంబిస్తే మరి కొందరు ఇతర ధర్మాలని అనుసరించిన నిదర్శనాలు అనేకం కనిపిస్తాయి. అయితే ఇంట్లో శుభకార్యాలు మాత్రం వైదికధర్మం ప్రకారం పురోహితుల ద్వారా జరిపించారు. ఆంధ్రుల సాంస్కృతిక వారసత్వం ఈ మతాలన్నింటి నుంచీ వచ్చింది. తొలి చారిత్రక యుగపు నాగరికుల జీవనవిధానాన్ని గురించి అవగాహన కావాలంటే ఈ మూడు పురుషార్థాలకు చెందిన మౌలిక గ్రంథాలని పరిశీలించాలి. అవి మనుధర్మశాస్త్రం, కౌటిల్యుని అర్థశాస్త్రం, వాత్స్యాయనుని కామసూత్రాలు. వీటిలో వాత్సాయనుడి గ్రంథం ఆనాటి పట్టణాలలోని ధనికవర్గపు జీవనానికి అద్దం పడుతుందని ప్రముఖ చరిత్రకారుల అభిప్రాయం. పౌరులలో ముఖ్యంగా ధనికవర్గంలో భోగలాలసత్వం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. కథాసరిత్సాగరంలోని ఇతివృత్తాలు ఈ వాదానికి నిదర్శనం. వ్యవసాయం హస్తకళలు అభివృద్ధి చెందటంతో వనరులు పెరిగి జీవనశైలిలో ఎన్నో మార్పులు వచ్చాయి. వాణిజ్య వ్యవస్థ పురోగమించటం వలన నగర ప్రజలకి అనేక విలాసవస్తువులు లభ్యమవసాగాయి. దేశ విదేశీ వర్తకులు యాత్రికుల వలస కొత్తకొత్త అభిరుచులు చోటు చేసుకొన్నాయి. పట్టణాలలో వివిధ పరిశ్రమలు, వర్తకులు నిగమాలుగా ఏర్పడి తమ తమ వ్యవహారాలు సాగించేవారు. అవి ఈనాటి కార్పొరేట్ సంస్థలలాగా భాగస్వామ్య పద్ధతిలో పని చేసేవి. ఈ నిగమాలలో ప్రవేశం జన్మ వల్లగాక వారి వారి విద్యా, నైపుణ్యాలని బట్టి ఉండేవని తెలుస్తోంది. కాని తరువాతి కాలాల్లోని కులవ్యవస్థకి బీజం ఈ నిగమ వ్యవస్థేనని శాస్త్రజ్ఞుల అభిప్రాయం. ఒక ప్రాంతంలోని నిగమాలన్నీ కలిసి తమ తమ పన్నులు, ఇతర వ్యవహారాలు పరిష్కరించుకోవటానికి ఒక గోష్ఠిగా ఏర్పడేవారు. పౌరుల వినోదమే ప్రధానమైన గణికా వ్యవస్థ సమాజంలో ప్రముఖమైన స్థాయికి ఎదిగింది. కౌటిల్యుని అర్థశాస్త్రం ఈ వ్యవస్థకి నిర్ణీతమైన పరిధులు విధించినా దాని వలన ప్రభుత్వానికి వచ్చే లాభాలను మాత్రం విస్మరించదు. ఒక వైపు శ్రమణదీక్షతో మోక్షాన్ని సాధించమని చెప్పిన బౌద్ధ, జైన మతాలు కూడా గృహపతుల దానాల మీద ఆధారపడ్డాయి. ఒక బ్రాహ్మణ సమాజానికి మూల స్తంభం యాజమాన్య వ్యవస్థ. గృహస్తాశ్రమమంటే ధర్మార్థకామాల సమ్మేళనం. ఈ మూడు పురుషా ర్థాలు మోక్షమనే పరమార్థానికి సోపానాలు. అయితే మానవుని నైతిక విలువని నిర్దేశించిడంలో మాత్రం ఆనాటి సమాజంలో ధర్మశాస్త్రానిదే అగ్రపీఠం. మొత్తానికి ఆనాటి నగరాలలోని సమాజాన్ని పరిశీలిస్తే అది వివిధ మతాల, వివిధ ప్రాంతాల, సంస్కృతుల సమ్మేళనం. ఈనాటి కాస్మోపాలిటన్ నగరాలకి ఏ విషయంలోనూ తీసిపోలేదనే చెప్పాలి. సాయి పాపినేని పదం నుంచి పథంలోకి - 5 -
బంగారు కొండ
సాయి పాపినేని పదం నుంచి పదం లోకి-4 సువర్ణగిరి - మౌర్యసామ్రాజ్యపు దక్షిణదేశ రాజధాని (నేటి కర్నూలు జిల్లాలోని జొన్నగిరి గ్రామం) - క్రీ.పూ. 256 కళింగ దండయాత్ర అఖండ విజయంతో ముగిసింది. బడలిక తీరిన మౌర్యసామ్రాజ్య చక్రవర్తి అశోకుడు తన దక్షిణ రాజధాని సువర్ణగిరికి రేపు రానున్నాడు. చక్రవర్తి ఆగమనానికి చేయవలసిన సన్నాహాలతో మహామాత్ర (గవర్నర్) ధర్మతేజుడు తలమునకలుగా ఉన్నాడు. ఇంతలో అత్యవసర న్యాయస్థానాన్ని హాజరు పర్చాలని రాజకుని (తహసిల్దార్) కోరిక. ఏదో దొంగతనం విచారణ. బహుశా బంగారం దొంగతనమే అయి ఉండాలి. సువర్ణగిరి ప్రాంతం బంగారు, వజ్రపు గనులకి ప్రసిద్ధి. ప్రతియేటా మణుగులకొలదీ బంగారం, వజ్రాలు ఏనుగులపై మగధకి రవాణా అవుతాయి. కోటలోని లోహ కర్మాగారం భారతదేశంలోనే అతి పెద్దది. దాని కర్మాంతికుడు (ఫ్యాక్టరీ సూపరింటెండెంట్) దమనదత్తుడు. నగరంలోని ఇతర ముఖ్యోద్యోగులు గనుల సంస్థానాధ్యక్షుడు (చీఫ్ మేనేజర్ మైన్స్), నగర వ్యవహారికుడు (మేజిస్ట్రేట్), ప్రాదేశికుడు (సిటీ కమిషనర్), దండపాలుడు (పోలీస్ ఇన్స్పెక్టర్) అందరూ కోట మధ్యలోని మైదానం వద్ద ఉన్నతాసనాలతో ముందుగానే వచ్చి కూర్చున్నారు. పట్టణంలో పౌరులు చోద్యం చూసేందుకు చుట్టూ గుమికూడారు. ధర్మతేజుడు అగ్రపీఠం అధిష్టించిన మరుక్షణమే భటులు నిందితుడు కాపడిని పెడరెక్కలు విరిచికట్టి ఈడ్చుకు వచ్చి మైదానం మధ్యలో పడవేశారు. ‘నిందితునిపై అభియోగం?’ ధర్మతేజుడు అడిగాడు. దమనదత్తుడు లేచి ‘ఆర్యా, ఇతడి పేరు కాపడు. కృష్ణాతీరంలోని బంగారు గనులలో పనిచేసే గణకుడు(అకౌంటెంట్). ఇతడు బంగారం శుద్ధిచేసే కర్మాగారంలో అనుమతి లేకుండా ప్రవేశించి బంగారం దొంగిలించి పారిపోతుండగా మన రక్షకదళం బంధించింది. ఇందులో విచారించేందుకు ఏమీ లేదు. తమరు తగిన దండన విధించగలరు’ అన్నాడు. ‘ఇది సామాన్యమైన దొంగతనం. నిందితుడిని నగర వ్యవహారికుడే దండించవచ్చు కదా? ప్రత్యేక న్యాయస్థానం దేనికి?’ కాకవర్ణుడు లేచాడు. అతడు గనుల సంస్థానాధ్యక్షుడు, ‘ఆర్యా, ఈ అపరాధాన్ని చిన్న దొంగతనంగా పరిగణించవద్దు. కౌటిల్యుని దండనీతి ప్రకారం కర్మాగారంలో అనుమతి లేకుండా ప్రవేశించిన వారికి మరణదండనే తగిన శిక్ష. నా అనుభవంలో ఇటువంటి నేరం ఇదే మొదటిసారి. దీనిని తీవ్రమైన నేరంగా పరిగణించి భవిష్యత్తులో మరొకరు ఇటువంటి నేరానికి పాల్పడకుండా కఠినమైన దండన విధించమని అర్థిస్తున్నాను’ అని తన వాదన వివరించాడు కాకవర్ణుడు. ‘ఊ.. మరణదండన’ అని కాసేపు ఆలోచించి నిందితుడు కాపడి వంక చూసి ‘ఏమోయ్, నీపై అభియోగం విన్నావు కదా? నీవేమైనా చెప్పుకోవలసినది ఉందా?’ అని అడిగాడు ధర్మతేజుడు. ‘అయ్యా! నేను నిరపరాధిని. గనుల కార్యాలయంలో గణకునిగా కొన్ని అవకతవకలు నా దృష్టికి వచ్చాయి. వాటిని రహస్యంగా ఇక్కడి గనుల సంస్థానధ్యక్షునికి విన్నవించేందుకు వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చాక దండపాలుడు నాపై ఈ లేనిపోని అభియోగం మోపటంతో దిక్కు తోచక పారిపోబోయాను. అంతే’... అన్నాడు కాపడు. కాపడి మాటలలో ధర్మతేజుడికి కపటం కనిపించలేదు. ‘ఆర్యా’ అంటూ లేచాడు నగర వ్యవహారికుడు. ‘కాపడు అబద్ధం చెబుతున్నాడు. దండపాలుడు గని అధికారులందరితో విచారించాడు. ఎక్కడా అవకతవకలు లేవు. ఇతడు దొంగ. చేతికందిన బంగారంతో కుటుంబం వద్దకు పారిపోవటమే అతడి ఉద్దేశ్యం అని విచారణలో తేలింది’ అని తన నివేదిక వివరించాడు. హుమ్! ఇక విచారించేందుకు ఏమీలేదు. ఇతడికి శిరచ్ఛేధమే శిక్ష. మూడు దినాల వ్యవధి తరువాత దండపాలుడు శిక్ష అమలు చేయవచ్చు’ అని లేవబోయాడు ధర్మతేజుడు. ‘ఆర్యా! మాదొక మనవి. రేపు చక్రవర్తి విచ్చేస్తున్నారు’ అని అడ్డుపలికాడు కాకవర్ణుడు. ‘ఆ ఉత్సవాల మధ్య శిక్ష అమలు చేయటం అనుచితమేమో. తమరు అనుమతిస్తే ఈ సాయంత్రమే... ‘వీలుకాదు. అది దండనీతికే విరుద్ధం. మరణశిక్ష విధించిన వ్యక్తికి లేదా అతడి సన్నిహితులకి కొత్త సాక్ష్యాలు, వాదనలు ప్రవేశపెట్టేందుకు అవకాశం ఇవ్వటం ఆనవాయితీ. ఈ విషయంలో నేను ధర్మం తప్పి మీరు కోరినట్లు అనుమతి ఇవ్వలేను. చక్రవర్తి ఇక్కడ ఉండగా శిక్ష అమలు చేయటానికి మీకు అభ్యంతరమైతే వారు వెళ్లిన తర్వాతే అమలు చేయవచ్చు. అంత వరకు ఇతడిని కారాగృహంలో నిర్బంధించండి’ అని నిష్ర్కమించాడు ధర్మాధికారి ధర్మతేజుడు. ‘అలాగే కానిస్తే సరి. ఎన్నాళ్లైనా సాక్ష్యం చెప్పేందుకు ముందుకొచ్చే ధైర్యమెవరికి?’ కాకవర్ణుని చెవిలో గుసగుసలాడాడు దమనదత్తుడు. ‘ఏదియేమైనా చక్రవర్తి వెళ్లే వరకూ వర్తకపు బిడారులు ఈ చుట్టుపక్కలకి రాకుండా చూడాలి. మన గుట్టు రట్టయిందంటే పీకల మీదకి వస్తుంది’ అని బదులుపలికాడు కాకవర్ణుడు. చక్రవర్తి వచ్చి వారం గడిచింది. గనుల పర్యవేక్షణకి విచ్చేస్తున్నారని ఏ రోజుకారోజు వార్త. కానీ ఏదో ఒక నెపంతో వాయిదా పడుతూనే ఉంది. కాకవర్ణునికి గనులని వదిలి వచ్చేందుకు వీలుపడటం లేదు. ఇంతలో పిడుగులాంటి వార్తతో పరిగెత్తుకు వచ్చాడు దమనదత్తుడు. ‘కాపడి మరణదండన విషయమై ఏదో కొత్త సాక్ష్యమట. ధర్మతేజుడు న్యాయస్థానాన్ని హాజరు పరిచాడట, తమరు వెంటనే రావాలి.’ ఊరంతా పారమైదానంలో హాజరైంది. వారికి తోడు చోద్యం చూడటానికి చక్రవర్తి మూలబలంలోని సైనికులు. ధర్మతేజుడు ఆసీనుడయిన మరుక్షణం నల్లగా బవిరిగడ్డంతో ఉన్న ఆగంతకుడు ఒకడు పౌరులలో నుండి వచ్చి మైదానం మధ్య నిలిచాడు. ‘మహామాత్రా. నేను పరదేశిని, నిందితుడు కాపడు నాకెంతో సన్నిహితుడు. అతడు నిరపరాధి అని నిరూపించే కొన్ని సాక్షాలు ప్రవేశపెట్టడానికి తమ అనుమతి కోరుతున్నాను’ అంటున్న ఆగంతకుడి కంఠం న్యాయస్థానం నలుదిశలా మార్మోగింది. వెంటనే కాకవర్ణుడు లేచాడు. ‘ఆర్యా! ఇతడొక తోడుదొంగ. వెంటనే బంధించండి’ అంటున్న అతణ్ణి వారిస్తూ అదే నిజమైతే అలాగే చేద్దాం. ముందుగా అతడిని మాట్లాడనివ్వండి’ అన్నాడు ధర్మతేజుడు. ‘ఏమయ్యా పరదేశీ. నీ వాంగ్మూలం సెలవీయవచ్చు’ అన్నాడు ఎంత దాచినా దాగని ముసి ముసి నవ్వులతో. ‘మహామాత్రా! కాపడు నిరపరాధి. ప్రభుత్వ గనుల నుండి కర్మాగారం నుండి అక్రమంగా బంగారం విలువైన రత్నాలు రవాణా అవుతున్నమాట నిజం. గని అధికారి దీనిలో భాగస్వామి. అతడే కాదు ఈ న్యాయస్థానంలో ఉన్నతాసనాలపై కూర్చొన్న పలువురు పెద్దలు కూడా..’ ‘ అప్రస్తుతం!’ ‘వీడిని పట్టి బంధించండి!’ ‘సాక్ష్యం ఏది?’ ఒక్కసారిగా గగ్గోలు మొదలైంది. కనుమూసి తెరిచేంతలోగా ఎక్కడ నుంచి వచ్చారో సైనికులు ఆ ప్రముఖుల పక్కనే నిలిచి వారిపై కత్తులు దూశారు. మెల్లిగా న్యాయస్థానంలో నిశ్శబ్దం ఆవరించింది. ఇంతలో కొందరు సైనికులు నలుగురు మనుషులని మైదానంలోకి ఈడ్చుకువచ్చి వారి ముఖాలపైనున్న ముసుగులు విప్పారు. వారిని చూడగానే నగర ప్రముఖుల ముఖాలు నెత్తురు చుక్కలేకుండా పాలిపోయాయి . వారు బిడారు వర్తక సంఘాల నాయకులు. అక్రమ బంగారాన్ని అనధికారంగా కొని తీసుకెళుతున్న ప్రబుద్ధులు. వారికి సహకరిస్తున్న నగర ప్రముఖుల గుట్టు బట్టబయలైంది. దమనదత్తుని మాటలు తడబడ్డాయి. ‘ఇఇ ఇంతకీ ఎవరివోయి నీవు?’ అని అడిగాడు ఆగంతకుడిని. బవిరిగడ్డంలో మైదానం మధ్య నవ్వుతూ నిలిచి ఉన్న ఆ ఆగంతకుడు ‘ఆహ్హహ్హహ్!’ అని నవ్వుతూ తన పెట్టుడు గడ్డం తీశాడు. జనం మధ్యలో ప్రత్యక్షమైన చక్రవర్తి అశోకుడి నిజరూపం చూసి ధర్మతేజుడు తప్ప మిగిలిన వారంతా కొయ్యబారిపోయారు. అశోకుడు: ఎర్రగుడి శాసనాలు... భారతీయ సెక్యులర్ న్యాయ సిద్ధాంతాలకి ప్రతీక అశోకుడు. మన జాతీయ జెండాలోని ధర్మచక్రం అతడి భవిష్య దృష్టికి చిహ్నం. ఆంధ్ర దేశంలో కూడా ఆర్థిక న్యాయవ్యవస్థలకి పునాది అశోకుని కాలంలోని వేయబడింది. నేటి ఆంధ్ర, కర్నాటక సరిహద్దు ప్రాంతంలో బంగారం తవ్వి తీసిన ఆధారాలు ఇప్పటికీ 5 వేల సంవత్సరాల ముందు రాతియుగం నుంచి కనిపిస్తాయి. కోలార్, హుట్టి బంగారు గనులు ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. ఇక్కడ పారే చిన్నా పెద్దా నదులలోని ఒండ్రుమట్టి నుంచి కూడా బంగారం వడగట్టి వెలికి తీసేవారు. సువర్ణగిరి, కనకగిరి వంటి అశోకుని శాసనాలు దొరికిన ప్రదేశాల పాత పేర్లు కూడా ఈ లోహంతో గల సంబంధాన్ని తెలియజేస్తాయి. కౌటిల్యుని అర్థశాస్త్రం ఖనిజాలని తవ్వితీసే పరిశ్రమ గురించి విశదంగా వివరిస్తుంది. అశోకుని శాసనాలని, అర్థశాస్త్రాన్ని పరిశీలిస్తే ఆనాటి వ్యవస్థలోని రాజోద్యోగుల డిజిగ్నేషన్లు, వారి వారి బాధ్యతలు, జీతాల వివరాలు దొరుకుతాయి. ప్రభుత్వ కర్మాగారాలు, వాటి పనితీరు, అధికారులలో అవినీతి, వాటికి తగిన శిక్షల గురించి అనేక వివరణలు ఉన్నాయి. న్యాయవ్యవస్థ, న్యాయస్థానాలు పనిచేసే విధానం (జ్యూరిస్ప్రుడెన్స్) రోమన్ సామ్రాజ్యం ప్రపంచానికి ఇచ్చిన వారసత్వం అని సామాజిక శాస్త్రవేత్తల అభిప్రాయం. సిసిరో, జూలియస్ సీజర్ మొదలైన రోమన్ ప్రముఖులు ఎందరో న్యాయవాద వృత్తిలో రాణించిన తరువాతే రాజకీయాలలో ఎదిగారు. భారతీయ స్వాతంత్య్ర సమరంలో ప్రముఖ పాత్ర వహించిన నాయకులు గాంధీ, నెహ్రూ, పటేల్ మొదలైన వారంతా మొదట్లో న్యాయవాదవృత్తి చేసినవాళ్లే. న్యాయవ్యవస్థకి, రాజకీయాలకి విడదీయరాని సంబంధం ఈనాటిది కాదు. రోమన్ సామ్రాజ్యం స్థాపనకి ముందే న్యాయవ్యవస్థని, సిద్ధాంతాలని నిర్దేశించిన గ్రంథాలు భారతదేశంలో ఎన్నో ఉన్నాయి. కౌటిల్యుని అర్థశాస్త్రం ఆనాడు దేశంలో ఉన్న పటిష్టమైన న్యాయవ్యవస్థని తెలియజేస్తుంది. భారతదేశంలో న్యాయశాస్త్రానికి మౌలికమైన గ్రంధం మనుధర్మశాస్త్రం. అన్నింటిలో ప్రప్రథమమైన ఆపస్తంభ ధర్మశాస్త్రం తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా పరిసరాలలో గోదావరి తీరంలో క్రీ.పూ. 6వ శతాబ్దంలో రచించబడింది. ఆంధ్రదేశంలో సువర్ణగిరి నుంచి ఆశోకునిచే వెలువరించబడిన శాసనాలు ఆనాటి ఉద్యోగులు, న్యాయాధికారుల బాధ్యతలను పౌరులకు తెలియజేయటానికి దేశంలో అనేక చోట్ల చెక్కబడినాయి. వీటిలో ముఖ్యమైనవి కర్నూలు జిల్లాలోని ఎర్రగుడి శాసనాలు. అయితే మౌర్యయుగం తరువాత న్యాయవ్యవస్థలో అసమానతలు చోటు చేసుకున్నాయన్న విషయంలో వివాదం లేదు. కులాలవారీగా శిక్షలు అమలు చేయటం జరిగింది. శిక్షలు కఠినంగానే ఉండేవి. ముక్కు చెవులు కోయటం చాలా సామాన్యం, ఆ విధంగా విరూపమైన ముఖాలని ప్లాస్టిక్ సర్జరీ ద్వారా సరిచేయటం, తెగిన అవయవాలని తిరిగి అతికించటం కోసం ప్రత్యేకమైన వైద్యాలయాలు కూడా ఉండేవని సుశ్రుతుని వైద్య గ్రంథం తెలియజేస్తుంది. -
ఆంధ్రపథం
పదం నుంచి పథంలోకి - 2: భరుకఛ్ఛం- నేటి గుజరాత్‌లోని ప్రఖ్యాత రేవు పట్టణం బరోచ్ - క్రీ పూ.500 అతడు మారువేషంలో ఉన్నాడు. మగధ (పాటలీపుత్రం- పాట్న) నుంచి భరుకచ్ఛం వరకూ ఎలాగోలా పారిపోయి వచ్చాడు. దక్షిణాపథం చేరాలంటే భరుకచ్ఛం వరకూ రాక తప్పదు. ఇక్కడి నుంచి సముద్ర మార్గాన పారశీకానికి (అరేబియా గల్ఫ్ రాజ్యాలు) పారిపోవచ్చు. లేదంటే వర్తక బిడారులతో కలవగలిగితే వారితో పాటు దక్షిణాపథం చేరుకోవచ్చు. ఇక అప్పుడు తన ప్రాణాలకు ప్రమాదం ఉండదు. నిజానికి అతడు మగధ విడిచి మూడు మాసాలయింది. తన అన్న అధికారానికి అతడెప్పుడూ వ్యతిరేకి కాడు. అన్న చక్రవర్తి. కాని ఆ చక్రవర్తి పీఠం పై తాను కన్నువేసినట్టుగా ఎవరో ఆయనకు నూరిపోశారు. సామ్రాజ్యధికార కాంక్ష రక్తసంబంధాలకు అతీతమైనది. అడ్డువచ్చినవాడు సొంత తమ్ముడైనా అది సహించదు. తన ప్రాణానికి ప్రమాదం పొంచి ఉన్నట్టు అర్థమైంది. ఏం చేయాలి? పది వేల గుర్రాలను ఒకేసారి కొనుగోలు చేయగల సామర్థ్యం, సంపదా ఒక్క మగధ సామ్రాజ్య చక్రవర్తికే ఉంది. తరచూ గుర్రాలను కొనడం చక్రవర్తి విలాసం. అందుకే ఆ గుర్రాల కొనుగోలు చేసే నెపంతో, రాజగృహం నుండి తప్పించుకొని కాశి (వారణాసి) , వైశాలీ (మధ్యప్రదేశ్ లోని బెస్నగర్), ఉజ్జయినిల మీదుగా భరుకచ్ఛం చేరుకున్నాడు. అప్పటికే అంతఃపురం నుంచి పావురం వార్త తెచ్చింది. భటులు తనను వెతుకు తున్నారని. బంధించనున్నారని. సమయం లేదు. త్వరగా ఆంధ్రపథం చేరాలి. ఆంధ్రపథం! భయంకరమైన వింధ్యాటవి, ఆపై దండకారణ్యం. ఒక్కడిగా ప్రయాణించడం అసాధ్యం. దూరంగా బిడారు కనిపించింది. భరుకఛ్ఛంలో వర్తకం ముగించుకుని తిరిగి వెళ్తున్న వాహకులు! దక్షిణాపథం (మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌లతో కూడిన దక్షిణ భారతదేశం) నుంచి ముడి ఇనుము, సువర్ణం, చందనం, దంతం, సుగంధద్రవ్యాలు భరుకచ్ఛం తెచ్చి ఇక్కడ నుండి పారశీకానికి (ఇరాన్, ఇరాక్) ఆపై భూమార్గం ద్వారా యవనసీమలకీ (గ్రీకుదేశాలు) ఎగుమతి చేయడం ఈ వర్తకుల పని. అందువల్ల అటు నుంచి ఇటుకు రాకపోకలు సాగిస్తుంటారు. అశ్మక గణరాజ్యంలోని (నిజామాబాద్, అదిలాబాద్ జిల్లాలు) మణిగ్రామం ఉక్కు ఆయుధాలకి ప్రసిద్ధి. ఆ నగరంలో అనేక లోహ కర్మాగారాలు - సూది నుండి చంద్రహాసఖడ్గం వరకూ ఏదైనా తయారుచేయగల వేలకొలదిగా కమ్మరులు ఉన్నారు. అక్కడకు సరుకు కొనే పని మీద వెళుతున్నారు. మారువేషధారి వారితో కలిశాడు. ప్రయాణం మొదలైంది. నెల రోజుల పాటు కొనసాగుతూనే ఉంది. ఆంధ్రపథంలోని ఆ పట్టణానికి ఐదు యెజనాల (40.కి.మి.) దూరంలో అపస్తంభుని బుష్యాశ్రమం, వేద వాఙ్మయాన్ని సూత్రబద్ధం చేసిన మహర్షి. కాశీ నుంచి వచ్చిన బ్రాహ్మణ విద్యార్ధినని మారువేషధారి చెప్పిన కట్టుకథని చిరునవ్వుతో విని ఆదరపూర్వకంగా ఆహ్వానించాడు. గౌతమీ నది ఒడ్డున ఉన్న రమణీయమైన కుటీరాన్ని విడిదిగా కేటాయించాడు. కమ్మని శాలి బియ్యపు అరిశెలు, ఆవునెయ్యిలో వేసిన పెసరపప్పు, లేతగా కాల్చిన కణుజు మాంసం, చింతపులుసుతో ఉడికించిన పొలస చేప, సుగంధద్రవ్యాలతో మిశ్రీతమైన ఇక్షువారుణి. చుక్కలు పొదిగిన ఆకాశం కింద మాధవీలతలూ, మల్ల్లెపొదలపై నుంచి వీచే చల్లని గాలి అతడి మార్గాయాసానికి కొంత సేద కూర్చాయి. మరునాటి ఉషోదయాన పవిత్ర గోదావరి జలాలతో స్నానమాచరించి బ్రహ్మచారులతో కళకళమంటున్న ఆశ్రమ ప్రాంగణం చేరాడు. ‘ఏం రాకుమారా! ఇప్పటికైనా తమ నిజ పరిచయ భాగ్యం మాకు కలిగిస్తారా?’ ముఖలక్షణాలు చూసి మనిషి పుట్టు పూర్వోత్తరాలు చెప్పగల మహా సాముద్రీకుడైనా ఆచార్యుని ప్రశ్నకి నిర్ఘాంతపోయాడు. ‘రుషివర్యా. మన్నించండి. నా పేరు నంది. బింబిసార చక్రవర్తి అసంఖ్యాకమైన పుత్రులలో ఒకణ్ణి. నా అన్న అజాత శత్రువు తన రాజ్యాన్ని నిష్కంటకం చేసుకునే యజ్ఙంలో నన్ను సమిధ చేయబూనాడు. రాజ్యకాంక్ష నాకెన్నడూ లేదు. ఈ పలాయనం ప్రాణరక్షణార్థమే. తమ సేవాభాగ్యమూ, విద్యావిధానమూ దొరికిన చాలు. ధన్యుడిని’ అని ఆ మహాత్ముని ఎదుట సాష్టాంగపడ్డాడు. ‘లే నాయనా. ఈ సమయంలో ఆంధ్రపథానికి నీ రాక దైవనిర్ణయం. బహుళమూ, అవైదికమూ అయిన ఈ ఆంధ్రగణరాజ్యాలని ధర్మపథంలో నడిపించే కర్తవ్యం నీదే. శ్రౌత, ధర్మ సూత్రాలని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన నా శిష్యుల సహాయంతో, ఈ దక్షిణదేశాన్ని ఆర్యావర్తానికి (ఉత్తర భారతదేశం) అనుసంధానం చేసే మహద్కార్యం నీ మీదే ఉంది. ప్రయాణ బడలిక తీర్చుకో. వచ్చే పౌర్ణమికే కార్యారంభం. కార్యప్రణాళిక నీకు ఈలోగా విశదీకరిస్తాను’’ అని అశ్వత్థవృక్షం నీడలో శిష్యసమూహం మధ్యనున్న తన పీఠంవైపు నడిచాడు. ‘ఇంకెంతో దూరం లేదు, ఆ మలుపు తిరిగితే రాతిగుట్ట, మన భాషలో అశ్మకగిరి’ అన్నాడు మహర్షి ఆపస్తంభుడు. గమ్యం దగ్గరవుతున్న కొద్దీ నంది గుండెల్లో ఏదో బెదురు, కానీ మహర్షి ఆపస్తంభుడు సామాన్యుడు కాదు. అతడి సంకల్పం వ్యర్థం కాజాలదు. ఆంధ్రనాగవంశాన్ని ఆర్యవ్యవస్థలో విలీనం చేయటమే అతడి ఉద్దేశ్యం. ఏదో ఒక గణరాజ్యానికి చంద్రవంశ ప్రతిష్ట కలుగజేస్తే మిగిలిన జాతులు కూడా వైదిక ధర్మమార్గాన్ని అనుసరించగలరని ఆయన నమ్మిక. అశ్మకానికి ముఖ్యపట్టణం పోతన కోట (నిజామాబాద్ జిల్లాలోని బోధన్). అదీగాక ఆంధ్రపథంలో అనేక లోహకర్మరుల మణిగ్రామాలు, వెయ్యికి పైగా జనావాసాలు ఉన్నాయి. గౌతమీ నదీతీర స్థ ప్రదేశంలో వర్షపాతం అధికం. పైగా ఆ మహానదిలో కలిసి అనేక చిన్న సెలయేళ్ల వలన సేద్యపు నీటి సౌకర్యం విస్తృతంగా ఉంది. అడవులను నరికి కొత్త భూములు సాగుకు తెచ్చేందుకు కావలసిన సాధన సంపత్తి, పశు సంపద ఉన్నాయి. గంగా తీరంలోని వ్యవసాయ పద్ధతులను ఇక్కడ ప్రవేశపెడితే చాలు సంపన్నతలో ఈ ప్రదేశం ఆర్యావర్తానికి ఏ విషయంలోనూ తీసిపోదు. కానీ ఈ ఆదిమ జనజాతులను ఆధునిక మార్గానికి నడిపించడానికి ఒక ఉదాహరణ కావాలి. మలుపు తిరిగినంతనే విశాలమైన పచ్చిక బయలు. దూరంగా కోలాహలం వినిపించింది. శవయాత్ర. యాత్రకు ముందు ఒక యువతి. ‘ఆమె పేరు పోతనాగి. ఈ ఆంధ్ర తెగకి దొరసాని. అదిగో ఆ పదిమంది బలశాలులైన యోధులు రాతి పలకపై పడుకోబెట్టి తెస్తున్న ఆ శవం పోరులో మరణించిన ఆమె సరిజోడుది. ఇప్పుడు జరగనున్నది అతడి ఖననం’ అన్నాడు ఆపస్తంభుడు. నంది ఆశ్చర్యంగా చూస్తున్నాడు. శవయాత్ర దక్షిణ దిశలోని వీరుల గుట్టవైపు సాగింది. అది మరణించిన వీరులను ఖననంచేసే మరుభూమి. అరచేతి మందంతో నిలువెత్తు రాతిపలకల మధ్య ఆ వీరుడి దేహాన్ని వస్తుసామగ్రి, ఆహారంతో పాటు సమాధిలో ఉంచడంతో ఊరేగింపు ముగిసింది. ఒక్కసారిగా నిశ్శబ్దం అలముకొంది. తోడు వచ్చిన జనం చుట్టూ చూస్తూ ఉండగా, నంది ఆశ్చర్యంలో మునుగుతుండగా పోతనాగి సమాధిలోకి ప్రవేశించింది. ఇప్పుడు శవాన్ని మోసుకొచ్చిన పదిమంది యోధులు, శవంతో పాటు పోతనాగి మీదుగా ఇనుప పారలతో మట్టిని తోడి సమాధిని కప్పసాగారు. శవపేటిక మట్టిలో కప్పబడిపోయింది. పోతనాగి నడుము వరకూ అదే మట్టిలో కూరుకొనిపోయింది. అంతలో గణాచారి చేతిలో శంఖం ‘భోం’ అని మోగసాగింది. డప్పుడు, కొమ్ముబూరాలు, శంఖాలు, కంచు గంటలమోత ఆకాశాన్నంటింది. ‘‘అమ్మా రా! మమ్మేలుకో’’ అనే కేకలు మిన్ను ముట్టాయి. నడుము లోతు మన్నులో కూడా సునాయాసంగా నడుస్తూ పోతనాగి బయటకి వచ్చింది. మరణించిన ఆమె జోడు ప్రేతమై ఆమె వెంట రాకుండా, జనమంతా తలో చెయ్యి వేసి పది అడుగుల నిడివిగల రాతిపలకతో సమాధిని మూసి వేసారు. భుజం భుజం కలిపి చిందేసి జనంతో పండగ మొదలయింది. ఇప్పుడా గణజాతి దొరసానికి జోడు లేడు. నేనంటే నేనని ఆ జనంలోని యువకులూ, వీరులు ముందుకొచ్చారు. తమతమ నగ్నదేహాలని ప్రదర్శిస్తూ, బల పరాక్రమాలని పొగుడుకుంటూ ఆమెను జతగూడమని ఆహ్వానిస్తూ ఆమె ముందు చిందులు తొక్కసాగారు. ఆమె ఎవరిని కూడితే అతడే ఆ దండుకి దొర! ఆపస్తంభుడు నందిని చూసి కనుసైగ చేశాడు. తెల్లని దోవతి, ఉత్తరీయం, బంగారు పూసలు, ఇంద్రనీలాలు పొదిగిన వెండి పడగతో పున్నమి చంద్రుడు ముందుగా ఉదయించాడా అన్నట్లు వెలుగుతున్న నంది లేచి నిలుచున్నాడు. ఆ ఉత్తరాది రాచబిడ్డని చూసేందుకు విరగబడుతోన్న జనం మధ్యలో వయ్యారంగా నడిచి వచ్చి అతని చేయందుకుంది పోతనాగి. ఆంధ్రులు ఎవరు? ‘ఏ తాండ్రాః పుండ్రాః శబరాః’ అంటూ ఐతరేయ బ్రాహ్మణం ఆంధ్రులని దక్షిణదేశానికి చెందిన ఆదిమ తెగగా ప్రస్తావించింది. క్రీ.పూ. 6వ శతాబ్దానికి చెందిన పాణిని తన ‘అష్టాధ్యాయి’ అనే సంస్కృత వ్యాకరణ గ్రంథంలో దక్షిణదేశంలోని అశ్మక రాజ్యాన్ని గురించి చెప్పాడు. బుద్ధుడు నిర్వాణం చెందిన సంవత్సరం క్రీ.పూ. 484 అనుకుంటే, అతడి జీవితకాలంలోనే ‘బావరి’ అనే బ్రాహ్మణ ఆచార్యుడు గోదావరి ఒడ్డున అశ్మక దేశం సరిహద్దులోని ఆశ్రమంలో నివసించినట్లు బౌద్ధగ్రంథం సుత్తనిపాతం చెబుతుంది. భీమసేనుడనే విదర్భరాజు జాతకకథ ఈ ప్రదేశాన్ని ఆంధ్రపథం అంటుంది. రామాయణ, మహాభారత రచనా కాలానికి దక్షిణదేశంలోని ఆంధ్రప్రజల గురించి ఉత్తర భారత దేశంలో గణనీయమైన పరిచయం కలిగింది. ఆ తరువాతి గ్రంథం ‘సెరివజ్ఞజాతకం’ అంటే చైనా వర్తకానికి సంబంధించిన కథ, ‘తెలవాహ’ నదీతీరంలోని ఆంధ్రనగరిని ప్రస్తావించింది. కొందరు శాస్త్రజ్ఞులు అది ఛత్తీస్‌గఢ్‌లోని తేర్ నదిగా భావిస్తారు. బూల్గర్, కాణే మొదలైన చరిత్రకారులు, ఆపస్తంభుడు క్రీ.పూ. 500లో ఆంధ్రప్రాంతంలోని గోదావరి ప్రాంతంలో వేదవాఙ్మయంలోని శ్రౌత, ధర్మశాస్త్రాలను క్రోడీకరించాడని అన్నారు. అంటే క్రీ.పూ. 6, 5వ శతాబ్దుల సంధికాలంలో ఉత్తరభారతానికి చెందిన బ్రాహ్మణ సంస్కృతి ఆంధ్రదేశం ప్రవే శించిందని చెప్పవచ్చు. కానీ ఈ గ్రంథాలేవీ ఆనాటి ఆంధ్రదేశంలో సాంఘిక పరిస్థితుల గురించి అంతగా చెప్పవు. అయితే ఆనాటి ఆర్థిక, రాజకీయ, సామాజిక పరిస్థితులనీ, నమ్మకాలనీ అవగాహన చేసుకోవటానికి అప్పటి పురాతత్వ అవశేషాలు కొంత సహకరిస్తాయి. ఆనాటి ఆంధ్రదేశంలోని సంస్కృతిని ‘బృహచ్ఛిలా సంస్కృతి’ అంటారు. అది ఇనుప యుగానికి చెందినది. దక్షిణదేశంలో అనేక చోట్ల కనిపించే రాక్షసిగుళ్ళు అనే పెద్ద పెద్ద శిలలతో నిర్మించిన సమాధుల వల్ల ఈ పేరు వచ్చింది. వీరు వరి పండించారు. ఇనుము, బంగారం వంటి ఖనిజాలు తవ్వితీసారు. ఇనుము, కంచు, ఉక్కు పనిముట్లు తయారుచేసారు. తెలంగాణలోని నిర్మల్ ప్రాంతం తరువాతి కాలాలలో కూడా ఉక్కు పరిశ్రమకి ఎంతో ప్రసిద్ధి చెందింది. ఆంధ్రదేశంలో బ్రాహ్మణ సంస్కృతి ప్రవేశించటానికి, తరువాత బౌద్ధ జైన మతాల విస్తరణకి దోహదం చేసిన రాజకీయ పరిస్థితులపై అనేక అభిప్రాయాలు ఉన్నాయి. అయితే దక్షిణాది చరిత్రలో ప్రసిద్ధి చెందిన రాజవంశాల మూలపురుషులు గాథలు దాదాపుగా ఒకే కథని చెబుతాయి. అవి ఉత్తరాదికి చెందిన సూర్య, చంద్రవంశ రాజకుమారులు, దక్షిణదేశానికి చెందిన నాగవంశపు రాణులని వివాహం చేసుకొని తద్వారా ఆయా వంశాలు స్థాపించారనే. ఏది యేమైనా మౌర్యుల కాలంనాటికి వింధ్య పర్వతాలకి దక్షిణాన ముప్పైకి పైగా ఆంధ్రనగరాలు ఉన్నాయని అనేక ఆధారాలు ఉన్నాయి. బృహచ్ఛిలా సంస్కృతులే చారిత్రక యుగంలో పట్టణాలుగా ఆవిర్భవించిన ఆధారాలు ఉన్నాయి. ఈ బృహచ్ఛిలా సంస్కృతులలో కూడా ఎంతో వైవిధ్యం కనిపిస్తుంది. మహాభారతం కూడా ‘ఆంధ్రాశ్చబహవః’ అంటే ‘ఆంధ్రులు పెక్కులు’ అనే చెబుతోంది. అయితే నన్నయ యుగానికి (10వ శతాబ్దానికి) తెలుగు భాష ప్రాచుర్యంలోకి వచ్చి ఈ భిన్న సంస్కృతులని ఒకటి చేసింది. ఈ తెలుగు వారినందరినీ ప్రప్రథమంగా రాజకీయంగా ఏకం చేసిన ఘనత కాకతీయులదే. భరుకఛ్ఛం- నేటి గుజరాత్‌లోని ప్రఖ్యాత రేవు పట్టణం బరోచ్ - క్రీ పూ.500 అతడు మారువేషంలో ఉన్నాడు. మగధ (పాటలీపుత్రం- పాట్న) నుంచి భరుకచ్ఛం వరకూ ఎలాగోలా పారిపోయి వచ్చాడు. దక్షిణాపథం చేరాలంటే భరుకచ్ఛం వరకూ రాక తప్పదు. ఇక్కడి నుంచి సముద్ర మార్గాన పారశీకానికి (అరేబియా గల్ఫ్ రాజ్యాలు) పారిపోవచ్చు. లేదంటే వర్తక బిడారులతో కలవగలిగితే వారితో పాటు దక్షిణాపథం చేరుకోవచ్చు. ఇక అప్పుడు తన ప్రాణాలకు ప్రమాదం ఉండదు. నిజానికి అతడు మగధ విడిచి మూడు మాసాలయింది. తన అన్న అధికారానికి అతడెప్పుడూ వ్యతిరేకి కాడు. అన్న చక్రవర్తి. కాని ఆ చక్రవర్తి పీఠం పై తాను కన్నువేసినట్టుగా ఎవరో ఆయనకు నూరిపోశారు. సామ్రాజ్యధికార కాంక్ష రక్తసంబంధాలకు అతీతమైనది. అడ్డువచ్చినవాడు సొంత తమ్ముడైనా అది సహించదు. తన ప్రాణానికి ప్రమాదం పొంచి ఉన్నట్టు అర్థమైంది. ఏం చేయాలి? పది వేల గుర్రాలను ఒకేసారి కొనుగోలు చేయగల సామర్థ్యం, సంపదా ఒక్క మగధ సామ్రాజ్య చక్రవర్తికే ఉంది. తరచూ గుర్రాలను కొనడం చక్రవర్తి విలాసం. అందుకే ఆ గుర్రాల కొనుగోలు చేసే నెపంతో, రాజగృహం నుండి తప్పించుకొని కాశి (వారణాసి) , వైశాలీ (మధ్యప్రదేశ్ లోని బెస్నగర్), ఉజ్జయినిల మీదుగా భరుకచ్ఛం చేరుకున్నాడు. అప్పటికే అంతఃపురం నుంచి పావురం వార్త తెచ్చింది. భటులు తనను వెతుకు తున్నారని. బంధించనున్నారని. సమయం లేదు. త్వరగా ఆంధ్రపథం చేరాలి. ఆంధ్రపథం! భయంకరమైన వింధ్యాటవి, ఆపై దండకారణ్యం. ఒక్కడిగా ప్రయాణించడం అసాధ్యం. దూరంగా బిడారు కనిపించింది. భరుకఛ్ఛంలో వర్తకం ముగించుకుని తిరిగి వెళ్తున్న వాహకులు! దక్షిణాపథం (మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌లతో కూడిన దక్షిణ భారతదేశం) నుంచి ముడి ఇనుము, సువర్ణం, చందనం, దంతం, సుగంధద్రవ్యాలు భరుకచ్ఛం తెచ్చి ఇక్కడ నుండి పారశీకానికి (ఇరాన్, ఇరాక్) ఆపై భూమార్గం ద్వారా యవనసీమలకీ (గ్రీకుదేశాలు) ఎగుమతి చేయడం ఈ వర్తకుల పని. అందువల్ల అటు నుంచి ఇటుకు రాకపోకలు సాగిస్తుంటారు. అశ్మక గణరాజ్యంలోని (నిజామాబాద్, అదిలాబాద్ జిల్లాలు) మణిగ్రామం ఉక్కు ఆయుధాలకి ప్రసిద్ధి. ఆ నగరంలో అనేక లోహ కర్మాగారాలు - సూది నుండి చంద్రహాసఖడ్గం వరకూ ఏదైనా తయారుచేయగల వేలకొలదిగా కమ్మరులు ఉన్నారు. అక్కడకు సరుకు కొనే పని మీద వెళుతున్నారు. మారువేషధారి వారితో కలిశాడు. ప్రయాణం మొదలైంది. నెల రోజుల పాటు కొనసాగుతూనే ఉంది. ఆంధ్రపథంలోని ఆ పట్టణానికి ఐదు యెజనాల (40.కి.మి.) దూరంలో అపస్తంభుని బుష్యాశ్రమం, వేద వాఙ్మయాన్ని సూత్రబద్ధం చేసిన మహర్షి. కాశీ నుంచి వచ్చిన బ్రాహ్మణ విద్యార్ధినని మారువేషధారి చెప్పిన కట్టుకథని చిరునవ్వుతో విని ఆదరపూర్వకంగా ఆహ్వానించాడు. గౌతమీ నది ఒడ్డున ఉన్న రమణీయమైన కుటీరాన్ని విడిదిగా కేటాయించాడు. కమ్మని శాలి బియ్యపు అరిశెలు, ఆవునెయ్యిలో వేసిన పెసరపప్పు, లేతగా కాల్చిన కణుజు మాంసం, చింతపులుసుతో ఉడికించిన పొలస చేప, సుగంధద్రవ్యాలతో మిశ్రీతమైన ఇక్షువారుణి. చుక్కలు పొదిగిన ఆకాశం కింద మాధవీలతలూ, మల్ల్లెపొదలపై నుంచి వీచే చల్లని గాలి అతడి మార్గాయాసానికి కొంత సేద కూర్చాయి. మరునాటి ఉషోదయాన పవిత్ర గోదావరి జలాలతో స్నానమాచరించి బ్రహ్మచారులతో కళకళమంటున్న ఆశ్రమ ప్రాంగణం చేరాడు. ‘ఏం రాకుమారా! ఇప్పటికైనా తమ నిజ పరిచయ భాగ్యం మాకు కలిగిస్తారా?’ ముఖలక్షణాలు చూసి మనిషి పుట్టు పూర్వోత్తరాలు చెప్పగల మహా సాముద్రీకుడైనా ఆచార్యుని ప్రశ్నకి నిర్ఘాంతపోయాడు. ‘రుషివర్యా. మన్నించండి. నా పేరు నంది. బింబిసార చక్రవర్తి అసంఖ్యాకమైన పుత్రులలో ఒకణ్ణి. నా అన్న అజాత శత్రువు తన రాజ్యాన్ని నిష్కంటకం చేసుకునే యజ్ఙంలో నన్ను సమిధ చేయబూనాడు. రాజ్యకాంక్ష నాకెన్నడూ లేదు. ఈ పలాయనం ప్రాణరక్షణార్థమే. తమ సేవాభాగ్యమూ, విద్యావిధానమూ దొరికిన చాలు. ధన్యుడిని’ అని ఆ మహాత్ముని ఎదుట సాష్టాంగపడ్డాడు. ‘లే నాయనా. ఈ సమయంలో ఆంధ్రపథానికి నీ రాక దైవనిర్ణయం. బహుళమూ, అవైదికమూ అయిన ఈ ఆంధ్రగణరాజ్యాలని ధర్మపథంలో నడిపించే కర్తవ్యం నీదే. శ్రౌత, ధర్మ సూత్రాలని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన నా శిష్యుల సహాయంతో, ఈ దక్షిణదేశాన్ని ఆర్యావర్తానికి (ఉత్తర భారతదేశం) అనుసంధానం చేసే మహద్కార్యం నీ మీదే ఉంది. ప్రయాణ బడలిక తీర్చుకో. వచ్చే పౌర్ణమికే కార్యారంభం. కార్యప్రణాళిక నీకు ఈలోగా విశదీకరిస్తాను’’ అని అశ్వత్థవృక్షం నీడలో శిష్యసమూహం మధ్యనున్న తన పీఠంవైపు నడిచాడు. ‘ఇంకెంతో దూరం లేదు, ఆ మలుపు తిరిగితే రాతిగుట్ట, మన భాషలో అశ్మకగిరి’ అన్నాడు మహర్షి ఆపస్తంభుడు. గమ్యం దగ్గరవుతున్న కొద్దీ నంది గుండెల్లో ఏదో బెదురు, కానీ మహర్షి ఆపస్తంభుడు సామాన్యుడు కాదు. అతడి సంకల్పం వ్యర్థం కాజాలదు. ఆంధ్రనాగవంశాన్ని ఆర్యవ్యవస్థలో విలీనం చేయటమే అతడి ఉద్దేశ్యం. ఏదో ఒక గణరాజ్యానికి చంద్రవంశ ప్రతిష్ట కలుగజేస్తే మిగిలిన జాతులు కూడా వైదిక ధర్మమార్గాన్ని అనుసరించగలరని ఆయన నమ్మిక. అశ్మకానికి ముఖ్యపట్టణం పోతన కోట (నిజామాబాద్ జిల్లాలోని బోధన్). అదీగాక ఆంధ్రపథంలో అనేక లోహకర్మరుల మణిగ్రామాలు, వెయ్యికి పైగా జనావాసాలు ఉన్నాయి. గౌతమీ నదీతీర స్థ ప్రదేశంలో వర్షపాతం అధికం. పైగా ఆ మహానదిలో కలిసి అనేక చిన్న సెలయేళ్ల వలన సేద్యపు నీటి సౌకర్యం విస్తృతంగా ఉంది. అడవులను నరికి కొత్త భూములు సాగుకు తెచ్చేందుకు కావలసిన సాధన సంపత్తి, పశు సంపద ఉన్నాయి. గంగా తీరంలోని వ్యవసాయ పద్ధతులను ఇక్కడ ప్రవేశపెడితే చాలు సంపన్నతలో ఈ ప్రదేశం ఆర్యావర్తానికి ఏ విషయంలోనూ తీసిపోదు. కానీ ఈ ఆదిమ జనజాతులను ఆధునిక మార్గానికి నడిపించడానికి ఒక ఉదాహరణ కావాలి. మలుపు తిరిగినంతనే విశాలమైన పచ్చిక బయలు. దూరంగా కోలాహలం వినిపించింది. శవయాత్ర. యాత్రకు ముందు ఒక యువతి. ‘ఆమె పేరు పోతనాగి. ఈ ఆంధ్ర తెగకి దొరసాని. అదిగో ఆ పదిమంది బలశాలులైన యోధులు రాతి పలకపై పడుకోబెట్టి తెస్తున్న ఆ శవం పోరులో మరణించిన ఆమె సరిజోడుది. ఇప్పుడు జరగనున్నది అతడి ఖననం’ అన్నాడు ఆపస్తంభుడు. నంది ఆశ్చర్యంగా చూస్తున్నాడు. శవయాత్ర దక్షిణ దిశలోని వీరుల గుట్టవైపు సాగింది. అది మరణించిన వీరులను ఖననంచేసే మరుభూమి. అరచేతి మందంతో నిలువెత్తు రాతిపలకల మధ్య ఆ వీరుడి దేహాన్ని వస్తుసామగ్రి, ఆహారంతో పాటు సమాధిలో ఉంచడంతో ఊరేగింపు ముగిసింది. ఒక్కసారిగా నిశ్శబ్దం అలముకొంది. తోడు వచ్చిన జనం చుట్టూ చూస్తూ ఉండగా, నంది ఆశ్చర్యంలో మునుగుతుండగా పోతనాగి సమాధిలోకి ప్రవేశించింది. ఇప్పుడు శవాన్ని మోసుకొచ్చిన పదిమంది యోధులు, శవంతో పాటు పోతనాగి మీదుగా ఇనుప పారలతో మట్టిని తోడి సమాధిని కప్పసాగారు. శవపేటిక మట్టిలో కప్పబడిపోయింది. పోతనాగి నడుము వరకూ అదే మట్టిలో కూరుకొనిపోయింది. అంతలో గణాచారి చేతిలో శంఖం ‘భోం’ అని మోగసాగింది. డప్పుడు, కొమ్ముబూరాలు, శంఖాలు, కంచు గంటలమోత ఆకాశాన్నంటింది. ‘‘అమ్మా రా! మమ్మేలుకో’’ అనే కేకలు మిన్ను ముట్టాయి. నడుము లోతు మన్నులో కూడా సునాయాసంగా నడుస్తూ పోతనాగి బయటకి వచ్చింది. మరణించిన ఆమె జోడు ప్రేతమై ఆమె వెంట రాకుండా, జనమంతా తలో చెయ్యి వేసి పది అడుగుల నిడివిగల రాతిపలకతో సమాధిని మూసి వేసారు. భుజం భుజం కలిపి చిందేసి జనంతో పండగ మొదలయింది. ఇప్పుడా గణజాతి దొరసానికి జోడు లేడు. నేనంటే నేనని ఆ జనంలోని యువకులూ, వీరులు ముందుకొచ్చారు. తమతమ నగ్నదేహాలని ప్రదర్శిస్తూ, బల పరాక్రమాలని పొగుడుకుంటూ ఆమెను జతగూడమని ఆహ్వానిస్తూ ఆమె ముందు చిందులు తొక్కసాగారు. ఆమె ఎవరిని కూడితే అతడే ఆ దండుకి దొర! ఆపస్తంభుడు నందిని చూసి కనుసైగ చేశాడు. తెల్లని దోవతి, ఉత్తరీయం, బంగారు పూసలు, ఇంద్రనీలాలు పొదిగిన వెండి పడగతో పున్నమి చంద్రుడు ముందుగా ఉదయించాడా అన్నట్లు వెలుగుతున్న నంది లేచి నిలుచున్నాడు. ఆ ఉత్తరాది రాచబిడ్డని చూసేందుకు విరగబడుతోన్న జనం మధ్యలో వయ్యారంగా నడిచి వచ్చి అతని చేయందుకుంది పోతనాగి. - సాయి పాపినేని -
పదం నుంచి పథంలోకి... గోదారి
నాగరికతలో లిపి ఆవిర్భావం ఒక మహోదయం అయితే లిపినీ లిపి వల్ల ఉద్భవించిన సాహిత్యాన్నీ పట్టుకొని ఆ నాగరికత దారుల్లో తిరిగి ప్రయాణించడం ఒక మహాద్భుతం. మానవ పథం, సాహిత్య పదం కలసి మెలసి సాగి ఒకదానికి ఒకటి బాసటగా నిలిచాయి. ఒకదాని ఆధారంగా మరొకదానిని తరచి చూడటం, తెలుసుకోవడం ప్రతి తరానికి అవసరమే. గతంలో రాహుల్ సాంకృత్యాయన్ ‘ఓల్గా నుంచి గంగ వరకు’, తిరుమల రామచంద్ర ‘హంపీ నుంచి హరప్పదాకా’ ఆ కోవలో విశేషమైనవి. ఆ దారిలో చేసిన అలాంటి ప్రయత్నమే ఇది. గతంలోకి ప్రయాణం. మనిషి నడిచి వచ్చిన దారినీ మూలాలనీ సాహిత్య సాంస్కృతిక సంకేతాల ద్వారా తెలుసుకునే ప్రయత్నం ఇది. సాంఘిక చరిత్రే కాదు సాహిత్య చరిత్ర కూడా విపులంగా అధ్యయనం చేసిన సాయి పాపినేని రాస్తున్న వ్యాసాలను ఇక మీద సాక్షి సాహిత్యం పేజీలో వారం విడిచి వారం అందిస్తున్నాం. ఫిక్షన్, ఫ్యాక్ట్ కలగలసిన ఈ నవీన శీర్షికను ఆదరిస్తారని ఆశిస్తున్నాం. ఈ సాలు నల్లేరు (కృష్ణానది) కొంచెం ముందుగా దాటాలి. వేసంగిలో మందలన్నీ దారిపడితే పోయినేటిలా పచ్చికకి కరువు... క్రీ.పూ.2000- అందేరు వద్ద గంటకల్లు గుట్ట (నేటి కర్నూలు జిల్లాలో హంద్రీ నది ఒడ్డున ఒక కొండ చరియ) ఆశగా తలెత్తి తనవంకే చూస్తున్న ఎర్రోడి దోసిట్లోకి తోలుతిత్తిలోని నీళ్లు వంచుతూ ఓరకంట నవ్వింది చింగి. ఆ నవ్వుకే ఉబ్బిపోయి కళ్లు ఇంతలా విప్పార్చాడు ఎర్రోడు. వాడివి పెద్దేరు నీళ్లలా నీలికళ్లు. అదాటున చూస్తే దడుసుకొనేట్లు తెల్లగా పాలిపోయిన దెయ్యం తోలు. అందుకే ఎర్రోడితో ఎవ్వరూ కలవరు. మనుషుల్తో కలవకున్నా ఎన్ని ఆవులైనా ఒక్కడే కాయగలడు. ఒకటా రెండా.. మందలు లెక్క కట్టాలంటే కాలివేళ్లు చాలవు. చిన్ననాటి నుండి చింగి ఒక్కతే వాడితో మాటలు కట్టిన నేస్తం. వాడు కూనగా ఉన్నప్పుడే ఉత్తరపు లోకాన్నించి (ఉత్తర భారతదేశంలో సింధులోయ నాగరికత ప్రదేశం) ఎత్తుకొచ్చాడటంట, అగ్గప్ప. అతడు మందకాపు. చింగి తల్లికి తోబుట్టువు. గూటికి పెద్ద దిక్కు. దండులో ఏడు గూళ్లకి ఏడుగురు పెద్దక్కలు. చింగి తల్లి అందరిలో పెద్దది. ప్రతి చలికాలం కుప్పకి అగ్గిపెట్టే పని ఆమెదే. చల్లగా వీచిన కొండగాలికి భుజాలు ముడుచుకొంది చింగి. దండల మధ్య నిక్కిన గుండెల్లోకి జారిన రంగు పూసల వంక తదేకంగా చూస్తూ ‘రేపు తెల్లారాక గంటకల్లు కాడికి వస్తావే చింగీ! కొత్త బొమ్మ చెక్కా. చూపిస్తా!’ చేతిలో వెలక్కాయలా గుండ్రటి మద్దురాయిని పెకైగరేసి పట్టుకుంటూ అన్నాడు, ఎర్రోడు. గంటకల్లు గుట్ట మీద కాట్రేడి బొరియ ఉంది. ప్రతి పున్నమికీ వేట బలిచ్చి జట్టుకూటికి దండంతా అక్కడే చేరేది. మొక్కుబడి చెల్లించాక గుర్తు చెక్కేపని మాత్రం ఎర్రోడిదే. వాడు చెక్కితే మనిషైనా గొడ్డైనా అట్లనే ప్రాణంతో లేసొస్తదేమో అన్నట్లుంటది. ‘పెద్దక్కలంతా అందేరుకి తెన్నుదిక్కు పోతున్నారు. కాకిపెసలు, రేగిపళ్లు ఇరగగాసినాయట. రేపు గాదు ఇంకోమారు చూద్దాంలే’ అంది చింగి. ‘రేగిపళ్లే గదే నేను తెచ్చిపెడతానులే’ దీనంగా మొహంబెట్టి అడిగాడు. ‘సరేలే, పొద్దు గుంకేలోగా కొండంచు ఏటికాడకి పోయి నా పందిగోర్లు (చెంచులు వేటకి వాడే ఒకరకమైన పదునైన బోన్లు) చూసుకోవాలి. ఏదులూ, బెట్టుడతలూ ఏమైనా ఉచ్చులో చిక్కినాయేమో. ఇప్పుడు తోడొస్తానంటే రేపు నీతో వస్తా’ అని కళ్ళెగరేసింది. ‘సరే పద’ అంటూ ఆకాశం వంక చూసి ఎదురుగా ఉన్న రావిచెట్టు వైపు ఉరికాడు. ‘ఇదిగో ముందే చెబుతున్నా వేట ఏదైనా చిక్కితేనే రేపు నీతో వచ్చేది’ అని కేకేసి విరగబడి నవ్వసాగింది చింగి. పడమటెండ నీడ సరిగ్గా మనిషి నిలువుంది. ‘బిన్నగా ఉరికితే పొద్దులోగా రావచ్చును’ అంటూ ముందుకి సాగాడు ఎర్రోడు. ‘ఏడకిరా?’ ఎదురొచ్చాడు అగ్గప్ప. ‘ఏటికాడికి, చింగవ్వ ఉచ్చులు చూసేందుకు’ అంటూ చింగి చేయందుకొని ముందుకురికాడు ఎర్రోడు. పొద్దుగుంకి చీకట్లు అలముకోసాగాయి. పెద్దక్క దగ్గర మాటల్లో కూచున్నాడు అగ్గప్ప. ‘లోయలో పచ్చిక పలచనైపోయినాదే. చలి కూడా ముదరుతాంది. కుప్పలు కాల్చేదింకెప్పుడంటావ్?’ చుక్కల వంక చూస్తూ అడిగాడు, అగ్గప్ప. గూడెంలో ఏడు గూళ్ళున్నట్లు ఆకాశంలో కూడా ఏడు పెద్దక్కల గూళ్ళనే చుక్కలు. ప్రతియేటా అవి నడినెత్తికి ఎక్కినప్పుడే అక్కల పండగ. మందలు దారిపట్టేది. ‘ఇంకెంత నెలపొడిచి మూన్నాళ్ళేగా. పున్నమి పదినాళ్ళున్నాది. ఈ సాలు దారికాపుకి నిలువురాటు నాటాల. ఎరుకేగా?’ అంది పెద్దక్క. ‘మూడు నిలువుల బండ. దిగువాకి దొర్లించాలి అంతే. రేపే ఆ పనిచేసి బలికి ఆలపోతులు దానికే కట్టేస్తా. ఇక నీవెప్పుడంటే అప్పుడే దారిపట్టు’ ‘ఆ పనిజెయ్యి. ఈ సాలు నల్లేరు (కృష్ణానది) కొంచెం ముందుగా దాటాలి. వేసంగిలో మందలన్నీ దారిపడితే పోయినేటిలా పచ్చికకి కరువు... ఇంతకీ చింగి కనబడదు, పొద్దుగుంకియాడకిబోయినాదో?’ ‘ఆ ఈడకే యేటికాడ ఉచ్చులు చూసేందుకు. తొందరలేదులే ఎర్రోడు తోడుబోయినాడు’ ‘ఆ ఎర్రోడిని నీవే మొచ్చుకోవాల. ఆ దెయ్యం కూనని నీవేగాదా నా నెత్తిన బెట్టావ్. ఈ సాలు దేవుళ్లకాడ మంచి వెలకి బేరం పెట్టి వదిలించుకోవాల’ ‘ఆ పనిజెయ్యి. ఆలాగన్నా వాడి లోకానికి వాడుబోతాడు’, అంటూ నిట్టూర్చాడు అగ్గప్ప. ఏనాడో ఉత్తరపు దారిన వాడి తల్లి ఊరు పారి తనని కలిసినాది. నిండు చూలు. కూనని తన చేతబెట్టి అది చచ్చినాది. లేగదూడలతో బాటూ వాడినీ సాకి ఈ దిక్కు తెచ్చినాడు. పెద్దక్క ఆనాడే వద్దనుండే. తెల్లతోలు, దెయ్యంబిడ్డ, కొండ మీద పండబెట్టమని జెప్పినా తానే పట్టుబట్టి సాకినాడు. కానీ ఈడ దండులో ఇంతమంది ఉన్నా ఆడికెవ్వరూ లేరు. ఆ దయ్యాల లోకమే మెరుగు. అయినా ఆడికేమి, ఏడున్నా నెగ్గుకొస్తాడు అనుకుంటూ ఏటితట్టు బాటపైన చూపుబెట్టాడు. దూరంగా ఎర్రోడూ, చింగి చెట్టపట్టలేసుకోని గుట్టెక్కుతున్నారు. ఎర్రోడి భుజాన్నేదో రెండు బారల వేట. రాత్రి కొట్టిన కొండగొర్రె తోలు తీసి, అగ్గిగుంట మీద సెగ తగిలేట్లు వేలాడగట్టి, పెద్దక్కకి ఎరుక జెప్పి, చింగితో సహా గంటకల్లు జేరాడు, ఎర్రోడు. ఇంకా తెల్లారలేదు. పడమటికి కుంగుతున్న చుక్కలు చూపిస్తూ, ‘అదిగో అదే ఒడయ. అది ఆడి చేతిలో విల్లు. ఆ మూడు సుక్కలు ఆడిసిరిన కోలు. ఆ ముందు పారతా ఉన్న కొమ్ముల మెకమే జన్నిగట్టు. అంటే ఆ దేవుళ్ళ లోకానికి తాత. ఆ ముందున్న జింక ఆడి కూతురే. కోలుమొన పోటుకి తాత విడిసిన అగ్గి నేలబడి ఈ లోకాలు, మనుషులు, మెకాలు పుట్టుకొచ్చినాయంట... అదే కత. దీన్ని ఆ ఎర్రబండ మీన చెక్కినా’.. ‘మంచి కత! నీకెవరు జెప్పినారు’.. అడిగింది చింగి. ‘పోయినసాలు నాకాడ మూటెడు బల్లెం మొనలు తీసుకొని ఇదిచ్చినాడే ఆ దేవుళ్లయ్యే’.. అని మెడలో వేలాడుతున్న పూసలదండ చూపించాడు ఎర్రోడు. ‘ఈయేడు పెద్దక్కకి సాలినన్ని రాగిపూసలూ, నూలు గుడ్డలూ ఇచ్చి నన్ను కొనుక్కుంటానని జెప్పినాడు. దేవుళ్ళ మాట వైనం కూడా నేర్పిస్తాననుండె.’. గర్వంగా అంటూ వాడు కత బొమ్మ చెక్కిన బండ వైపుకి గెంతాడు. పేడకుప్పలు తగలబెట్టి గంటకల్లు గుట్ట వదిలి పూర్తి నెల గడిచింది. వెయ్యికి పైన ఆవుల మంద. మధ్యలో మరో రెండు మందలు కలిసాయి. ఉమ్మితో తడి చేసిన చూపుడువేలు పెకైత్తాడు ఎర్రోడు. గాల్లో తేమ తెలుస్తోంది. అంటే దారి మరెంతో దూరంలేదు. అడవి కూడా చిక్కబడింది. కొండల మధ్య బయళ్లలో మంద ముందుకు సాగుతోంది. ఒకసారి దారి తగిలితే ఇక పచ్చికకు కొరత ఉండదు. ‘ఏటిగట్టునే మూడు నెలలు సాగితే చాలు దేవుళ్ల ఊళ్లు’.. తెలిసిన విషయమే మరోసారి చింగికి చెప్పసాగాడు. ‘తెన్నుదిక్కు మందలన్నీ ఆ దారినే పట్టేది. ఆ దారి కొననే బలిబేరాల బయళ్లు. దేవుళ్లు ఆ దారినే గోదారి అంటారు. వానాకాలానికల్లా వేలకొలదీ గోవులు.. జన్నాలకీ, జాతర్లకీ కావల్సినన్ని పశువులు. వెయ్యూళ్ల లోకమది... మాలోకం’.. అంటూ ఆనందంగా చింగి కళ్లలోకి చూసాడు. అంటే నన్నొదిలేసి ఆళ్ళల్లో కలిసిపోతావురా.. అంటున్న చింగి కళ్ళలోంచి రాలిన నీటిబొట్టు చూసిన ఎర్రోడి గుండెల్లో ఏదో ములుకు గుచ్చుకున్నట్టు కలుక్కుమంది. ఆ దారే గోదారి వేద వాజ్ఞ్మయంలో క్రతువులలో ఉపయోగించిన గోవుల సంఖ్యా ప్రమాణాలు చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగక మానదు. అంత పెద్ద సంఖ్యలో పశువులను దక్షిణాపథం నుండే గ్రహించి ఉంటారనటానికి దక్కన్ పీఠభూమిలో దొరికిన ఆ కాలానికి చెందిన అనేక శిలాచిత్ర లేఖనాలే సాక్ష్యం. దక్కన్ పీఠభూమిలో జనావాసాలు క్రీ.పూ.10000 నాటికే ఉన్నాయని శాస్త్రజ్ఞుల అభిప్రాయం. కానీ, ఇనుప యుగంలోనే దక్షిణ భారతదేశంలో పరిణతి చెందిన సాంఘిక వ్యవస్థ స్థిరపడింది. క్రీ.పూ. 3000కి చెందిన సింధూలోయ నాగరికతకు, దక్షిణాదిలోని నవీన శిలాయుగం సంస్కృతులకి వాణిజ్యపరమైన సంబంధాలు ఉండేవని ధ్రువీకరించవచ్చు. శాస్త్రజ్ఞులు తుంగభద్ర, హంద్రీ పరీవాహక ప్రాంతాల్లో క్రీ.పూ.2000 నాటి అనేక పశుపోషక జనజాతుల ఆవాసాలు కనుగొన్నారు. వీటిలో కర్నూలు జిల్లాలోని ఉతునూరు, గుత్తి-బళ్లారి రైల్వే మార్గంపైన కుప్గల్లు, గుల్బర్గ జిల్లాలోని బుధిహాల్ ముఖ్యమైనవి. శాస్త్రజ్ఞులు ఈ తరహా ఆవాసాలను బూడిదకుప్ప సంస్కృతులు (యాష్మౌండ్ సైట్స్) అంటారు. అవి సంచార జాతులే. కానీ ప్రతి సంవత్సరమూ అదే ప్రదేశంలో తాత్కాలిక ఆవాసాలు ఏర్పరచుకున్న ఆనవాళ్లు ఉన్నాయి. సంవత్సరానికి ఒకసారి పేడ కుప్పలను తగులబెట్టే ఆచారం కనిపిస్తోంది. ఇప్పటికీ రాయలసీమలో సంక్రాంతి పండుగకు కాటమరాయుడి జాతర్లలో పిడకలతో భోగిమంట వేసే ఆచారం ఉంది. కొష్టాల విస్తీర్ణం, పేడ కుప్పల పరిమాణాలను బట్టి ఒక్కొక్క జనావాసంలో పశువుల సంఖ్య 800 నుండి 1200 వరకూ ఉండొచ్చని అంచనా వేశారు. ఐతే, మానవ ఆవాసాలు (హెర్త్స) ఏడు నుంచి పన్నెండు మించి గుర్తించలేకపోయారు. అంటే ఒక జనజాతి గుంపు లేదా గూడెంలో పాతిక నుండి యాభై వరకూ జనం ఉండేవారని తెలుస్తోంది. సంఖ్యా ప్రమాణాలని బట్టి చూస్తే పాతికకి మించిన పశువులు. ఇది సంఖ్యాపరంగా అనురూపం (డిస్ప్రపోర్షనేట్) అని ప్రొ.పద్దయ్య వంటి శాస్త్రజ్ఞుల అభిప్రాయం. మరి అంత పెద్ద సంఖ్యలో పశువులను గ్రహించగల నాగరికత ఆ కాలంలో, అంటే క్రీ.పూ.2000 కాలంలో, ఎక్కడ ఉంది? సింధు నాగరికతకి చెందిన కాలింబగన్ (రాజస్థాన్), లోథల్ (గుజరాత్), రాఖీగఢి (హర్యానా) మొదలైన ఆవాసాలలో సామూహిక యజ్ఞవాటికలు ఉన్నట్లు శాస్త్రజ్ఞులు గుర్తించారు. సింధు, సరస్వతి పరివాహిక ప్రాంతంలో (పాకిస్తాన్, పంజాబ్, రాజస్తాన్, హర్యానా), గుజరాత్ రాష్ట్రంలలో వెయ్యికి పైగా ఆ నాగరికతకి చెందిన పట్టణ, గ్రామీణ ఆవాసాలు కనుగొనటం జరిగింది. యజ్ఞాలలో గోవధ, గోదానం అన్నది వేదకాలం నుండి ఉన్న ఆచారం. వేద వాజ్ఞ్మయంలో క్రతువులలో ఉపయోగించిన గోవుల సంఖ్యా ప్రమాణాలు చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగక మానదు. అంత పెద్ద సంఖ్యలో పశువులను దక్షిణాపథం నుండే గ్రహించి ఉంటారనటానికి దక్కన్ పీఠభూమిలో దొరికిన ఆ కాలానికి చెందిన అనేక శిలాచిత్ర లేఖనాలే సాక్ష్యం. సింధు నాగరికత ముద్రలపైనున్న పశువుల చిత్రాలకు, ఈ శిలా చిత్రాలకూ ఉన్న సామ్యం ఈ వాదనని బలపరుస్తోంది. అంతేకాక అదే కాలానికి చెందిన ఋగ్వేదంలోని సరమా అనే కుక్క కథ దక్షిణ దేశం నుండి వచ్చే అసంఖ్యాకమైన గోసంపద గురించి ప్రస్తావిస్తుంది. రస అంటే నర్మదా నదికి అవతలి వైపు పాణీ అనే అసురజాతివారు గోవులని తస్కరించటం, సరమా అనే కుక్క సాయంతో ఇంద్రుడు దారి కనుక్కొని ఆ గోవులను తిరిగి సాధించి అంగీరసులకు ఇవ్వటం, ఆ కథ సారాంశం. ఆ బూడిద కుప్ప సంస్కృతులవద్దనే రాతి పనిముట్లు చేసే కర్మాగారాలు కూడా గవేషణలలో బయల్పడ్డాయి. ఇవేకాక ఆ పరిసరాలలో దొరికిన కుండపెంకులు, ఖననంలో ఉపయోగించిన సామాగ్రులు, ఇతర వస్తువులూ పరిశీలించి, ఈనాటి ఆదిమ గణజాతుల జీవనాధార వ్యవస్థతో సంధానం చేస్తే, అప్పటి జీవనశైలి, వస్తు సంస్కృతి పట్ల అవగాహన కలుగుతోంది. వాతావరణం, పర్యావరణ పరిస్థితులు, పచ్చిక బయళ్ల ఉనికి పరిశీలిస్తే ఆ జనజాతుల యొక్క సంచార వలయాన్ని గ్రహించవచ్చు. వర్షాకాలం నుండి సంక్రాంతి వరకు పీఠభూముల్లోని బయళ్లలో, చిట్టడవుల్లో పచ్చిక సమృద్ధిగా దొరుకుతోంది. ఫిబ్రవరి నెల నుండి వేసవి గడిచేంతవరకూ పచ్చిక ఉనికి కృష్ణా, గోదావరి నదీ పరీవాహక ప్రాంతాలకి పరిమితమవుతుంది. గోదావరి జన్మస్థలమైన నాసిక్ ప్రదేశం సింధు నాగరికతకి దక్షిణపుటెల్ల. ఉత్తర దిశగా వెళ్ళే రహదారి గోదావరి నదిని అనుసరించింది అనడానికి చారిత్రక ఆధారాలున్నాయి. గోదావరి, గౌతమి అనే నామాలలోని గో, గౌ శబ్దాలు గోవులకు సంబంధించినవే. తెలుగులో దారి-తెన్ను.. అనే పదబంధం ఈనాటికీ వాడుకలో ఉంది. తెన్నూ అంటే ద్రవిడ భాషలో దక్షిణ దిక్కు. దారి అనే పదం ఒకప్పుడు ఉత్తరపు దిశనే సూచించి ఉండవచ్చు. ఉత్తర పథానికి తీసే గోవుల దారి గోదారి అయి, కాలక్రమేణా ఆ నదీనామంగా స్థిరపడి సంస్కృతీకరించబడి గోదావరి అయి ఉండవచ్చు.