మాలకాకి | sai papineni special story | Sakshi
Sakshi News home page

మాలకాకి

Published Fri, Mar 13 2015 11:09 PM | Last Updated on Sat, Sep 2 2017 10:47 PM

మాలకాకి

మాలకాకి

బోయి భీమన్న రాసిన ‘కూలీరాజు’ నాటకం పుస్తకం పక్కనపెట్టి, ఈజీచెయిర్లో కాళ్లు జాపుకొని ఆంధ్రపత్రిక తెరిచాడు డాక్టర్ దాస్. ముందు పేజీలో ‘రామరాజ్యం’ అనే శీర్షికతో కాశీనాథుని నాగేశ్వరరావు రాసిన సంపాదకీయం చదువసాగాడు. హరిజనుల్లో వస్తున్న కాస్తోకూస్తో అభివృద్ధి పట్టణాలకే పరిమితమైందనీ, గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడేలా ఉందని, అసలైన రామరాజ్యం రావాలంటే గ్రామాల్లోని పీడితప్రజల ఉద్ధరణకి గాంధీజీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ నడుం కట్టాలని దాని సారాంశం.

అది చదివాక దాస్‌కు తన ఊరు గుర్తుకొచ్చింది. దానిని విడిచివచ్చి పాతికేళ్లు. అమ్మా, అయ్యా, తమ్ముళ్లూ... గూడెంలో చుట్టాలూ, ఊర్లో జనాలూ... ఏమయ్యారో? ఎలా వున్నారో? నిశ్చయానికి వచ్చి గోడకి తగిలించిన టెలిఫోన్ అందుకొని తన అసిస్టెంటుతో ‘మిస్టర్ పిళ్లే.. దిసీజ్ డాక్టర్ దాస్.. అర్జంట్ పని మీద ఊరెళ్లాలి. వారం రోజులు హాస్పిటల్‌కి రానని సూపర్నెంట్‌కి కబురు చేయండి. తరువాత- ఇవాళ జీటీలో పలాసకి ఒక ఫస్ట్ క్లాస్ సీటు రిజర్వ్ చేస్తారా. థాంక్యూ’ అని ఫోను పెట్టేసి బట్టలూ, షేవింగ్ సెట్టూ ఒక చిన్న బ్యాగులో సర్ది, గబగబా తయారై, బీరువాలోంచి కొన్ని పచ్చనోట్లు జేబులో పెట్టుకొని భార్యకి విషయం చెప్పి స్టేషన్‌కి బయల్దేరాడు. రైలుపెట్టె కిటికీలో టెలిగ్రాఫ్ స్తంభాల్లా తాను ఊరువిడిచి వచ్చిన నాటి సంఘటనలు అతడి కళ్లముందు పరుగెత్తసాగాయి..

ఆ రోజు...

ఊళ్లో పెద్దోళ్ల పిల్లలంతా నాయుడుగారి దేవిడీలో చేరి ‘అంటాడు’ ఆడుతున్నారు. అంగడి శెట్టి కొడుకు దొంగపడితే ‘నన్నంటుకోకే నామాలకాకీ’ అని పాడుతూ అందరూ పరుగులు పెడుతున్నారు. అప్పట్లో బడిని ఊరి గుడి నుంచి కొత్త భవంతికి మార్చాక మాలల పిల్లల్ని కూడా బళ్ళో చేర్చుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయినా మాలలతో కలిసి చదివేందుకు ఇష్టంలేని పెద్దలు తమ పిల్లలని బడి మాన్పించడంతో ఆ బడి నాలుగు రోజుల్లోనే మూతబడింది. బడి మూసేశాక ఊరి పిల్లలకి నాయుడుగారి దివాణమే బడి. రంగారావ్ మేస్టారు గన్నేరుచెట్టు నీడలో సైకిల్ స్టాండేసి వసారాలోకి వచ్చేసరికి అందరూ బుద్ధిమంతుల్లా పలకా బలపాల్తో బాసినపట్లేసుకొని కూర్చున్నారు.

ఆయన పట్నం నుంచి వచ్చిన ప్రైవేట్ మాస్టారు. ఆ రోజు ఇంగ్లిషు పాఠం.  కొట్టంలో గొడ్లకి కుడితిపెట్టి, గడ్డేసి, చాటుగా గన్నేరు చెట్టు నీడలో కూర్చొని ఎండుపుల్లతో మాస్టారి ప్రశ్నలకి సమాధానాలు పాదులోని తడిమట్టిలో రాస్తూ పాఠం వినసాగాడు కన్నదాసు.
 అప్పుడప్పుడు అతడి వంక చూసినా చూడనట్లే ఉండే మాస్టారు ఆ రోజుపాఠం ముగిశాక ‘ఒరేయ్.. సైకిల్లో గాలి తగ్గినట్లుంది. సెట్టిగారి అంగళ్లో గాలి పంపుంది. అక్కడి దాకా తోసుకురా’ అని బయలుదేరాడు. మాస్టారు అతడితో మాట్లాడడం అదే మొదటిసారి.
 గుడి మలుపు తిరగగానే ‘చదువు కోవాలనుంటే నాతో పట్నం రారా. బళ్లో చేర్పిస్తాను’ కలకండ పలుకుల్లా తీయని మాస్టారి పలుకులు అతడి భవిష్యత్తును మార్చేస్తాయి. కానీ అయ్య ఒప్పుకోడు. తండ్రి పడిన బాకీ తీర్చాలంటే తనకు దివాణంలో చిన్న పాలేరు పని తప్పదు. అదేమాట మాస్టారికి చెప్పాడు.

‘నీ ఇష్టం. నాకు వాల్తేరు కాలేజీలో ఉద్యోగం వచ్చింది. రేపు మధ్యాహ్నం బండిలో వెళ్లిపోతున్నాను. వీలైతే బండెక్కు’ అని సమాధానం కోసం ఎదురు చూడకుండా సైకిలెక్కి కాశీబుగ్గవైపు సాగిపోయాడు.  ఆ రోజు కట్టకింద మోస్తున్న పశువుల్ని అలాగే వదిలేసి, ఎవరికీ చెప్పకుండా బండెక్కాడు కన్నదాసు. వాల్తేరులో ఎఫ్‌ఏ వరకూ, రాయవెల్లూరులో వైద్యం, లండన్‌లో ఎఫ్‌ఆర్‌సీఎస్ చేసి గత ఐదేళ్లుగా మద్రాస్ రైల్వే హాస్పిటల్లో సర్జన్‌గా ఎంతో పేరు గడించాడు.

పలాస స్టేషన్లో బండి దిగాడు డాక్టర్ దాస్.
 
ఐదు మైళ్ల బండిబాటలో ఒంటెద్దు బండి ముసలయ్య నోట ఊళ్లో విషయాలు కొన్ని తెలిశాయి. గూడెంలో తల్లిదండ్రులని, సొంత వాళ్లని చూడాలని అతడి మనసు తొందర పెట్టసాగింది. గూడేనికి పోవాలంటే ఊరి మెరకదార్లోనే పోవాలి. ఊరి మొదల్లో బండి దిగి నడిపించసాగాడు ముసలయ్య.  నాయుడుగారి దివాణం ముందు పోతూ ఉంటే ‘ఎవర్రా.. బండిలో?’ అనే కేకేశాడు నాయుడు. ముసలయ్య తడబడుతూ ‘మ మ్ మ్ మాలోళ్ల సంగడి కొడుకయ్యా! పట్నంలో డాకటేరు’ అన్నాడు.  ‘హుమ్.. మధ్యాహ్నం జీడితోటకెళ్లాలి. బండి ఇక్కడే ఉంచి వాడ్ని నడిచిపొమ్మను’ అని ‘కాస్త అక్షరాలు వస్తే చాలు. ఈ నాయాళ్ల కళ్లు నెత్తికెక్కుతాయ్’ అని పైకి వినిపించేలా అంటూ లోపలికెళ్లాడు నాయుడు. దీనంగా అర్థించే ముసలాడి మొహం చూసి, రెండు నాణాలు వాడి చేతిలో పెట్టి, బ్యాగ్ భుజాన్నేసుకొని మౌనంగా గూడెం వైపు నడిచిపోయాడు డాక్టర్ ఎం.కెదాస్- ఎం.డి ఎఫ్‌ఆర్‌సీఎస్.

గూడెం ఏమీ మారలేదు. గుడిసెల మీద కాంగ్రెస్, కమ్యూనిస్ట్ జెండాలు చూస్తూ బురదలో కాలేశాడు దాస్. మిలమిలా మెరిసే అంబాసిడర్ బూటు బురదలో కూరుకుపోయింది. వాటిని అక్కడే విడిచి ఉత్తికాళ్లతో ఇల్లుచేరాడు.  పాతికేళ్ల తరువాత అంత పెద్దోడై తిరిగొచ్చిన సంగడి కొడుకుని చూసి గూడెంలో సంబరం అంతింత కాదు. పాటలు పాడారు. ఆటలు ఆడారు. దాసు ఇచ్చిన పది రూపాయలతో ఆ సాయంత్రం అమ్మోరికి వేట తెగింది. ఇంట్లో డైనింగ్ టేబుల్, పింగాణీ ప్లేట్లకి అలవాటు పడ్డ దాసుకి మట్టి కంచంలో సంకటికూరలు రుచించలేదు.

ఎట్టాగూ ఎక్కూవ బ్యామ్మర్లు మాకంటె
ఎట్టాగూ ఎక్కూవ ఏదైనా మాకంటె!!
అందారు పుట్టిరి హిందమ్మ తల్లీకి
అందారు ఒక్కటై ఉందారి సక్కంగ!!
అంటూ యువకులూ పిల్లలూ పాడిన ‘మాలోండ్ర పాట’తో తాను కూడా గొంతు కలిపాడు. తనవాళ్ల కోసం ఏదో చేయాలనే తహతహ! సేవా సంస్థల ద్వారా ఆర్థిక సహాయం చెయ్యొచ్చు. కానీ అవి సక్రమంగా ఉపయోగపడతాయనే నమ్మకం లేదు. ఏదైనా హాస్పిటలో, స్కూలో కట్టించి దగ్గరుండి చూసుకుంటేనే ఏదైనా ప్రయోజనం. కానీ పట్నంలో ఉద్యోగం, హోదా, సంపాదన వదిలి రావడం సాధ్యమా? అందుకు తన భార్యాబిడ్డలు సహకరిస్తారా? అలాగే ఆలోచిస్తూ తమ్ముడు తనకై ప్రత్యేకంగా తెప్పించిన నులక మంచంపై బ్యాగ్ తలగడగా పెట్టుకొని చుక్కలవంక చూస్తూ పడుకున్నాడు.

ఎంత ప్రయత్నించినా నిద్రపట్టలేదు. మురుగు కంపు, కుక్కల గోల, ముసిరే దోమలు! గొంగళి కప్పుకుంటే ఉక్కపోత. రాత్రంతా ఎటూ తెమలని ఆలోచనలు. ఏమేమో చేద్దామనే తపన. సాధ్యమా కాదా అనే సందేహం.

తెల్లవారకముందే లేచి చొక్కా తొడుక్కొని మొహం కడుక్కునేందుకు బావి వద్దకు చేరాడు. సేవా సమాజం హరిజనులకై ‘ప్రత్యేకంగా’ తవ్వించిన ఆ బావి ఎప్పుడో పూడిపోయింది. వీధి మధ్య తొట్టిలో నీళ్లు రేకుడొక్కులో పట్టుకొని కాలకృత్యాలకై రైలుకట్ట చేరుకున్నాడు దాస్.

రైలుకట్ట మీద మద్రాస్ మెయిల్ ఆగింది. రెడ్ సిగ్నల్! ఆలోచనలతో ప్రమేయం లేకుండా అతడి కాళ్లు అటువైపు ఈడ్చుకెళ్లాయి. రేకుడొక్కు విసిరేసి బండెక్కేశాడు డాక్టర్ దాస్.
 - సాయి పాపినేని
 ఫోన్: +91 9845034442

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement