భిక్షువు | chain king is coming in india | Sakshi
Sakshi News home page

భిక్షువు

Published Sat, May 3 2014 12:25 AM | Last Updated on Mon, Apr 8 2019 7:50 PM

భిక్షువు - Sakshi

భిక్షువు

పదం నుంచి పథంలోకి 5
 
 
ధాన్యకటకం (గుంటూరు జిల్లా, అమరావతి) క్రీ.శ.100
 
 హాన్ వంశపు యువరాజు యాన్‌కు ఇదంతా నమ్మశక్యంగా లేదు. నిజంగానే తాను భారతదేశానికి చేరానా? నిజంగానే చేరాడు. ఇప్పుడు తెలుగు గడ్డ మీద ఉన్నాడు. దీనికి నేపథ్యం ఉంది. యాన్ అన్న  చైనా చక్రవర్తి మింగ్. ఆయనకు ఒక కలవచ్చింది. ఆ కలలో సువర్ణదేహంతో సూర్యుని తలదన్నే ప్రకాశంతో ఆకాశంలో ఎగురుతూ ఒక మహాపురుషుడు కనిపించాడు. అది ఎవరని విచారిస్తే అతడే బుద్ధుడు అని తెలిసింది. బుద్ధుడు ఇండియాలో ఐదొందల సంవత్సరాల క్రితం ‘డావో’ అంటే ధర్మమార్గాన్ని సామాన్య మానవులకు ఆచరణయోగ్యమైన సూత్రాలుగా ఉపదేశించాడని కూడా తెలిసింది. వాటిని తెలుసుకోవాలి. అందుకే తన తమ్ముణ్ణి ప్రయాణం కట్టమన్నాడు. ఇండియాకు వెళ్లి ఆ ప్రవచనాలను తెలుసుకొని, ఆ మతానికి చెందిన గ్రంథాలని చైనా రాజ్యానికి తీసుకురమ్మని ఆజ్ఞ ఇచ్చాడు.    
 
ఆ ఆజ్ఞను శిరసావహించడంలో భాగంగా యాన్ దక్షిణచైనాలో గ్వాంగ్‌ర (కాంటన్ తీరంలోని రేవుపట్టణం) నుంచి ఆంధ్రప్రదేశపు వర్తకుల సహాయంతో నాలుగు నెలలు హిందూ మహాసముద్రం చుట్టి తెన్‌గ్యూ(తెలుగు) తీరంలోని ధాన్యకటకానికి చేరాడు యాన్.ధాన్యకటకం అతి సుందరమైన నగరం. నదికి కుడి ఒడ్డున యాైభై ‘లీ’ (పదిమైళ్ళు. 1 మైలు = 5 లీ) నిడివిగల మహానగరం. నగరంలో వంద అడుగుల ఎత్తై మహాచైత్యం ఉంది. అది మింగ్ చక్రవర్తికి కలలో కనిపించిన బుద్ధుని భౌతిక అవశేషాలపై కట్టిన స్తూపం. అక్కడ ధాన్యకటకంలోనే బుద్ధుని అష్టాంగమార్గాన్ని ఆచరించే ఆచార్యులు వందలకొలదిగా ఉన్నారు. ఇంతమందిలో ఎవరిని ఆశ్రయించాలి? నది ఒడ్డున విదేశీయుల కొరకు ప్రత్యేకించబడిన పేటలో రెండంతస్తుల మేడ యాన్ రాకుమారుని పరివారానికి విడిది. విపణివీధి ప్రపంచపు నలుమూలల నుండీ వచ్చిన వర్తక శ్రేష్టులతో ఎప్పుడూ కిటకిటలాడుతూ ఉంటుంది. వీధికి ఇరువైపులా లెక్కలేనన్ని అంగళ్ళు. కళ్ళు చెదిరిపోయేలా రంగురంగుల వస్త్రాలు, ఆభరణాలు, చందనం, కస్తూరి, జవ్వాజి, అగరు, కర్పూరం, వీధిలో వేసే ప్రతి అడుగుకి మనసుని ఆహ్లాదపరిచే సువాసనలు. దంతం, పాలరాయి, కంచు, మంజిష్టల్లో వద్దంకుల (శిల్పులు, వడ్రంగులు) ప్రతిభని ప్రతిబింబించే అపురూప శిల్పసంపద. ఇక ఆహార సామాగ్రుల విషయం సరేసరి. ధాన్యకటకపు పేరు సార్థకమయ్యేలా రకరకాల ధాన్యాలు,  పప్పు నూనె దినుసులు, సుగంధ ద్రవ్యాలు. శాలి, మహాశాలి, వ్రీహి, శ్యామకం అని వడ్లలోనే పలురకాలు.  ఆంధ్రదేశంలోని నేత కార్మికుల ప్రతిభ అసామాన్యం. పట్టు వస్త్రాలేకాదు, ఉల్లిపొరకన్నా సన్ననైన నూలు రవపట్టం నేయటంలో కూడా దిట్టలు.
 
యాన్ రాకుమారుడికి  స్థానిక, విదేశ వర్తకులతో విందులూ వినోదాలతో రెండు నెలలు గడచిపోయాయి. అయినా వచ్చిన పని ఏమాత్రమూ ముందుకు సాగలేదు. అక్కడికి పశ్చిమంగా 500 లీ (100 మైళ్లు) నదీమార్గంలో వెళితే శ్రీపర్వతం (నాగార్డుని కొండ) అనే విశ్వవిద్యాలయం ఉంది. శ్రీపర్వత విశ్వవిద్యాలయంలో అనేక బౌద్ధ గ్రంథాలు ఉన్నాయట, వాటిని చైనా భాషలో వివరించగల ఆచార్యులు కూడా ఉంటారట! ఆ విశ్వవిద్యాలయం ముఖ్యాచార్యుడి పేరు డ్రాగన్ వీరుడు (నాగ - అర్జునుడు). ఆయన ఆహ్వానం లేనిదే వెళ్ళడానికి వీలులేదు. ప్రయత్నిస్తే అక్కడి నుంచి అనుమతి రావడం లేదు.

 ఆరోజు కామునిపౌర్ణమి. ఊరంతా పండగ. పచ్చని తోరణాలతో, మొగలి చిలకలతో అలంకరించి వీధులు, సంబరాలలో ప్రజలు ఒకరిపై ఒకరు జల్లుకున్న రంగురంగుల పుప్పొడి జాజరతో నిండిపోయాయి. జనం మధ్యలో దారిచేసుకొంటూ చైత్యం వైపు నడవసాగాడు యాన్. అడుగడుగునా అవరోధమే. నృత్యాంగనలు, వివిధ వాయిద్యాలతో పాటగాళ్ళు, పగటి వేషగాళ్లు, విటులు, మధుపానపు మత్తులో చిందులేస్తున్న పురజనులు. వీలు ఉండాలే గానీ ధాన్యకటకంలో ప్రతి రోజూ పండగే! ఒక్క రోమ్ సామ్రాజ్యపు వాణిజ్యం ద్వారా నగరానికి వచ్చే ఆదాయమే కోటి పణాలకి మించుతుంది. ధాన్యకటకపు పౌరుల తలసరి ఆదాయం వంద పణాలకి పైనే. ప్రపంచంలోనే అంతటి సంపన్నమైన నగరం మరొకటి ఉండదేమో!

 ఎదురుగా వేల దీపాల కాంతితో చైత్యం ధగధగా వెలిగిపోతుంది. చైత్యకుల ఆరామం ముందర ఐదు నిలువుల స్వస్తి తోరణం. ఠంగుఠంగని మోగే గంటలతో బౌద్ధారామంలో కూడా పండగ వాతావరణం నెలకొని ఉంది. ఎదురుగా ఉన్న మైదానంలో నిలువెత్తు యవనిక(స్టేజి), సాయంకాలం ప్రదర్శించాల్సిన నాటకం కొరకు సిద్ధం అవుతోంది. ఎటు చూసినా ఉరుకులు పరుగులు పెడుతున్న భిక్షువులు. ఏమిటో హడావుడి?

 రాకుమారుడు యాన్, ఆరామంలో అందరికీ సుపరిచితుడే. పలకరించిన వారినందరికీ ఒంటిచేత్తో నమస్కరిస్తూ ఆచార్యుని విడిది చేరాడు. పీఠంపై అసమాన తేజస్సుతో వెలిగిపోతున్న ఒక ఆచార్యుడిని చూశాడు. ఆ బుద్ధభగవానుడే ఎదుట ప్రత్యక్షమయ్యాడా? అని ఒక క్షణం నివ్వెరపోయాడు. యాన్. అతడే ఆచార్య నాగార్జునుడు. అప్రయత్నంగా ఆచార్యుని పాదాలవద్ద సాగిలపడ్డాడు.

 ‘లే రాకుమారా!’ ఆచార్యుని మాటలు శుద్ధమైన చైనాభాషలో వినపడేసరికి, యాన్ ఆశ్చర్యం ద్విగుణీకృతం అయింది. ‘మీరు వచ్చిన పని దాదాపు పూర్తయింది. శ్రీపర్వతంలోని మత గ్రంథాల నకళ్లు, టీక తాత్పర్యాలతో సహా సిద్ధంగా ఉన్నాయి. ఇక మూడు నెలల్లో వేసవి ముగిసి, సముద్రపు గాలులు నైఋతి నుండి వీస్తాయి. అది మీ ప్రయాణానికి అనుకూలం. అయితే తథాగతుని బోధనలని అక్కడి మతగురువులకు, మీ అన్న మింగ్ చక్రవర్తికి విశదీకరించటం ఆవశ్యకం. దాని కొరకు, విశ్వవిద్యాలయంలోని ఆచార్యుడు కశ్యపమాతంగుడు,తన శిష్యబృందంతో పాటూ మీతో మీ దేశానికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. మీరు అనుమతిస్తే అది మాకెంతో సంతోషదాయకం. ఏమంటారు?’ అన్నాడు నాగార్జునుడు. సమాధానంగా తలవూపుతూ మౌనంగా ఆయన పాదాలపై వాలిపోయాడు చైనా కుమారుడు.
           
 చైనాకి తిరుగు ప్రయాణానికి సమయం దగ్గరపడింది. శాతకర్ణి చక్రవర్తి సమకూర్చిన ఓడలు గ్రంథాగారంతో సహా రేవులో సిద్ధంగా ఉన్నాయి. కృష్ణమ్మ అలల మీదుగా వీచి చల్లబడిన పడమటి గాలి మండుటెండల వేడి నుండి కాస్త ఉపశమనం కలిగిస్తోంది. చైనా సాంప్రదాయపు హాన్‌పూ దుస్తులు వదిలేసి ప్రాంతీయమైన సన్నని పట్టుపంచె, అంగీ ధరించి శ్రీపర్వతంలోని ఆచార్యుని ఉపన్యాసమందిరం వైపు నడవసాగాడు యాన్. అక్కడ కొలువైన విశ్వవిద్యాలయాన్ని ఆశ్చర్యంగా చూస్తున్నాడతడు. విశ్వవిద్యాలయంలో యవన, ద్రవిడ, పారశీక శైలుల్లో అనేక కట్టడాలు. గ్రంథాలయాలు, ఉపన్యాసకూటాలూ, యవనికలూ, వాస్తు శిల్పాగారాలూ, వైద్యశాలలూ, యంత్రాగారాలూ, రసాయన ప్రయోగశాలలూ, వాటి చుట్టూ వసతి గృహాలూ, భోజనశాలలు. క్రీడాంగణంలో సాయంకాలం వ్యాయామానికి నేల యీనినట్లు వచ్చిన విద్యార్థి బృందాలు. జ్ఞానార్జనే ధ్యేయమైతే శ్రీపర్వతానికి మించిన విద్యాలయం ప్రపంచంలోనే లేదు.యాన్ మనఃస్థితి సందిగ్ధావస్తలో ఉంది. అక్కడ మధ్యచైనాకి తిరిగి వెళితే సమస్త రాజభోగాలు ఉంటాయి. ఇంకా పితృదేవతలు అనుగ్రహిస్తే చక్రవర్తిత్వం కూడా దక్కవచ్చు. ఇక్కడే ఉంటే భిక్షువృత్తి స్వీకరించాలి, కానీ అపారమైన జ్ఞాన సముపార్జనకి అవకాశం, అపర బోధిసత్వుడైన ఆచార్యుని శిష్యరికం దొరుకుతాయి. తన భవిష్యత్తు ఏదో నిర్ణయించుకొనే సమయం వచ్చింది.


 అతడి మనస్సు ఆచార్యుని వైపే మొగ్గింది. తెల్లని తెరచాపలతో రెక్కల గుర్రాలలాంటి పన్నెండు నావలు చైనా ప్రయాణానికి సిద్ధంగా కృష్ణానదిలో ఓలలాడుతున్నాయి. ఒడ్డుపై నిలిచి వాటికి వీడ్కోలు పలికాడు, జ్ఞానతృష్ణతో రాచరికాన్నే త్యజించిన బౌద్ధ భిక్షువు యాన్.
 
 
 అపరబోధిసత్వుడు ఆచార్య నాగార్జునుడు

 క్రీ.శ. మూడవ శతాబ్దిలో చైనాలో రచించబడిన ‘లిహ్వోలున్’ అనే గ్రంథంలో బౌద్ధమతం ఏవిధంగా కృష్ణాతీరం నుండి చైనాకి పాకిందో వివరించబడింది. ఈ గ్రంథం ఇండియా తీరాన్ని ‘తెన్‌గ్యూ’ దేశమనే పేరుతో సంబోధించింది. హాన్ వంశానికి సమకాలీనమైన శాతవాహన సామ్రాజ్యంలో బౌద్ధమతం ఎంతో ఉచ్ఛదశలో ఉంది. ఆంధ్రప్రదేశ్ నలుమూలలలో దొరికిన బౌద్ధ శిథిలాలే అందుకు నిదర్శనం.
 అజంతా చిత్రాలు, అమరావతి శిల్పసంపద ఆనాటి వైభవోపేతమైన జనజీవనానికి అద్దంపడతాయి. అంతేకాదు చైనా, టిబెట్, శ్రీలంకల్లో దొరికిన బౌద్ధ వాఞ్మయం ఆనాటి వాణిజ్యాన్ని, వస్తు సంస్కృతిని వివరిస్తాయి. ‘పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్ సీ’ అనే రోమన్ గ్రంథం దక్షిణ భారతదేశంలోని రేవు పట్టణాలు, వ్యాపారం, పరిశ్రమల గురించి వివరిస్తుంది. క్రీ.శ. 1వ శతాబ్దిలో రచించబడిన రోమన్ గ్రంథం, ‘హిస్టోరియా న్యాచురాలిస్’ రచయిత, ప్లైనీ ద ఎల్డర్, క్రిష్ణాతీరంలో తయారయ్యే వస్త్రాల కోసమే రోమన్ స్త్రీలు సాలుకి కోటి సెస్టర్సీస్ (రోమన్ వెండినాణెం) వెచ్చిస్తున్నారని వాపోయాడు. ముడినూలు, పట్టులను వస్త్రాలుగా నేసే సాలీలకి ఆంధ్రదేశం ఎల్లప్పుడూ ప్రఖ్యాతి గాంచింది. ఆధునికయుగంలో ఇంగ్లండ్‌లో పారిశ్రామిక విప్లవం, బ్రిటిష్ ప్రభుత్వపు ద్వంద్వ వైఖరివల్ల మిల్లుబట్టల తాకిడికి మన చేనేత పరిశ్రమ దాదాపు రూపు మాసిపోయింది. ఇక చైనా, జపాన్, ఆగ్నేయ ఆసియా దేశాలకి నాగరికతని, బౌద్ధమతాన్ని పంచినది ఆంధ్రదేశమే. నేటి నాగార్జునసాగర్ డ్యాం వద్ద శ్రీపర్వతం అనే మహావిశ్వవిద్యాలయం ప్రపంచానికే తలమానికమై విలసిల్లింది. ఆ కాలంలో ఆచార్య నాగార్జునుని శ్రీపర్వత క్షేత్రం ఎలావుండేదో తెలుసుకోవాలంటే చైనా యాత్రికులు ఫాహియాన్, హ్యూయెన్‌త్సాంగుల కథనాలు ఒక చక్కని ఆధారం. పదివేలకు పైగా దేశవిదేశాల విద్యార్థులు అక్కడ శిక్షణ పొందేవారు.

 భారత వైద్యశాస్త్ర వాఞ్మయంలో ఆచార్య నాగార్జునుడి ప్రశంస ప్రారంభించని గ్రంథం లేదు. సుశ్రుతుని శస్త్రవైద్య సంహితను సంకలనం చేసింది అతడే. ఆరోగ్య మంజరి అతడు రచించిన వైద్య గ్రంథాలలో ఒకటి. నేత్రవ్యాధులకి అతడు నిర్దేశించిన చికిత్స చైనాలోనూ ఎంతో ప్రసిద్ధిగాంచింది. పాదరసం, బంగారం మొదలైన ఖనిజాల రహస్యాలు విశదీకరించే రసరత్నాకరం భారతీయ రసాయనశాస్త్రానికే ఆదిగ్రంథం. అతడి మానవాతీత శక్తులపై అనేక కథనాలు ప్రపంచపు నలుమూలలా వ్యాపించాయి. ప్రకృతి ధర్మాలను ఔపోసన పట్టిన సిద్ధపురుషుడు. ఇక బౌద్ధ మహాయానానికి అతడే మూలపురుషుడు. తర్కంలో, తత్వశాస్త్రంలో అతడి ప్రజ్ఞ అనితరసాధ్యం. అతడి మాధ్యమికతత్వం, మతానికే కాక, ఆదిశంకరుని అద్వైతానికి కూడా ప్రామాణికం అయింది.

 క్లుప్తంగా  చెప్పాలంటే అతడు వైద్య, రసాయన, ఖనిజ, ఖగోళ, వృక్ష శాస్త్రజ్ఞుడే కాక మహాయాన బౌద్ధాన్ని సిద్ధాంతీకరించిన తర్కవేత్త.
 అంతేకాదు, అతడొక గొప్ప రాజనీతిజ్ఞుడు. శాతవాహన చక్రవర్తికి ధర్మోపదేశం చేస్తూ ‘సుహృల్లేఖ’ అనే పేరుతో అతడు రాసిన ఉత్తరాల సంకలనం ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. ఇండియాలోనే కాదు, మధ్య ఆసియా దేశాల్లో కూడా విద్యాలయాల్లోని విద్యార్థులు సుహృల్లేఖని ప్రతిరోజు వల్ల వేసేవారని చైనా యాత్రికుడు ఇత్సింగ్ చెప్పాడు. అరిస్టాటిల్, ప్లాటో వంటి తత్వవేత్తలకి కూడా ఆచార్య నాగార్జునుని గంటం నుండి వెలువడిన అపారమైన రచనాపరంపర ముందు తలవొగ్గక తప్పలేదు.
 
  సాయి పాపినేని
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement