ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డులకు అంతా సిద్ధమైంది. ఇటీవల లాస్ ఎంజిల్స్‌లో కార్చిచ్చు వల్ల వాయిదా పడిన ఈవెంట్ కొత్త తేదీలను ఆస్కార్ అకాడమీ తాజాగా ప్రకటించింది. ఈ ఏడాది మార్చి 2న ఆస్కార్ అవార్డుల వేడుక జరగనుందని అకాడమీ సీఈఓ బిల్ క్రామెర్, ప్రెసిడెంట్ జానెట్ యాంగ్ లేఖ విడుదల చేశారు. అయితే ఈ ఏడాది వేదికపై ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఎంపికైన పాటల ప్రదర్శన ఉండదని అకాడమీ స్పష్టం చేసింది. కార్చిచ్చు నింపిన విషాదం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. అయితే పాటలు రాసిన రచయితలను వేదికపైకి ఆహ్వానిస్తామని తెలిపింది.
ఇప్పటికే ఇండియా నుంచి ఆరు చిత్రాలు ఆస్కార్ బరిలో నిలిచాయి. వాటిలో ప్రధానంగా సూర్య కంగువా, మలయాళ చిత్రం ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ చిత్రాలపైనే అందరి దృష్టి నెలకొంది. ఆస్కార్ నామినేషన్స్‌కు ఎంపికైన చిత్రాల జాబితాను జనవరి 23న ప్రకటించనున్నారు. ఈ వేడుక ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది.
ఈ ఏడాది జరగనున్న 97వ ఆస్కార్ బరిలోను సౌత్ నుంచి సూర్య కంగువా(Kanguva Movie ), పృథ్వి రాజ్ సుకుమారన్ హీరోగా నటించిన ది గోట్ లైఫ్(Aadujeevitham: The Goat Life) కూడా ఆస్కార్‌లోకి ఎంట్రీ దక్కించుకుంది. ఇండియా నుంచి ప్రస్తుతం ఆస్కార్ 2025 కోసం షార్ట్ లిస్ట్ చేసిన సినిమాల్లో ‘ఆడు జీవితం’, ‘కంగువా’, సంతోష్ , స్వాతంత్ర్య వీర సావర్కర్ , ఆల్ వీ ఇమాజిన్ యాజ్ లైట్(మలయాళం) చిత్రాలు ఉన్నాయి. షార్ట్ లిస్ట్ అయినా సినిమా నుంచి ఆస్కార్ ఫైనల్ నామినేషన్లను ఎంపిక చేస్తారు.
లాపతా లేడీస్‌కు నో ఎంట్రీ..
ఇండియా నుంచి మొదటగా కిరణ్ రావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘లాపతా లేడీస్’(Laapataa Ladies ) ఆస్కార్‌కు ఎంపికైంది. అయితే ఈ చిత్రం ఆస్కార్ షార్ట్ లిస్ట్‌లో చోటు దక్కించుకోలేకపోయింది. డిసెంబర్ 17న ఆస్కార్ షార్ట్ లిస్ట్ చిత్రాలను అకాడమీ ప్రకటించింది. వాటిలో లాపతా లేడీస్ కు చోటు దక్కలేదు. కానీ భారతీయ నటి షహనా గోస్వామి ప్రధాన పాత్రలో నటించిన ‘సంతోష్’ చిత్రం ఆస్కార్‌కు షార్ట్ లిస్ట్‌కి ఎంపికైంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘సంతోష్’ హిందీ చిత్రం యూకే నుంచి ఆస్కార్ షార్ట్ లిస్ట్‌లో స్థానం సొంతం చేసుకుంది. ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ జాబితాలో షార్ట్ లిస్ట్‌లో అధికారికంగా చోటు సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment