ఫ్రెండ్ ప్రపోజ్ చేసింది...
దాదాపు 20 ఏళ్ల క్రితం లాస్‌ఏంజెలెస్‌లో బాలాజీ నేను కలిశాం. నిజం చెప్పాలంటే ప్రారంభంలో ఒకరంటే ఒకరికి ఏ మాత్రం ఆసక్తి లేదు. అయితే మా ఇద్దరికీ తెలిసిన ఒక స్నేహితురాలు మేం ఇద్దరం ఒకరికొకరు బాగా నప్పుతాం అంటూ వచ్చేది. ఆమె దాదాపు ఏడాది పాటు మాతోనే ఉంది. అదే సమయంలో ఇద్దరం క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యాం. ఆరేళ్ల డేటింగ్ తర్వాత 14 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాం.
బాలాజీ.. మంచి మనసున్న వాడు..
బాలాజీ చాలా గ్రౌండ్ టు ఎర్త్ టైప్. నిజాయితీగా అందరికీ సాయం చేయడాన్ని ఇష్టపడతాడు. ఇతరుల్లో మంచిని మాత్రమే చూస్తాడు. నా నవ్వుతో ప్రేమలో పడ్డానంటాడు తరచుగా. నేను చిన్నప్పటి నుంచి స్వతహాగా అందరితో, అన్ని సంస్కృతులతో భాగం అయిపోయే తత్వం కలదాన్ని కావడంతో.. అందరూ నాతో ఓపెన్‌గా ఉంటారు. నాకు కాస్త షార్ట్ టెంపర్. దాన్ని కూడా తను ప్రేమిస్తాడు. తరచుగా నాకు కావాలని చిరు కోపం తెప్పిస్తూ ఉడికిస్తుంటాడు.
అప్పుడీ పెళ్లిళ్లు అసాధారణమే...
ఇంటర్ రేషియల్ మ్యారేజెస్‌కు అమెరికన్ పేరెంట్స్ కొంత అనుకూలంగా ఉంటారు. మా సొంత కమ్యూనిటీ వ్యక్తిని నేను పెళ్లి చేసుకుంటానంటే మా కుటుంబం మరింత ఆనందిస్తుందనేది నిజమైనా, బాలాజీని కూడా అంతే ఇదిగా తొలి నుంచీ అభిమానించి అంగీకరించారు. అయితే బాలాజీ కుటుంబం మాత్రం ప్రారంభంలో అంగీకరించడానికి ఇబ్బంది పడ్డారు. పద్నాలుగేళ్ల క్రితం ఇండియాలో ఇలాంటి పెళ్లి అరుదైన విషయమే కదా. అయితే కాలక్రమంలో ఇది మారుతూ వచ్చింది.
కొన్నాళ్లయ్యాక మా రెండు ఫ్యామిలీలు బాగా క్లోజ్ అయిపోయాయి. కొన్ని కొన్ని సార్లు ఆచార వ్యవహారాల పరంగా విబేధాలు రావా..? అంటే తప్పకుండా వస్తాయి. అయితే అదృష్టవశాత్తూ మాకు పరస్పరం సంస్కృతీ సంప్రదాయాల పట్ల పూర్తి గౌరవభావం ఉంది. అత్తామామయ్యల కోసం ఏమైనా చేసేంత గౌరవం పెంచుకున్నాను. అలాగే నా భర్త కూడా నా పేరెంట్స్, ఫ్యామిలీ పట్ల ప్రేమగా ఉంటారు. నా పెళ్లి సమయంలో మా కౌబోయ్ డాడీ..‘మా అమ్మాయి కౌబాయ్‌ని చేసుకోకపోయినా.. కనీసం ఒక ఇండియన్‌ని చేసుకుంది’ అని నవ్వుతూ అన్నారు.
నేనే ఇండియాకి తీసుకొచ్చా...
మేం ఇండియాలో ఏడున్నరేళ్లుగా ఉంటున్నాం. మిగిలిన మిక్స్‌డ్ నేషనల్ కపుల్స్‌కి భిన్నంగా నేను నా భర్తని ఇండియాకి తిరిగి వచ్చేలా చేశానని గర్వంగా చెప్పగలను. అమెరికాలో ఉండగా మేం చాలా సార్లు ఇండియా గురించి మాట్లాడుకునేవాళ్లం. మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే ఇండియాకు వెళ్లిపోవడం సరైనదని ఆయనకి చెప్పాను. అయితే నేను ఆ మాట బలంగా అంటున్నానని బాలాజీ మొదట్లో అనుకునేవారు కాదు. ‘నిజంగానే అంటున్నావా?’ అని అడిగేవారు. ఇండియాలో నా భర్త బంధువుల గురించి, సంస్కృతుల గురించి తెలుసుకోవడం గొప్పగా అనిపించింది. మా పిల్లలకు ఇక్కడి దేవుళ్ల దీవెనలు అందుతున్నాయి.
వెస్ట్రన్‌లోనూ విలువలున్నాయి...
ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏమిటంటే.. భారతీయ పురుషులకు పాశ్చాత్య దేశ మహిళల మీద కొంచెం తేలిక అభిప్రాయం ఉంది. అది మార్చుకోవాలని నా విన్నపం. పాశ్చాత్య మహిళలు నైతిక విలువలు లేనివారుగా భావించడం చూశాను. ఇది బహుశా సినిమాలు, టీవీల ప్రభావం కావచ్చు ఇది. సెక్స్ వంటి అంశాల్లో మాకు మీకు-మాకు కొన్ని వ్యత్యాసాలు, అభిప్రాయ బేధాలు ఉండవచ్చు. అయితే పాశ్చాత్య మహిళల్లో అత్యధికులు తమ మీదే కాదు ఇతరుల మీద కూడా అత్యంత గౌరవభావం కలిగి ఉంటారు. వ్యక్తిగతాలను పూర్తిగా గౌరవిస్తారు. వెస్ట్రన్ ప్రపంచం కూడా అత్యంత బలమైన కుటుంబ విలువలు కలిగి ఉంటుంది.
అక్కడ పిల్లలు పెద్దలకు చాలా గౌరవం ఇస్తారు. అలాగే పిల్లల అభిప్రాయాలకు పెద్దలూ విలువిస్తారు. ఏదేమైనా, నేను, పిల్లలు ఇక్కడ చాలా హ్యాపీగా ఉన్నాం. ఈ అద్భుతమైన దేశం మా హృదయాల్లో నిండిపోయింది. మనం నిజంగా చాలా అదృష్టవంతులం అని నా పిల్లలతో అంటుంటాను. ఎందుకంటే మాకు రెండు హోమ్ కంట్రీస్ ఉన్నాయి. ఇదంతా బాలాజీతో నా పెళ్లి వల్లే సాధ్యమైంది. అందుకే థ్యాంక్స్ టు బాలాజీ. థ్యాంక్యూ వెరీమచ్ టూ ఇండియా.
- లిసా, అమెరికా