వారసుడు | The heir | Sakshi
Sakshi News home page

వారసుడు

Published Fri, Apr 18 2014 10:49 PM | Last Updated on Sat, Sep 2 2017 6:12 AM

వారసుడు

వారసుడు

దంతపురి, కళింగం - క్రీ.పూ.2 శతాబ్దం
ప్రస్తుత శ్రీకాకుళం పట్టణం చుట్టుపక్కల ప్రాంతం


 పెద్దశెట్టి బుధదత్తుడి ఇంట్లో వేడుక.
 కొత్త నాట్యగత్తె ఆట ఆడబోతోందట.
 పెద్ద కోలాహలంగా ఉంది.


 బుధదత్తుడంటే మాటలా? నాగావళీ వంశధార నదుల అంతర్వేదిలోని నూరుగ్రామాలకి గృహపతి. తల్లిదండ్రులు, తమ్ముళ్లూ, ఇల్లరికపుటల్లుళ్లూ, చుట్టపక్కాలతో సందడి చేసే వంద పడకల లోగిలి. అంతర్వేదిలోనే కాదు మధ్య కళింగంలోనే అతడి మాటకి తిరుగులేదు. పదిహేడేళ్ల క్రితం పుష్యపౌర్ణమి పర్వదినాన పుట్టిన కుమారుడికి పుష్యగుప్తుడు అని పేరు పెట్టాడు. అతడిప్పుడు ఉదయగిరిలో (ఒడిశాలో భువనేశ్వర్‌వద్ద కొండగుహ) జైనస్వామి వద్ద గణిత వ్యాకరణాలు అభ్యసించి ఇంటికి రాబోతున్నాడు. కుమారుడి విద్య కోసం ఆ జైనసంఘానికి నాలుగు గ్రామాలపై వచ్చే ఆదాయాన్ని దానం చేసిన బుధదత్తుడు విద్యాభ్యాసం పూర్తి చేసుకొని వచ్చే కుమారుడి వేడుకలలో తక్కువ కోలాహలం చేస్తాడా? ఖర్చుకు వెనుకాడుతాడా? అందుకే ఈ నాట్యం. బుధదత్తుడు పుత్రోత్సాహంతో కుమారుడి స్నాతక మహోత్సవం కనీవినీ ఎరుగని రీతిలో సూర్యదేవుని ఆలయ ప్రాంగణంలో చేయటానికి సంకల్పించాడు. పూర్ణకుంభాలతో గుడి పూజార్లతో సహా ఎదురుకోలకి ఊరంతా కదిలివచ్చింది. ఆశ్వీయుజ మాసంలో ఎదురెండకి గొడుగుపట్టే బోయలు, మార్గమంతా కాలికి మట్టి అంటకుండా వెల్లవస్త్రాలు పరిచే రజకులు, చామరాలతో నర్తకులు, స్తోత్రపాఠకులు, మేళగాళ్లు ముందు కదిలారు.
 నవనవలాడే అందగాడు, కుర్రవాడు పుష్యగుప్తుడు ఆలయంలో ప్రవేశించగానే మొగలిరేకులతో అలంకరించిన నృత్య మంటపంలో గజ్జె ఘల్లుమంది. అతడి గుండె ఝల్లుమంది. మంటపంలో నాట్యకత్తె. పేరు నాగసిరి.  కౌమారప్రాయం అంతా కొండగుహలలో గడిపిన ఆ పడుచువాడు మేళతాళాలకు గతిబద్ధంగా నాట్యం చేస్తున్న ఆ చక్కని చుక్కని కనులు విప్పార్చి చూస్తూ ఉండిపోయాడు.
           
  గుళ్ళో ఉత్సవం ముగిశాక నాగసిరిని తీసుకుని తల్లి చందసిరి ఇల్లు చేరేసరికి సూర్యుడు నడినెత్తికి వచ్చాడు. నృత్యం జయప్రదమైనందుకు ఆమెకు సంతోషంగా ఉంది. పెద్దశెట్టి బుధదత్తుడే స్వయంగా అడిగితే కాదనలేకపోయిందే తప్ప ఇంకా పూర్తిగా పక్వానికి రాని ఒక్కగానొక్క కూతురి నృత్యార్చనకు ఆమె పూర్తి సమ్మతంగా లేదు. అయితే ఏం? నాగసిరి రంగప్రవేశానికి  బుధదత్తుడు చెల్లించిన మూల్యం- కాలువ దిగువన పది నివర్తనాల చెరకుతోట. ఇలాంటి కానుకలు, కాసులు చందసిరికి కొత్తకాదు. ఆమె గణికా నిగమానికి  నాయకురాలు. ఆమె నిగమానిది నది ఒడ్డున నూరు నివర్తనాల వాడ. పగలూ రాత్రి కళకళలాగే భోగలాలసుల స్వర్గం. మధుశాలలు, భోజనశాలలు, వసతి గృహాలలో వెయ్యికిపైగా నగరవాసులకి ఆ వాడలో ఉపాధి దొరుకుతుంది. నగర గోష్టికి సాలుకి పన్నుల రూపంలో కట్టే ఆదాయమే లక్ష పణాలు మించుతుంది. కూతురు చేతికి అంది వస్తే కనకవర్షమేనని ఆమెకు తెలుసు.
 ఇంటి మండువాలో కూతురికి ముసలి దాసి చెల్లక్క దిష్టి తీస్తూ ఉంటే ‘అంతా అమ్మడి అదృష్టం’ అని మెటికలు విరిచింది చందసిరి.
 
‘సరే గానీ పెద్దశెట్టి కొడుకు ఎల్లాగున్నాడేటి?’ అని అడిగింది చెల్లక్క  ‘అబ్బా! ఎంతందగాడే. మన్మథుడు దిగొచ్చినట్లు సుమా. అమ్మడి నాట్యం చూస్తూ రెప్పవేయలేదంటే నమ్ము’. ‘మరే. మన బంగారుకేటి తక్కువ? ఆ కుర్రాడిని చిటికినవేలున కట్టీసుకోలదు’. ‘నిజమేనే. అల్లాంటోడు ఒక్కడు దొరికితేచాలు తరతరాలు తిన్నా కరిగిపోని ఆస్తి. ప్చ్! లాభం లేదు. మనకి చిక్కటం కష్టమే’. ‘అదేటి? మన అమ్మడికన్నా అందగత్తె ఈ కళింగంలోనే లేదు. అరవైనాల్గు కళల పట్టి. అనుభవం లేదనేగాని ఒకసారి కూడితే దాన్ని విడిచి పెట్టడం బ్రహ్మతరంకాదు. ఆ!’ ‘నిజమే కానీ పెద్దశెట్టి ధర్మం తప్పని మనిషి. ఇతడు అతని వారసుడు కదా?’  ‘ఐతే? పుర్రెకొక బుద్ధి. జిహ్వకొక చపలం. అందరూ ఒకేలా ఉంటారేటి? ప్రయత్నించటంలో తప్పేటి? ఆ పని నాకొగ్గేయ్. నా దగ్గర ఉన్న విద్యలు నీకు తెలియవేటి?’

 ‘ఏమో ఆ కుర్రోడు ఇక్కడ ఉంటే కదా మనకి దక్కేది. ఇవాళ దేవాలయంలో చూడాలి. అతడికి ఉద్యోగం ఇచ్చేందుకు నిగమాలన్నీ పోటీపడ్డాయి. ఉదయగిరిలో ఎక్కాలు కట్టడంలో ఆ కుర్రాడికి సాటిలేరట. మేమంటే మేమని వేలంపాటలా వేలకివేలు ఆశ పెట్టారు. ఆఖరికి బావరికొండ రేవు (విశాఖపట్టణం వద్ద బావికొండ) నగరశ్రేష్ఠి తన కూతురినిచ్చి పెళ్లిచేసి వారసత్వం కూడా కట్టబెట్టేందుకు ముందుకొచ్చాడు. పెద్దశెట్టి కూడా సరేనన్నాడు. కానీ ఇల్లరికానికి అప్పుడే ఏం తొందర పదేళ్ల తరువాత ఇంటికొచ్చాడు, కొన్నాళ్లు నా ఎదురుగా ఉంటాడు అని సర్దిచెప్పాడు’ అని పూసగుచ్చినట్లు వివరించింది చందసిరి.

 ‘మరీ మంచిది. నగరంలోనే ఉంటే ఏదోలా మచ్చిక చేసుకోవచ్చు’ అన్నది చెల్లక్క.  ‘నీ మొహం! మన పెద్దశెట్టి నీడలో నీ పప్పులేం ఉడకవు సుమా’ అంతలో మడిచిన పంచె కుచ్చిళ్లని చిటికెనవేలుకి చుట్టి విలాసంగా ముంగిట్లోకి వచ్చాడు బాదరాయణుడు. ఒకప్పుడు ఉత్తమవంశంలో పుట్టిన నగరప్రముఖుడు. కానీ భోగలాలసత్వానికి ఉన్నదంతా తగలేసి ఆఖరికి విటుడిగా గణికా నిగమంపై ఆధారపడి జీవితం సాగిస్తున్నాడు. చేతిలోని నాణాలు నిండిన పట్టుసంచిని చందసిరి దోసిట్లో జారవిడిచి ‘నాగసిరి నృత్యం మీదకు మరోమారు మనసు పోతోంది చందూ’ అంటూ పక్కనే ఉన్న పాన్పుపై చతికిలబడ్డాడు.

 చిక్కం విప్పి చూసిన చందసిరి ముఖంలో ఆశ్చర్యం. అందులో నూరు నిష్కాలు మేలిమి బంగారానివి ఉన్నాయి. ‘నీ ముఖానికి నాగసిరా? ఈ  నిష్కాలు ఎక్కడివి?’ అంది చందసిరి. బాదరాయణుడు నవ్వాడు. ‘నాకు కాదులేవే. ఉన్నాడులే స్నేహితుడొకడు! పెద్దశెట్టి కొడుకు. పొద్దున్న దాని నాట్యం చూసి మనసు పారేసుకొన్నాడట. పాపం మరోసారి చూడాలని ఉబలాట పడుతున్నాడు’ అన్నాడు. అతడికి ఉత్సాహంగా ఉంది. ఈ బేరం కుదిర్చితే ఇరుపక్షాల నుంచి ఎంతో కొంత దక్కకపోదు. ఆ మాట వింటూనే చందసిరి ముఖంలో ఆనందానికి తోడు ఏదో సంశయం. ‘అది ఇంకా చిన్నపిల్ల. ఇప్పట్లో ఇలాటివన్నీ సాధ్యంకాదు’ అని చేతిలోని సంచిని తిరిగి ఇచ్చివేసింది. బాదరాయణుడు లొంగే ఘటం కాదు.

 ‘ఇది ముందుగా ఇచ్చిన బయానా అనుకో. ఈ సాయంత్రానికే తప్పనిసరిగా ఏర్పాట్లు చెయ్యి. వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకోకు’ అన్నాడు. చందసిరి కాసేపు ఆలోచించి ‘నీవింత చెప్పాక తప్పుతుందా’ అని తలవూపుతూ లేచి చెల్లక్కతో ‘ఏంటే ముసలిముండా! అల్లుడు ఎండనబడి వచ్చాడు. కాస్త ఫలహారం ఇద్దామన్న మర్యాద కూడా లేదూ?’ అంటూ అతడి చేతిలోని సంచిని తిరిగి లాక్కుంది.
           
 మూణ్ణెల్లు గడిచాయి.
 
‘ఇంకెన్నాళ్ళే చందూ?’ ముద్దముద్దగా తడబడే మాటలతో మల్లెపూల పరిమళంతో గుబాళిస్తున్న చందసిరి క్రీడోద్యానంలో పట్టుపరుపుపై కూర్చొని తాంబూలం ఆస్వాదిస్తూ అడిగాడు బాదరాయణుడు. ‘అంత ఆత్రంగా ఉందేంటి? అల్లుడిని కాస్త ఓపిక పట్టమను. చందసిరి కూతురంటే మాటలేంటి?’‘మరుండదేంటి? ప్రతిరోజూ ఇల్లాగే అందని పండులా ఊరిస్తుంటే అతడిని ఆపడం కష్టం. ఒకసారి చేజారిపోతే ఇక నా వల్లకాదు’ అన్నాడు చేతిలోని పాత్ర పెకైత్తి అందులోని ద్రాక్షమధువును గొంతులో పోసుకుంటూ.‘వచ్చే మాఘపౌర్ణిమకి అల్లాగే చేద్దామని చెప్పానుకదా?’ ‘మరీ తెగేదాకా లాగకు. ఆ తూర్పు ఉప్పుమళ్ళు ఎలాగోలా నీ పరంచేస్తానన్నాడు. వాటి అజమాయిషీ మాత్రం నా చేతిలో పెట్టు, ఏటంటావ్?’ అన్నాడు బాదరాయణుడు.
           
 మాఘపౌర్ణమి రానే వచ్చింది. పెళ్ళికి విచ్చేసిన అతిథులతో ఆవరణ అంతా నిండిపోయింది. వధూవరులు వచ్చారు. పెళ్లికొడుకు పుష్యగుప్తుడి మనసంతా అతడి నూతన వధువు పైనే. బావరికొండ పద్మశ్రేష్ఠి కూతురు పదహారేళ్ళ బంగారు బొమ్మ. ఈడూ జోడూ! నాగసిరి మాటే  మర్చిపోయాడు. గృహస్తాశ్రమంలో ప్రవేశిస్తున్న కొడుకుని చూస్తే పెద్దశెట్టి మనసు ఆనందంతో నిండిపోయింది. చిరునవ్వుతో ఎదురుగా నిలిచి ఉన్న చందసిరిని సమీపించాడు. ‘ఈ మూడు నెలలూ నా వారసుడుని ఒక కాపు కాసినందుకు నీకేమిచ్చినా తక్కువే. వచ్చే గోష్టిలో ఆ ఉప్పుమళ్లు మీ నిగమానికి అప్పగించే బాధ్యత నాది, సరేనా?’ అంటూ చేతిలో చెయ్యేసి తన కృతజ్ఞత వ్యక్తం చేస్తున్న పెద్దశెట్టి మాటలకి చందసిరి సంతోషించినా ఆమె పెదాల మీద చిన్న విషాద వీచిక.నిజమే. భోగవాటికలో పాడు చేసేవారిని అందరూ చూస్తారు.  పాడుకాకుండా చూసేవారిని ఎవరు గుర్తు పెట్టుకుంటారు? ఆ మాటే పెద్దశెట్టితో అంటే నవ్వి ‘పాడై పోయినవారు ఎందులోనూ మిగలరు చందూ. కాని పాడుకాని వారే అన్నింటికీ నిజమైన వారసులవుతారు’ అన్నాడు కొడుకువైపు గర్వంగా చూసుకుంటూ.            
 
 
 
 పురుషార్థాలు

 మనిషిగా పుట్టిన ప్రతివాడు ధర్మం, అర్థం, కామం, మోక్షం అనేవి ఆర్జించాలని చూస్తాడు. ఈ పురుషార్థాలలో మోక్షం అన్నింటి కన్నా మిన్న. చిన్న తేడాలతో జైనుల కైవల్యం, బౌద్ధుల నిర్వాణం, బ్రాహ్మణ వ్యవస్థలోని మోక్షం ఒకటే. శాసన వాజ్ఞ్మయాలలోని ఆధారాలని పరిశీలిస్తే ఆనాటి నగరవాసులు అన్ని మతాలను సమదృష్టితో చూశారనిపిస్తుంది. ఒకే కుటుంబంలో కొందరు బౌద్ధం అవలంబిస్తే మరి కొందరు ఇతర ధర్మాలని అనుసరించిన నిదర్శనాలు అనేకం కనిపిస్తాయి. అయితే  ఇంట్లో శుభకార్యాలు మాత్రం వైదికధర్మం ప్రకారం పురోహితుల ద్వారా జరిపించారు. ఆంధ్రుల సాంస్కృతిక వారసత్వం ఈ మతాలన్నింటి నుంచీ వచ్చింది.

 తొలి చారిత్రక యుగపు నాగరికుల జీవనవిధానాన్ని గురించి అవగాహన కావాలంటే ఈ మూడు పురుషార్థాలకు చెందిన మౌలిక గ్రంథాలని పరిశీలించాలి. అవి మనుధర్మశాస్త్రం, కౌటిల్యుని అర్థశాస్త్రం, వాత్స్యాయనుని కామసూత్రాలు. వీటిలో వాత్సాయనుడి గ్రంథం ఆనాటి పట్టణాలలోని ధనికవర్గపు జీవనానికి అద్దం పడుతుందని ప్రముఖ చరిత్రకారుల అభిప్రాయం. పౌరులలో ముఖ్యంగా ధనికవర్గంలో భోగలాలసత్వం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. కథాసరిత్సాగరంలోని ఇతివృత్తాలు ఈ వాదానికి నిదర్శనం. వ్యవసాయం హస్తకళలు అభివృద్ధి చెందటంతో వనరులు పెరిగి జీవనశైలిలో ఎన్నో మార్పులు వచ్చాయి. వాణిజ్య వ్యవస్థ పురోగమించటం వలన నగర ప్రజలకి అనేక విలాసవస్తువులు లభ్యమవసాగాయి. దేశ విదేశీ వర్తకులు యాత్రికుల వలస కొత్తకొత్త అభిరుచులు చోటు చేసుకొన్నాయి. పట్టణాలలో వివిధ పరిశ్రమలు, వర్తకులు నిగమాలుగా ఏర్పడి తమ తమ వ్యవహారాలు సాగించేవారు. అవి ఈనాటి కార్పొరేట్ సంస్థలలాగా భాగస్వామ్య పద్ధతిలో పని చేసేవి. ఈ నిగమాలలో ప్రవేశం జన్మ వల్లగాక వారి వారి విద్యా, నైపుణ్యాలని బట్టి ఉండేవని తెలుస్తోంది. కాని తరువాతి కాలాల్లోని కులవ్యవస్థకి బీజం ఈ నిగమ వ్యవస్థేనని శాస్త్రజ్ఞుల అభిప్రాయం.

ఒక ప్రాంతంలోని నిగమాలన్నీ కలిసి తమ తమ పన్నులు, ఇతర వ్యవహారాలు పరిష్కరించుకోవటానికి ఒక గోష్ఠిగా ఏర్పడేవారు. పౌరుల వినోదమే ప్రధానమైన గణికా వ్యవస్థ సమాజంలో ప్రముఖమైన స్థాయికి ఎదిగింది. కౌటిల్యుని అర్థశాస్త్రం ఈ వ్యవస్థకి నిర్ణీతమైన పరిధులు విధించినా దాని వలన ప్రభుత్వానికి వచ్చే లాభాలను మాత్రం విస్మరించదు. ఒక వైపు శ్రమణదీక్షతో మోక్షాన్ని సాధించమని చెప్పిన బౌద్ధ, జైన మతాలు కూడా గృహపతుల దానాల మీద ఆధారపడ్డాయి. ఒక బ్రాహ్మణ సమాజానికి మూల స్తంభం యాజమాన్య వ్యవస్థ. గృహస్తాశ్రమమంటే ధర్మార్థకామాల సమ్మేళనం. ఈ మూడు పురుషా ర్థాలు మోక్షమనే పరమార్థానికి సోపానాలు. అయితే మానవుని నైతిక విలువని నిర్దేశించిడంలో మాత్రం ఆనాటి సమాజంలో ధర్మశాస్త్రానిదే అగ్రపీఠం. మొత్తానికి ఆనాటి నగరాలలోని సమాజాన్ని పరిశీలిస్తే అది వివిధ మతాల, వివిధ ప్రాంతాల, సంస్కృతుల సమ్మేళనం. ఈనాటి కాస్మోపాలిటన్ నగరాలకి ఏ విషయంలోనూ తీసిపోలేదనే చెప్పాలి.
 
సాయి పాపినేని
 పదం నుంచి పథంలోకి - 5  

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement