శాపం | 1370 AD,vidhyanagarm of Hampi | Sakshi
Sakshi News home page

శాపం

Published Fri, Nov 21 2014 11:14 PM | Last Updated on Sat, Sep 2 2017 4:52 PM

శాపం

శాపం

విద్యానగరం క్రీ.శ.1370 హంపి
 
మాల్యవంతం రఘునాథుని ఆలయం మెట్ల కింద పదడుగులెత్తున్న హనుమంతుడి విగ్రహంతో మొరపెట్టుకుంటున్నాడు పూజారి లకుమయ్య.  ‘పదేళ్లుగా నీ సేవలోనే ఉన్నాను. ఎదుగూ బొదుగూ లేదు. పెళ్లీపెటాకులు లేవు. పది రూకలు వెనకేసుకోలేని బీద బాపడికి పిల్లనెవరిస్తారు? నేనూ నీలాగే బ్రహ్మచారిగా బతుకువెళ్లదీయాలా? ఇకనైనా కరుణించవయ్యా హనుమయ్యా!’  ఇంతలో ‘ఇదిగో లకుమయ్యా’ అంటూ పెద్దగుళ్లో పూజారి మెట్లపై నుండే కేకేసాడు.

 ‘శాయనాచార్యుల నుండి వర్తమానమట. ఎందుకో తెలియదు. వెంటనే వారి ఇంటికెళ్లి వారి ఆజ్ఞ ఏదో తెలుసుకురా. వెళ్లేటప్పుడు ఈ మడిగుడ్డలు వదిలి కాస్త శుభ్రంగా తయారై వెళ్లు’. వెంటనే అర్చన పూర్తి చేసి ఇల్లు చేరాడు లకుమయ్య.  ఇంటి అవతారం ఎలా ఉందని? నట్టింట కట్టేసిన లేగదూడ, చుట్టూ గడ్డిగాదం, మూల మోపుగట్టిన దర్భలు, చూరుకు  వేలాడుతున్న పెరికలు... ఆడదిక్కులేని ఇల్లు.
 లకుమయ్య మడిబట్టలు ఆరేసి, మడిచి పెట్టిన పాత నూలు ధోవతి కట్టుకుని, గుళ్లోంచి తెచ్చిన పన్నీరు జల్లుకుని, ఎందుకైనా మంచిదని అరువు తెచ్చుకొన్న మ్లేచ్ఛుల కుప్పసం ఒంటిపై తొడుక్కొని, నెత్తిన పెట్టుకొనే కుళ్లాయి కోసం ఇల్లంతా గాలించసాగాడు.

 ఆ కుళ్లాయి అతడి తాతలిచ్చిన ఒకే ఒక ఆస్తి. వెంజావళి పట్టుబట్టపై, కాళహస్తి అద్దకపు బొమ్మ నుదురుపై కనపడేట్లు, ఎంతో నైపుణ్యంతో కుట్టాడెవరో పింజారి సాయెబు. శాయనాచార్యులంటే  విద్యానగర రాజ్యాన్ని నడిపించే ప్రధానామాత్యుడు. ఆయన వద్దకు సభామర్యాదకి తగిన దుస్తులు, కుళ్లాయి లేనిదే ప్రవేశమే దొరకదు. ‘వెళ్లేది వేదాలకి భాష్యం రాసిన శాయనాచార్యుని వద్దకే అయినా బ్రాహ్మణులకీ పండితులకీ కూడా ఈ తురకల శిరోభూషణం తప్పదు’ అని గొణుక్కున్నాడు.

 ఇంతకీ ఈ కుళ్లాయి ఎక్కడ చచ్చిందో?  హమ్మయ్య! దొరికింది!  అరగూడు వెనకమూల పడున్న కుళ్లాయిని దుమ్ముదులిపి తలపై పెట్టుకున్నాడు. ముఖం చూసుకోవడానికి అద్దం లేదు. అయినా నా మొహం చూసేదెవరు? ఈ ఒంటి బాపడికి సింగారం ఒకటి అనుకుంటూ బయలుదేరాడు.
 
శుక్రవారం మధ్యాహ్నం! రాచవీధిలో రద్దీ అంతంత మాత్రం కాదు. రంగురంగుల అంగీలలో అరబ్బీ వర్తకులు, మసీదులో ప్రార్థనల అనంతరం మలబారి బజారులోని దుకాణాలపై పడ్డారు. ఒకవైపు అత్తరు ఘుమఘుమలు, మరోవైపు మత్స్యమాంసాలతో పలావు బియ్యం వాసనలు. ముక్కుమూసుకొని గబగబా అడుగులేయసాగాడు. వెయ్యికిపైగా ఉప్పరవాళ్లు... రాతికోటకి మరమ్మత్‌లు చేస్తున్నారు. కోట- ముట్టడికి సిద్ధమవుతోంది. యుద్ధమేమన్నా రానుందా? ముట్టడి ఆలోచన రాగానే వణికిపోయాడు లకుమయ్య.
 తొమ్మిదేళ్ల క్రితం కాల్బుర్గి సుల్తాను దాడిలో లకుమయ్య ఇల్లంతా నాశనమయింది. తాతతండ్రులూ, తల్లీపెదతల్లులూ, అన్నలూ, వదినలూ, అక్కచెల్లెళ్లూ అందరూ  కైజార్లకి బలయ్యారు. పాతికమందితో కళకళలాడే సంసారం! బావిలో దాంకొని తానెలాగో బతికిబట్టకట్టాడు. ఆస్తంతా పోయి ఏకాకిగా మిగిలాక ఆంజనేయుడి పాదాల వద్ద అర్చకత్వం దక్కింది. గుడి పక్కన దోసెడు కొంపలో బతుకు నెట్టుకొస్తున్నాడు.

హేమకూటంపై శాయనాచార్యుని మహల్ చేరాడు. ఆచార్యుని కొరకు వచ్చే పోయే వారి కోసం బయట పందిట్లో రోజూ అన్న సంతర్పణే! కమ్మటి నేతి వాసనలు అతణ్ణి నిలవనీయలేదు. పందిరివైపు ఈడ్చుకెళ్లాయి. కోనేట్లో కాళ్లు కడుక్కొని బంతిలో కూర్చున్నాడు. ఇలాంటి భోజనం చేసి ఎన్నాళ్లయిందో? తాంబూలం వేసుకొని, నెతి ్తమీద కుళ్లాయిని సర్దుకుంటూ ఉంటే వెతుక్కుంటూ వచ్చాడు రక్షకదళపతి.
 ‘ఎక్కడికి పోయావయ్యా పూజారయ్య! అయ్యవారు నిన్ను తక్షణం తీసుకురమ్మన్నారు’ అని జబ్బపుచ్చుకొని లాక్కెళ్లాడు.
 చావిట్లో ఉయ్యాలబల్లపై కూర్చొని పది మంది లేఖకులకి శ్రావ్యమైన కంఠంతో వేదాల సారాంశం వినిపిస్తున్న శాయనాచార్యుని చూడగానే సాష్టాంగపడి నమస్కరించాడు.

‘ఏమయ్యా.. నువ్వేనా మాల్యవంతం ఆంజనేయుడి పూజారివి? మధురావిజయానికి వెళ్లే ముందు కంపన యువరాజుని మంత్రపుష్పంతో దీవించావట. నీ దీవెనల వల్లనే సునాయాసంగా మధుర సుల్తానుపై విజయం సిద్ధించిందట. వెయ్యి వరహాలు పారితోషికంగా అనుగ్రహించారు. చిన్న భండార్‌ని కలిస్తే హుండీ రాయించి ఇస్తాడు’. వెయ్యి వరహాలా! ఇక తనకి పిల్లనివ్వటానికి ఎవరికీ అభ్యంతరం ఉండదు. వింటున్న లకుమయ్యకి ఆచార్యునికి బదులు తనని అనుగ్రహిస్తున్న హనుమంతుడే కనిపించాడు.

రాయచూరు దుర్గం పట్టుకొని సుల్తాను దండుని ఊచకోత కోస్తూ విజయనగర సైన్యం ముందుకి సాగుతోందని వార్త. కాని రాత్రికి రాత్రి పరిస్థితులు తారుమారయ్యాయి. శరణుజొచ్చిన శత్రువుకి అభయమిచ్చి విజయోత్సవాలలో మునిగి వున్న రాయల శిబిరంపై సుల్తాన్ సైనికులు రాత్రిపూట ఫిరంగులతో దాడి చేశారు. పది మంది అంగరక్షకులతో బీదరైతు వేషంలో పలాయనమై ఎలాగోలా ప్రాణాలతో రాజధాని చేరాడు చక్రవర్తి దేవరాయలు. వెన్నంటి వచ్చిన సుల్తాన్ ముయిజ్జాం సేనలు విద్యానగరాన్ని ముట్టడించాయి. బయటి మట్టికోట ఎన్నాళ్లో నిలవదు. ఫిరంగుల మోతలకి చెవులు చిల్లులు పడుతున్నాయి. బయటివాడల ప్రజలని కొంపాగోడూ వదిలిపెట్టి రాతికోటలో తలదాచుకొమ్మని ఆదేశాలు జారీ అయ్యాయి. మాల్యవంతం వాడంతా నిర్మానుష్యమైంది. పదేళ్లుగా తన తోడూనీడా అయిన హనుమయ్యని వదిలి రానని మొండికేశాడు లకుమయ్య. అడిగినవన్నీ ఇచ్చే నా దేవుడే నా ప్రాణానికి కాపు అంటూ ఆంజనేయుడి విగ్రహం కాళ్ల వద్దే తిండీ నిద్రా లేకుండా ఉండిపోయాడు.

 బహమనీ దండ్లు బయటివాడల్లో ప్రవేశించాయి. ఇళ్లూ గుళ్లూ కొల్లగొడుతూ ముందుకి సాగాయి. కసి తీర్చుకోవటానికి ఒక మనిషి కూడా లేడు!  ఆఖరికి హనుమంతుడి విగ్రహం ముందు శోషవచ్చి పడున్న లకుమయ్య వారి కళ్లబడ్డాడు. బంగారు పతకాలు, మఖ్మల్ తొడుగులతో తెల్లని అరబీ గుర్రంపై ప్రత్యక్షమైన సుల్తాన్ ముయిజ్జాంనీ అతడి చుట్టూ చిందులు వేస్తున్న బంట్లనూ చూసి, భయంతో దేక్కుంటూ తన దేవుడి కాళ్లపైబడ్డాడు లకుమయ్య. పదేళ్ల క్రితం తన కుటుంబాన్ని కడతేర్చిన కైజార్లు అతడి కళ్లముందు మెదిలాయి. అతడి చేష్టలు సుల్తానుకి నవ్వు తెప్పించాయి.

 ‘హహ్హా! ఏరా! ఈ రాతిబొమ్మ నిన్ను రక్షిస్తుందా?’  ‘బేవకూఫ్’ అతడి భటులు వంత పలికారు. ‘అదీ చూద్దాం! వెంటనే కోట తలుపులు పగలగొట్టే యంత్రాన్ని సిద్ధం చేయండి. ముందు ఈ విగ్రహం పనిబట్టి తరువాత ఈ కాఫిర్ పని చూద్దాం’ అన్నాడు సుల్తాన్.  రెండడుగుల నిడివిగల ఇనుప దూలం. ఎనుబోతులు లాగే చక్రాల బండిపై వేగంగా వచ్చి విగ్రహాన్ని తాకింది. నల్లరాతి విగ్రహం చెక్కుచెదరలేదు. కానీ లకుమయ్య కళ్లు మాత్రం  నిప్పులు చెరిగాయి. ‘ఓరీ మ్లేచ్చుడా! నీవు చేసే ఈ పాపానికి ఇల్లు చేరేలోగా చస్తావ్!’ అని శపించి, మరోసారి విగ్రహంవైపు రెట్టింపు వేగంతో దూసుకొస్తున్న దంచనానికి అడ్డుగా నిలిచాడు. పిడుగుపాటులా తాకిన దెబ్బకి హనుమంతుడి విగ్రహం పెళపెళమంటూ విరిగిపడింది. మధ్య చిక్కిన బక్కబ్రాహ్మడి దేహం ఆ తాకిడిని ఏ మాత్రమూ తగ్గించలేకపోయింది.  కానీ ఆ బీద బాపడి శాపం మాత్రం ఫలించింది! విజయోత్సాహంతో తిరుగుముఖం పట్టిన సుల్తాన్‌ని అతడి దాయాది దావూద్‌ఖాన్ మార్గమధ్యంలోనే హత్య చేసి కాల్బుర్గి సింహాసనాన్ని ఆక్రమించాడు.
 
మహమ్మదీయ దండయ్రాతలు
 
మహమ్మదీయుల రాక యుద్ధతంత్రంలో హిందూరాజులకి కొత్త సవాలు విసిరింది. ఫిరంగులు, తుపాకులు, మందుపాతరలు, వేగంగా పరుగెత్తే గుర్రాలపై నుండే టర్కీవిల్లుతో బాణాలు కురిపించే అశ్వికులు... ఇవి మహమ్మదీయ సేనలకి పైచేయినిచ్చాయి. పురాతమైన ధర్మశాస్త్రానికి కట్టుబడి చేసే ద్వంద్వ యుద్ధాల ఆచారాలకి రోజులు చెల్లాయి. హిందూరాజులకు రాత్రియుద్ధం నిషిద్ధం. లొంగిపోయిన శుత్రువుకి అభయమిచ్చి ఒప్పందం చేసుకొని తగిన పరిహారం పొందటం ఆనవాయితీ. కానీ మహమ్మదీయ సైన్యాధ్యక్షులు లొంగినట్లు నటించి ఏమరుపాటులో ఉన్న శుత్రువుపై రాత్రుల్లో దాడికి పూనడం వంటివి చేసారు. ముఖ్యంగా ఓడిన శుత్రువు మళ్ళీ తలెత్తకుండా ప్రజలలో భయోత్పాతాలు సృష్టిస్తూ చావుదెబ్బ కొట్టడం వారి యుద్ధనీతి.

యుద్ధాలలో ప్రాణనష్టం, ఆస్తినష్టం అనేవి సర్వసామాన్యం. కానీ హిందూ రాజులు బ్రాహ్మణులకి వారి ఆస్తులకి అపకారం తలబెట్టలేదు. మహ్మదీయ దండయాత్రల్లో మొట్టమొదటిసారి బ్రాహ్మణులు శత్రువు ఆగ్రహాన్ని చవిచూసారు. అదే విషయం నాటి సాహిత్యంలో కూడా ఎత్తిచూపారు. అయితే రాజకీయాల్లో మతాన్ని వాడుకోవటానికి, మతసంస్థలని ధ్వంసం చేయటానికి, మతాల పేరిట తలబడటానికి మహమ్మదీయ దాడులకి మునుపే ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. యుద్ధాల్లో పతనమైన అనేక జైన, బౌద్ధ శిథిలాలు ఈనాటికీ మౌనంగా ఆ నిజాన్నే చెబుతాయి. అంతెందుకు వీరశైవం, వీరవైష్ణవాల మధ్య జరిగిన సంగ్రామమే పల్నాటియుద్ధం అని కొందరి అభిప్రాయం. రాజకీయ ప్రయోజనాలకి మతం ముసుగువేసి సామాన్యుల్లో ఆవేశకావేశాలు రగిలించటం నేటికీ ప్రపంచమంతా కనిపిస్తూనే ఉంది.
 1303లో ఆంధ్రదేశం మొట్టమొదటిసారిగా మహమ్మదీయ దాడులకి గురయ్యింది. ఇరవై యేళ్ళ తరువాత తుగ్లక్ సేనలు వరంగల్లుని పట్టి చక్రవర్తి ప్రతాపరుద్రుని బందీగా తీసుకెళ్ళడంతో కాకతీయ సామ్రాజ్యం పతనమయింది. గంగూ బహ్మన్ అనబడే ఒక బ్రాహ్మణుడు ఇస్లాం మతం పుచ్చుకొని ఖిల్జీ చక్రవర్తి దాసుడై, తన ప్రతిభా పాటవాల వల్ల ఢిల్లీ దర్బారులో అత్యున్నత స్థానానికి ఎదిగి, కాకతీయుల అనంతరం అల్లావుద్దీన్ హసన్ గంగూ బహ్మన్‌షా అనే పేరుతో గుల్బర్గాలో స్వతంత్ర సామ్రాజ్యం నెలకొల్పడంతో దక్షిణ భారతదేశంలో మహ్మదీయ అధికారం స్థిరపడింది. తుంగభద్రకి దక్షిణాన విజయనగర సామ్రాజ్యం స్థాపించబడింది. కృష్ణా తుంగభద్రా అంతర్వేది ఇరురాజ్యాల మధ్య యుద్ధభూమిగా మారింది. ఐతే ఇదే ప్రాంతంలో రెండు మతాల మధ్య సామరస్యం కూడా వృద్ధి చెందింది. దక్షణదేశానికి అరబ్బు వర్తకులతో సంబంధాలు ఎన్నో శతాబ్దాలుగా ఉన్నాయి. రాజకీయ, ఆర్థిక కారణాల వల్ల అనేక మంది ఇస్లాం మతం స్వీకరించినా సామాజిక చట్రంలో భాగస్వాములుగానే ఉన్నారు. కొందరు కింది వర్గాలవారికి సమాజంలో స్థాయిని పెంచుకోవటానికి ఇస్లాం ఒక కొత్త అవకాశం చూపింది.

భవనాల నిర్మాణంలో, వేషభాషల్లో, లలితకళల్లో, రాజ్యవ్యవహారాల్లో హిందూ ముస్లిం శైలుల మేళవింపుతో ఒక సరికొత్త పాలకవర్గ సంస్కృతి పుట్టింది. నాటి పౌరులు, తలకి పెట్టుకునే టోపి నుండి కాళ్ళకి వేసుకునే చెప్పులదాకా మహమ్మదీయ ఫ్యాషన్లని అనుకరించారు. విజయనగరంలో తలపై కుళ్ళాయి, ఒంటిపై గౌనులాంటి కుర్పారసం, భుజంపై శాలువా వంటివి పాలకవర్గంలో రివాజుగా మారాయి. తిరుపతిలో శ్రీకృష్ణదేవరాయల విగ్రహం, అన్నమాచార్యుని వర్ణచిత్రాలలో ఇలాంటి కుళ్ళాయిని చూస్తాము. ఇది టర్కీలో ధరించే ‘కుల్లాహ్’ అనే పొడవాటి టోపీ. కవిసార్వభౌముడు శ్రీనాథునికి కూడా రాజదర్శనానికి వెళ్ళేటప్పుడు ఈ కొత్త ఫ్యాషన్ అనుకరించక తప్పలేదు. ‘కుళ్ళాయించితి కోకచుట్టితి మహాకూర్పాసమున్ దొడ్డితిన్’ అనే పద్యమే దీనికి నిదర్శనం.

సాయి పాపినేని
9845034442

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement