బిళ్ల బంట్రోతు | Young Men's Literary Association | Sakshi
Sakshi News home page

బిళ్ల బంట్రోతు

Published Fri, Feb 6 2015 11:43 PM | Last Updated on Sat, Sep 2 2017 8:54 PM

బిళ్ల బంట్రోతు

బిళ్ల బంట్రోతు

యంగ్‌మెన్స్ లిటరరీ అసోసియేషన్ :: గుంటూరు- ఏప్రిల్ 1911
 
‘ఏమోయ్. ఇవాళ సాయంత్రం వచ్చేటప్పటికి బాగా ఆలస్యమౌతుంది. వెంకన్నకి చెప్పి మిద్దె మీద నాలుగు పక్కలేయించు. బందరు నుంచి కుర్రాళ్లొస్తున్నారు. వినిపించిందా?’ కోటు జేబులో బక్రాం కాలరు తురుముకుంటూ కేకేశాడు వకీలు రాజారావు.
 ‘భోజనాలకి వస్తారుగా? ఎంతమందేమిటి?’ అడిగింది అర్థాంగి.

‘లేదు లేదు. భోజనాలు నారాయణ్రావ్ గారింట్లో. కాస్త తమలపాకులూ మంచినీళ్లూ పైన పెట్టించు. చాలు’ బల్ల మీదున్న దేశాభిమాని పత్రిక చంకలో పెట్టుకుని ‘ఒరే కాసీం. ముందు క్లబ్బుకి పోనీయ్’ అంటూ వాకిట్లో నిలిచి ఉన్న గూడు జట్కాబండిలో కూర్చున్నాడు.
 రైల్వేగేటు దాటాక ఏసీ కాలేజీ కాంపౌండు వద్ద బండాపగానే కత్తెర మార్కు సిగరెట్ల టిన్నుతో పరిగెత్తుకొచ్చాడు కిళ్లీకొట్టు రంగయ్య. జేబులోంచి అణాబిళ్ళ తీసిస్తూ ‘ఏంటి విశేషాలు.. రంగయ్యా’ అని పలకరించాడు రాజారావు.

 ‘తమరికి చెప్పాను గాదయ్యా? మా కోటిగాడికి బంట్రోతు ఉద్యోగం’ తల గోక్కుంటూ నాన్చాడు. ‘అవునవును. ఇవాళ జడ్జిగారిని కలిసి గుర్తు చేస్తాను. అయినా వాడికేం తక్కువ? ఫస్టుఫార్మ్ వరకూ చదివాడు. కోర్టులో అందరికీ తలలో నాలుక. నారాయణరావుగారే వాడిని సిఫారసు చేశారు’

 ‘అంతా మీ దయ. ఈ ఏడాది వాడికి పెళ్లి కూడా చేద్దామని’ ‘నీవు నిశ్చింతగా ఉండు. వాడికి ఉద్యోగం వచ్చిందే అనుకో’ అని హామీ ఇచ్చి ముందుకు సాగాడు రాజారావ్. రీడింగ్ రూమ్ ముందు బండాపగానే ఎదురొచ్చాడు శేషగిరి. ‘నిన్నటి హిందూ పేపరు చూశారా?’ అన్నాడు.‘అప్పుడే ఎక్కడ? మద్రాస్ మెయిల్ రావాలి. మనవాడు బెజవాడ నుంచి తేవాలి. మూడ్రోజుల క్రితం పేపరు ఇవాళ వేశాడు. అయినా ఏంటో విశేషం?’ ‘ఆహ్... ఏముంది? ఈ అరవాళ్ల పొగరు బాగా బలిసిపోయింది. మనవాళ్లు వెనకబడ్డ జాతట. మనకి బుర్రలేదట. తెలుగుగడ్డ మీద ఒక్క ప్రముఖుడూ పుట్టలేదట’ ‘నిజమే కదా? మనవాళ్లకి ఒక్క జిల్లా కలెక్టర్ లేడు. జిల్లా జడ్జి లేడు. రోజూ ఎవడో ఒక అరవాడికి ‘మిలార్డ్’ అంటూ సలాం కొట్టాలి’ అని సిగరెట్టు వెలిగించి పేముకుర్చీలో కూర్చుంటూ ‘ఇంతకీ కోర్టుకి వస్తున్నారా లేదా?’ అన్నాడు.

 ‘ఆ ఉంది లేండి ఒక పనికిమాలిన కేసు. తక్కెళ్లపాడు పార్టీ. తోడికోడళ్ల తగువుకి వాజ్యం తెచ్చి బంగారంలాంటి పొలాలు బీడు పెట్టారు. వాయిదా అడగమని గుమాస్తాకి చెప్పాను. నాలుగు వాయిదాలు పడితేగానీ దిమ్మ తిరిగి బేరానికి రారు. అయిన ఇవాళ ఈ అరవవాళ్ల సంగతేదో చూడాలి. ఇక్కడే గజిట్ పుస్తకాలు బయటికి తీసి మన మద్రాసు రాష్ట్రంలో మనవాళ్లెన్ని ఉద్యోగాల్లో ఉన్నారో అరవాళ్లు ఎన్నిట్లో ఉన్నారో కూపీ లాగాలి. ఇంతకు ముందే చలపతిరావుగారు దేశాభిమాని పత్రికకి ఏదైనా రాయమని అడిగారు’
 ‘ఎందుకండీ కొరివితో తలగోక్కోవడం? రేపు కోర్టులో మళ్లీ అరవ జడ్జీ ముందే నిల్చోవాలి. సరేలేండి... సాయంత్రం బందరు కుర్రాళ్లు కొందరు వస్తున్నారు. వాళ్లలో రామస్వామని కమ్మవాడు. చాకులంటి కుర్రాడు. మంచి కవి. నారాయణరావ్ గారింట్లో భోజనాలు. మీరూ వస్తే బాగుంటుంది’

 ‘తప్పకుండా. వారు కూడా కబురంపారు’ క్లబ్బు లోపలికి చూస్తూ ‘ఒరే సాంబయ్యా. ఇడ్డెన్లు వచ్చాయా’ అని కేకేసి, బల్ల మీది హిందూ పేపర్ రాజారావ్ చేతికందించాడు. సాంబయ్య తెచ్చిన ఇడ్లీలని నేతిలో ముంచి కరేపాకు పొడి అద్దుకుని ‘ఇంట్లో ఎన్ని పలహారాలున్నా ఈ మణీహోటల్ ఇడ్లీ తినందే రోజు గడవదు. ఏమంటారు?’ అన్నాడు రాజారావ్.

‘అంతేమరి. హోటలు కూడు కూడా ఈ అరవ్వాళ్లు పెడితేనే మనకి’ అంటూ పొట్లాం అందుకన్నాడు శేషగిరి. ‘ఇంతకీ సబ్‌కోర్టులో బంట్రోతు ఉద్యోగం విషమేమయిందో తెలిసిందా?’  ‘ఆహ్. అదేముంది మన కోటిగాడి విషయం మీరందరూ సిఫారసు చేశారుగా. నిన్న బెంచిక్లర్కు వరదరాజాన్ని అడిగాను. పన్నెండు దరఖాస్తులు వచ్చాయట. మనవాడికి ఉన్న అర్హతలు ఎవరికీ లేవు. ఖాయంగా వాడికే అని చెప్పాడు. అదే నేను కూడా వాడికి చెప్పాను’ అన్నాడు శేషగిరి.
   
ముందు రోజు రాత్రి కొరిటెపాడు గుడి దగ్గర నాలుగు వేటలు తెగాయి. కోటయ్యకి దఫేదారు ఉద్యోగం ఖాయమయిందని ఊరంతా పండగ చేసుకున్నారు. తెనాలి నాటక సమాజానికి పాతిక రూపాయలు పోసి ‘కురుక్షేత్రం’ నాటకం కూడా ఆడించాడు కోటయ్య. రాత్రి తాగిన మత్తులోంచి తేరుకునేటప్పటికి ఎండ చుర్రని కాల్తోంది. మొగం కాళ్లు కడుక్కుని హడావుడిగా కోర్టుకి పరుగెత్తాడు.బార్ అసోసియేషన్ రూమ్ బయట వకీళ్లంతా రుసరుసలాడుతూ వాదులాడుకుంటున్నారు. కోటయ్యని చూడగానే మొహాలు చాటేసి అక్కడ నుండి తప్పుకున్నారు. మెల్లగా ద్వారం దగ్గరకెళ్లి చేతులు కట్టుకు నిల్చున్నాడు కోటయ్య.

వకాలత్ కాగితాల్లో తల ముంచి కూర్చున్న రాజారావ్ సిగరెట్టు పీక మూలకి విసిరి గదిలోంచి బయటికి వస్తూ ‘పర్లేదు లేరా. ఇప్పుడు కాకపోతే పోయింది. ఈసారి తప్పకుండా చూద్దాం’ అని సమాధానం కోసం ఎదురుచూడకుండా కోర్టుహాల్లోకి వెళ్లిపోయాడు.
 కోటయ్య గుండె జారిపోయింది.

ఉద్యోగమొచ్చిందని బడాయిగా ఊరందరికీ పండగ చేశాడు. రాలేదంటే ఊళ్లో తలకొట్టేసినట్టే.పరిగెత్తుకుంటూ చెట్టు కింద ఉన్న శేషగిరి వద్దకి వెళ్లాడు. అతడి ముఖంలో మారిన రంగులు విషయం చెప్పకుండానే తేటతెల్లం చేశాయి. చెట్టు కిందే ఉన్న పళంగా కుప్పకూలిపోయాడు.
   
 ఆ రాత్రి విందులో చర్చంతా తమిళుల గురించే.‘చివరికి బిళ్ల బంట్రోతు ఉద్యోగానికి కూడా మన తెలుగవాళ్లకి దిక్కులేదు. ఆఖరి నిమిషంలో ఎక్కడో కుంభకోణం నుండి తెప్పించిన దరఖాస్తును చూపించి, వాడెవడికో ఉద్యోగమిస్తూ ఉత్తర్వులు జారీ చేశాడా అరవ సబ్‌జడ్జి. చూస్తే వాడికి ఓ అంటే నా రాదు. తెలుగు మాట్లాడటం కూడా రాదట’ శేషగిరి మధ్యాహ్నమంతా కూర్చుని మద్రాసు రాష్ట్రంలో ప్రభుత్వోద్యోగుల పట్టిక తయారు చేశాడు. ‘సగానికి పైగా జనాభా ఉన్న తెలుగు వాళ్లకి కనీసం పది శాతం ఉద్యోగాలు కూడా లేవు. జడ్జీలే కాదు, రెవెన్యూ, విద్య, సరే, ఏ డిపార్ట్‌మెంట్ చూసినా అరవవాళ్లే, ఛీ’
 
‘చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా
 గతమెంతో ఘనకీర్తి కలవోడా’

 విందులో బందరు కుర్రాడు రామస్వామి పాడిన పాట కూడా ఎవరినీ ఉత్తేజ పర్చలేకపోయింది. మర్నాడు కోర్టు దగ్గర గూడుబండి దిగంగానే చెట్టు కింద గుమికూడిన జనాన్ని చూశాడు రాజారావ్. గబగబా నల్లకోట్లని అడ్డు తొలగించుకుంటూ ముందుకెళ్లాడు.
 చెట్టుకి వేలాడుతున్న కోటిగాడి శవం.

 అదే క్షణంలో నిర్ణయించుకున్నాడు. ‘ఏది యేమైనా సరే ఈ అరవాళ్ల జాడ్యం వదలాలంటే తెలుగువాళ్ల ప్రత్యేక రాష్ట్రమే మందు. అది సాధించే వరకూ నిద్ర పోకూడదు’ అతడి మనసులోని భావం చుట్టూ ఉన్నవారందరి ముఖాల్లో ప్రతిబింబించింది.
 
- సాయి పాపినేని
 ఫోన్: +91 9845034442
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement