మైలసంత | history of Orugallu | Sakshi
Sakshi News home page

మైలసంత

Published Fri, Nov 7 2014 11:31 PM | Last Updated on Sat, Sep 2 2017 4:02 PM

మైలసంత

మైలసంత

ఓరుగల్లు, క్రీ.శ. 1300
 
ఆ రోజు ముఖ్య సమావేశం. బాహత్తర నియోగాధిపతి (చీఫ్ సెక్రటరీ) పిలుపు అందుకోగానే అన్ని శాఖల అధిపతులతో పాటుగా హడావుడిగా రాతికోటలోని సభామంటపం చేరాడు దండనాయకుడు (పోలీస్ కమిషనర్) సింగమనాయుడు. ఇంకా సమావేశం మొదలవలేదు. అధికారులంతా ముఖమండపంలో ఎదురు చూస్తున్నారు.‘ఎందుకో అత్యవసర సమావేశం?’ మండపంలో కూర్చొని వున్న గజసాహిణి గోన విఠలరెడ్డిని అడిగాడు సింగమనాయుడు. గోన విఠలరెడ్డి వర్ధమానపురం రాజు. కాకతీయుల అపారమైన గజసైన్యానికి నాయకుడు.

‘ఏముందప్పా? నూటికి ముప్పై కప్పంగా కట్టినా భాండాగారం వట్టిపోయిందని ఒకటే గొడవ. అంబయ్యదేవుడిని ఓడించాక ఖజానాలో చేరిన నలభై కోట్లు కోటగోడ మరమ్మతుకే సరిపోయాయట. నాయకుల కప్పాలు, భూములపైన ఆదాయం, వాణిజ్యపన్నులూ అన్నీ కలిపి ఈసారి ఎనభై కోట్లే వచ్చాయట. అవి వీరభటుల బత్యాలు, నవలక్ష ధనుర్థారులకే చాలడంలేదు. ఇక వాళ్లని కూడా గ్రామాలనికి తోలి నాయంకరాలకి పంచాలని అయ్యగారి ఉద్దేశ్యం. వడ్డమాను ఆదాయమంతా ఆరువేల ఏనుగుల్ని మేపడానికే చాలదు. ఇక వీళ్లు కూడా మా పైనబడితే మా రాజ్యాల్లో ఏమీ మిగలదు’ అన్నాడు గోన విఠలరెడ్డి.

ఇంతలో రొప్పుకుంటూ వచ్చిన తలారి సాంబడు ‘దన్నాయకులు సింగప్రభువులకి దండాలు. మైలసంతలో దిక్కులేని శవం పడి ఉందట’ అన్నాడు. సింగమనాయుడు ఉలిక్కిపడ్డాడు. ‘ఎన్నడూ లేనిది ఇదేం ఉపద్రవం?’ అనుకుంటూ హుటాహుటిగా బయల్దేరాడు.
 ఓరుగల్లు కోట బయట వందల కొలదీ అంగళ్లతో దేశవిదేశాల వర్తకులతో ప్రతి మంగళవారం మైలసంత జరుగుతుంది. ఆ సంత నుంచి ప్రభుత్వానికి సుంకాల ద్వారా వచ్చే ఆదాయమే సాలుకి మూడుకోట్లు, పటిష్టమైన రక్షణ వ్యవస్థ మధ్య ఇలాంటి అవాంఛనీయ సంఘటనలకి తావులేదు. మరి ఇది ఎలా జరిగినట్టు?

నూనె అంగళ్ల మధ్య భటులు కట్టిన దడి మధ్యలో బోర్లా పడివున్న శవం. కంసాలి వేషంలో వచ్చిన గజదొంగ కన్నప్పది.
 చుట్టూ పరికించి చూశాడు సింగమనాయుడు. దుకాణాలలో లావాదేవీలు మామూలుగానే జరుగుతున్నాయి. చోద్యానికి వచ్చిన జనాలు భటులు కలుగచేసుకోవడంతో దూరంగా పారిపోయారు.  ‘చచ్చినవాడు కంసాలివాడట. అక్కలవీధిలో విడిది. శవం అప్పటికే నీలిరంగు తిరిగి ఉంది. అంటే హత్య జరిగి చాలాసేపే అయింది. బహుశా నిన్న సాయంత్రమే మరణించి ఉంటాడు’ వివరించాడు తలారి సాంబడు.
 ‘కావలి భటులకి వివరాలు చెప్పకుండా ఊరు దాటడం సాధ్యం కాదు. అలాంటప్పుడు అతడు కోటదాటి బయటకి ఎలా వచ్చినట్లు?
 ‘అక్కలవీధిలో విచారిస్తే తెలుస్తుంది!’

‘ఊ! శవాన్ని గోళకీమఠానికి శవపరీక్షకి పంపండి’ అని తలారి భటులకి ఆదేశమిచ్చి కోటవైపు కదిలాడు సింగమనాయుడు.
 సంతలో విపరీతమైన రద్దీ. తమలపాకులు, టెంకాయలు, నువ్వులు, గోధుమలు, ఆవాలు, పెసలు, వడ్లు, ఉప్పు, బెల్లం, మిరియాలు, పసుపు, ఉల్లి, అల్లం... ప్రతిదానికి ప్రత్యేకమైన అంగళ్లు. గంపలో గాజుబుడ్లతో ‘సంపెంగనూనె...’ అని అరుస్తూ గుర్రానికి అడ్డం వచ్చిన మాలపిల్లని అదిలించి వేగంగా ముందుకి కదిలాడు సింగమనాయుడు. పట్టుబట్టల దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. కాకతమ్మ బోనాల పండుగ ఇంకా ఎన్నాళ్లో లేదు. అక్కసాలెవాడ వద్ద దండాలు పెడుతూ ఎదురొచ్చాడు సుంకాధికారి. చుట్టూ ఉన్న తగరం, సీసం, రాగి, ఇనుము కర్మాగారాల ఠంగుఠంగనే సుత్తుల శబ్దంలో అతడు చెప్పేది వినపడక గుర్రం దిగాడు సింగమనాయుడు.

‘ఏమిటి సంగతి?’

‘ఏముంది ప్రభూ! ఈ సాలు మిరియాలపై సుంకం పదోవంతు కూడా రాలేదు. అంటే బొక్కసానికి ముప్పైలక్షలు నష్టం.  ఏమైందని మన కరణాలని అడిగితే అమ్మకాలే లేవంటారు. పన్ను కట్టాల్సిందే అని పట్టుబడితే ఈ వర్తకులు తీర్పరుల సభక్తి (ట్రిబ్యునల్) వ్యాజ్యం తెచ్చారు’
 
‘మిరియాల చారు లేకుండా ముద్ద దిగని మన ప్రజలు ఉప్పూకారాలు మానేసే వ్రతం పట్టారా ఏమిటి? ఊహ్. మీ తిప్పలు మీరు పడండి. నా తిప్పలు నాకున్నాయి. సంతలో ఎవరో కంసాలిని హత్య చేశారు. బంగారం కోసమై ఉండొచ్చు. దొంగసొమ్ము కొనేవాళ్ల మీద కాస్త నిఘా పెట్టండి. ఎవరిపైనన్నా అనుమానం వస్తే వెంటనే తలారికి తెలియపర్చండి.’ ‘చిత్తం ప్రభూ’ అని సెలవు తీసుకున్నాడు సుంకాధికారి.

పూటకూళ్లింట్లో కన్నప్ప అద్దెగదిని చూపిస్తూ ‘ఇదే గది. పాపం అబ్బాయి మంచివాడే! వచ్చి వారమైంది. ఎవరితోనూ గొడవలేదు’ అంటూ మారుతాళంతో తలుపు తెరిచింది పూటకూళ్ల సీతక్క. గది చక్కగా సర్దినట్లుంది. దానిని పరిశీలించే పని తలారి సాంబడికి అప్పజెప్పి ‘వ్యాపారం కోసం ఎవరెవరిని కలిసాతో తెలుసా? అతడి కొరకు వచ్చినవాళ్ల వివరాలేమైనా ఉన్నాయా?’ సీతక్కని అడిగాడు సింగమనాయుడు.

‘అతడి కోసం ఎవరూ రాలేదు. కాని నాలుగురోజుల క్రితం అనుమయ్యశెట్టిని పరిచయం చేయమని కోరితే నేనే చేశాను’ ‘కంసాలికి జొన్నల వ్యాపారితో ఏంపని?’ ‘అతడి వద్ద నగలేవో బేరానికి పెట్టాలని.’ ఇంతలో ‘అయ్యా! తమరిది చూడాలి’ గదిలోంచి కేకపెట్టాడు సాంబడు. సంచిలో నల్లబట్టల మధ్య చోరవృత్తికి కావాల్సిన పరికరాలు.  ‘ఇతడు కంసాలి కాదు. దొంగ’ అన్నాడు తలారి సాంబడు.
 ‘అంటే, వీడు అనుమయ్యశెట్టి ఇంటికి కన్నం వేయటానికి పథకం వేశాడా? ఆ మూడో గోనెసంచి విప్పండి. అందులో ఏముందో?’ అన్నాడు సింగమనాయుడు. విప్పారు. జొన్నలు. గోనెసంచి మీద నీలిరంగు ముద్ర ఉంది. అనుమయ్యశెట్టిది. మూతివిప్పి తలకిందులు చేశాడు. జలజలమని రాలే జొన్నల మధ్య మరో మూట.

 సంచిలో సంచి!  మూటవిప్పాడు సింగమనాయుడు. నల్లబంగారం!  ‘పదండి. వెంటనే అనుమయ్యశెట్టి కోష్టాలు పరిశీలించాలి. సాంబయ్యా.. నువ్వు వెంటనే సుంకాధికారి మల్లన్నని అక్కడికి తోడ్కొనిరా’ అంటూ బయలుదేరాడు దండనాయకుడు సింగమనాయుడు.

తీర్పరుల ధర్మాసనం ముందు పొగడదండతో దోషిగా నిలబడ్డాడు అనుమయ్య.  సామాన్యుల ఆహారమైన జొన్నలపై కాకతీయ రాజ్యంలో సుంకంలేదు. ధనికులు తినే వడ్లూ, గోధుమలూ, ఇతర దినుసులపై సుంకం మాడబడివీసం- అంటే 16వ వంతు. సుగంధద్రవ్యాలు, హస్తకళ సామాగ్రులపై మాడబడిచిన్నం- అంటే 8వ వంతు. కానీ నల్లబంగారమనే మిరియాలపై మాత్రం అత్యధికంగా మాడబడిపణం- అంటే సగం. ‘గత పది నెలలుగా జొన్నల సంచులలో మిరియాలు తేవటం ద్వారా అనుమయ్య ఎగవేసిన సుంకం ముప్పైలక్షల మాడలకి పైబడే’ అంటూ నేరాన్ని వివరించాడు వడ్ల వ్యవహారి (ప్రాసిక్యూటర్).

 శెట్టి ఆస్తిపాస్తులు జప్తు చేసి అతడి వద్ద కొనగోళ్లు చేసిన అంగళ్లపై మడిగసుంకం (అంగడిపన్ను) రెండు రెట్లు పెంచాల్సిందిగా సుంకాధికారికి ఆదేశాలిచ్చాడు మైలసంత తీర్పరి.  ‘రహస్యం తెలుసుకొని బెదిరించి డబ్బు గుంజేందుకు వచ్చిన కన్నప్పని హత్య చేయించినందుకు, నిందితునికి తగిన శిక్ష విధించేందుకు దండ న్యాయస్థానానికి అప్పగించడమైనది’ అంటూ లేచాడు తీర్పరి.  అంతా ఎటువాళ్లటు వెళ్లిపోయారు. సింగమనాయుడికి కన్నప్ప గుర్తొచ్చాడు.  పాపం దొంగకన్నప్ప! వచ్చింది దొంగతనానికే అయినా వీడి వల్ల ఇంటిదొంగలు బయటపడ్డారు అనుకుంటూ ఇంటిదారి పట్టాడు సింగమనాయుడు.
 
లోటు బడ్జెట్

కాకతీయ సామ్రాజ్యం ఒక ఫెడరల్ వ్యవస్థ. మధ్యయుగం ఆరంభంలోనే కే ంద్రీకృత ప్రభుత్వానికి రోజులు చెల్లాయి. రాజ్యం నాడులు, విషయాలుగా విభజింపబడి, అవి సామంతరాజుల చేతుల్లో ఉండేవి. వాళ్లు అవకాశం వచ్చినప్పుడల్లా తిరుగుబాటు చేసేవారు. ఆ పరిస్థితుల్లో ఓరుగల్లు చక్రవర్తికి కుడిభుజాలుగా నిలిచిన గోన, మల్యాల, చెరకు, రేచర్ల నాయకులు ఆంధ్రసామ్రాజ్యం ముక్కచెక్కలు కాకుండా కాపాడారు. కాని కుట్రలూ కుతంత్రాలూ సాగేవి. నేడో రేపో తెగబడేందుకు ఢిల్లీలో పొంచి ఉన్న ముస్లిం సైన్యాల భయం ఒకటి. దాంతో రాజధాని రక్షణ అత్యంత కీలకమై ఏడు ప్రాకారాలతో ఓరుగల్లు కోట నిర్మించి ఎప్పటికప్పుడు మరమ్మతులు చేస్తూ శత్రుదుర్భేధ్యం చేయక తప్పలేదు. చక్రవర్తి రక్షణకై నవలక్ష ధనుర్థారులతో మూలబలాన్ని పోషించారు. యుద్ధసమయంలో సామంతుల సైన్యాలు చక్రవర్తికి సహాయపడేవి.

ప్రతాపరుద్రీయం, సిద్ధేశ్వరచరిత్ర అనే గ్రంథాల్లో కనిపించే కాకతీయ సామ్రాజ్యపు ఆదాయ వ్యయాల (పక్కన ఉన్న) పట్టిక చూస్తే ఆనాటి ఆర్థిక వ్యవస్థ ఎంత అస్తవ్యస్తంగా ఉందో అర్థమవుతుంది.
 
వ్యయం    ఆదాయం  (ప్రతాపాలు = రూపాయలు)
చక్రవర్తి తులాభారం    3.5 కోట్లు
చక్రవర్తి నిత్యవైభవాలకి    3.6 కోట్లు
జీతాలు నవలక్ష ధనుర్ధారులకి    38 కోట్లు
జీతాలు ఇతరులు, రక్షకభటులు    50 కోట్లు
సత్రాలు    1 లక్ష
బ్రాహ్మణులకి దానాలు    1.3 కోట్లు
అంతఃపురం, ద్వారపాలకులకు    3.8 కోట్లు
గుర్రాలు, ఏనుగులు    2.5 కోట్లు
ఆలయానికి మఠాలకి(వ రంగల్లు)    1 కోటి
రాజగృహాల నిర్మాణం    1 కోటి
సామంతుల కప్పం        24 కోట్లు
భూములనుండి ఆదాయం        20 కోట్లు
వాణిజ్య సుంకాలు        44 కోట్లు
మొత్తం        88 కోట్లు
లోటు        16 కోట్లు
మొత్తం    104 కోట్లు    104 కోట్లు
 
 అంటే అదొక లోటు బడ్జెట్! చక్రవర్తి ఆదాయం రక్షణ వ్యవస్థకే చాలేది కాదు. ఆదాయం పెంచేందుకు పన్నులు వసూలు చేసే వ్యవస్థని పటిష్టం చేశారు. సామంతులు కూడా సైన్యపు భారాన్ని మోసేందుకు వ్యవసాయాభివృద్ధికై చెరువులు, కాలువలు తవ్వించారు. వాణి జ్యానికి ప్రోత్సాహం లభించింది. వాణిజ్యాన్ని నియమితం చేసేందుకు ప్రతి పట్టణంలో రెండు రకాల సంతలను ప్రభుత్వమే నిర్వహించేది. పట్టణం మధ్యలో మడిసంత, ఊరి వెలుపల మైలసంతలను నిర్వహించారు. వరంగల్‌లోని ఖాన్‌సాహెబ్‌తోట ప్రాంతంలో ఒకప్పటి మైలసంత ఉండేది. ఆ సంతలో అమ్మిన వస్తువులూ వాటిపై పన్నుల వివరాలు కూడా అక్కడి శాసనంలో దొరుకుతాయి. కోటలో సుంకాల వల్ల ధరలు ఎక్కువ. అయితే మైలసంతలో తక్కువ పన్నుతో ఉత్పత్తిదారులే స్వయంగా అమ్ముకునే అవకాశం ఉండేది నేటి రైతుబజార్లలా! అయితే ప్రతాపరుద్రుని కాలానికి సామంతులపై కప్పం భారం విపరీతంగా పెరిగింది. 72 శాఖల అధికారుల జీతాలకి బదులుగా, రాజ్యాన్ని 72 నాయంకరాలుగా విభజించి వారికి పన్నుల వసూలు, సైన్యాన్ని పోషించడం వంటి బాధ్యతలు అప్పగించడం జరిగింది. వారిలో వెలమలు ఎక్కువ. అది ముందు నుంచీ కాకతీయుల ధ్వజం పట్టి సామ్రాజ్యాన్ని కాపాడిన సామంతుల కన్నెర్రకి కారణమైంది. ఇదే తరువాతి యుగంలో వెలమల, రెడ్ల మధ్య వైరానికి దారితీసింది.
 
 - సాయి పాపినేని
 ఫోన్: +91 9845034442
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement