ఓడరేవు మోటుపల్లి, క్రీ.శ. 1250 | Motupalli port, AD 1250 | Sakshi
Sakshi News home page

ఓడరేవు మోటుపల్లి, క్రీ.శ. 1250

Published Fri, Oct 10 2014 11:44 PM | Last Updated on Sat, Sep 2 2017 2:38 PM

Motupalli port, AD 1250

పదం నుంచి పథంలోకి 15
 
ఊరంతా కోలాహలంగా ఉంది. వెదకబోయిన తీగ కాలుకి తగిలినట్టు గణపతిదేవచక్రవర్తి మోటుపల్లికి వేంచేశారు. దక్షిణదేశ జైత్రయాత్ర ముగిసిందట! కవిబ్రహ్మ తిక్కన సోమయాజి ప్రార్థనపై  కంచి రాజేంద్రచోళుని ఓడించి తెలుగు చోడరాజు మనుమసిద్ధిని నెల్లూరు సింహాసనంపై నిలిపి కుటుంబసమేతంగా ఓరుగల్లు తిరిగివెళ్తూ మోటుపల్లిలో ఆగారు.
 
తాను ఏనాటి నుంచో దర్శించుకుందామనుకుంటున్న ప్రభువు ఇంత సులువుగా అందుబాటులోకి వచ్చారన్న కబురు తెలిసి ఉక్కిరిబిక్కిరయ్యాడు పాపయ్య శెట్టి. తవాయి (థాయ్‌లాండ్) ద్వీపకల్పం నుంచి ఓడల మీద సరుకు వేసుకొని వచ్చిన బడలిక అంతా ఆ ఒక్క కబురుకే తుడిచి పెట్టుకుపోయింది.
 
పాపయ్యశెట్టి సామాన్యమైన వర్తకుడు కాడు. తవాయిలోని  తిన్-గ్యుయ్ పట్టణ తెలుగు నకరానికి అధ్యక్షుడు. అక్కడ స్థిరపడి వ్యాపారంలో లాభాలు చూసి ఎన్నో యేళ్ళ తరువాత స్వదేశంలో కాలుపెట్టాడు. తన వెంట ఒక్కొక్క నౌకలో యాభై బారువాల (75 టన్నులు) అగరు, కర్పూరం, జవ్వాజి, చందనం, మిరియాలు, జాజికాయ, జాపత్రి మొదలైన సుగంధ ద్రవ్యాలతో  వెలనాటి తీరం చేరాడు. నిజానికి ఇప్పుడు కూడా అతడు వచ్చేవాడు కాదు. కాని పరిస్థితులు మారాయి. మంజి (దక్షిణ చైనా) ప్రాంతాన్ని  పాలించే మంగోల్ ఖాఖాన్ చంపా- తరుణసీరి (బర్మా) జయించి అక్కడి వర్తకస్థావరాలని పట్టుకున్నాడు. అతడి తమ్ముడు కుబ్లయ్‌ఖాన్ నౌకాసైన్యాలు యవద్వీపాలని జయించాయి. రేవు పట్టణాలలో వాళ్ళు చేసిన బీభత్సం అంతింత కాదు. దినదిన గండంగా అక్కడ జీవించడంకన్నా వ్యాపారానికి స్వస్తి చెప్పి స్వదేశం చేరితే మంచిదని పాపయ్యశెట్టి ఉద్దేశం. ‘తూర్పుసముద్రంలో నౌకావర్తకానికి ఇక రోజులు చెల్లాయి. ఇక్కడే ఉంటే మనం సంపాదించి దాచుకున్నదంతా ఆ మంగోలు ఖానుడి పాలవుతుంది. మనం మన ప్రాంతం వెళ్లిపోదాం. పుష్యమాసం తరువాత బయలుదేరితే తుఫానుల బెడద ఉండదు కనుక నేరుగా సముద్రమధ్య మార్గంలో దొంగల భయం లేకుండా మోటుపల్లి చేరవచ్చు. అక్కడ కాకతి గణపతిదేవచక్రవర్తి ధర్మప్రభువు. ఒకసారి ఆంధ్రతీరం చేరితే మనకి కావలసిన సహకారం అందుతుంది’ అని సాటి వర్తకులని ఒప్పించాడు. తీరానికి కోసు దూరంలో సముద్రంలో లంగరేసిన వల్లీ నావలను వదిలి, చిన్న కప్పలి పడవలో నలుగురు వీరభటులతో మోటుపల్లి చేరాడు. అప్పుడుగానీ హాయిగా ఊపిరి పీల్చుకోలేదు పాపయ్యశెట్టి.
 
మోటుపల్లి స్థానకరణం, అయ్యావళి ఇన్నూరు సంఘాధిపతి రేవణ్ణశెట్టి ఇతర సంఘముఖ్యులతో కలిసి  పాపయ్యశెట్టికి స్వాగతం పలికాడు. ‘రేపు కేశవాలయం వద్ద మహోత్సం జరుగుతుంది. తమరు పాల్గొనాలని మా ఆకాంక్ష’ అని ఆహ్వానించాడు. పక్కనే ఉన్న రేవణ్ణ శెట్టి అతడి మనసుని తొలుస్తున్న అసలు విషయం అడిగేశాడు. ‘శెట్టరే! ఇంతకీ మీ ఓడలో తెచ్చిన సామాగ్రి ఏనో?’. పాపయ్యశెట్టి తలెత్తి సముద్రంలో లంగరేసి ఉన్న నావలను చూస్తూ ‘ఏముంది శెట్టిగారు! తూర్పుదీవుల వాళ్ళం. కర్పూరం, కస్తూరి, జవ్వాజి. మొత్తం కలిపి ఐదు వందల బారువులు’ అని బదులిచ్చాడు . విన్నంతనే రేవణ్ణ శెట్టి ముఖం తెల్లగా పాలిపోయింది.
****************
అర్ధరాత్రి. లంగరు వేసిన నావల్లో కలకలం మొదలయ్యింది. అవి మెల్లమెల్లగా మునిగిపోవడం మొదలుపెట్టాయి. పాపయ్య శెట్టి కొయ్యబారి చూస్తూ ఉండగా నావల్లోని ముప్పై కుటుంబాల సభ్యులు గగ్గోలు పెడుతూ  బెస్తవారి సాయంతో ఎలాగో ప్రాణాలతో ఒడ్డు చేరారు.
**********
కుమారుడు రుద్రదేవుడు (మగవేషంలో ఉన్న రుద్రమదేవి), బావమరిది జాయప సేనాని, భార్యలు నారమ్మ, పేరమ్మ, పరివారం వెంటరాగా కేశవస్వామికి సేవలందించి గుడి నుంచి  మరిలాడు సప్తమ చక్రవర్తి కాకతి గణపతిదేవుడు. అందుకోసమే కాచుకొని ఉన్న పాపయ్య శెట్టి భార్యపిల్లలతో సహా ‘మహాప్రభో! పాహి!’ అంటూ చక్రవర్తి పాదాలపై పడ్డాడు. అతడిని చూసి కుడిచెయ్యి అభయముద్రతో పెకైత్తి ఒక్క క్షణం అలాగే నిలిచాడు గణపతిదేవుడు. మరుక్షణం పాపయ్యశెట్టి  చేతిలోని కొలతో చక్రవర్తి చుట్టూ గుండ్రంగా నేలపై గిరిగీసి మరలా సాగిలపడ్డాడు. ఆ హఠాత్ పరిణామానికి చక్రవర్తి పరివారమేగాక పురజనులు కూడా అవాక్కయ్యారు. అప్పు ఎగగొట్టి చెల్లించని వాళ్ళు దొరికితే వారి చుట్టూ గిరిగీసి వీధిలో నిలబెట్టడం ఆచారం.
 ‘ఎంత అపచారం’
 ‘వీడికి భూమి మీద నూకలు చెల్లాయ్!’
 ‘అయినా చక్రవర్తి ఇతడికి ఎలా బాకీ పడ్డాడు?
 గణపతిదేవుని కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. అది గమనించిన జనంలో కలకలం మొదలయింది.  రక్షకభటులు కత్తులు దూశారు. ‘ఆగండి’ అంటూ ముందుకొచ్చింది ఆరేళ్ళ రాకుమారుడి వేషంలో ఉన్న రుద్రమ్మ. ‘ఏమోయ్ శెట్టి! సముద్రంలో మీ నావలు మునిగిపోయిన విషయం మాకు తెలిసింది. కానీ ఈ విషయంలో చక్రవర్తి మీకెలా బాకీ పడ్డారో చెప్పగలవా?’ కుమార్తె రుద్రమ పలికిన ముద్దుమాటలకు కోపం నుంచి తేరుకున్నాడు చక్రవర్తి.
 తన చుట్టూ గీత గీసినవాడు సామాన్యుడు కాదు. తూర్పు దీవులలో ప్రాముఖ్యం కలిగిన వర్తక శ్రేణి నాయకుడు. పరిహారం చెల్లించకుండా గీసిన గీత దాటడం సంఘ నియమాలని అతిక్రమించడమే. రాజైన తానే నియమాలు పట్టించుకోకుంటే ఇక ప్రజల మాటేమిటి? అతడి వాదన ఏమిటో విందాం అనుకొని, ‘ఊ! చెప్పవయ్యా శెట్టి! మేము మీకెలా ఋణపడ్డామో? అన్నాడు చక్రవర్తి.
 శెట్టి జవాబు ఇవ్వలేదు. గుడి వైపు చూశాడు.
 ‘చక్రవర్తి ఈ నకరశెట్టికి బాకీపడిన మాట వాస్తవమే’ అంటూ వీరభద్రుని గుడిలోంచి సమర్థింపుగా చిన్న చిర్నవుతో బయటికి వచ్చాడు మహామంత్రి శివదేవయ్య దేశికుడు. త్రిశూలధారి... విశాలమైన ఫాలంపై అడ్డబొట్టు... చుట్టూ మూగిన జనం కూడా శివదేవయ్య మంత్రి వంకకి తిరిగారు. ‘రేవు పట్టణాలలో దిగే వర్తకులకి రక్షణ కల్పిస్తామని చక్రవర్తి చేసిన శాసనం నిజమైతే ఈ శెట్టికి వచ్చిన నష్టానికి తమరూ తమ అధికార యంత్రాంగమే బాధ్యులు. చేసిన వాగ్దానం తప్పితే ఎంతటి రాజునైనా నిర్బంధించడంలో తప్పు లేదు’ అన్నాడు శివదేవయ్య.
 ‘అదెలా సాధ్యం గురుదేవా? రేవులోని సరుకులకి కరణాలు, రాజోద్యోగులూ బాధ్యత వహించగలరు. కానీ సముద్రంలో మునిగిపోయిన నావలకి వారెలా బాధ్యులు?’ అడిగాడు చక్రవర్తి.
 ‘అవి మునిగిపోవడం ప్రకృతి వైపరీత్యం వల్ల కాదు. దానికి కారకులు తమ శరణులో ఉన్న కొందరు పౌరులే’ అని బదులిచ్చాడు శివదేవయ్య.
 ‘గురుదేవులకి తెలియనిది లేదు. తమరు వివరించి నన్ను ఋణవిముక్తుణ్ణి చేసి ఈ చిక్కు నుండి బయటపడే ఉపాయం చెప్పగలరు’ అన్నాడు చక్రవర్తి.
 ముఖంపై ఎంత అణుచుకున్నా దాగని చిరునవ్వుతో ‘అసలు తప్పు మీదే! కళింగ, కాంచీపురాలు జయించి విజయోత్సవాల పేరున దేశంలో కనీవినీ ఎరుగని రీతిలో వసంతోత్సవాలు సంకల్పించారా లేదా? ఆ ఉత్సవాలలో వెదజల్లేందుకు కస్తూరి, కర్పూరహిమం, అగరు, జవ్వాజుల కొరకు నభూతోనభవిష్యతి అనే విధంగా సుగంధ భాండాగారాలు కట్టించారా లేదా?’ అడిగాడు శివదేవయ్య. అవునని తలూపాడు చక్రవర్తి.
 ‘వాటిని నింపేందుకు దేశం నలుమూలల నుంచి సుగంధ ద్రవ్యాలని అధిక ధరకి కొని దాచిన సరుకుని తమరికి లాభానికి అమ్మాలనుకోవడంలో వర్తకుల తప్పేమిటి? అది వారి నైజం. ఇలాంటి సమయంలో ఈ శెట్టి తన వెంట తెచ్చిన ఐదొందల బారువుల సరుకు కనుక రేవులో దింపే సుగంధ ద్రవ్యాల ధర సగానికి పడిపోతుంది. అందువల్ల సభ్యులకి కలగబోయే నష్టాన్ని నివారించేందుకు రాత్రికిరాత్రి నావలకి తూట్లు పొడిపించి ముంచే పాపం అయ్యావళి సంఘం రేవణ్ణశెట్టికి తప్పలేదు. పరోక్షంగా పాపయ్యశెట్టి నష్టానికి బాధ్యత తమదే. పరిహారం నిర్ణయించి, అతడు ఒప్పుకుంటే తమరు గీత దాటవచ్చు’ అన్నాడు శివదేవయ్య దేశికుడు.
 న్యాయం తప్పడం గణపతి దేవుని రక్తంలో లేదు.
 ఆయన అంగీకారంగా తల ఊపి పాపయ్య శెట్టి వైపు వరం ఇచ్చే దేవుడిలా చల్లని చిర్నవ్వు నవ్వాడు.
 
- సాయి పాపినేని
 ఫోన్: +91 9845034442

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement