యూనిసెఫ్ భారత జాతీయ అంబాసిడర్‌గా కరీనా : భావోద్వేగం | Sakshi
Sakshi News home page

యూనిసెఫ్ భారత జాతీయ అంబాసిడర్‌గా కరీనా : భావోద్వేగం

Published Wed, May 8 2024 10:00 AM

Kareena Kapoor Appointed As UNICEF India National Ambassador Gets Emotional

రంగుల ప్రపంచానికి ఆవల...

2014 నుండి  యూనిసెఫ్‌ ఇండియాతో అనుబంధం కలిగి ఉంది  బాలీవుడ్‌ హీరోయిన్‌ కరీనా కపూర్. ఇద్దరు బిడ్డల తల్లిగా బాల్య అభివృద్ధి, ఆరోగ్యం, విద్య మరియు లింగ సమానత్వం కోసం ప్రతి పిల్లల హక్కును పెంపొందించడంలో సంస్థకు మద్దతు ఇస్తుంది. తాజాగా యునిసెఫ్ భారత జాతీయ అంబాసిడర్‌గా కరీనా కపూర్‌ ఎంపికైంది. ఈ సందర్బంగా ఆమె భావోద్వేగానికి లోనైంది.

కరీనా కపూర్‌ అనగానే రంగుల ప్రపంచం కళ్ల ముందు ఆవిష్కారం అవుతుంది.
అయితే ఈ అందాల నటికి మరో ప్రపంచం కూడా తెలుసు.

స్త్రీ సాధికారత నుంచి మెన్‌స్ట్రువల్‌ హైజీన్‌ వరకు ఎన్నో అవగాహన కార్యక్రమాల్లో పాల్గొంటోంది. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా దేశవ్యాప్తంగా ఎన్నో  ప్రాంతాలకు వెళుతోంది. పేదింటి బిడ్డలతో మాట్లాడుతోంది.

తాజాగా యూనిసెఫ్‌ ఇండియా నేషనల్‌ అంబాసిడర్‌గా నియామకం అయిన కరీనా కపూర్‌లో ఫ్యాషన్‌ డిజైనర్, రైటర్, మోటివేషనల్‌ స్పీకర్, సోషల్‌ యాక్టివిస్ట్‌ ఉన్నారు...

ఉత్తమనటిగా సుపరిచితమైన కరీనా కపూర్‌ సృజనాత్మకమైన డిజైనర్‌ కూడా. క్లాతింగ్‌ రిటైలర్‌ ‘గ్లోబస్‌’తో కలిసి పనిచేసింది. న్యూట్రిషనిస్ట్‌ రుజుత దివాకర్‌తో కలిసి తీసుకు వచ్చిన ‘డోంట్‌ లూజ్‌ యువర్‌ మైండ్, లూజ్‌ యువర్‌ వెయిట్‌’ పుస్తకం అమ్మకాల్లో రికార్డ్‌ సృష్టించింది. కరీనా కపూర్‌ వాయిస్‌తో ఈ పుస్తకం ఆడియో బుక్‌గా రావడం మరో విశేషం. ‘ది స్టైల్‌ డైరీ ఆఫ్‌ బాలీవుడ్‌ దివా’ పేరుతో తన జ్ఞాపకాల పుస్తకాన్ని తీసుకువచ్చింది. అదితి షా బీమ్జానీతో కలసి ప్రెగ్నెన్సీపై రాసిన పుస్తకం కమర్షియల్‌గా సక్సెస్‌ అయింది. 

రుజుత దివాకర్‌తో కలిసి న్యూట్రిషన్‌కు  సంబంధించి ‘ది ఇండియన్‌ ఫుడ్‌ విజ్‌డమ్‌ అండ్‌ ది ఆర్ట్‌ ఆఫ్‌ ఈటింగ్‌ రైట్‌’ డాక్యుమెంటరీపై పనిచేసింది. ఉమెన్‌ ఎంపవర్‌మెంట్‌పై వచ్చిన ‘గర్ల్‌ రైజింగ్‌’ అనే డాక్యుమెంటరీ ఫీచర్‌ ఫిల్మ్‌కు వాయిస్‌–వోవర్‌ ఇచ్చింది.

ఒకవైపు సినిమాల్లో బిజిగా ఉన్నప్పటికీ... పిల్లల విద్య, మహిళల భద్రతకు సంబంధించిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటోంది. మహిళలపై హింసను నిరో«ధించడానికి ఎన్‌డీ టీవి ప్రారంభించిన శక్తి క్యాంపెయిన్‌కు  అంబాసిడర్‌గా పనిచేసింది. 

2014 నుంచి బాలికల విద్యకు సంబంధించి యూనిసెఫ్‌తో కలిసి పనిచేయడం మొదలుపెట్టింది. రాజస్థాన్, మహారాష్ట్రలోని  పాఠశాలలకు వెళ్లి అక్కడి విద్యార్థులతో మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలుసుకునేది. జాల్నా జిల్లాలో కస్తుర్బా గాంధీ బాలికల విద్యాలయం నిర్వహించిన నిధుల సేకరణ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంది.


నిరుపేద పిల్లల చదువు కోసం షర్మిలా ఠాగుర్‌తో కలిసి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించింది. చైల్డ్‌–ఫ్రెండ్లీ స్కూల్‌ అండ్‌ సిస్టమ్స్‌ (సీఎఫ్‌ఎస్‌ఎస్‌) యాకేజీని లాంచ్‌ చేసింది. 

చత్తీస్‌ఘడ్‌లో చైల్డ్‌ రైట్స్‌ ప్రొటెక్షన్‌ వీక్‌ çసందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో బాగా చదివే పిల్లలు,  పాఠాలు బాగా చెప్పే టీచర్‌లకు పురస్కారాలు అందజేసింది. మెన్‌స్ట్రువల్‌ హైజీన్‌పై యూనిసెఫ్‌ లక్నోలో నిర్వహించిన సమావేశంలో ప్రసంగించింది. ‘నవజాత శిశువులను కాపాడుకుందాం’ పేరుతో కరీనా రాసిన వ్యాసానికి మంచి స్పందన  వచ్చింది. నవజాత శిశువులు, తల్లుల క్వాలిటీ హెల్త్‌ కేర్‌కు సంబంధించి ‘ఎవ్రీ చైల్డ్‌ అలైవ్‌’ అనే క్యాంపెయిన్‌ను నిర్వహించింది. 

మదర్స్‌ డే సందర్భంగా యూనిసెఫ్‌ దిల్లీలో నిర్వహించిన సమావేశంలో కరీనా ప్రధాన వక్త.
ప్రకృతి వైపరీత్య బాధితుల కోసం, ఎన్నో స్వచ్ఛంద సేవా సంస్థల కోసం నిధుల సేకరణ కార్యక్రమాల్లో పాల్గొంది కరీన. పిల్లల రోగనిరోధక శక్తి పెరుగుదలకు సంబంధించిన అంశాలపై పనిచేసే స్వస్థ్‌ ఇమ్యునైజేషన్‌ ఇండియాకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా పనిచేసింది.

తాజా విషయానికి వస్తే.. ‘నేషనల్‌ అంబాసిడర్‌గా యూనిసెఫ్‌తో నా అనుబంధం కొనసాగడం గౌరవంగా భావిస్తున్నాను. పిల్లల చదువు, హక్కుల కోసం నా గొంతు వినిపిస్తాను’ 
అంటుంది కరీనా కపూర్‌.

‘కరీనా కపూర్‌ ఎక్స్‌లెంట్‌ కమ్యూనికేటర్‌’ అని కితాబు ఇచ్చింది యూనిసెఫ్‌.
 

చిన్న విజయం చాలు...  పెద్ద సంతోషానికి
సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ‘నేను ఎలా సాధించానంటే’లాంటి స్టోరీలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రేస్‌ మొదలైంది. ఆ రేస్‌లో భాగంగా యువతరం ఒత్తిడిని ఎదుర్కొంటుంది. ఈ రేసులో మెంటల్‌ హెల్త్‌ అనేది వెనక్కి వెళ్లిపోయింది. రేస్‌ అనేది శాంతి, సంతోషాల కోసం ఉండాలి. విద్యార్థులు తమ మానసిక శాంతిపై ఎక్కువ దృష్టి పెట్టాలి. చిన్న విజయాన్ని కూడా పెద్ద విజయంగా భావించుకోవాలి. ‘ఇదీ ఒక విజయమేనా!’ అనుకున్నప్పుడు అసంతృప్తి ఉంటుంది. అసంతృప్తి నుంచి అశాంతి జనిస్తుంది –కరీనా కపూర్‌

Advertisement
 
Advertisement
 
Advertisement