మాదిగ బండక్వారీ జనార్దన నాయుడిదే కాదట
రికార్డుల్లో ఉన్న లీజుదారు శరత్‌కుమార్
ఏకంగా చంద్రబాబునే బురిడీ కొట్టించిన వైనం
కూటమి అధికారంలోకి రాగానే క్వారీపై పెత్తనం
ఒకే ఆధార్ నెంబరుతో రెండు రాష్ట్రాల్లో కార్డులు
సాక్షి టాస్క్‌ఫోర్స్: పలమనేరు ఎన్నికల ప్రచారానికి వచ్చిన చంద్రబాబు మాట్లాడుతూ పాపం కర్ణాటక నుంచి ఇక్కడికొచ్చి మెటల్ స్టోన్ క్రషింగ్ చేసుకుంటున్న జనార్దన నాయుడిని బెదిరించి దాన్ని కొట్టేశారని ఆరోపించారు. ఇదే విషయాన్ని ఆయన జిల్లాలో పలుచోట్ల ఎన్నికల ప్రచారాల్లో మాట్లాడారు. జనార్దన నాయుడుకు ఇంత అన్యాయం జరిగిందా అనుకున్నారుగానీ ఇప్పుడు చూస్తే అసలు ఆ క్వారీకి లీజుదారుడు జనార్దన్ నాయుడే కాదు.
చిత్తూరు జిల్లా వి.కోట మండలానికి చెందిన శరత్‌కుమార్‌దిగా ఇక్కడి మైనింగ్ రికార్డుల్లో ఉంది. ఇన్నాళ్లు చంద్రబాబునే బురిడీ కొట్చించిన జనార్దన్ నాయుడు భలే వాడుగా ఉండాడే అంటూ ఇక్కడి జనం చర్చించుకుంటున్నారు. కూటమి అధికారంలోకి రాగానే మాదిగబండ క్వారీనీ నాయుడు స్వాధీనం చేసుకుని తమ ప్రభుత్వం అధికారంలో ఉందని అధికారులను సైతం బెదిరించుకుంటూ జల్లి(కంకర)పనులు యథేచ్ఛగా చేస్తున్నాడు. నాయుడు కర్ణాటకలో బీజేపీ నాయకుడు, ఇక్కడేమో టీడీపీ లీడర్‌గా చలమాణి అవుతున్నాడు.
ఆపరేటర్ మృతితో విషయం వెలుగులోకి...
మూడు రోజుల క్రితం మాదిగబండ క్వారీలో ఓ జేసీబీ ఆపరేటర్ అనుమానాస్పదంగా మృతి చెందాడు. దీనిపై స్పందించిన ఇక్కడి వైఎస్సార్‌సీపీ నేతలు మృతుని కుటుంబానికి రూ.50లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలకు దిగారు. ఈ నేపథ్యంలో క్వారీకి సంబందించిన అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2021లో ఇక్కడి క్వారీకి లీజుదారుగా ఉన్న జి.మోహన్‌బాబు తన క్వారీని శరత్‌కుమార్‌కు బదిలీ చేశారు. ఇందుకు సంబంధించిన స్థానిక మైనింగ్ శాఖలో ప్రొసీడింగ్స్ నెం:1059/టీక్యూఎల్/ఆర్‌ఎంబీఎస్/21 గా ఉంది.
దీంతో శరత్‌కుమార్ లీజుదారుగా మారాడు. క్వారీకి సంబంధించి హెచ్‌టీ సర్వీస్ నెం:2503 పేరిట తీసుకున్నాడు. అయితే ఇదే క్వారీ ఇన్ ఎలిజిబుల్ జాబితాలో ఉందంటూ 2022 ఆగస్టు 1న మైనింగ్ డీడీ కేఎల్వీ ప్రసాద్‌రావు లీజుదారుడైన శరత్‌కుమార్‌కు ప్రొసీడింగ్స్ నెం:3522/క్యూ1గా నోటీసు జారీ చేశారు. దీంతో ఈ క్వారీ పనులు ఆగిపోయాయి. అనవసరంగా కరెంట్ చార్జీలు భారమెందుకు అనుకుని, 2024 జూన్ 6న స్థానిక ట్రాన్స్‌కో అధికారులకు అప్పటిదాకా ఉన్న బకాయిలను చెల్లించి సర్వీసును డీసీ చేయమని ట్రాన్స్‌కో ఎస్‌ఈ(ఆపరేషన్)కు అర్జీ ఇచ్చాడు. దీన్ని బట్టి చూస్తే ఈ క్వారీ జనార్దన్‌నాయుడుది కాదు శరత్‌కుమార్‌దని తేలిపోయింది.
పంచాయతీకి సెస్‌లు కూడా లేవట
కొలమాసనపల్లి పంచాయతీ సర్పంచ్ గోవిందుస్వామి సోమవారం స్థానిక మైనింగ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇక్కడ అక్రమంగా మైనింగ్ చేస్తున్న జనార్దన్‌నాయుడుపై చర్యలు తీసుకోవాలని అందులో కోరారు. పైగా పంచాయతీ పన్నులను వసూలు చేయించాలని విన్నవించారు.
ఒకే నెంబరుతో రెండు ఆధార్ కార్డులు
జనార్దన్‌నాయుడు 9041 1852 3636 అనే నంబరుతో దొడ్డ కంబలి, బంగారుపేట తాలుకా, కర్ణాటక పేరిట ఆధార్ కార్డు ఉంది. ఇదే నంబరుపై కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలం కెనమాకులపల్లిలోనూ ఆధార్ కార్డు కలిగి ఉన్నట్టు ఇక్కడి వైఎస్సార్‌సీపీ నేతలు బయటపెట్టారు. దీనిపై కలెక్టర్ విచారణ చేపట్టాలని విన్నవించారు.
నోరుమెదపని అధికారులు
అనర్హత జాబితాలోకి వచ్చిన మాదిగబండ క్వారీని స్థానిక మైనింగ్ అధికారులు ఎందుకు ఆపలేదో అర్థం కాలేదు. తనకు కరెంట్ వద్దని విన్నవించిన లీజ్‌దారుని కాదని ఇన్ని నెలలుగా ట్రాన్స్‌కో అధికారులు ఎలా సరఫరా ఇస్తున్నారో చెప్పడం లేదు. దీనిపై వారిని వివరణ కోరినా దాటవేసే ప్రయత్నం చేయడం గమనార్హం.
కూటమి అధికారంలోకి రాగానే..
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జనార్ధన్‌నాయుడు తన మనుషులతో వచ్చి మాదిగబండ క్వారీని స్వాధీనం చేసుకున్నాడు. అప్పటికే అక్కడున్న జల్లిని సైతం కర్ణాటకకు తరలించుకున్నాడు. దీనిపై లీజుదారుడైన శరత్‌కుమార్ జూన్ 16న స్థానిక సీఐకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. కానీ అధికారబలంతో నాయుడు రెచ్చిపోయి క్వారీవద్దకు ఎవరినీ రానీయకుండా స్టోన్‌క్రషింగ్ చేస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment