నెమిలిడేగ | Nemili the wings of an eagle, golden color, glossy | Sakshi
Sakshi News home page

నెమిలిడేగ

Published Fri, Jan 2 2015 11:49 PM | Last Updated on Sat, Sep 2 2017 7:07 PM

నెమిలిడేగ

నెమిలిడేగ

తుల్యభాగ ఒడ్డున పోలమ్మపుట్ట క్రీ.శ. 1757
తూ.గో.జిల్లా, రాయవరం

 
 ‘రారా కోడిబా.. పాపారాయుడరా...’
 గిర్రున తిరుగుతూ నెమలిడేగని నదిలోకి విసిరేసాడు సూరన్న. నల్లని మెడ రిక్కించి, బంగారు రంగులో నిగనిగలాడే రెక్కలు బారజాచి క్షణాల్లో ఈదుతూ ఒడ్డు చేరిన పాపారాయుడిని చంకలోకెత్తుకొని పొట్ట నిమురుతూ ‘ఇంకాస్త కొవ్వు కరగాల్రా పాపాయ్’ అంటూ మరోసారి నీళ్ళలోకి విసిరాడు. కనుమరోజు పెద్దాపురంలో పందెం. సూరన్న ప్రత్యేకంగా పెంచే నెమలిడేగలంటే గోదావరి సీమలో తిరుగులేదు.

‘మనోడిని కొట్టే పుంజు సర్కారులోనే లేదు సూరయ్యా. కడియం పెట్టి పెద్దాపురం నుంచి మనోడిని ఊరేగించుకొస్తుంటే మండపేటోళ్ళ గుండెల్లో మండాల, బీమారపోళ్ళు బిక్కసావు సావాల. పోలమ్మ గుళ్లో ఏట బలిస్తానని మొక్కుకున్నా’ మెత్తటి తుండుగుడ్డతో పాపారాయుడిని తుడుస్తూ మీసం తిప్పాడు పాలేరు భీముడు. గెలిచిన పుంజుకి బంగారు కడియం, ఐదొందల రూపాయల బహుమానం ప్రకటించాడు పెద్దాపురం జగదేవరాజా.
 ‘ఏమోరా. పరాసు (ఫ్రెంచ్) కోళ్ళతో పోటీ!’
 ‘పరాసులా? ఆడమ్మబాబులా? మనోడెవడు? తాండ్రపాపడు! పిఠాపురం అల్లుడూ! బొబ్బిలిపులి!’ పొడిబట్ట చుట్టి పాపారాయుడిని సూరన్న చేతికందించాడు.
 ధనుర్మాసం. ఇంటికెళ్లే దారిలో రంగవల్లులు తీర్చి గొబ్బిసుద్దులు పాడుతూ సూరన్నపై వాలుకళ్లతో వయ్యారా
 లొలక బోసే పడుచుపిల్లలు.
 ‘ఏం బావా. ఈసారి పాపాయికి బంగారు కడియమటగా? నాకేమిస్తావ్?’ ఎదురొచ్చింది కమలం, సూరన్న మేనత్త కూతురు.
 ‘కడియమెందుకే. ఒక ముదిస్తే వడ్డాణమే చేయిస్తా’ అని మరదలిని ఆటపట్టించాడు.
 ‘ముద్దిస్తే వడ్డాణమంటే ఇక్కడ మేమంతా లేమూ?’ రెండుచేతులూ పెకైత్తి హరిదాసు కుండలో చాటెడు బియ్యం పోస్తూ అడిగింది అతడి మేనమామ చిన్న భార్య కనకం.
 ‘నీ వారానికి వడ్డాణం చాలదత్తా, పలుపుతాడు కావాలి’ అని ఎగతాళిచేస్తూ ముందుకి సాగాడు.
 మలుపు తిరగంగానే ‘సూరన్నా.. మనవూరి పౌరుషం నిలిపే నెమిలిడేగ.. మన పాపారాయుడు’ అంటూ ఆటవెలదిలో పద్యమందుకున్నాడు గుడిచెట్టు కింద కాపుకాసిన స్తోత్రాల బాపనయ్య.
 చలుక భీముని సరిపాటి పౌరుసమును
 పల్లనాటి బెమ్మ పోరు పటిమ
 బలిజ సూర్యనింట బుట్టిన మా ఊరి
 మగటిమిగల పుంజు పాపరేడు
 తన కోడిపుంజుని మెచ్చుకుంటే చాలు సూరన్నకి ఒళ్ళూపైనా తెలీదు. రూపాయకాసు వాని దోసిట్లో పడేసి పాపారాయుడి గడ్డం దువ్వుతూ ఇంటికి చేరాడు.
 ‘ఒరే తమ్ముడూ. ఇవ్వాళ కోటిపల్లి రేవుకెళ్ళాలి. నీ బావగారు వస్తున్నారు గుర్తుందిగా?’ కాళ్ళకి నీళ్ళతో ఎదురొచ్చింది అతడి పెద్దక్క సామ్రాజ్యం.
 ‘సరే అన్నం పెట్టు. బండి రాగానే బయలుదేరుతా’ అంటూ పెరట్లో మామిడిచెట్టుకి కట్టిన లగ్గం పాపయ్యకి తగిలించాడు.


‘ఈసారి మీ పొలంలో బంగారం పండింది నాయుడూ అక్కుళ్ళు ఎకరానికి పదిహేను మూటలన్నా ఉంటుంది’ అన్నాడు సరాఫు సాంబిరెడ్డి. నైజాం సర్కారు గుత్తేదార్లకి అతడి లెక్కంటే లెక్కే. ‘కలవసం తీసేస్తే నూటముప్పై బస్తాలు. గుడికి, కొత్వాలుకి, తాసిల్దారుకి, గుత్తానికి పోగా వంద బస్తాలు. ఊర్లో కొలుపులకి పది. ఇక మిగిలినదాన్లో జమీందారి పన్ను యాభై బస్తాలు. ఫిర్కాలో పన్ను వసూలంతా రాదారి నావ కెక్కించి రాజమండ్రి పంపమని రాజావారి పురమానం.’ వింటున్న రామస్వామి గుండెలు గుభేలుమన్నాయి. ‘అదేంటి సాంబయ్యా? నూటికి నలభైయేగా పన్ను?’ అంటూ నిలుచుని చోద్యం చూస్తున్న కరణం వంక చూశాడు.
 ‘ఏం చేస్తాం నాయుడూ. మన ఖర్మ. సర్కారు భూముల్ని పరాసులకి దత్తం చేశాక ఆ బూచిదొర పన్నులు అరవైకి పెంచాడు. దానికి మన్నే సుల్తాన్ విజీనారం రాజావారి మద్దతు’ అన్నాడు కరణం పేర్రాజు.

‘చిన్నదాని పెళ్ళి మాఘమాసంలో పెట్టుకున్నాం. పండిందంతా ఈ పరాసులు దోచుకుంటే ఇక రైతులు పండించేమి లాభం?’ తలుచుకున్న కొద్దీ గుండె మండిపోతుంది. నూటయాభై పండిస్తే మిగిలేది ముప్పై మూటలా? ఐదొందలు కూడా రాలదు.   ‘ఇది అన్యాయం కరణంగారూ, మిగతా రైతులకి తెలుసా?’

‘మీదే మొదటి బందోబస్తు. రాజావారిని అడిగేందుకు ఆయన పెద్దాపురంలో లేరు. బొబ్బిలి రాయలు పన్ను కట్టేందుకు నిరాకరించారట! రాజావారు ఎటూ తేల్చుకోలేకుండా ఉన్నారని జోగినాథం పంతులు చెప్పగా విన్నాను’.
 ‘రేపు కనుమ సంబరాలకి పెద్దాపురం వస్తారుగా? అప్పుడు మనమంతా కట్టుగా వెళ్ళి రాజావారి కాళ్లపై బడితే?’
 ‘ఆ దారీ లేదు. పెద్దాపురంలో ఐదొందల మందితో పరాసు దళం నిలబెట్టాడు బూచి. బొబ్బిలి విషయం తేలేదాకా మనకీ తిప్పలు తప్పవు. మన కర్మయింతే చేయగలిగింది లేదు.’
 కాళ్ళలో సత్తువపోయి అలాగే కూలబడిపోయాడు రామస్వామి

బావగారితోని ఇల్లు చేరేసరికి ఇల్లంతా స్తబ్దుగా ఉంది. వస్తూనే పాపారాయుడి వద్దకి ఉరికాడు సూరన్న. ‘ఏమయ్యింది అత్తయ్యా?’ గుడ్ల నీరుకుక్కుకుంటూ నీళ్ళందించిన అత్తగారిని అడిగాడు ప్రకాశం. రాజానగరం కొత్వాలీలో గుమస్తా, రామస్వామికి మేనల్లుడు. మేనమామ వద్ద విషయం తెలుసుకున్నాడు.
 
‘ఇది మనకు కాదు మామయ్యా. దేశానికే పట్టిన పీడ. బసాలత్ జంగు పుణ్యాన పరాసుల పాలబడ్డాం. కొన్నాళ్ళు ఓపికబట్టాలి. బొబ్బిలి మీదకి విజయరామరాజు దండు వెడలింది కదా. అటు వాడికీ, ఇటు ఈ పరాసు రాక్షసులకీ బుద్ధిచెప్పగలవాడు ఒక్కడే. తాండ్రపాపయ్య. రేపు కనుమ పండగకి పెద్దాపురం వెళితే విషయం తెలుస్తుంది. చిన్నమ్మ పెళ్ళి గురించి అప్పుడే ఆలోచించొచ్చు’
 ‘పెళ్ళికి కనీసం వెయ్యి రూపాయల ఖర్చు. అప్పు చేసి రెండోపంట చేతికిరాకపోతే ఉన్న పొలానికే ఎసరు’ అని తలపట్టుకున్నాడు.
 ‘లే మామయ్యా! పద గుడివద్దకు వెళ్దాం. ఇవ్వాళ పల్నాటియుద్ధం బుర్రకథట! కాస్తలా తిరిగొచ్చి పదిమందినీ కలిస్తే బాగుంటుంది’ అని లేవదీశాడు.


 పెద్దాపురంలో పందిరి కింద ఇరవై అడుగుల బరి. రాజాగారి తమ్మపడిగెకి అటూ యిటూ పరాసు బూచి దొర, మన్నె సుల్తాన్ విజయరామరాజు. బొబ్బిలితో యుద్ధానికి పెద్దాపురం రాజాని కూడగట్టుకు వెళ్ళాలని సర్వప్రయత్నాలూ జరుగుతున్నాయి. జగదేవరాజా ఎటూ తేల్చడు.

 ఆఖరి పందెం! సూరన్న నెమిలిడేగ పాపారాయుడికీ, పరాసు నోర్డు పుంజుకీ పందెం. జనమంతా సూరన్న పక్షమే. ‘పరాసు పుంజు గెలిస్తే జగదేవరాజు పరాసుల పక్షం చేరేందుకు సిద్ధమట! అదే పరాసు పుంజుపై మీ నెమలిడేగ గెలిస్తే అది బొబ్బిలి వీరులు అజేయులని సూచిస్తుంది. మన రాజావారికి వెనుకంజ వేయక తప్పదు,’ ప్రకాశం చెవిలో చెప్పాడు దివాన్ జోగినాథం.
 ‘మంచిది. నా బావమరిది పెంచిన పాపారాయుడిని కొట్టే పుంజు ఇంకా పుట్టలేదు. పరాసుల పొగరు కాస్తంతయినా అణుగుతుంది’ తొడగొట్టాడు ప్రకాశం.

 ‘దానివల్ల నీకేం ఉపయోగం? యుద్ధానికి వెళ్ళినా లేకున్నా పన్ను కట్టకతప్పదు. అదే ఓడిపోతే ఐదువేల రూపాయలు. నీ మరదలు పెళ్ళికి ఏ అవాంతరమూ ఉండదు. ఆలోచించు’ ప్రకాశం తల గిర్రున తిరిగింది. ఐదువేలు! చిటికెడు పప్పుమందుతో మామ కష్టాలన్నీ తీరినట్లే. కానీ...  ‘సూరన్నని ఒప్పించడం సాధ్యమా?’

చిన్నమ్మ పెళ్ళి ధూంధాంగా చేద్దామనుకున్నాడు రామస్వామి. తోబుట్టువు పెళ్ళికోసం పందెం ఓడిపోయి, ఊరి పరువుతీసిన సూరన్నంటే కోపంతో ఊరివాళ్ళెవరూ పెళ్ళికి రాలేదు. పందిరి బోసిపోయింది. ఊళ్ళో మొగం చూపించలేక ఇల్లూ బంధువులూ వదిలి తుంగభద్ర ఒడ్డులో రాయచూరు సర్కారుకి వలసపోయాడు సూరన్న.
 - సాయి పాపినేని
 ఫోన్: +91 9845034442
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement