ప్రబంధం
కొండవీడు క్రీ.శ.1515
పల్లకీకి అడ్డుగా వచ్చినందుకు భటుడి తాపుకి అటుగా వెళుతున్న చాకలివాని గాడిద మీద పడ్డాడు దండిభట్టు.
‘ఛీ గాడిదా!’ అన్నాడు భటుడు. ఆ మాట దండిభట్టును అన్నాడో గాడిదను అన్నాడో తెలియలేదు. పల్లకీ నిలిచిపోయింది.
‘ఎందుకురా దానినంటావ్? మీ ఆంధ్రదేశంలో కవులకంటే గాడిదలే నయం. కనీసం మాసినగుడ్డలైనా మోస్తాయ్’ అన్నాడు పల్లకీలోని హమ్మీరపాత్రుడు. ఆ తర్వాత అతని చూపు దండిభట్టు మీద పడింది. ‘ఏమయ్యా కవిగార్ధభా. దుక్కలా ఉన్నావ్. ఏదన్నా పనీపాటా చేసుకోలేవూ?’ అని ఛీత్కరిస్తూ ముందుకు సాగాడు. దండిభట్టుకి కోపమొచ్చింది. ‘విద్యానగరం కృష్ణరాయలు ఉదయగిరి పట్టాడట. ఇంకెంతో కాలం లేదులే. నీ చావు మూడిందిలే. నీవూ నీ వడ్డెరాజూ మట్టిగొట్టుకుపోతారులే’ అని మనసులో తిట్టుకున్నాడు.
దండిభట్టు ఉద్దండపిండం. అనేక యక్షగానాలు రచించాడు. అతడు రచించిన ‘ఊర్వశీ పురూరవం’అనే ప్రబంధం అర్థ్ధశబ్దాలంకారాలలో, అష్టాదశవర్ణనలలో దానికదే సాటి. కానీ గజపతుల పాలనలో తెలుగు కావ్యానికి ఆదరణే లేదు.
‘శ్రీనాథ కవిసార్వభౌముడినే అష్టకష్టాలకి గురిచేసిన ఈ వడ్డెరాజులని ఆశ్రయించబూనడం నాదే తప్పు. కళకి గుర్తింపులేని ఈ సీమలో ఇక మనలేను. తక్షణమే దేశం విడిచి పోతాను’ అని ఉబుకుతున్న కన్నీళ్లని అణచుకుంటూ, తాను చిన్ననాటి నుండి ఎరిగిన నూనె వర్తకుడికి తన గోడు వెళ్లబోసుకున్నాడు దండిభట్టు. ‘ఎక్కడికి పోతావయ్యా భట్టూ? రాజమహేంద్రంలో రెడ్డిరాజుల వైభవం వీరభద్రారెడ్డితోనే నశించింది. ఓరుగల్లు తురకల వాతబడింది. రాచకొండ వెలమలు అన్నీ వదిలిపెట్టి వెలుగోడులో తలదాచుకున్నారు. ఇక మిగిలింది కర్నాటకం. అంతదూరం ఏం పోతావ్? కమ్మనాటిలో నాకు తెలిసిన చౌదరయ్య ఉన్నాడు. నీలాంటి పండితులంటే ప్రాణంపెట్టే చోడరాయుడు. ఒక్కగానొక్క కూతురు! ఆమెకి మంచి గురువు కావాలని అడిగాడు. నీ ప్రబంధం చూస్తే నాలుగూళ్లు ఇచ్చి జీవితాంతం పోషించగలడు. నేనెలాగూ అటే పోతున్నాను. నాతో కూడా రా’ అని సముదాయించాడు.
చోడరాయుడిది కమ్మనాటిలో నూరుగ్రామాల సంస్థానం. వందమంది అశ్వికులు, దానికి పదిరెట్లు కాలిబంట్లతో ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండే సైన్యం. తీరంలో ఉప్పుమళ్లు, రంగుబట్టల నేతగాళ్లు, కాల్పట్టణం రేవు సుంకాలు, జీడి, తమలపాకుల తోటల నుండి వచ్చే ఆదాయం వల్ల మహల్లో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ నర్తిస్తూ ఉంటుంది. ఆశ్రీతులకూ, కవి పండితులకూ కల్పతరువు. ఇంతున్నా రాయుడికి పుత్రసంతానం లేదు. ఒక్కర్తే కూతురు!
ఆమె గురువుగా చోడరాయుడి కొలువులో అన్ని సౌకర్యాలూ ఉన్నా దండిభట్టు మనసు మనసులో లేదు. ఉదయాన్నే పట్టుబట్టలతో, తలపై కురుమాపు పాగాతో మహల్ వెలుపల తోటలోని నృత్యమంటపం చేరుకున్నాడు. నల్లరాతి స్తంభాలపై అపూర్వ శిల్పసంపద, నిలువెత్తు కలంకారీ తెరల మధ్య, రంగవల్లులు చిత్రించిన చలువరాతి నేలపై, వెండిరేకుతో తాపడం చేసిన దేవదారు తమ్మపడిగిపై కూర్చొని శిష్యురాలి రాకకోసం ఎదురు చూడసాగాడు.
అతడి ఆలోచనలన్నీ ఆమె మీదే!
తప్పని తెలుసు. శిష్యురాలు కూతురుతో సమానం. కానీ ఆమె సమక్షంలో ఏదో నిస్సహాయత ఆవరిస్తోంది. ఆమె సౌందర్యం అలాంటిది. పండితుడనని నమ్మి కూతురి విద్యాభ్యాసాన్ని తనకప్పగించిన రాయుడికి ఆగ్రహం కలిగించడం ఆత్మహత్యా సదృశమే.
తెల్లని కావంచు పరికిణీ, అదే రంగు పైటతో, సగమారిన కేశాలని జారుముడి వేసి, మెడలో సంపెంగమాల తప్ప వేరే ఆభరణాలు లేకుండా నెమలి నడకలతో ఎదురుగా వచ్చి కూర్చొన్న శిష్యురాలిని
చూస్తూ కళ్లార్పలేకపోయాడు దండిభట్టు.
పాట మొదలెట్టింది. అది తాను రచించిన ‘హైమవతీ కల్యాణం’ అనే యక్షగానంలోని ఘట్టం! తపోదీక్షలో ఆమెని పట్టించుకోని పరమశివుని కోసం, అభిసారికయై ఎదరుచూస్తున్న పార్వతిలా, శివరంజని రాగంలో ఆలపించసాగింది శిష్యురాలు. విరహాగ్నిలో దహించుకుపోతూ యవ్వనాన్ని ఎరగట్టి నాయకుడిని తన పొందుకు ఆహ్వానిస్తున్నట్లు ఆ అందాలరాశి పాడే ఒక్కొక్క చరణం అతడి గుండెని అదుపుతప్పేలా చేస్తోంది.
తమకంతో చేయి పట్టుకున్నాడు. గురువు స్పర్శకి ఒక్క క్షణం ఏమీ తోచక నివ్వెరపోయిందా పదహారేళ్ళ ఆడబడుచు. కందిపోయిన లేతరెమ్మలాంటి మణికట్టుని విడిపించుకొని ఆందోళనతో ఇంటివైపు పరుగెత్తింది. చేతజిక్కిన ఆమె పెచైంగుని చూస్తూ నిశ్చేష్టుడై నిలిచిపోయాడు దండిభట్టు.
కళింగాన్ని జయించి కొండవీడు వచ్చిన శ్రీకృష్ణదేవరాయల విజయస్కంధావారంలో కవితాగోష్ఠికి దండిభట్టుకి ఆహ్వానం దొరికింది. చక్రవర్తి ఎదుట ‘ఊర్వశీ పురూరవం’ ప్రబంధం వినిపించసాగాడు.చిన్న తప్పిదానికి తనను వీడిపోతున్న అప్సరస ఊర్వశిని గూర్చి విలపిస్తూ, పురుచక్రవర్తి పాడే ఒక్కొక్క పద్యంలో, కవి మనఃఫలకం ముందు అర్ధనగ్నంగా పారిపోతున్న ఆమె రూపే ప్రత్యక్షమై వింటున్న సభికుల కళ్ళలో నీళ్ళునింపాయి. ఆ కవి తన్మయత్వానికి ప్రతిస్పందించని పండితుడు లేడు.రాయలవారి చేతులు ఆనందపారవశ్యంతో అతడిని బంధించాయి. ‘ఆహా, ఎంత సహజమైన వర్ణన! తమ కవితావేశానికి ప్రేరణనిచ్చిన ఆ సౌందర్యమూర్తి ఎవరో సెలవిస్తే సంతోషిస్తాం’ అన్నారు రాయలవారు.
దండిభట్టుకి రాయలవారి ప్రశంసకన్నా చోడరాయునిపై పగతీర్చుకునే అవకాశం వచ్చిందనే ఆనందమే ఎక్కువయింది. ఆనాడు... కూతురి చేయి పట్టుకున్నందుకు కాల్పట్టణపు వీధుల్లో తనను బెత్తాలతో కొట్టించి, నగ్నంగా పరుగెత్తించిన ఆ చౌదరయ్యను అతడు మర్చిపోలేదు. జరిగిన సంఘటనలో తన తప్పేమీ కనపడలేదు. అమాయకంగా కనిపిస్తూ ఓరచూపులతో, వలపు పాటలతో, తన నిగ్రహాన్ని ఛేదించిన ఆమె ఒక కామపిశాచి అన్నదే ఆ ఉన్మాది పిచ్చి ఆలోచన!
‘ప్రభూ! ఆమె ఎవరో కాదు, కమ్మనాటి చోడుని కుమార్తె. తన నగరిలో రాణీవాసానికి అర్హురాలు. కానీ...’ అని తటపటాయించాడు.
‘సందేహమెందుకు కవివర్యా?’ ‘చోడుడు ఓడ్ర గజపతికి ఆప్తుడు. తమతో వియ్యానికి అంగీకరించడేమో?’
‘వియ్యం కాకపోతే కయ్యం. కావలసిన సైన్యంతో తమరే స్వయంగా వెళ్ళి మా ఆజ్ఞని చోడుడికి తెలియపర్చగలరు’ అన్నాడు రాయలు.
విజయనగర మదగజాల పదఘట్టనలకి కాల్పట్టణం నేలమట్టమయింది. ఎదురుతిరిగిన చోడుడ్ని ఇనుపశూలకెక్కించి, తన అవమానాన్ని కళ్లజూసిన పౌరుల ఇళ్లు తగులబెట్టించి, తనను కాదన్న ఆమెను నగ్నంగా బండికొయ్యపై కట్టి, ఎండలో ఒంగేరు మార్గమంతా ఊరేగిస్తూ, వెర్రినవ్వుతో అట్టహాసం చేస్తూ కొండవీడు చేరాడా మదోన్మాది దండిభట్టు. తన కవితావ్యామోహం, కవి పండిత పక్షపాతంతో అనాలోచితంగా చేసిన నిర్ణయంవల్ల వచ్చిన అనర్థాన్ని తెలుసుకొన్న రాయలవారి మనస్సు పశ్చాత్తాపంతో కుంగిపోయింది. మానవ మృగమైన ఆ కుకువి దండిభట్టు నుదురుపై కుక్క పాదం ముద్ర వేయించి, దేశాన్నుంచి బహిష్కరించాడు. తన దుర్నిర్ణయానికి కారణమైన ప్రబంధాన్ని స్వహస్తాలతో అగ్నికి ఆహుతి చేసినా రాయలవారి మనసు చల్లారలేదు.
సాయి పాపినేని