మిత్రలాభం | Allied benefit Close Friends | Sakshi
Sakshi News home page

మిత్రలాభం

Published Sat, Jun 14 2014 12:20 AM | Last Updated on Sat, Sep 2 2017 8:45 AM

మిత్రలాభం

మిత్రలాభం

వేలూరు గురుకులం క్రీ.శ.463
మెదక్ జిల్లా చేగుంట వద్ద వెల్లూరు


వరాహదేవుడికి ఇద్దరు ప్రాణమిత్రులు. ఒకడు విష్ణుకుండిన రాకుమారుడు ఇంద్రవర్మ, రెండోవాడు వాకాటక యువరాజు హరిసేనుడు. ఇద్దరూ వేలూరు గురుకులంలో విద్యాభ్యాసం పూర్తి చేసుకొని స్వంతవూళ్లకి బయలుదేరనున్నారు. ఇంద్రవర్మ విష్ణుకుండిన రాజధాని వేంగీపురికైతే (ప.గో.జిల్లా, దెందులూరు), హరిసేనుడు వాకాటక రాజధాని వత్సగుల్మానికి (మహారాష్ట్రలోని వాషిం). ఒకరు తూర్పు, మరొకరు పడమర. అంతలో యుద్ధం అని వార్త తెచ్చాడు వరాహదేవుడు. ఈ పరిస్థితుల్లో ప్రయాణం శ్రేయస్కరం కాదు.
 ‘యుద్ధమా! ఎవరెవరికి?’ అడిగారు హరిసేనుడు, ఇంద్రవర్మ.

 ‘మీ తండ్రులు మధ్యే యుద్ధం. వేంగిసైన్యం వాకాటక రాజ్యంపై దండయాత్రకి సిద్ధంగా ఉంది. వాకాటకుల అధీనంలో ఉన్న ఈ తెలుగు ప్రాంతాన్ని కూడా ఆంధ్రరాజ్యంలో కలుపుకోవడమే విష్ణుకుండినుల ఉద్దేశం’ అని వివరించాడు వరాహదేవుడు. ‘అందుకు మా తండ్రిగారు మహారాజు సాహసించరే? వాకాటకులకు, విష్ణుకుండినులకు ఉన్న స్నేహ బాంధవ్యాలు ఈనాటివి కావే?’ ఆశ్చర్యంగా అడిగాడు ఇంద్రవర్మ.స్నేహితులు వేలూరు గురుకులంలో కలిసి చదువుకున్నారు. ఆరేళ్లు ఆరు నిమిషాల్లా గడిచిపోయాయి. సహాధ్యాయులంతా రాజవంశాలకి, ధనిక వర్తకసంఘాలకి, పండిత కుటుంబాలకి చెందినవారే. గురుపీఠానికి అధ్యక్షుడు విష్ణువర్మ. రాజనీతి శాస్త్రంలో  కౌటిల్యుడికి ఏమాత్రమూ తీసిపోడు. రాజతంత్రాన్ని పంచతంత్రమనే కథల రూపంగా చిరుతప్రాయంలోనే విద్యార్థుల తలకెక్కించాడు. వాకాటక, గాంగ, కదంబ, విష్ణుకుండిన ప్రభుత్వాలలో అనేకమంది మంత్రులు, రాకుమారులు ఆయన శిష్యులే.

 ‘అహ్హహ్హా! అంటే తరతరాలుగా వస్తున్న వైవాహిక స్నేహ సంబంధాలని విడిచిపెట్టి మాతోనే వైరానికి దిగుతారా, మా మామగారు?’ కందగడ్డలా ఎర్రబడిన ముఖంలో కోపాన్ని దిగమింగుతూ అడిగాడు హరిసేనుడు. ఇంద్రవర్మ, హరిసేనులు స్నేహితులేకాదు, మేనమరుదులు కూడా. ఇంద్రవర్మ తల్లి, వాకాటక మహారాజు దేవసేనుడి చెల్లెలూ, విష్ణుకుండిన మహారాజు మాధవవర్మకి పట్టమహిషి.

 ‘మా తండ్రిగారు అటు తూర్పున కళింగాన్ని (ఉత్తరకోస్తా), ఇటు దక్షిణాన రేనాటినీ (రాయలసీమ) వేంగిలో విలీనం చేసిన మహావీరుడు. ఇక గోదావరి వరకూ ఉన్న తెలుగు సీమలన్నింటినీ కలిపి ఆంధ్రదేశాన్ని నైసర్గిక ఎల్లల వరకూ ఒకే రాజ్యం కిందకి తేవడం ఒకందుకు మంచిదేనేమో!’ పౌరుషంగా తండ్రిని సమర్థిస్తూ మిత్రుడు హరిసేనుడి వంక చూశాడు ఇంద్రవర్మ.వరాహదేవుడి మనసు మనస్సులో లేదు. అతడి ప్రాణస్నేహితులలో ఒకడు వాకాటకుడు, ఒకడు విష్ణుకుండినుడు. ఇప్పుడు వాళ్ల తండ్రుల మధ్య యుద్ధం. వరాహదేవుడిది వేలూరు వంశం. అతడి తండ్రి గోదావరిలోయ నుంచి కృష్ణాతీరం వరకూ కొండపడమటి తెలుగుసీమలకు (తెలంగాణ) సంస్థానాధిపతి. వాకాటకులకి సామంతుడేగాక ముఖ్యమంత్రి కూడా! కానీ ఇటు విష్ణుకుండినులు భాషా సంస్కృతి రీత్యా తోటి తెలుగువాళ్లు. తానెవరి పక్షం వహించాలి?

 ‘ఈ యుద్ధంవల్ల విద్యావ్యాసంగాలకూ, పరిశ్రమలకూ ఆలవాలమై విలసిల్లే ఈ ప్రాంతం మరుభూమి కావల్సిందేనా? మీ రెండు రాజ్యాల మధ్యా స్నేహ సంబంధాలు ఉన్నంత కాలం ఈ ప్రశ్న ఉదయించలేదు. ఏది దారి? ఒకవేళ యుద్ధం ఆపాలన్నా పదిహేడేళ్లు నిండని మన మాట వినేది ఎవరు?’ అని నిట్టూర్చాడు, వరాహదేవుడు.స్నేహితుడు హరిసేనుడికి ముఖం చూపలేక తలదించుకొని అడుగులేయసాగాడు ఇంద్రవర్మ. వేంగిదేశం దక్షిణాపథానికే ధాన్యాగారం. గురుకులంలో అతడు చదివిన రాజతంత్రం ప్రకారం పరిశ్రమలూ ఖనిజసంపదా అపారంగా ఉన్న పక్క రాజ్యాన్ని జయించాలనే అతడి ఉద్దేశ్యం సరైనదే. దాని వలన తన స్నేహితుడితో వైరం అనివార్యమా? వేంగి రాజ్యానికి చుట్టూ శత్రువులే ఒక వాకాటకులు తప్ప! ఉత్తరభారతదేశపు గుప్తరాజు అండ వాకాటకులకి ఏనాటి నుండో ఉంది. భవిష్యత్తులో అది వేంగికే ప్రమాదంగా పరిణమించవచ్చు, అనే ఆలోచనలతో సతమతమౌతూ ‘యుద్ధనివారణ సాధ్యమా?’ అని పైకి అడిగాడు.

తలతిప్పి చూసి స్నేహితుడి మాటల్లో ధ్వనించిన విచారాన్ని గమనించిన హరిసేనుడికి కోపం తగ్గిపోయింది. ‘మన సందేహాలకి సమాధానం చెప్పగలవాడు ఒక్కడే! ప్రపంచానికే తలమానికమైన జ్యోతిష శాస్త్రవేత్త ఆర్యభటాచార్యుడు. ఆర్యభటుడి నక్షత్రాశాల ఇక్కడికి దగ్గరే. వెళ్లి కలుద్దామా?’ అడిగాడు.సరేనని ముగ్గురూ ఆర్యభటుని నక్షత్రశాల చేరుకున్నారు.
       
చీకటి పడింది. ఆకాశంలో కనబడే నక్షత్రాలని, గ్రహాలని గుర్తించి వెంటనే వాటి స్థానాలని నక్షత్రశాలలోని ఖగోళ చిత్రపటంపై సూచించేందుకు ఓపికగా అంచలంచలుగా ఎదురుచూసే నలుగురు విద్యార్థులు తప్ప గుట్టపై ఎవరూ లేరు. కింద గురుకులం పూర్తి అంధకారంలో ఉంది. ఆచార్యుడు ఆర్యభటుడు కూడా గుట్టదిగి వడివడిగా నక్షత్రశాల వైపు అడుగులేయసాగాడు. అరుగు మీద కూర్చొనివున్న ముగ్గురు కుర్రవాళ్లని చూసి ఆగాడు.

 ‘ఏవరు? రాత్రిపూట ఇక్కడేమి చేస్తున్నారు?’

పరిచయాల అనంతరం ముగ్గురు స్నేహితులనీ లోనికి ఆహ్వానించాడు.ఆచార్యుని నక్షత్రశాల ప్రవేశించటం వాళ్లకదే మొదటిసారి. నక్షత్రశాల మధ్యలో ఏడడుగుల ఎత్తు భ్రమయంత్రం (దిక్సూచి) గిర్రున తిరుగుతోంది. వివిధ గ్రహాలని, రాశులని, నక్షత్ర మండలాలని చిత్రించిన, అర్ధగోళాకారపు స్వయంవాహ (ఆటోమాటిక్) యంత్రం కప్పుకి వేలాడుతుంది. మూడడుగుల వ్యాసంగల వర్తులాకారపు పీఠాలపై కర్ణం (హైపోటెన్యూస్), తుర్యగోళం (క్వార్టర్ ప్లేట్), యష్టి (రూరల్) మొదలైన పరికరాలు కనిపిస్తున్నాయి. చుట్టూ నల్లని గోడలపై మరిన్ని ఖగోళ చిత్రపటాలు. మిత్రులు ముగ్గురూ నోళ్లెళ్లబెట్టి చూస్తూ ఉండిపోయారు. నల్ల మిరియాలు జల్లిన వేడి అంబలి తాగి సేదతీరి, ఆచార్యుడికి తమ సంకటస్థితి నివేదించారా ప్రాణమిత్రులు. ‘ఎక్కాలు రాసుకునే లెక్కల పండితుడిని. యుద్ధం ఆపడం నావల్ల ఏమవుతుంది? అయినా పిల్లలు మీరడిగారు కనుక ప్రయత్నిస్తాను’ అని చిరునవ్వు నవ్వాడు. ప్రఖ్యాత గణిత ఖగోళ శాస్త్రజ్ఞుడు ఆర్యభటుడు.
       
అమావాస్య మధ్యాహ్నం.

కృష్ణా గోదావరీ నదుల మధ్య రెండు యోజనాల విస్తీర్ణంగల మహాపట్టణం వేంగి. ఆంధ్రుల రాజధాని నగరం. వేంగీ నగరంలో చిత్రరథస్వామి కోవెల ముందు అశేషమైన జనం గుమికూడారు. మహారాజు మాధవవర్మ, మహామంత్రి, పుర ప్రముఖులు, ఆర్యభట పండితుడి సందేశం వినేందుకు వచ్చారు.ఆరోజు మధ్యాహ్నం సంపూర్ణ సూర్యగ్రహణం వస్తుందన్న విషయం ఆర్యభటుడికి తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. చేతిలోని నిలువెత్తు యష్టిని నేలపై నిలిపాడు  ఆర్యభటుడు. ఆ కర్ర నీడని గమనిస్తూ ఉపన్యాసం ఆరంభించాడు. ‘వాకాటక, విష్ణుకుండినుల మధ్య వైరం గ్రహాలూ, దేవతలూ అంగీకరించరు. రాహుకేతువులు వేంగి సామ్రాజ్యానికి గ్రహణాన్ని సూచిస్తున్నారు.  యుద్ధమే మీ ఉద్దేశ్యమైతే ఈ క్షణంలో నా మంత్రోఛ్ఛారణతో ఆ గ్రహాల ఆగ్రహాన్ని దర్శింపజేస్తాను’ అని కళ్లు మూసుకొని జపం చేయసాగాడు. ఆర్యభటుడు కళ్లు మూసుకున్న మరుక్షణమే సూర్యుడు మసకబారసాగాడు. కొంతసేపటి తరువాత పూర్తిగా అదృశ్యమైన సూర్యుని చూసి భయంకంపితుడైన మహారాజు ఆర్యభటుని ఆజ్ఞ పాఠించి వెంటనే యుద్ధవిరమణ ఘోషణ చేసాడు.

ఆచార్యుని ప్రార్థనతో గ్రహాలు శాంతించాయి. గ్రహణం వీడింది. ఆకాశంలో చిత్రరథస్వామి మళ్లీ దర్శనమిచ్చాడు.ప్రయత్నం సఫలమైనా ఆచార్యుడి ముఖంలోని విచారం వరాహదేవుడిని ఆశ్చర్యపరిచింది. కారణం అడిగిన శిష్యులతో ‘విజ్ఞానాన్ని దేశకల్యాణానికి ఉపయోగిస్తే తప్పులేదు. కానీ అమాయక ప్రజల మూఢవిశ్వాసాలని స్వార్థానికి ఉపయోగిస్తే, భవిష్యత్తులో మన భారతీయ శాస్త్రీయ విజ్ఞానానికి గ్రహణం పట్టక తప్పదు’, అన్న ఆర్యభటుని మాటలు వరాహదేవుడికి జీవితాంతం గుర్తుండిపోయాయి.
 
ఈ శీర్షికపై మీ స్పందన రాయండి: saipapineni@gamil.com   - సాయి పాపినేని
 
 శాస్త్రీయ విద్యలో తెలంగాణ
 
ఆనాటి రాజులు పండితులను కళలను ఆదరించటమే కాక తాము కూడా ఎన్నో రచనలు చేశారు. అజంతా గుహలలో అధికభాగం వాకాటక మహారాజు హరిసేనుడు. అతడి మంత్రి వరాహదేవుల కాలంలో నిర్మించబడ్డాయి. విష్ణుకుండినరాజు ఇంద్రవర్మ మహాకవిగా కీర్తించబడ్డాడు. ఛందస్సుపై అతడు రచించిన గ్రంథం ‘జనాశ్రయఛందోవిచ్ఛితి’. ఇంద్రవర్మ హయాంలో ఆంధ్రరాజ్యం శ్రీకాకుళం నుండి నెల్లూరు వరకూ పశ్చిమాన బళ్లారి వరకూ విస్తరించింది.

 క్రీ.శ. 5వ శతాబ్దం భారతీయ శాస్త్రీయ విజ్ఞానానికి స్వర్ణయుగం అంటాడు. తెలంగాణ ఆనాటి లౌకిక విజ్ఞానానికి ఆయువుపట్టుగా విలసిల్లింది. హైదరాబాద్‌కి 50 కి.మీ. దూరంలో వేలూరు వాస్తవ్యులైన పండితులు మంత్రులుగా అప్పటి భారత రాజకీయాలు నిర్దేశించారు. అజంతా గుహల శాసనాలు మూడు తరాలుగా వాకాటకులకు ప్రధాన మంత్రులైన ఆ వంశాన్ని ప్రస్తావిస్తాయి.
 విష్ణుశర్మ రచించిన ‘పంచతంత్రం’ రాజనీతిని ఆసక్తికరమైన కథల ద్వారా ముగ్గురు వాకాటక రాకుమారులకు అందించిన నిదర్శన కావ్యం. మొదట పర్షియాలో ‘ఖలీల్ వా దిమ్నా’గా పరిచయమై, పిదప అరబ్బీ, ల్యాటిన్, జర్మన్, ఇంగ్లిష్‌లలోనేకాక చైనా, జపాన్, కావి (ఇండోనేసియా) భాషలలో క్రీ.శ.16వ శతాబ్దానికి పూర్వమే అనువదింపబడింది. ఇక నవీనయుగంలో ప్రపంచంలోని అన్ని ముఖ్య భాషల్లోకీ అనువదింపబడిన భారతీయ గ్రంధం ఇదొక్కటే. వాకాటక రాకుమారులకు రాజకీయ పాఠాలు బోధించిన విష్ణుశర్మ మన హైదరాబాద్ ప్రాంతం వాడే అని చారిత్రకుల అభిప్రాయం.

 ఇక భారతదేశంలో ప్రాచీన యుగం నుండీ గణిత, ఖగోళ శాస్త్రాలు ఎంతో పరిణతి చెందాయన్న విషయం తెలిసినదే. వేదవాజ్ఞ్మయంలోని శుల్వసూత్రాలు, ‘పైథాగరస్ థీరం’ పైథాగరస్‌కు మూడు శతాబ్దాల ముందే భారతీయ ఇంజనీర్లకు తెలుసని నిరూపిస్తాయి. సున్న, డెసిమల్, అంకెలు భారతీయులు ప్రపంచానికి ఇచ్చిన శాస్త్రీయ వారసత్వమే.

 ప్రాచీన గణిత శాస్త్రజ్ఞులలో అగ్రగణ్యుడు ఆర్యభటుడు. గెలీలియోకి వెయ్యేళ్ల పూర్వమే భూమి గోళాకారంలో ఉందని సూచించాడు. జామెట్రీకి ఆయువుపట్టైన ‘పై’ యొక్క విలువను 3.1416గా నిరూపించాడు. త్రికోణమితిలోని (ట్రిగొనామెట్రీ) ‘సైన్’ విలువకు పట్టికలు తయారుచేశాడు. సూర్య చంద్ర గ్రహణాలు - చంద్రగ్రహం భూమికి సూర్యునికి మధ్య రావటం వల్లనూ, భూమి ఛాయ చంద్రుని మీద పడటం వల్లనూ సంభవిస్తాయని ప్రకటించిన మొట్టమొదటి ఖగోళశాస్త్రజ్ఞుడు ఆర్యభటుడే.

 ఈ మహామేధావి స్వస్థలం అశ్మకదేశం, అంటే తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా పరిసరాలు. అతడు రచించిన ఆర్యభటీయం అనే గ్రంథమే గాక తదుపరి శాస్త్రజ్ఞులు రచించిన గ్రంథాలలో ప్రస్తావించబడిన అతడి గణిత, ఖగోళ సిద్ధాంతాలను ‘అశ్మకతంత్రం’ అని పిలిచారు. ఆర్యభటుని సిద్ధాంతాలను ఆచరించే శాస్త్రజ్ఞులను ‘అశ్మకీయులు’ అనేవారు. అంటే, ఆర్యభటుని తరువాత కూడా తెలంగాణలో గణిత ఖగోళ శాస్త్రాలపై పరిశోధనలు సాగించారని తెలుస్తుంది. బాసర, వేములవాడ, కొలనుపాక, అలంపురం పట్టణాలు ఉన్నత విద్యాకేంద్రాలుగా వికసించాయి. ధార్మిక శాస్త్రాలయిన వేద, వేదాంగ, ఆగమ శాస్త్రాలు చెప్పే పాఠశాలలు గ్రామగ్రామాలలో వెలిశాయి.
 అయితే క్రీ.శ. 5వ శతాబ్దం తరువాత దేశంలో ఆర్థిక రాజకీయ సంక్షోభం వల్ల విద్యావికాసం కుంటుపడింది. దేవాలయాలకు, వైదిక పండితులకు చేసిన దానశాసనాలు మాత్రమే కనిపిస్తాయి. అందువలన ధార్మిక ప్రాముఖ్యం పెరిగి లౌకిక విద్యలు వెనకబడ్డాయి. శాస్త్రీయజ్ఞానాన్ని ఆలంబనంగా చేసుకొని భుక్తికోసం అమాయక ప్రజలని భయోత్పాతులని చేసి విద్యలని స్వలాభానికి వాడుకొనే తంత్రవేత్తలూ, మంత్రగాళ్లూ బయలుదేరారు. దేశంలో స్వచ్ఛమైన శాస్త్రీయ విద్యకి గ్రహణం పట్టింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement