భారతీయ సైబర్ క్రైమ్ కో ఆర్డినేషన్ సెంటర్ రాయబారి రష్మికా మందన్నా
‘‘సైబర్ నేరస్తులు మనల్ని టార్గెట్ చేయడానికి ఎప్పుడూ రెడీగా ఉంటారు. మనం అప్రమత్తంగా ఉండి, మనల్ని మనం కాపాడుకోవాలి’’ అంటున్నారు రష్మికా మందన్నా. గత నవంబరులో రష్మికా మందన్నా డీప్‌ఫేక్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం గుర్తుండే ఉంటుంది. బ్రిటిష్–ఇండియన్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ జరా పటేల్ శరీరానికి రష్మికా ముఖాన్ని పెట్టినట్లు ప్రచారం జరిగింది. ఆ వీడియో రష్మికతో పాటు చాలామందిని షాక్‌కి గురి చేసింది. ఆ తర్వాత కూడా పలువురు తారల ఫేక్ వీడియోలు వైరల్ అయ్యాయి.
కాగా, తన గురించి వచ్చిన డీప్‌ఫేక్ వీడియో గురించి స్పందిస్తూ... ‘‘నేను స్కూల్లో, లేదా కాలేజీలో ఉన్నప్పుడు ఇలా జరిగి ఉంటే ఆ పరిస్థితిని ఎదుర్కొని ఉండగలనా? అని ఊహించుకుంటేనే భయంగా ఉంది’’ అని రష్మిక అప్పట్లో ట్వీట్ చేశారు. అలాగే ‘‘అందరం కలిసి ఈ ధోరణికొక విరుగుడు కనిపెడదాం’’ అని మహిళలకు పిలుపునిచ్చారు కూడా. ఇప్పుడా పిలుపునకు ఒక సాధికారత లభించింది. ఇండియన్ సైబర్ క్రైమ్ కో ఆర్డినేషన్ సెంటర్ (14సి)కు బ్రాండ్ అంబాసిడర్‌గా కేంద్ర ప్రభుత్వం రష్మికా మందన్నాని నియమించింది. కేంద్ర హోమ్ మంత్రి ఆధ్వర్యంలో ఈ కో ఆర్డినేషన్ సెంటర్ పని చేస్తుంది. రష్మికా మందన్నాని రాయబారిగా ఎంపిక చేసినట్లు మంగళవారం కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
సైబర్ సేఫ్టీ జాతీయ ప్రచారోద్యమ రాయబారిగా తాను నియమితమైన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పేర్కొని, ఓ వీడియో విడుదల చేశారు రష్మిక. ఆ వీడియోలో ‘‘మనం డిజిటల్ యుగంలో బతుకుతున్నాం. సైబర్ క్రైమ్ అనేది చాలా భారీ స్థాయిలో ఉంది. దాని ప్రభావం ఎంత ఉంటుందో స్వయంగా అనుభవించిన వ్యక్తిగా మన ఆన్‌లైన్ ప్రపంచాన్ని కాపాడుకోవడానికి కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాను. మనందరం కలిసి మన కోసం, భవిష్యత్తు తరాల కోసం సురక్షితమైన సైబర్ స్పేస్‌ని రూపొందించుకుందాం. సైబర్ క్రైమ్స్ గురించి వీలైనంత ఎక్కువమందికి అవగాహన కల్పించి, రక్షించాలని అనుకుంటున్నాను.
సైబర్ క్రైమ్ కో ఆర్డినేషన్ సెంటర్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఈ నేరాలపై అవగాహన పెంచుతాను. మన దేశాన్ని సైబర్ నేరాల నుంచి కాపాడడానికి నా వంతు కృషి చేస్తాను’’ అని పేర్కొన్నారు రష్మికా మందన్నా. ఇక దాదాపు ఏడాది క్రితం (నవంబరు 6) రష్మిక సైబర్ క్రైమ్ బాధితురాలు... ఏడాది తిరక్క ముందే ప్రజల్ని బాధితులు కానివ్వకుండా జాగృతం చేయనున్న సైబర్ యోధురాలు. ఇదిలా ఉంటే... కెరీర్ పరంగా ‘దేవదాస్’ (2018) చిత్రంలో ఇన్‌స్పెక్టర్ పూజగా నటించారు‡రష్మిక. తెరపై తన బాధ్యతను నిర్వర్తించడానికి కృషి చేశారు. ఇప్పుడు నిజ జీవితంలో సైబర్ సెక్యూరిటీ అంబాసిడర్‌గా తన బాధ్యతను చాలా సిన్సియర్‌గా నిర్వర్తించాలని బలంగా నిర్ణయించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment