ఒంగోలు గిత్త | Ongole gitta | Sakshi
Sakshi News home page

ఒంగోలు గిత్త

Published Sat, Jan 17 2015 12:07 AM | Last Updated on Sat, Sep 2 2017 7:46 PM

ఒంగోలు గిత్త

ఒంగోలు గిత్త

గుండ్లకమ్మ... దేవరంపాడు చెక్‌డ్యామ్ క్రీ.శ.1878
 
 శ్రీరాములునాయుడు ఒంగోలు పక్కన మామిడిపాలెం మునసబు.
 చెన్నపట్నం నుంచి ఒంగోలు స్టేషన్ దాకా రైలుబండి నడుస్తుంది. ఉత్తరాన పదిమైళ్ల దూరంలో గుండ్లకమ్మపై రైలువంతెన నిర్మాణం జరుగుతోంది. అది పూర్తయితే ఒక్క రోజులో పొగబండి మీద బెజవాడకి పోవచ్చు. విన్సెంట్ పుణ్యమా అని ఎడ్లబండిలో కాకుండా రైలుపట్టాల మీద ట్రాలీలో రావడం వల్ల పని చూసుకొని సాయంత్రానికి ఇల్లు చేరొచ్చు.
 ‘అయ్యగారూ... చీకటి పడేలోగా ఒంగోలు పోవాల. ట్రాలీ నాలుగింటికల్లా బయలు దేరకపోతే మా స్టేషన్ మాస్టర్ ఊరుకోడు’ అన్నాడు విన్సెంట్.
 ‘సరేలేరా. రాముడిని చూసుకొని అట్లాగే వచ్చేస్తా’ అని కేకేసి రంగయ్య వైపు నడవసాగాడు.
 ‘అదేందయ్యా? రేపు జాతరకి ఉండట్లా’ అడిగాడు వెనకగా నడుస్తున్న పాలేరు కోటిగాడు.
 ‘లేదురా. రాత్రికి ఇంటికి పోవాల. నువ్వుగూడా పద’
 ‘అయ్యా. నీవు కూకలేయనంటే ఒక మాట’ తుండు విదిలించి తల గోక్కుంటూ నసిగాడు.
 చెప్పకుండానే కారణం గ్రహించాడు నాయుడు.
 ‘ఏందిరా. మతంగానీ మార్చుకుంటున్నావా’
 తలూపాడు కోటిగాడు.
 దూరం నుండే చేయూపి ఎదురొచ్చాడు పాస్టర్ రంగయ్య. అతడు నాయుడికి మేనమామ కొడుకు. నెల్లూరు చర్చీబళ్లలో అప్‌ఫోర్తు చదివాడు. పదేళ్ల క్రితం జ్యూయెట్ అమ్మ మతమిచ్చింది. ప్యాంటూ చొక్కాతో అచ్చం దొరల్లే ఉన్నాడు. గత ఆరేళ్లుగా దేశాన్ని కరువు రక్కసి పీడిస్తోంది. బాధితులని ఆదుకునేందుకు పనికి ఆహార పథకం కింది క్లోవ్ దొరకి సర్కారు కాలవ కాంట్రాక్టు వచ్చింది. ఆ పనంతా రంగయ్య మీదే.
 ‘ఏంది ఇలా వచ్చావ్ బావా? రాముడిని చూట్టానికా లేకపోతే...నా మాట విని మతంగానీ పుచ్చుకుంటున్నావేంది?’ అడిగాడు రంగయ్య.
 ‘నా సంగతి సరేగానీ రేపు ఏంది హడావుడి?’
 ‘పద ఆ పక్కకి పోయి మాట్లాడుదాం’ అని వేపచెట్టు కిందున్న గుడారంలోకి దారి తీసాడు రంగయ్య. బల్ల, రెండు కుర్చీలు, విశ్రాంతికి మడతమంచం. బల్ల మీద రెమింగ్‌టన్ టైప్‌మిషను. కాగితాల దొంతర. అది క్లోవ్ దొర ఆఫీసు. నిలువు గుంజకి తగిలించిన శిలువా, ఈతచాప, ఆయన ప్రార్థనా మందిరం. గత ఐదేళ్లుగా బాధితుల మధ్యనే క్లోవ్‌దొర జీవనం.
 చలువకుండలో మంచినీళ్లు ఎత్తి నోట్లో పోసుకుంటూ కావాలా అని సైగ చేశాడు రంగయ్య. దాంతో నాలుక పిడచ కట్టుకుపోతున్నా ‘వద్దులే’ అన్నాడు నాయుడు.
 ‘నీవేమీ మారలేదు బావా. పరవాలేదులే ఇవి నా కోసం ఏటి నుండి తెప్పించినవే’ అని నీళ్లందించాడు రంగయ్య. చెంబు అందుకుని తాగకుండా పక్కన పెట్టాడు.
 ‘ఏముంది. ఆరేళ్లు గడిచినా కరువు తీరే ఆశ లేదు. ఇప్పుడు కాలవ పనిలో ఆరువేలకి పైచిలుకే ఉన్నారు. నిన్నటికి నిన్న పాతికమంది పడమటోళ్లు దిగారు. బొత్తిగా ఎముకల గూళ్లు. కాలవ పనా... పూర్తిగావచ్చింది. సర్కారు సహాయం కూడా ఇక రాదు. ఆయినా అదెంత. మనిషికి పౌను ధాన్యం, అణా బత్యం. అదీ మగాళ్లకే. ఆడాళ్లకీ పిల్లలకీ అర్ధణా మాత్రమే. పిల్లా మేకా తిండానికి ఏంది? అమెరికాలో క్రైస్తవులని దేహీ అని వాళ్లిచ్చిన చందాలతో నెట్టుకొస్తున్నాం. ఇప్పుడు సర్కారు కాంట్రాక్టు లేకపోతే వీళ్లకి గంజికి కూడా దిక్కుండదు’ వింటున్న నాయుడి కళ్లలో నీళ్లు తిరిగాయి.
 ‘మరెలారా’ బొంగురుపోయిన గొంతుతో అడిగాడు.
 ‘మన క్లోవ్‌దొర సంఘం పేరు అమెరికన్ బాప్టిస్ట్ మిషన్. నీకు తెలుసుగా? అమెరికాకి ఫొటోలూ పాంప్లెట్లూ ఎన్ని పంపించినా మన బాధలు వాళ్లకెలా పట్టేట్టు? మత ప్రచారం అంటే అక్కడి దొరలకికాస్తా ఆసక్తి. కానీ ఒకటీ అరాతో లాభం లేదు. ఏదైనా బ్రహ్మాండమైన పని చేస్తేగానీ అక్కడ పత్రికలలో రాయరు. అలాగైతేనే ఒంగోలు మిషన్‌కి చందాలు తెచ్చుకోవడానికి వీలవుతుంది అని క్లోవ్‌దొర వాదం’
 ‘బ్రహ్మాండమా.. అంటే’
 ‘ఏమీ లేదు. మద్రాస్ నుండి అమెరికా పత్రికల వాళ్లు వస్తున్నారు. వారి ముందు సామూహికంగా రెండు వేల మందికి గుండ్లకమ్మలో దివ్యస్నానం ఇచ్చి మతం మారిస్తే ఇక చూస్కో. అమెరికాలో ఒంగోలు మిషన్ పేరు దద్దరిల్లుద్ది. దాంతో పదివేల మందికి మరో పదేళ్లు అన్నం పెట్టొచ్చు. సర్కారు కాంట్రాక్టు లేకపోయినా ఒంగోలులో ఆసుపత్రి, చర్చీ, స్కూలు కట్టించి జనాలకి పని కల్పించవచ్చు. ఏమంటావ్ బావా’
 ‘ఆహ్’ అని బిత్తరపోయి చెంబులో నీళ్లు గడగడా తాగేశాడు నాయుడు.

 ఏటి ఒడ్డున డచ్చి ఫారం.
 ‘రాముడికి చూసి చాలా దినాలయింది. నన్ను చూడందే వాడు పచ్చిగడ్డయినా ముట్టేవాడు కాదు. ఎలా ఉన్నాడో? వెంట తీసుకుపోదామంటే ఊళ్లో పాటిదబ్బల మీద కూడా గడ్డి మొదలవడం లేదు’ అన్నాడు శ్రీరాములు నాయుడు.
 ‘కర్మయ్యా. కానీ ఈడ పర్లేదయ్యా. ఆవుల దొర మనోడిని కన్నబిడ్డల్లే చూసుకుంటుండాడు’
 ‘అవున్రా. ఆ దొరే లేకుంటే ఊళ్లలో ఈ మాత్రం పాడి కూడా మిగిలేది గాదు’
 ‘అయ్యా! మరోమాట. రంగయ్యన్న చెబుతా... అదేదో నెట్టల (సౌతాఫ్రికాలో న్యేటల్) దేశమంట. నెలకి పది రూపాయల జీతమంట. ఎటు చూసినా నీళ్లు, చెరుకు తోటలంట. చెన్నపట్నంలో ఓడెక్కితే ఇక అంతా వాళ్లే చూసుకుంటారంట. నేనూ నా ఆడదీ’.. ఒక క్షణం తటపటాయించి ‘అయ్యా నీ అనుమతి అయితేనే’ అని దీనంగా ముఖం పెట్టాడు.
 ‘ఆరినీ... నీవట్లా దేశాలు పట్టి పోతే ఇంట్లో నీ ముసిలాళ్లకి ఎవరు చూస్తార్రా’ గదిమాడు.
 ‘దానికి ముందస్తుగానే మణిషికి ముప్పై రూపాయలు ఈడనే ఇస్తారంటయ్యా. ముసలోళ్లకెంతయ్యా? రోజుకి అర్దణా కర్సు. నాలుగేళ్లు తిండికి ఇబ్బంది లేదు. కావస్తే ఒక పది రూపాయలు పారేసి రెండెకరాలు కొనుక్కొని యవసాయం చేయొచ్చు’
 ‘హూ... ముప్పై రూపాయలు. ఇద్దరికి అరవై. అంటే దాదాపు వెయ్యి అణాలు. నాలుగైదేళ్లు తిండికి ఢోకాలేదు. అన్నాళ్లు బతికుంటే సేద్యమే చేస్తారులే’ వేళ్లపై గుణించుకుంటూ ముందుకు సాగాడు.
 ఫారం ఇంకా ఫర్లాంగ్ దూరంలో ఉండగానే యజమానిని ఎలా పసిగట్టాడో కంచె దూకి ఉరుకుతూ ఎదురొచ్చాడు రాముడు. మూపురం వద్దకు ఎనిమిదడుగుల ఎత్తు, మచ్చలేని తెల్లని ఒంగోలు గిత్త. రాముడి మెడపై ముఖం ఆనించిన శ్రీరాములు నాయుడికి కళ్లలో నీళ్లూరాయి. రాముడి ఉరుకు చూసి వెంటబడి పరిగెత్తుకు వచ్చాడు పశువుల డాక్టరు వోన్‌ట్రోప్ దొర. అతడి వెనుకనే ఫాదర్ క్లోవ్.
 ‘నాయుడు గారూ. మన్చీ టైమ్‌కి వచ్చినారూ. రేపు పేద్ద పండగ వున్దీ. పెద్దలూ మీరూ ఉండావలె’ అన్నాడు ఫాదర్ క్లోవ్.
 ‘అవును. రంగయ్య చెప్పాడు. మీరు చేస్తున్న పనికి మేమూ మా ఊరూ ఎప్పుడూ ఋణపడి ఉంటాం. కానీ నాకు వెళ్లక తప్పదు’ రాముడి గంగడోలు నిమురుతూ అన్నాడు.
 ‘సరే యువర్ విష్. మీకూ ఒక్క విషయమూ చెప్పావలె. డాక్టర్ వోన్‌ట్రోప్ వచ్చే నెల రోటర్‌డ్యాం పోతూనారు. ఇక్‌డ నున్చి కొన్ని మంచి స్పెసిమెన్స్ వాల్లతో తీస్కుపోతారు. మీ రామ్‌డూ మంచీ సీడ్‌బుల్. వాల్లతో తీస్కుపోతాన్కి మీ పర్మిషన్ కోరినారు. బట్ రామ్‌డూ మీకూ కొడుకూ లాన్టీవాడు. అన్దూకే నో అని చెప్పాను’ అన్నాడు ఫాదర్ క్లోవ్.

ట్రాలీలో బెంచీ మీద కూర్చున్న నాయుడికి దుఃఖం ఆగడం లేదు. రైలు పట్టాలపై పరిగెత్తుతూ ట్రాలీని తోసి గెంతి పక్కన చేరాడు విన్సెంట్.
 ‘ఊరుకోండి అయ్యగారూ... ఇంకెన్నాళ్లు? ఈ యేడు కాస్త వానలు కురిస్తే రాముడిని ఇంటికి తీసుకురావచ్చు’ అన్నాడు సముదాయింపుగా.
 ‘ఇంకెక్కడి రాముడురా... వెంకడూ. వంద రూపాయలకి నా కొడుకుని అమ్ముకున్నాన్రా’ అంటూ కండువాలో ముఖం దాచుకున్నాడు శ్రీరాములు నాయుడు.
 
- సాయి పాపినేని
 ఫోన్: +91 9845034442

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement