దండుబాట | sai papineni special story | Sakshi
Sakshi News home page

దండుబాట

Published Fri, Dec 19 2014 10:59 PM | Last Updated on Sat, Sep 2 2017 6:26 PM

దండుబాట

దండుబాట

లంగరు బండ క్రీ.శ. 1600 ::: బండమీద చందుపట్ల

పదం నుంచి పథంలోకి 21
 
 టపా సమయం. టపాబంటు వచ్చే సమయానికి ఊళ్లో ఒకొక్కరూ ఒకొక్కరూ మర్రిచెట్టు వద్దకి చేరుకుంటున్నారు. మొదట ఫౌజ్‌దార్ రహీంఖాన్ వచ్చేశాడు. ఎప్పుడో పెషావర్ నుండి వలప వచ్చిన రహీంఖాన్ మల్కిభ రాముడి సుల్తానీలో చందుపట్ల ఫిర్కాలో ఫౌజ్‌దార్‌గా నియమించబడ్డాడు. అతడు ఒంటిచేత్తో రోహిల్లా
 
బందిపోట్లని ఎదిరించి గ్రామాన్ని కాపాడిన వీరకథ ప్రసిద్ధం. అతడి కోసమని అరుగు మీద గుడుగుడు పళ్ళెంలో కణకణమండే నిప్పులు వేసి ఊదసాగాడు వెట్టి మల్లేసు. ఇంకా ఊరి పెద్దమనుషులూ ఆరడుగుల ఎత్తుండే పఠాన్‌దొరలు కూడా జనం సలాములు అందుకుంటూ అరుగుపై వచ్చి కూచున్నారు.

 ఎండమావుల మధ్య కాళ్లకు గజ్జెల మోతతో పరుగెత్తుకొస్తున్న టపాబంటు రూపం కనపడగానే  అందరిలో ఉత్సుకత పెరిగింది. టపా వచ్చిందంటే గోల్కొండ ఖబర్లు తెలుస్తాయి మరి.  ‘బారెమాలిక్ గట్ల మొగలాయిల కాడ్నుండి రాయబారి వచ్చిండట?’ తూర్పు మాగాణి యాదిరెడ్డి ఎవర్నీ ఉద్దేశించకుండా అడిగాడు.  ‘ఔ! ఢిల్లీ పాదుషా జలాలుద్దీన్(అక్బర్) హుకూమత్ జబర్‌దస్త్‌గా ఉందంట’ సమాధానం ఇచ్చాడు రహీంఖాన్.  మాట పూర్తియ్యేలోగా టపా వచ్చేసింది. అక్కడే సిద్ధంగా ఉన్న మరో టపాబంటు టపా సంచి అందుకొని తర్వాతి గమ్యానికి పరుగందుకున్నాడు.

 ‘ఖాన్ సాహెబ్! గోల్కొండ నుంచి మీ ఊరికి టపా ఉంది’ అంతవరకూ పరిగెత్తుతూ వచ్చిన అలసటతో గసపెడుతూ అంగీలో భద్రం చేసిన సిక్కా కమ్మను రహీంఖాన్‌కు అందించాడు టపాబంటు నల్లసిద్ది. అరబీ లిపిలో ఉన్న ఆ కమ్మను వెదరు గొట్టం నుంచి బయటకి లాగి చూడగానే ‘ఒరే మల్లాయ్!  పెద్దనాయుడుగార్ని దౌడెల్లి తోల్కరా. గోల్కొండ కాడ్నించి ఖబరని చెప్పు’ అని వెట్టివాడిని పురమాయించి ఉత్తరం చదవడంలో పడ్డాడు రహీంఖాన్. చూస్తున్న జనంలో విశేషం తెలుసుకోవాలనే ఆత్రం. గోల్కొండ నుంచి ప్రత్యేకంగా కబురు రావడం మాములు విషయం కాదు. కానీ పెద్దనాయుడు వచ్చేదాకా రహీంఖాన్ నోరు విప్పలేదు.

 పెద్దనాయుడు వచ్చాడు. రహీంఖాన్ అరబ్బీలో ఉన్న పత్రం చూపించాడు. నాయుడికి అర్థంకాని ఆ లిపిలో ఏముందో చెప్పాడు. నాయుడి సంబరానికి అంతులేదు. పాలమురు తరఫ్‌దార్ నుండి నాయుడిని పదూళ్ళ ఫిర్కాకి గుత్తేదార్‌గా నియమిస్తూ పంపిన నియామక పత్రం అది.   ‘గోల్కొండలో ఎవురో ఖాస్ ఆద్మీ ఉన్నట్టున్నాడు. అన్నీ వరాలు నీకే ఇచ్చాడు’ అన్నాడు రహీంఖాన్ నవ్వుతూ.  పెద్దనాయుడు అంతా ఆ దేవుడి దయ అన్నట్టు ఆకాశంలో చూశాడు.

 ‘గోల్కొండ నుంచి ఫిరంగి దెయ్యాల (డచ్చివాళ్ళు) దళమొకటి వస్తుందట. మచిలీబందర్ వెళుతూ ఈడ్నే నాల్గుదినాలు మకాం ఉంటుందట. వాళ్ల మంచీ చెడ్డా చూడాలి’ అన్నాడు రహీంఖాన్. పెద్దనాయుడు అలాగే అని తలాడించాడు. ‘మరో ఖబర్ కూడా ఉంది. మచిలీబందర్లో సర్కారీ కార్ఖానాకి నూరుమంది నేతగాళ్ళు కావల్నెంట. ఆడమనిషికి దూది వడకేంటికి తెలిసింటే సాలు. ఖానా పీనా ఇచ్చి జంటకి వారానికొక హొన్ను బత్యం. ఎవరైనా ఉంటే చూడు. దళంతో పాటు పంపించేద్దాం’ అంటూ అలవాటుగా పెద్దనాయుడికి హుక్కా గొట్టం అందించాడు రహీంఖాన్. నాయుడు తీసుకోలేదు. ‘వద్దులే భాయీ. నా సుట్ట ఉందిలే. నీ తురకల గుడుగుడు పిలిస్తే కులం సంకరమైనట్లు’ అని, నవ్వుతూ మొలలో దోపిన సంచిలోంచి పొగాకు కట్ట తీశాడు.

 ‘ఇంతకీ ఈ నేతగాండ్ల పనికి పంపేందికి నీ దమాక్లో ఎవరైన ఉండిరా?’ అన్నాడు నాయుడు. రహీంఖాన్ నవ్వాడు.
 ‘నీ ఇరాదా నాకు సంఝాయెలే. నీ కొడుకుల్లో ఒకడిని పంపేటికి యోచన్జేస్తుండావ్ కదా’ అన్నాడు. పెద్దనాయుడు దాచలేదు. అతడికి ఐదుగురు కొడుకులు. ఒకడు దేశాలు పట్టిపోగా మరొక నలుగురు గట్టెక్కాల్సి ఉంది.

పెద్దనాయుణ్ణి చూస్తూ రహీంఖాన్ సతమతం అయ్యాడు. అసలు సంగతి నాయుడికి ఎలా చెప్పాలి? కబురు పూర్తిగా ఎవరికీ చెప్పకుండా తనలోనే దాచుకున్నాడు. సమయం వచ్చేదాకా రహస్యంగానే ఉంచితే మంచిదనే నిర్ణయానికి వస్తూ ‘నాయుడూ. నయీముద్దీన్ అనీ మీర్‌జుమ్లా దివాన్లో దబీర్‌గా ఉంటుండు. ఈ ఫిరంగుల్తో వస్తుండు. నా ఇంట్లనే మకాం. కాని వాని ఖానాకి మీ ఇంట్లనయితే వంటలు ఖాస్‌గా ఉంటవి. కాస్త లచ్చక్కతో సెబుతావె?’  ‘అదెంత భాగ్యం భాయ్. నువ్ ఫికర్ చేయకు’ అన్నాడు పెద్దనాయుడు.
   
గోల్కొండ కోట గుమ్మం వద్ద ఫర్మానా పెట్టెని సేవకులకి అందించి ఉత్సాహంగా గుర్రమెక్కాడు దబీర్ నయీముద్దీన్. కారవాన్ రాస్తా రద్దీగా ఉంది. మూసీనది దాటితే సుల్తాన్ కట్టిస్తున్న కొత్త షహర్. ఫిరంగులకి అక్కడ విడిది. చుట్టూ తోటలతో అందమైన నగరం బాగ్‌నగర్! అతడు పన్నెండేళ్ల క్రితం ఇంట్లోంచి పారిపోయి దేశమంతా తిరిగాడు. ఉర్దూ, మరాఠి, ఫార్సీలే కాక బుడతకీచుల వద్ద ఫిరంగి (ట్రేడ్‌ఫ్రెంచ్) భాష కూడా నేర్చుకున్నాడు. బుడతకీచుల దుబాసీగా గోల్కొండ వచ్చి మీర్‌జుమ్లా అమీన్ ఉల్ ముల్క్ ప్రాపకం సంపాదించాడు. గోల్కొండ అమీర్లలో ఒకడిగా ఎదిగాడు. బందేనవాజ్ గిసుద్‌రాజ్ ఖంఖాలో ఇస్లాం మతం స్వీకరించి నయీముద్దీన్‌గా పేరు మార్చుకున్నాడు.

రోహిల్లాబండ (షాలిబండ) వద్ద డచ్చి వర్తకుల దండు ప్రయాణానికి సిద్ధంగా ఉంది. మచిలీబందర్లో రంగువస్త్రాల కర్మాగారాలు నెలకొల్పేందుకు సుల్తాన్ నుండి ఫర్మానా సాధించడమేగాక మడపొలెంలో తుపాకీ మందు కార్ఖానాకీ మిరాసీ సంపాదించాడు. రెండేళ్ళు కళ్ళు మూసుకుంటే రాజ్యంలో ఏ పదవి కావాలన్నా కొనగలిగేటంత ధనం!  నన్ను చూస్తే బాపు ఎంత సంతోషిస్తాడో?  చందుపట్లలో నాలుగు రోజుల మకాం తరువాత నయీముద్దీన్ కారవాన్ కదిలింది.  మర్రిచెట్టు కింద అరుగు మీద నిలుచొని మరోసారి చేయి వూపి వీడ్కోలు చెప్పాడు నాయుడు.
 
ఇక అసలు రహస్యం చెప్పేందుకు సమయమొచ్చింది అనుకుంటూ ‘పద నాయుడు భాయ్! నీకొక ఖాస్ ఖబర్ చెప్పాల’ అని దూరంగా తాటితోపులో దారి తీశాడు రహీంఖాన్.  ‘భాయ్! ఈ నాల్గురోజుల్ నీ ఇంట్ల ఉన్న మాలిక్ నయీముద్దీన్ సాహెబ్‌ని చూసిండవు గాదె?’ చిరునవ్వుతో అడిగాడు.  ‘ఔ! ఆ సాహెబ్‌ని సూస్తా వుంటే ఎవడో దగ్గర మనిషుల్ని సూస్తన్నట్లుంది’.  ‘మల్ల అంత దగ్గరంటోడ్ని గుర్తుపట్టిండ్లా నాయుడూ భాయ్?’ అడిగాడు రహీంఖాన్ తీక్షణంగా నాయుడి కళ్లలోకి చూస్తూ. అంతవరకూ ఎక్కడో మనసు లోతుల్లో తోచిన చిన్న సందేహం ఒక్కసారిగా విశ్వరూపంతో అతడి కళ్లముందుకొచ్చింది. నిజమా? చిన్నప్పుడు ఇంటి నుండి పారిపోయిన తన పెద్దకొడుకు నర్సింగు నాయుడే ఈ నయీముద్దీన్ సాహెబా? ‘ఎందుకు చెప్పలేదు?’ అంటూ ఖాన్ సాహెచ్ భుజం పట్టుకొని కుదిపేశాడు. రహీంఖాన్ మౌనంలో కూడా నాయుడికి సమాధానం దొరికింది.  కులం, సాంప్రదాయం ప్రాణంగా భావించే తాను, తన కొడుకు ముస్లిముల్లో కలిశాడంటే ఊరివాళ్లకి మొహమెలా చూపగలడు? ఇరవై ఏళ్ల స్నేహంలో తన గురించి తనకంటే ఖాన్‌కే ఎక్కువ తెలుసు. ఉబికివస్తున్న కన్నీళ్లు అణుచుకుంటూ ఖాన్ భుజంపై తలవాల్చాడు నాయుడు.
 - సాయి పాపినేని
 ఫోన్: +91 9845034442
 
 ‘ఆ... గోల్కొండ నుంచి ఫిరంగి దెయ్యాల (డచ్చివాళ్ళు)

దళమొకటి వస్తుందంట. మచిలీబందర్ వెళుతూ ఈడ్నే నాల్గుదినాలు మకాం ఉంటుందంట. వాళ్ల మంచీ చెడ్డా చూడాలి’ అన్నాడు రహీంఖాన్.
 

 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement